Civil Assistant Surgeon
-
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సరీ్వసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం పోస్టులు 435 కాగా, అందులో 351 ప్రాథమికఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు, మరో 80 పోస్టులు డీఎంఈ పరిధిలో ఆస్పత్రుల్లో ఆర్ఎంఓ పోస్టులు. ఐపీఎంలో భర్తీ చేసే పోస్టులు నాలుగు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. బోర్డు వెబ్సైట్( https://mhsrb. telangana.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల రెండో తేదీన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరితేదీ అదే నెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.58,850 నుంచి రూ.1,37,050 మధ్య ఉంటుంది. ఫలితాల ప్రకటన వరకు సంబంధితశాఖ నుంచి ఖాళీలు ఏవైనా ఉంటే వాటిని చేర్చడం లేదా తొలగించడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్ ప్రాక్టీస్‌కు అర్హులు కాదని స్పష్టం చేశారు. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. గరిష్టంగా 80 పాయింట్లు అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ప్రకారం ఇస్తారు.అంటే ఎంబీబీఎస్‌లో అన్ని సంవత్సరాలలో పొందిన మొత్తం మార్కులు 80 శాతంగా మార్చుతారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులకు సంబంధించి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పరీక్ష (ఎఫ్ఎంజీఈ)లో పొందిన మార్కులశాతాన్ని పరిగణనలోకి తీసుకొని 80 శాతంగా మార్చుతారు. కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు/సంస్థల్లో పనిచేసే వారికి గరిష్టంగా 20 పాయింట్లు ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. అక్కడ పనిచేస్తున్నట్టు అనుభవ ధ్రువ పత్రాన్ని సంబంధిత అధికారి ద్వారా తీసుకోవాలి. అనుభవ ధ్రువ పత్రాన్ని పొందిన తర్వాత అభ్యర్థి ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.ఇతర ముఖ్యాంశాలు... » ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందు, దరఖాస్తుదారులు సాఫ్ట్‌కాపీని దగ్గర ఉంచుకోవాలి. » ఆధార్ కార్డు, పదోతరగతి సర్టిఫికెట్ (పుట్టిన తేదీ రుజువుకు), ఎంబీబీఎస్ సమగ్ర మార్కుల మెమో, సర్టిఫికెట్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజి్రస్టేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువపత్రాలు, స్థానికతను తెలియజేసే స్టడీ సర్టిఫికెట్లు (1 నుంచి 7వ తరగతి), ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ సర్టిఫికెట్, బీసీల విషయంలో నాన్–క్రీమిలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరేవారు తాజా ఆదాయ, ఆస్తి సర్టిఫికెట్, స్పోర్ట్స్ కేటగిరీ వారు స్పోర్ట్స్ సర్టిఫికెట్, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, మాజీ సైనికులు వయస్సు సడలింపునకు సరీ్వస్ సర్టిఫికెట్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కోసం సర్వీస్ సర్టిఫికోట్ అప్లోడ్ చేయాలి. » నోటిఫికేషన్ తేదీ నాటికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఎంబీబీఎస్ లేదా తత్సమాన అర్హత చదివి ఉండాలి. సరి్టఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో, ఏదైనా దరఖాస్తుదారుడు అవసరమైన అర్హత కాకుండా ఇతర అర్హతలు ఉంటే (అర్హతకు సమానమైనవి) వాటిని ’నిపుణుల కమిటీ’కి సిఫార్సు చేస్తారు. నిపుణులకమిటీ’ నివేదిక ప్రకారం బోర్డు నిర్ణయిస్తుంది.» తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన దర ఖాస్తుదారులు ఎలాంటి రిజర్వేషన్లకు అర్హులు కారు. » పోస్టులను మల్టీ–జోనల్‌గా వర్గీకరించారు. » మల్టీ జోన్–1లో జిల్లాలు: ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మ ల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్. » మల్టీ జోన్–2 : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ -
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ
-
భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్ కుదరదు
సాక్షి, హైదరాబాద్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో భార్యాభర్తలకు ప్రాధాన్యం ఉండబోదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి మెరిట్ ఆధారంగానే డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల తాత్కాలిక జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734 పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 209 పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) పరిధిలో ఏడు పోస్టులకు అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. వాస్తవానికి మొత్తం 969 పోస్టులకుగాను 950 మందితో తుది జాబితాను విడుదల చేశారు. దివ్యాంగ అభ్యర్థులు లేకపోవడంతో వారికి కేటాయించిన 39 పోస్టుల్లో 19 మంది అభ్యర్థులే వచ్చారు. దీంతో మిగిలిన 20 పోస్టులను ఖాళీగా వదిలేశారు. వాటిని వచ్చే పోస్టుల భర్తీలో నింపుతారు. అప్పుడు కూడా రాకుంటే వాటిని సాధారణ పోస్టుల జాబితాలో చేరుస్తారు. మొత్తం జాబితాలో అత్యధికంగా మహిళా డాక్టర్లు 509 మంది, పురుష డాక్టర్లు 441 మంది ఉన్నారు. సాధారణంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. అయితే మెరిట్లో వారి రిజర్వేషన్‌కు మించి మహిళా డాక్టర్లు ఉన్నందున రిజర్వేషన్‌ను కాకుండా ప్రతిభ ఆధారంగానే జాబితా విడుదల చేసినట్లు బోర్డు వెల్లడించింది. వారం రోజుల్లో కౌన్సెలింగ్... మూడు విభాగాల్లో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు మొత్తం 4,803 దరఖాస్తులు రాగా వాటిలో రెండో విడతలో 1,860 మంది అర్హులను ఎంపిక చేశారు. వారిలో దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది అర్హులతో 950 మందిని గుర్తించారు. వారం రోజుల్లోగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారు. ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్ లేదా అనారోగ్య సమస్యలు లేదా భార్యాభర్తలకు ఒకచోట లేదా సమీప ఆసుపత్రుల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రాధాన్యాలు ఉండవని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం మెరిట్ ప్రకారం వారిచ్చే ప్రాధాన్యాల ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారు. మొదట వచ్చినవారికి ఇష్టమైన చోటకు పోస్టింగ్ వస్తుంది. తర్వాత వచ్చే వారికి వారి ప్రాధాన్యం ప్రకారం ఉంటే ఇస్తారు... లేకుంటే మరోచోటకు వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. బదిలీల సందర్భంగానే భార్యాభర్తలు, ఇతర ప్రాధాన్యాల ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారని, ఇప్పుడు మాత్రం కుదరదని చెబుతున్నారు. నేటి నుంచి అసిస్టెంట్ వైద్య ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల జాబితా విడుదలతో ఇక 1,147 అసిస్టెంట్ వైద్య ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని బోర్డు సభ్య కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తెలిపారు. ఈ పోస్టులకు మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ భర్తీ ప్రక్రియ ఒక దశకు చేరుకున్నాక నర్సుల పోస్టుల భర్తీపై ప్రకటన విడుదల చేస్తారు. ఇది సరికొత్త రికార్డు: మంత్రి హరీశ్‌రావు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైందన్నారు. 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం ఆరు నెలల్లో బోర్డ్ పూర్తి చేసిందన్నారు. రాత పరీక్ష లేకుండా, నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం విశేషమన్నారు. -
కాంట్రాక్టు డాక్టర్లకే కొలువులు!
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ కొలువుల భర్తీ ప్రక్రియ కాంట్రాక్టేతర వైద్య అభ్యర్థులను నిరాశపర్చింది. ఇందులో దాదాపు అన్ని పోస్టులు కాంట్రాక్ట్ వైద్యులకే దక్కనున్నాయని మెజారిటీ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డాక్టర్లకు ప్రాధాన్యత మార్కులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొంటున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగం(పీహెచ్–ఎఫ్డబ్ల్యూ), తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) విభాగాల్లో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది జూలై 15న తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి ఈ నెల మొదటివారంలో అభ్యర్థుల స్కోరింగ్ జాబితాను విడుదల చేసింది. ఇటీవల సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా 1:2 నిష్పత్తిలో విడుదల చేసిన టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ శనివారం నాటితో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసింది. అతి త్వరలో తుదిజాబితా విడుదల చేసి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనుంది. వారికి రిక్తహస్తమే... వాస్తవానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ కొలువులను పెద్దసంఖ్యలో భర్తీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. కానీ, ప్రాథమిక అర్హత జాబితాలో కాంట్రాక్టు డాక్టర్లకు మాత్రమే చోటు దక్కిందని కాంట్రాక్టేతర అభ్యర్థులు చెబుతున్నారు. కొత్తగా ఉద్యోగాల భర్తీ కాకుండా కాంట్రాక్టు డాక్టర్ల సర్వీసును క్రమబద్ధీకరించినట్లుగా నియామకాల ప్రక్రియ జరిగిందంటూ మెజార్టీ అభ్యర్థులు పెదవి విరిచారు. ముందుగా కాంట్రాక్టు వైద్యులతో పోస్టులు భర్తీ చేసి, ఆ తర్వాత ఇతర అభ్యర్థుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తే కోర్సులో మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు దక్కేవని అంటున్నారు. అలా కాకుండా పెద్ద సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చూపి చివరకు కాంట్రాక్టు వైద్యులతో సరిపెట్టడంతో ఇతర అభ్యర్థులను నిరుత్సాహపరిచినట్లు అయిందంటూ పలువురు వైద్యులు బోర్డు తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణలో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా
డబ్ల్యూడీసీడబ్ల్యూ పటాన్చెరువు అంగన్వాడీల్లో 32 ఖాళీలు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. పటాన్ చెరువు పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 32 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్–08, అంగన్వాడీ ఆయా–24. ► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్లు మించకుండా ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరాఖాస్తులకు చివరి తేది: 27.08.2021 ► వెబ్సైట్: https://mis.tgwdcw.in or https://wdcw.tg.nic.in యాదాద్రి భువనగిరి జిల్లా అంగన్వాడీల్లో 57 పోస్టులు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ విభాగం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 57 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్లు–08, అంగన్వాడీ ఆయాలు–45, మినీ అంగన్వాడీ టీచర్లు– 04. ► ప్రాజెక్టుల వారీగా ఖాళీలు: ఆలేరు–18, భువనగిరి–14, మోత్కూర్–10, రామన్నపేట–15. ► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా వివాహితురాలై, స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: సంబంధిత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: 26.08.2021 నుంచి 28.08.2021 వరకూ. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021 ► వెబ్సైట్: https://wdcw.tg.nic.in డీహెచ్ఎస్, జగిత్యాలలో 10 ఖాళీలు తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన జగిత్యాల జిల్లా హెల్త్ సొసైటీ.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 10 ► పోస్టుల వివరాలు: సివిల్ అసిస్టెంట్ సర్జన్–04, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫార్మసిస్ట్–05. ► సివిల్ అసిస్టెంట్ సర్జన్: అర్హత: ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ► ల్యాబ్ టెక్నీషియన్: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఫార్మసీలో డిప్లొమా/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ► ఫార్మసిస్ట్: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు డీఎంఎల్టీ/బీఎస్సీ(ల్యాబ్ టెక్నీషియన్) ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో మెరిట్ మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, జగిత్యాల చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021 ► వెబ్సైట్: https://jagtial.telangana.gov.in మేనేజ్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 05 ► పోస్టుల వివరాలు: డైరెక్టర్(అగ్రికల్చర్ మార్కెటింగ్)–01, రీసెర్చ్ అసోసియేట్ (అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్)–01, రీసెర్చ్ అసోసియేట్(నాలెడ్జ్ మేనేజ్మెంట్)–01, జూనియర్ స్టెనోగ్రాఫర్–01, అసిస్టెంట్ క్యాషియర్–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ డైరెక్టర్(అడ్మినిస్ట్రేషన్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్), రాజేంద్రనగర్, హైదరాబాద్–500030, హైదరాబాద్, తెలంగాణ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: https://www.manage.gov.in టీఎస్ పోస్టల్ సర్కిల్లో 55 స్పోర్ట్స్ కోటా పోస్టులు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం.. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 55 ► పోస్టుల వివరాలు: పోస్టల్ అసిస్టెంట్–11, సార్టింగ్ అసిస్టెంట్–08, పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్–26, ఎంటీఎస్–10. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత స్థానిక భాష వచ్చి ఉండాలి. ► వయసు: పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్/పోస్ట్‌మ్యాన్/మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ► క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బేస్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, జూడో, కబడ్డీ, కరాటే, ఖో ఖో, షూటింగ్ తదితరాలు. ► క్రీడార్హతలు: సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ► ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న క్రీడా ప్రాథమ్యాల ప్రాధాన్యతా క్రమం ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► వెబ్సైట్: https://tsposts.in -
అక్రమార్కులకు ఆఫ్‘లైన్ క్లియర్’
సాక్షి, అమరావతి: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను గత రెండు దఫాలుగా ఆన్లైన్ విధానంలో భర్తీ చేసిన సర్కారు.. తాజా నోటిఫికేషన్లో ఆఫ్‌లైన్ ద్వారా భర్తీ చేస్తామనడంతో అభ్యర్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం అక్రమార్కులకు వరం కానుందని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తెచ్చి తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని.. దీనివల్ల ప్రతిభ కలిగిన వైద్యులకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అసలే ఉద్యోగ నియామకాల్లేక నాలుగున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వైద్యులకు.. ఈ నోటిఫికేషన్‌ను చూసి సంతోషించాలో.. బాధపడాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఆఫ్‌లైన్ ఎవరి కోసమో! ప్రజారోగ్యశాఖలో, బోధనాస్పత్రుల్లో కలిపి 1171 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 2018 సెప్టెంబర్ 26న నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో అక్రమార్కులకు రాచబాట వేసినట్టుగా అర్థమవుతోందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. గతంలో అంటే 2010లో ఒకసారి, 2013లో మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరిపారు. అప్పట్లోనే ఆన్లైన్ పద్ధతిలో నియామకాలు చేపట్టారు. కానీ తాజా నోటిఫికేషన్లో ఆన్లైన్ అనే పద్ధతిని వాడలేదు. ఎవరికోసం ఆఫ్‌లైన్ పెట్టారో అర్థంకాని పరిస్థితి. ఒక్కో పోస్టుకు 12 మంది (1:12)లెక్కన 1171 పోస్టులకు.. 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్న ఈ ప్రక్రియ ఆన్లైన్లో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మాన్యువల్‌గా నియామకాలు చేపడితే.. ఏ దశలోనైనా సర్టిఫికెట్లు గానీ, డాక్యుమెంట్లు గానీ మార్చేయడానికి అవకాశముందని, నియామక కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు బాటలు వేసినట్లవుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. అభ్యర్థులు కుటుంబ సంక్షేమశాఖ వెబ్సైట్లో దరఖాస్తును డౌన్లోడు చేసుకుని, దాన్ని పూరించి సర్టిఫికెట్లన్నీ జతచేసి ఈ నెల 25వ తేదీలోగా గొల్లపూడిలోని కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయానికి చేర్చాలని పేర్కొన్నారు. తాము పంపిన దరఖాస్తుల్లో ఏదైనా సర్టిఫికెట్ లేకున్నా, కావాలని వాటిని తీసేసినా దానికి ఎవరు బాధ్యత వహిస్తారనేది అభ్యర్థుల ఆందోళన. ఆన్లైన్లో అయితే ఎవరి మార్కులు ఎన్ని, సర్వీసు ఎంత.. ఇలాంటివన్నీ తెలిసే అవకాశముందని, ఆఫ్‌లైన్ అయితే అన్నీ గుట్టుగా సాగే అవకాశముందనేది పలువురు వైద్యులంటున్నారు. జోనల్ వ్యవస్థపై స్పష్టత లేకుండానే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ వ్యవస్థ అనేది దశాబ్దాల తరబడి ఉంది. రాష్ట్రప్రతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్) మేరకు కొనసాగుతున్న ప్రక్రియ ఇది. దీనిపై స్పష్టత ఇవ్వకుండానే నోటిఫికేషన్ జారీచేశారు. రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6 జోన్లుగానూ, హైదరాబాద్ ఫ్రీ జోన్గానూ ఉండేది. ఈ జోనల్ వ్యవస్థపై చివరి సారిగా 2002లో జీవో ఎంఎస్ నం.124 ద్వారా సవరణలు చేసి అప్పట్లో నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత ఇప్పటివరకూ ఎలాంటి సవరణలూ లేవు. 2014లో రాష్ట్రం విడిపోయాక దీనిపై స్పష్టత రాలేదు. ఫలితంగా ఏ జోన్లో ఎన్ని పోస్టులన్న వివరాల్లేవు. దీంతో కొన్ని జోన్లలో పోస్టుల్లేక, మరికొన్ని జోన్లలో పోస్టులు ఎక్కువగా ఉండి అసమానతలు ఏర్పడే అవకాశముందని అధికార వర్గాలంటున్నాయి. ఇలాంటి విషయాల్లో స్పష్టత లేకుండా హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేశారని అధికారవర్గాల్లో చర్చజరుగుతోంది. -
నాడు పశువుల కాపరి నేడు పేదల వైద్యుడు
కృషి ఉంటే మనుషులు రుషులవుతారని అంటారు. లక్ష్మిరెడ్డి డాక్టర్ అయ్యారు. ఇరవై ఏళ్ల క్రితం పశువుల కాపరిగా ఉన్న లక్ష్మిరెడ్డి నేడు సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా మార్కాపురం ఏరియా వైద్యశాలలో ప్రభుత్వ వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. మార్కాపురం మండలంలోని బిరుదులనరవ గ్రామంలో 1979లో పగడాల వెంకటరెడ్డి, సుబ్బమ్మలకు జన్మించిన డాక్టర్ లక్ష్మిరెడ్డి విద్యాభ్యాసం ఒకటి నుంచి నాల్గవ తరగతి వరకు దోర్నాల మండలం చిన్నదోర్నాలలోని వేమన విద్యాలయంలో జరిగింది. ఆరు నుంచి పది వరకు మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం హైస్కూల్లో జరిగింది. లక్ష్మిరెడ్డి టెన్త్‌లో ఫెయిల్ కావటంతో తల్లిదండ్రులు అతడికిక చదువు రాదని నిర్ణయించుకుని పశువులను మేపేందుకు పొలాలకు పంపారు. ఏడాది పాటు పశువుల కాపరిగా ఉన్న లక్ష్మిరెడ్డి ఇదే తన జీవితం కాదని, టెన్త్ పాస్ కావాలని నిశ్చయించుకున్నాడు. ఇన్స్టెంట్ పరీక్ష రాసి పాసయ్యాడు. మార్కాపురం ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలలో ఇంటర్ చేరేందుకు వెళ్లగా టెన్త్ను ‘ఎట్ ఎ టైమ్’ పాస్ కాకపోవడంతో సీటు ఇవ్వలేమని చెప్పారు. దీనితో నల్లగొండలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరాడు. మళ్లీ రెండవ సంవత్సరం బేస్తవారిపేటలో చదివాడు. ఎంసెట్ లో 1600 ర్యాంక్ రావటంతో తిరుపతి వెటర్నరీ కళాశాలలో చేరాడు. దాంతో సంతృప్తి చెందని లక్ష్మిరెడ్డి మెడికల్ సీటు సాధించాలనే పట్టుదలతో మళ్లీ ఎంసెట్ రాశారు. ఈసారి 229వ ర్యాంక్ రావటంతో కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆయన పట్టుదల అక్కడితో ఆగిపోలేదు. ఎంబీబీఎస్‌లో కూడా టాపర్‌గా నిలిచారు. తిరుపతి స్విమ్స్‌లో డయాబెటిస్‌లో కోర్సు పూర్తి చేశారు. 2007లో దూపాడులో వైద్యాధికారిగా విధుల్లో చేరారు. అప్పటికీ వైద్య వృత్తిలో ఇంకా ఏదో సాధించాలనే తపనతో పీజీ కోసం పరీక్ష రాశారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంఎస్‌లో సీటు వచ్చింది. కోర్సు పూర్తయిన అనంతరం 2015లో మార్కాపురం ఏరియా వైద్యశాలలో జనరల్ సర్జన్‌గా నియమితులయ్యారు. ఈ మూడేళ్ల కాలంలో లక్ష్మిరెడ్డి సుమారు రెండు వేల మైనర్ ఆపరేషన్లు, వెయ్యి మేజర్ ఆపరేషన్లు చేశారు. ఏ డాక్టర్ వద్దకు వెళ్లినా ఓపీ ఫీజు వందా, నూటాయాభై రూపాయలు ఉన్న ఈ రోజుల్లో పట్టణంలో ప్రజా వైద్యశాలను స్థాపించి ముప్పై రూపాయలు మాత్రమే తీసుకుంటూ పేదల డాక్టర్‌గా గుర్తింపు పొందారు లక్ష్మిరెడ్డి. నిరాశా నిస్పృహలు వద్దు ఎంసెట్‌లో మొదటి ప్రయత్నంలో మెడికల్ సీటు కోల్పోవటంతో ఇంటికి వచ్చేశా. అదే సమయంలో ‘నారాయణ’ విద్యా సంస్థల చైర్మన్ నాకు స్వయంగా ఫోన్ చేసి ఉచితంగా కోచింగ్ ఇప్పించడంతో రెండో ప్రయత్నంలో మెడికల్ సీటు సాధించా. దీనితో నా కల నెరవేరింది. పేదలకు మంచి వైద్యం అందించటమే నా లక్ష్యం. కృషి, పట్టుదల, శ్రమ ఉంటే సాధించలేనిదేమీ లేదు. ఇటీవల కాలంలో ఎంసెట్‌లో, నీట్లో ర్యాంక్‌లు రాలేదని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం చూస్తుంటే బాధ కలుగుతోంది. నిరాశ, నిస్పృహల్ని దగ్గరకు రానివ్వద్దు. పట్టుపట్టి చదివితే విజయం సాధించి తీరుతాం. అందుకు నేనే ఉదాహరణ. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో మా సొంత ఊరెళ్లి తల్లిదండ్రులకు పొలం పనుల్లో సహాయం చేస్తుంటా. నాకు అది తృప్తినిస్తుంది. – డాక్టర్ లక్ష్మిరెడ్డి – జి.ఎల్.నరసింహారావు, సాక్షి, మార్కాపురం -
వైద్యం.. అచేతనం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్యం కరువు వైంది. వైద్యులు.. సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండటంతో ఆరోగ్య కేంద్రాలు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. జ్వరం వచ్చినా ప్రజలు జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సి వస్తోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు జిల్లా కేంద్రానికే పరిమితం అవుతున్నారు. జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ఉండగా.. ఇందులో 24 గంటల పాటు వైద్యసేవలందించే ఆరోగ్య కేంద్రాలు 40 ఉన్నాయి. వీటితో పాటు 16 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ) వైద్య సేవలు అందిస్తున్నాయి. 2012లో క్లస్టర్ల వ్యవస్థను తీసుకొచ్చినా ఉపయోగం లేని పరిస్థితి నెలకొంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను పర్యవేక్షించేందుకు ప్రతి క్లస్టర్‌కు ఒక ఎస్పీహెచ్వోను నియమించారు. ప్రస్తుతం ఓర్వకల్లు, ఆత్మకూరు, కోడుమూరు ఎస్పీహెచ్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర ఎస్పీహెచ్వోలను వాటికి ఇన్‌చార్జీలుగా నియమించారు. ఎస్పీహెచ్వోలు వారి క్లస్టర్ పరిధిలోని పీహెచ్‌సీలను పర్యవేక్షించాల్సి ఉన్నా.. అధిక శాతం ఎస్పీహెచ్వోలు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎస్పీహెచ్వోలతో పాటు ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఆరోగ్య కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉన్నా చుట్టపుచూపుగా విధులకు హాజరవుతున్నారు. సగం మంది వైద్యులు, సిబ్బంది డుమ్మా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వైద్యవిద్యను అభ్యసించే ప్రభుత్వ వైద్యులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్వహించాల్సి ఉండగా అధిక శాతం వైద్యులు ఉదయం 10 గంటల తర్వాత వచ్చి ఒంటి గంటకే తిరిగి వెళ్తున్నారు. జిల్లాలో 210 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉండగా 18 ఖాళీగా ఉన్నాయి. 192 మందిలో 28 మంది ఉన్నత విద్య(పీజీ) కోసం వెళ్లారు. వీరి స్థానంలో ఎవరినీ నియమించలేదు. 164 మందిలో సగం మంది వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పీహెచ్‌సీల్లో పనిచేస్తే పీజీ సీట్లకు రిజర్వేషన్ వస్తుందనే భావనతో చేరుతున్నా విధులు మాత్రం నిర్వర్తించడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. సాధారణ జ్వరమొచ్చినా పల్లె నుంచి పట్టణంలోని ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనికి తోడు ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాలు, పరికరాల కొరతతో పాటు వైద్య సిబ్బంది, ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికి వారు యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా సీహెచ్సీలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఒక్కో సీహెచ్‌సీకి 4 నుంచి 5 పోస్టులు ఉండగా, అక్కడి వైద్యులు వంతుల వారీగా రోజుకొకరు చొప్పున విధులకు హాజరవుతున్నారు. ఏ రోజు సీహెచ్‌సీకి వెళ్లినా పూర్తి స్థాయిలో వైద్యులు ఉండరన్నది బహిరంగ రహస్యం. పత్తికొండ సీహెచ్‌సీలో నలుగురు మెడికల్ ఆఫీసర్లు ఉండగా రాత్రి విధుల్లో డెంటల్ డాక్టర్‌ను నియమించడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని చోట్ల రాత్రి వేళల్లో స్టాఫ్‌నర్సుల సేవలే దిక్కవుతున్నాయి. వైద్యులే విధులకు డుమ్మా కొడుతుండటంతో కింది స్థాయి సిబ్బంది పనితీరు యథారాజా తథాప్రజ అన్నట్లు తయారైంది. వైద్యపరీక్షలూ బరువే... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలతో పాటు వైద్య పరీక్షలు కూడా అటకెక్కాయి. సాధారణ హెచ్‌బీ, బ్లడ్‌షుగర్, బీపీ, మలేరియా శ్యాంపిల్, ఎక్స్‌రే వంటి సాధారణ పరీక్షలు చేసే వారు కూడా పీహెచ్‌సీల్లో కరువయ్యారు. కొన్ని పీహెచ్‌సీల్లో ల్యాబ్ పరికరాలు, ఎక్స్‌రే యూనిట్లు మూలనపడ్డాయి. ఈ నెపంతో అధిక శాతం కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్ కేంద్రాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. దీంతో వైద్యపరీక్షలు చేయించుకోలేక, వ్యాధి ముదిరి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందించడ మే కాకుండా వ్యాధులు ప్రబలకుండా చైతన్యపరచాల్సిన బాధ్యత కూడా వైద్య ఆరోగ్యశాఖపై ఉంది. అయితే ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో ఈ శాఖ పూర్తిగా వెనుకబడింది. ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సిన మాస్ మీడియా విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులు అధిక శాతం డిప్యూటేషన్లపై జిల్లా కేంద్రంలో పనిచేస్తుండటం గమనార్హం.