నాడు పశువుల కాపరి నేడు పేదల వైద్యుడు | Tomorrow's Doctors Day | Sakshi
Sakshi News home page

నాడు పశువుల కాపరి నేడు పేదల వైద్యుడు

Published Sat, Jun 30 2018 1:57 AM | Last Updated on Sat, Jun 30 2018 1:57 AM

Tomorrow's Doctors Day - Sakshi

కృషి ఉంటే మనుషులు రుషులవుతారని అంటారు. లక్ష్మిరెడ్డి డాక్టర్‌ అయ్యారు. ఇరవై ఏళ్ల క్రితం పశువుల కాపరిగా ఉన్న లక్ష్మిరెడ్డి నేడు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా మార్కాపురం ఏరియా వైద్యశాలలో ప్రభుత్వ వైద్యునిగా సేవలు అందిస్తున్నారు.


మార్కాపురం మండలంలోని బిరుదులనరవ గ్రామంలో 1979లో పగడాల వెంకటరెడ్డి, సుబ్బమ్మలకు జన్మించిన డాక్టర్‌ లక్ష్మిరెడ్డి విద్యాభ్యాసం ఒకటి నుంచి నాల్గవ తరగతి వరకు దోర్నాల మండలం చిన్నదోర్నాలలోని వేమన విద్యాలయంలో జరిగింది. ఆరు నుంచి పది వరకు మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం హైస్కూల్‌లో జరిగింది. లక్ష్మిరెడ్డి టెన్త్‌లో ఫెయిల్‌ కావటంతో తల్లిదండ్రులు అతడికిక చదువు రాదని నిర్ణయించుకుని పశువులను మేపేందుకు పొలాలకు పంపారు.

ఏడాది పాటు పశువుల కాపరిగా ఉన్న లక్ష్మిరెడ్డి ఇదే తన జీవితం కాదని, టెన్త్‌ పాస్‌ కావాలని నిశ్చయించుకున్నాడు. ఇన్‌స్టెంట్‌ పరీక్ష రాసి పాసయ్యాడు. మార్కాపురం ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలలో ఇంటర్‌ చేరేందుకు వెళ్లగా టెన్త్‌ను ‘ఎట్‌ ఎ టైమ్‌’ పాస్‌ కాకపోవడంతో సీటు ఇవ్వలేమని చెప్పారు. దీనితో నల్లగొండలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చేరాడు. మళ్లీ రెండవ సంవత్సరం బేస్తవారిపేటలో చదివాడు. ఎంసెట్‌ లో 1600 ర్యాంక్‌ రావటంతో తిరుపతి వెటర్నరీ కళాశాలలో చేరాడు. దాంతో సంతృప్తి చెందని లక్ష్మిరెడ్డి మెడికల్‌ సీటు సాధించాలనే పట్టుదలతో మళ్లీ ఎంసెట్‌ రాశారు.

ఈసారి 229వ ర్యాంక్‌ రావటంతో కర్నూలు మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చింది. ఆయన పట్టుదల అక్కడితో ఆగిపోలేదు. ఎంబీబీఎస్‌లో కూడా టాపర్‌గా నిలిచారు. తిరుపతి స్విమ్స్‌లో డయాబెటిస్‌లో కోర్సు పూర్తి చేశారు. 2007లో దూపాడులో వైద్యాధికారిగా విధుల్లో చేరారు. అప్పటికీ వైద్య వృత్తిలో ఇంకా ఏదో సాధించాలనే తపనతో పీజీ కోసం పరీక్ష రాశారు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంఎస్‌లో సీటు వచ్చింది.

కోర్సు పూర్తయిన అనంతరం 2015లో మార్కాపురం ఏరియా వైద్యశాలలో జనరల్‌ సర్జన్‌గా నియమితులయ్యారు. ఈ మూడేళ్ల కాలంలో లక్ష్మిరెడ్డి సుమారు రెండు వేల మైనర్‌ ఆపరేషన్లు, వెయ్యి మేజర్‌ ఆపరేషన్లు చేశారు. ఏ డాక్టర్‌ వద్దకు వెళ్లినా ఓపీ ఫీజు వందా, నూటాయాభై రూపాయలు ఉన్న ఈ రోజుల్లో పట్టణంలో ప్రజా వైద్యశాలను స్థాపించి ముప్పై రూపాయలు మాత్రమే తీసుకుంటూ పేదల డాక్టర్‌గా గుర్తింపు పొందారు లక్ష్మిరెడ్డి.

నిరాశా నిస్పృహలు వద్దు
ఎంసెట్‌లో మొదటి ప్రయత్నంలో మెడికల్‌ సీటు కోల్పోవటంతో ఇంటికి వచ్చేశా. అదే సమయంలో ‘నారాయణ’ విద్యా సంస్థల చైర్మన్‌ నాకు స్వయంగా ఫోన్‌ చేసి ఉచితంగా కోచింగ్‌ ఇప్పించడంతో రెండో ప్రయత్నంలో మెడికల్‌ సీటు సాధించా. దీనితో నా కల నెరవేరింది. పేదలకు మంచి వైద్యం అందించటమే నా లక్ష్యం.

కృషి, పట్టుదల, శ్రమ ఉంటే సాధించలేనిదేమీ లేదు. ఇటీవల కాలంలో ఎంసెట్‌లో, నీట్‌లో ర్యాంక్‌లు రాలేదని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం చూస్తుంటే బాధ కలుగుతోంది. నిరాశ, నిస్పృహల్ని దగ్గరకు రానివ్వద్దు. పట్టుపట్టి చదివితే విజయం సాధించి తీరుతాం. అందుకు నేనే ఉదాహరణ.  ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో మా సొంత ఊరెళ్లి తల్లిదండ్రులకు పొలం పనుల్లో సహాయం చేస్తుంటా. నాకు అది తృప్తినిస్తుంది. – డాక్టర్‌ లక్ష్మిరెడ్డి

– జి.ఎల్‌.నరసింహారావు, సాక్షి, మార్కాపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement