కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్యం కరువు వైంది. వైద్యులు.. సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండటంతో ఆరోగ్య కేంద్రాలు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. జ్వరం వచ్చినా ప్రజలు జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సి వస్తోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు జిల్లా కేంద్రానికే పరిమితం అవుతున్నారు. జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) ఉండగా.. ఇందులో 24 గంటల పాటు వైద్యసేవలందించే ఆరోగ్య కేంద్రాలు 40 ఉన్నాయి. వీటితో పాటు 16 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ) వైద్య సేవలు అందిస్తున్నాయి.
2012లో క్లస్టర్ల వ్యవస్థను తీసుకొచ్చినా ఉపయోగం లేని పరిస్థితి నెలకొంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను పర్యవేక్షించేందుకు ప్రతి క్లస్టర్‌కు ఒక ఎస్‌పీహెచ్‌వోను నియమించారు. ప్రస్తుతం ఓర్వకల్లు, ఆత్మకూరు, కోడుమూరు ఎస్‌పీహెచ్‌వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర ఎస్‌పీహెచ్‌వోలను వాటికి ఇన్‌చార్జీలుగా నియమించారు. ఎస్‌పీహెచ్‌వోలు వారి క్లస్టర్ పరిధిలోని పీహెచ్‌సీలను పర్యవేక్షించాల్సి ఉన్నా.. అధిక శాతం ఎస్‌పీహెచ్‌వోలు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎస్‌పీహెచ్‌వోలతో పాటు ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఆరోగ్య కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉన్నా చుట్టపుచూపుగా విధులకు హాజరవుతున్నారు.
సగం మంది వైద్యులు, సిబ్బంది డుమ్మా
ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వైద్యవిద్యను అభ్యసించే ప్రభుత్వ వైద్యులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్వహించాల్సి ఉండగా అధిక శాతం వైద్యులు ఉదయం 10 గంటల తర్వాత వచ్చి ఒంటి గంటకే తిరిగి వెళ్తున్నారు. జిల్లాలో 210 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉండగా 18 ఖాళీగా ఉన్నాయి. 192 మందిలో 28 మంది ఉన్నత విద్య(పీజీ) కోసం వెళ్లారు. వీరి స్థానంలో ఎవరినీ నియమించలేదు.
164 మందిలో సగం మంది వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పీహెచ్‌సీల్లో పనిచేస్తే పీజీ సీట్లకు రిజర్వేషన్ వస్తుందనే భావనతో చేరుతున్నా విధులు మాత్రం నిర్వర్తించడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. సాధారణ జ్వరమొచ్చినా పల్లె నుంచి పట్టణంలోని ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనికి తోడు ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాలు, పరికరాల కొరతతో పాటు వైద్య సిబ్బంది, ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికి వారు యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నారు.
ప్రధానంగా సీహెచ్‌సీలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఒక్కో సీహెచ్‌సీకి 4 నుంచి 5 పోస్టులు ఉండగా, అక్కడి వైద్యులు వంతుల వారీగా రోజుకొకరు చొప్పున విధులకు హాజరవుతున్నారు. ఏ రోజు సీహెచ్‌సీకి వెళ్లినా పూర్తి స్థాయిలో వైద్యులు ఉండరన్నది బహిరంగ రహస్యం. పత్తికొండ సీహెచ్‌సీలో నలుగురు మెడికల్ ఆఫీసర్లు ఉండగా రాత్రి విధుల్లో డెంటల్ డాక్టర్‌ను నియమించడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని చోట్ల రాత్రి వేళల్లో స్టాఫ్‌నర్సుల సేవలే దిక్కవుతున్నాయి. వైద్యులే విధులకు డుమ్మా కొడుతుండటంతో కింది స్థాయి సిబ్బంది పనితీరు యథారాజా తథాప్రజ అన్నట్లు తయారైంది.
వైద్యపరీక్షలూ బరువే...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలతో పాటు వైద్య పరీక్షలు కూడా అటకెక్కాయి. సాధారణ హెచ్‌బీ, బ్లడ్‌షుగర్, బీపీ, మలేరియా శ్యాంపిల్, ఎక్స్‌రే వంటి సాధారణ పరీక్షలు చేసే వారు కూడా పీహెచ్‌సీల్లో కరువయ్యారు. కొన్ని పీహెచ్‌సీల్లో ల్యాబ్ పరికరాలు, ఎక్స్‌రే యూనిట్లు మూలనపడ్డాయి. ఈ నెపంతో అధిక శాతం కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్ కేంద్రాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. దీంతో వైద్యపరీక్షలు చేయించుకోలేక, వ్యాధి ముదిరి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందించడ మే కాకుండా వ్యాధులు ప్రబలకుండా చైతన్యపరచాల్సిన బాధ్యత కూడా వైద్య ఆరోగ్యశాఖపై ఉంది. అయితే ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో ఈ శాఖ పూర్తిగా వెనుకబడింది. ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సిన మాస్ మీడియా విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులు అధిక శాతం డిప్యూటేషన్లపై జిల్లా కేంద్రంలో పనిచేస్తుండటం గమనార్హం.
వైద్యం.. అచేతనం
Published Wed, Jun 4 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement