గ్రామీణ వైద్యం.. గాలిలో దీపం | Doctors Shortage In Primary Health Centers Kurnool | Sakshi
Sakshi News home page

గ్రామీణ వైద్యం.. గాలిలో దీపం

Published Wed, Aug 29 2018 7:04 AM | Last Updated on Wed, Aug 29 2018 7:06 AM

Doctors Shortage In Primary Health Centers  Kurnool - Sakshi

దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు. గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుంది. అక్కడి ప్రజలే అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుంటే..వారికి ప్రాథమిక వైద్యం కూడా అందని ద్రాక్షగా మారితే అది సమాజాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జిల్లాలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో గ్రామీణ వైద్యం పడకేసింది. నిపుణులైన వైద్యులు లేకపోవడం, ఉన్న వైద్యుల్లోనూ కొందరు విధులకు సరిగా రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా సాధారణ వ్యాధులకు సైతం పల్లెజనం పట్టణ బాట పడుతున్నారు.  

కర్నూలు(హాస్పిటల్‌):   జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఇందులో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 40 దాకా ఉన్నాయి. వీటితోపాటు వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 20 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు(సామాజిక ఆరోగ్య కేంద్రాలు) పనిచేస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందితో కలిసి 2,125 మంది దాకా పనిచేస్తున్నారు. పీహెచ్‌సీల్లో ప్రాథమిక వైద్యం, సీహెచ్‌సీల్లో సాధారణ వ్యాధులతోపాటు ప్రసవాలు, చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులకు వైద్యమూ అందించాల్సి ఉంది. గ్రామీణ ప్రజలు ముందుగా ఏదైనా జ్వరం వస్తే సమీపంలోని సబ్‌సెంటర్‌ను ఆశ్రయిస్తున్నారు. అక్కడ నర్సులు ఇచ్చే చికిత్సకు వ్యాధి స్పందించకపోతే పీహెచ్‌సీలకు వెళ్తారు. అక్కడ కూడా ఆరోగ్యం బాగు పడకపోతే కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు రెఫర్‌ చేస్తారు. ఇక్కడ కూడా బాగు కాకపోతే జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రులకు రోగులను వైద్యులు రెఫర్‌ చేస్తారు.
 
సమయపాలన పాటించని వైద్యులు
సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఉండి చికిత్స అందించాలి. 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు, కొన్ని సీహెచ్‌సీల్లో నిరంతరం వైద్య సిబ్బంది ఉండి ఏ సమయంలోనైనా వచ్చే రోగులకు చికిత్స చేయాలి. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల్లో అధికారులు బయోమెట్రిక్‌ మిషన్‌ను ఏర్పాటు చేసి హాజరు పరిశీలిస్తున్నారు. దీనిని సీఎం డ్యాష్‌బోర్డుకు అనుసంధానం చేసి, ఏ రోజు, ఏ సమయంలో ఎంత మంది హాజరయ్యారో రికార్డు చేస్తారు. కానీ జిల్లాలో అ«ధికశాతం ఆసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రం, డివిజన్‌ కేంద్రాలకు దూరంగా ఉండే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ఈ పరిస్థితి మరీ అధికంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆసుపత్రికి వెళితే అధికశాతం వైద్యులు కనిపించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
నిపుణులైన వైద్యులు కరువు
జిల్లాలోని 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 159 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులుండగా అందులో 76 రెగ్యులర్, 59 కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారిలోనూ 8 మంది పీజీ వైద్యవిద్య కోసం వెళ్లగా, వారి స్థానంలో పక్క పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులను డిప్యుటేషన్‌పై వేస్తున్నారు. ఈ కారణంగా రెండుచోట్లా రోగులకు వైద్యం జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో 8 డిప్యూటీ సివిల్‌ సర్జన్, 50 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, 8 డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు ఉన్నాయి. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 3, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులు ఒకటి మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం నాటి జనాభాకు అనుగుణంగా ఉన్న పోస్టులే ఇప్పటికీ ఉండటం, జనాభా పెరగడంతో పాటు ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్యా పెరగడం వల్ల ఉన్న వైద్యులపై అదనపు భారం పడుతోంది. కొన్ని కేంద్రాల్లో  వైద్యులు సమయపాలనపాటించకపోవడంతో రోగులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.  

పెద్దాసుపత్రిపైనే పెద్దభారం
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను బోధనాసుపత్రిగా పరిగణిస్తారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో నయం కాని కేసులను మాత్రమే అక్కడి వైద్యులు ఈ ఆసుపత్రికి రెఫర్‌ చేయాలి. కానీ పలు రకాల కారణాల వల్ల అధిక శాతం రోగులు సాధారణ వ్యాధులకూ ఇదే ఆసుపత్రికి చికిత్స కోసం వస్తున్నారు. ఫలితంగా ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య 2,500ల నుంచి 3 వేలు దాటుతోంది. 1,050 పడకలు మంజూరైతే 1,500లకు పైగా రోగులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగా అదనంగా, అనధికారికంగా 700లకు పైగా పడకలను రోగుల కోసం అధికారులు వేయాల్సి వస్తోంది. మూడింతలు అధికంగా రోగులు వస్తున్నా దానికి అనుగుణంగా ఇక్కడి వైద్యులు, ఉద్యోగులు, పారామెడికల్‌ సిబ్బంది సంఖ్యను ప్రభుత్వం పెంచడం లేదు.  

లద్దగిరిలో డాక్టర్లుండరు
మా ఊరికి లద్దగిరి ఆసుపత్రి దగ్గరే. అయితే మా ఊరు ఆసుపత్రి పరిధిలోకి రాదని అక్కడి వైద్యులు చెబుతున్నారు. చికిత్స కోసం వెళితే సరిగ్గా చూడరు. ఈ కారణంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నాం. ఊళ్లోనే బాగా చూస్తే మాకు ఇంత దూరం వచ్చి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదు.  –సురేష్, రేమడూరు 

మా ఆసుపత్రిలో సరిగ్గా చూడరు
మా ఊళ్లో ఉన్న ధర్మాసుపత్రిలో సమయానికి డాక్టర్లుండరు. ఉన్నా మమ్ముల్ని సరిగ్గా చూడరు. నాకు కాళ్లనొప్పులు, ఆయాసం ఉంది. మా ఊళ్లో ఆసుపత్రికి వెళితే మందులు తక్కువగా ఇస్తారు. అందుకే దూరమైనా ఈ పెద్దాసుపత్రికి వస్తున్నా. నెలకోసారి వచ్చి డాక్టర్లకు చూపించుకుంటా. ఇక్కడి డాక్టర్లు నాకు నెలరోజులకు మందులు ఇస్తారు. ఊరి నుంచి ఆసుపత్రికి వచ్చిపోవాలంటే రూ.80 అవుతుంది.  – పక్కీరమ్మ, సి.బెళగల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement