మంత్రి అనుచరుడు ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న పెద్దాసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ విభాగం
అసలే పెద్దాసుపత్రి. ఆరేడు జిల్లాలకు పెద్దదిక్కు. నిత్యం వేలాదిమంది రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఏ వ్యాపారం పెట్టినా డబ్బే డబ్బు. అదీ మందుల వ్యాపారమైతే లాభాలకు హద్దే ఉండదు. ఇదే ఆలోచన మంత్రి అనుచరుడికి వచ్చింది. పైగా ఆ మంత్రికి సొంత శాఖ. చెబితే కాదనే సాహసం ఎవరూ చేయరు. అనుకున్నదే తడువు ఆసుపత్రి ‘పెద్ద’పై ఒత్తిడి తెచ్చారు. అసలే అక్రమాల్లో కూరుకుపోయిన ఆ ‘పెద్ద’ కూడా మంత్రి ప్రాపకం కోసం జీహుజూర్ అంటున్నారు. ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటయితే ప్రస్తుతం పేదలకు కాస్తోకూస్తో ఊరటనిస్తున్న చౌక మందుల (జనరిక్) దుకాణాలు మూతపడడం ఖాయంగా కన్పిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే పలు సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తాజాగా ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న జనరిక్ మందుల దుకాణాల (అన్న సంజీవని)ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో మంత్రి అనుచరుడు ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులు ఇవ్వొద్దంటూ గతంలో జారీచేసిన ఉత్తర్వులకు సైతం తూట్లు పొడిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తన అనుచరుడు షాపు పెట్టుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌పై మంత్రి ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. అయితే, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పే సాహసం కూడా సూపరింటెండెంట్ చేయడం లేదు. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. మంత్రి ఆదేశాలను ఆచరణలోకి తెచ్చేందుకు వీలుగా ఏం చేయాలనే విషయంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదనే నిబంధనను సైతం అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే టెండరు లేకుండానే డైట్ కాంట్రాక్టును మరో ఏడాది పాటు కొనసాగించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెడికల్ షాపు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మొత్తమ్మీద ఆసుపత్రి కేంద్రంగా దందా కొనసాగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
జనరిక్ షాపులపై దొంగ దెబ్బ!
గతంలో కర్నూలు సర్వజనాసుపత్రిలో ప్రైవేటు మెడికల్ షాపులు ఉండేవి. అతి తక్కువ బాడుగకే షాపులు ఇచ్చేవారు. అయితే, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి అనుగుణంగా ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రైవేటు మెడికల్ షాపులను రద్దు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఇక మీదట ఎలాంటి ప్రైవేటు మెడికల్ షాపులనూ అనుమతించవద్దని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం జనరిక్ మందుల షాపులు మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు వీటికి ఎసరు పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు చేసేందుకు మంత్రి అనుచరుడికి అనుమతి ఇవ్వాలనే ఒత్తిళ్లు వస్తున్నాయి.
తలూపుతున్న సూపరింటెండెంట్!
పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ ఏళ్లుగా అద్దె చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌లో ‘హార్ట్ ఫౌండేషన్’ కొనసాగించారు. దీనిపై విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి మాటలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆందోళనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనరిక్ ఔషధశాలలను దెబ్బతీసే విధంగా, ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటుకు అనుగుణంగా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం.
కాంట్రాక్టర్లతో మంతనాలు
కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పలు సంస్థలు కాంట్రాక్టు పనులు చేపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పనీ ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. రోగులకు ఆహార పంపిణీ మొదలుకుని.. సెక్యూరిటీ, స్కావెంజర్ పనులు, వివిధ పరికరాల కొనుగోళ్లు, మందుల సరఫరా వంటి అనేక కాంట్రాక్టులను ప్రైవేటు సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో కొన్ని కాంట్రాక్ట్‌ల కాలపరిమితి ముగిసినప్పటికీ.. వాటిని టెండర్లు పిలవకుండానే కొనసాగించారు.
అయితే, ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఫరూక్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికే ఆసుపత్రిలో కాంట్రాక్టు పనులు చేస్తున్న వారందరికీ మంత్రి పీఏ నేరుగా ఫోన్లు చేసి.. వ్యక్తిగతంగా కలవాలంటూ కబురు పంపారు. ఏయే కాంట్రాక్టు సంస్థ ఏ విధంగా పనులు చేస్తోందనే విషయాలను కూడా ఆసుపత్రిలోని కొద్ది మంది సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా ఆయా కాంట్రాక్టు సంస్థలను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు అనేక డిమాండ్లు పెట్టి నెరవేర్చుకున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఇప్పుడు ఏకంగా తన అనుచరుడికి మెడికల్ షాపు అప్పగించేలా మంత్రి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment