Shortage of employees
-
‘పట్టా’లెక్కని ఉద్యోగాల భర్తీ!
సాక్షి, అమరావతి: భారతీయ రైల్వేలో ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది పనిభారంతో సతమతమవుతున్నారు. నిత్యం ఓవర్ టైం డ్యూటీలు చేయాల్సిన దుస్థితి కనిపిస్తోంది. సిబ్బంది కొరత కారణంగానే టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అందుకే టికెట్ బుకింగ్ సేవలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 3.11 లక్షల గ్రూప్ సి పోస్టులు, 3,018 గెజిటెడ్ కేడర్ మంజూరైన పోస్టులుంటే.. వాటిల్లో సుమారు 2.74లక్షల పోస్టులు ఇంకా భర్తీకే నోచుకోలేదు. భద్రతను విస్మరిస్తూ.. రైల్వేలో లోకో పైలెట్లు, ట్రాక్స్‌పర్సన్స్, క్లర్క్‌లు, గారు్డలు, రైలు మేనేజర్, స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ పోస్టులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ట్రాక్ మెయింటెనెన్స్, ఫిట్నెస్, సీనియర్–జూనియర్ సెక్షన్ ఇంజినీర్లు, గ్యాంగ్‌మెన్, టెక్నీíÙయన్ల పోస్టులు భర్తీ కాకపోవడంతో.. తగిన సిబ్బంది లేక రైల్వే ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ట్రాక్‌లను తనిఖీ చేయడానికి సిబ్బంది రోజూ 8–10 కి.మీ ప్రయాణించాల్సి ఉంది. ఇలాంటి సున్నితమైన పనిని శ్రద్ధతో చేయాల్సి ఉండగా.. పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.సేఫ్టీ కేటగిరీలోని 1,52,734 ఖాళీలను యు ద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. వెంటాడుతున్న ప్రమాదాలు.. పాసింజర్ రైళ్లలో 2020–21లో 22, 2021–22లో 35, 2022–23లో 48, 2023–24లో 20 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాలకు రైళ్లు పట్టాలు తప్పడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మిగిలిన సంవత్సరాలతో పోలిస్తే 2022–23లో రైలు ప్రమాదాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఒక్క 2018–19లో 59 ప్రమాదాలు జరిగితే వీటిల్లో 46 రైళ్లు పట్టాలు తప్పాయంటే ట్రాక్‌ల దుస్థితి ఎంత దారుణ పరిస్థితిలో ఉందో అద్దం పడుతున్నది. 2022–23లో 48 ఘటనల్లో 6 ప్రమాదాలు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొనడం, 36 పట్టాలు తప్పడంతో జరిగాయి. వీటిల్లో దాదాపు 17 శాతం ప్రమాదాలు ముంబై, నాగ్‌పూర్, భుసావల్, పూణే, షోలాపూర్ ప్రాంతాల్లోనే సంభవించాయి. సెంట్రల్ జోన్ తర్వాత ఈస్ట్ సెంట్రల్ జోన్, నార్త్ జోన్లలో 6 ప్రమాదాలు జరిగాయి. దేశంలోని 18 రైల్వే జోన్లలో ఆరు జోన్లలో మాత్రమే (ఈశాన్య, నైరుతి, దక్షిణ, పశ్చిమ మధ్య, కొంకణ్, మెట్రో రైల్వేలు) ఎటువంటి ప్రమాదాలు లేకపోవడం విశేషం. నిధులు విదల్చట్లేదు.. రైల్వే ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వే శాఖ ఖర్చు చేస్తున్న నిధులను సైతం కాగ్ తప్పు పట్టింది. 2017–18లో ప్రవేశపెట్టిన రా్రïÙ్టయ రైల్ సంరక్ష కోష్ (ఆర్ఆర్ఎస్కే) రైల్వే భద్రతా నిధి (భద్రతకు సంబంధించిన పనులకు ఆరి్థక సాయం అందించడానికి ప్రత్యేక నిధి)పేరుకు మాత్రమే ఉందని ఎద్దేవా చేసింది. ఆర్ఆర్ఎస్కే నుంచి ప్రాధాన్యత–1 పనులపై మొత్తం వ్యయం 2017–18లో 81.55 శాతం నుంచి 2019–20లో 73.76 శాతానికి పడిపోయింది. ట్రాక్ పునరుద్ధరణ పనులకు 2018–19లో నిధుల కేటాయింపు రూ.9,607.65 కోట్ల నుంచి 2019–20లో రూ.7,417 కోట్లకు దిగజారింది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ రైల్వే కోసం 2019–20లో మొత్తం వ్యయంలో ట్రాక్ పునరుద్ధరణ కోసం ఖర్చు చేసినది 3.01 శాతమే కావడం గమనార్హం. ఉద్యోగాలు భర్తీ చేయాలి.. కృత్రిమ మేధస్సు (ఏఐ) ను సిబ్బంది తొలగింపునకు, పోస్టుల రద్దుకు వినియోగించే బదులు విస్తృతంగా స్టేషన్ డేటా లాగర్ల, లోకోమోటివ్ లలోని మైక్రో ప్రాసెసర్ల డిజిటల్ డేటాను తక్షణమే విశ్లేషించి ప్రమాదాలను నివారించాలి. ఏటీఆర్‌లను సమర్పించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని గతంలో రైల్వే భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్ సమర్పించిన నివేదికలో సిఫారసులను కచ్చితంగా అమలు పరచాలి. రైల్వేలోని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. – వి.కృష్ణ మోహన్, జాతీయ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ) -
భారీగా తగ్గిన హెచ్1–బీ వీసాలు
వాషింగ్టన్: అమెరికా కలల ప్రయాణానికి కరోనా మహమ్మారి అడుగడుగునా అడ్డు పడుతోంది. భారతీయ టెక్కీల్లో అత్యధిక డిమాండ్ ఉండే హెచ్1–బీ వీసాల సంఖ్య గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలకి కొరత లేదు. జాబ్ ఓపెనింగ్స్ భారీ సంఖ్యలో ఉన్నాయి. కానీ హెచ్1–బీ ఉద్యోగస్తుల సంఖ్య పడిపోయింది. కోవిడ్ నేపథ్యంలో అమెరికా ప్రయాణాలపై, వీసాలపై ఆంక్షలు విధించడంతో ఈ వలసేతర వీసాలు తగ్గాయి. రెండేళ్లలో 19 శాతం తగ్గిపోయిన ఉద్యోగులు అమెరికా కార్మిక శాఖ వెల్లడించిన గణాంకాలను బ్లూమ్‌బర్గ్ న్యూస్ విశ్లేషించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే సెప్టెంబర్ 2021 నాటికి హెచ్–1బీ కేటగిరి కింద విదేశీ ఇంజనీరింగ్, మ్యాథ్‌మేటిక్స్ ఉద్యోగస్తులు 12.6% తగ్గిపోయారు. కరోనా ముందు అంటే 2019లో పోల్చి చూస్తే ఇదే కేటగిరిలో 19% హెచ్1–బీ వీసాలు తగ్గిపోయాయి. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించడం, వీసాల జారీ ప్రక్రియ మందగించడం, కోవిడ్ ముప్పుతో అమెరికాకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలతోనే హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘2020 మార్చి నుంచి కొత్త వీసాల జారీ ప్రక్రియ బాగా నెమ్మదించింది. లాక్డౌన్ ఆంక్షలతో ఒకానొక దశలో కొన్నాళ్ల పాటు దాదాపు నిలిచింది. స్టెమ్ (సైన్స్, సాంకేతికం, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కేటగిరీలో ఉద్యోగులు తగ్గిపోయాయి. కొన్ని కంపెనీలు విదేశాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతినివ్వడంతో హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయింది’ అని కాలిఫోర్నియా యూనిర్సిటీ ప్రొఫెసర్ పేరి గోవణ్ణ చెప్పారు. ప్రతీ ఏడాది కొత్తగా 85 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటారు. స్టెమ్‌లో గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి. కానీ త్వరగానే ఆయా రంగాలు కోలుకోవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా అమెరికా కార్మిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,97,000 ఉద్యోగాలు ఉన్నాయని 2020 నుంచి పోల్చి చూస్తే 9% తగ్గిందని, 2019తో పోల్చి చూస్తే 17% తగ్గిందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ వెల్లడించింది. -
ఉద్యోగులేరీ?
సాక్షి, సూర్యాపేట: జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కలెక్టరేట్‌తో పాటు జిల్లా కేంద్రంలో ఉన్న 64 ప్రధాన శాఖల్లో సుమారు 2వేల మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం 625 మందితో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సకాలంలో ఏ పనీ జరగడం లేదు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకు నోచుకోకపోగా, విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పని భారం తప్పడంలేదు. జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు ఉండాలి. కానీ కేవలం ఒక అధికారి, అటెండర్ మాత్రమే ఉన్నా వీరిని యాదాద్రి భువ నగిరి జిల్లాకు ఇన్చార్జ్గా ని యమించారు. దీంతో ఏడాది కాలంగా కార్యాలయ తాళం తీ యడం లేదు. జిల్లాస్థాయి ప్ర భుత్వ కార్యాలయాల్లో సిబ్బం ది కొరతకు ఇది నిదర్శనం. సర్కారు పథకాలు సకాలంలో ప్రజలకు అందించాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సరిపడా ఉద్యోగులు ఉండాలి. చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయవచ్చని భావించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఉద్యోగులను మూడు జిల్లాలకు పంచడమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కొంత మంది ఎంప్లాయీస్‌ను సూర్యాపేట జిల్లాకు ఆర్డర్టు సర్వ్ పేరుతో పంపింది. అయితే తగినంతమందిని కేటాయించకపోవడంతో జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగుల కొరత పట్టిపీడిస్తోంది. ఒకటి రెండు శాఖల్లో ఉద్యోగుల కొరత ఉంటేనే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటిది అన్ని శాఖల్లో అలాంటి పరిస్థితే ఉండడంతో సకాలంలో పనులు జరగడంలేదు. జిల్లా ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగుల సమస్య మాత్రం తీరడం లేదు. శాఖల్లో పరిస్థితి.. జిల్లా సమీకృత కలెక్టరేట్‌తో పాటు జిల్లా కేంద్రలో ఉన్న 64 ప్రధాన శాఖల్లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉండాలి. కానీ కేవలం 625 మందితో నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొంది. సమీకృత కలెక్టరేట్లో ఉన్న జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత స్పష్టంగా కనబడుతోంది. అన్ని శాఖల్లో ప్రధాన్యత కలిగిన జిల్లా రెవెన్యూ కార్యాలయంలో వివిధ సెక్షన్లలో కలిపి 54 మంది ఉద్యోగులు అవసరం ఉండగా 30 మంది మాత్రమే ఉన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయలంలో 15 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 8 మంది ఉద్యోగుల మాత్రమే ఉన్నారు. జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక అధికారి, అటెండర్ మాత్రమే ఉన్నా వీరు కూడా ఇతర మరో జిల్లాలకు ఇన్చార్జ్గా నియమించడంతో గత సంవత్సరం నుంచి కార్యాలయ తాళం తీయడం లేదు. ఇక జిల్లా కార్మిక శాఖలో 12 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక జిల్లా అధికారి, ఒక డివిజన్ అధికారి, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిపి మొత్తం నలుగురు మాత్రమే ఉన్నారు. అదే విదం గా గ్రామ పంచాయతీ కార్యాలయం, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం, సివిల్ సప్లయ్, పౌరసంబంధాలశాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, సహకారశాఖ, భూ కొలతలు, పంచాయతీరాజ్ ఇలా అన్ని శాఖల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. సక్రమంగా అమలు కాని ప్రభుత్వ పథకాలు ఉద్యోగుల కొరత వల్ల ప్రభుత్వ పథకాలు స క్రమంగా అమలు కావడం లేదు. చిన్న జిల్లాలు ఏర్పడినా ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగక తప్పడం లేదు. ఇదిలా ఉంటే ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా అధికారులతో పాటు సీనియర్ అసిస్టెంట్లపై అధికభారం పడుతోందని ఆయా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నేరుగా బయటకు చెప్పకున్నా తమలో తమే బాధపడుతున్న సందర్భాలూ ఉన్నాయి. -
నీటిపారుదల శాఖలో ఇంజినీర్ల కొరత
మోర్తాడ్(బాల్కొండ): చిన్న తరహా నీటిపారుదల శాఖ లో ఇంజినీర్ల కొరత వేధిస్తోంది. ఖాళీ అయిన పోస్టులలో ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఇన్‌చార్జులతోనే శాఖలోని పనులను అధికారులు నెట్టుకొస్తున్నారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం పనులకు తీరని ఆటంకం కలుగుతోంది. క్షేత్ర స్థాయిలో పని చేయడానికి ఒక్కో మండలానికి ఒక ఏఈ ఖచ్చితంగా అవసరం. కొత్త మండలాల వారీగా కాకపోయినా పాత మండలాల వారిగానైనా ఏఈలు ఉండాల్సి ఉంది. అయితే పోస్టులు భర్తీ కాలేక పోయాయి. పదవీ విరమణ చేసిన అధికారుల స్థానంలో కొత్తగా ఉద్యోగులను నియమించకపోవడంతో ఖాళీలు పేరుకు పోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో నీటిపారుదల శాఖను పాలించే ఎస్ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఎస్ఈగా పని చేసిన దామోదర్ మాల్ ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందారు. దీంతో నిర్మల్ జిల్లా ఎస్ఈగా పని చేస్తున్న మురళీధర్‌కు ఇక్కడ పదవీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. రెండు జిల్లాల బాధ్యతలను ఒక్క అధికారే పర్యవేక్షించాల్సి ఉంది. బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి రెగ్యులర్ ఏఈ ఒక్క కమ్మర్పల్లి మండలానికి మాత్రమే ఉన్నారు. మోర్తాడ్‌లో పదవీ విరమణ పొందిన ఏఈ గంగాధర్‌ను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఏర్గట్ల, భీమ్‌గల్, బాల్కొండ మండలాలతో పాటు కొత్తగా ఏర్పడిన ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల మండల బాధ్యతలను మోర్తాడ్ బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారే పరిశీలించాల్సి వస్తోంది. ఆర్మూర్ నియోజకవర్గంలో మాక్లూర్, ఆర్మూర్‌లకు మాత్రమే ఏఈలు ఉన్నారు. నందిపేట్ మండలంలోని పోస్టు ఖాళీగానే ఉంది. ఆర్మూర్ ఏఈ నందిపేట్ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నందిపేట్ మండలం భౌగోళికంగా చాలా పెద్దదిగా ఉండగా ఒకే అధికారి రెండు మండలాల బాధ్యతలను నిర్వహించడం కష్టంగానే ఉంది. నిజామాబాద్ రూరల్ మండలంలో డిచ్పల్లి, సిరికొండ మండలాల్లోనే ఏఈలు ఉన్నారు. ధర్పల్లి, ఇందల్వాయి, నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న ఇద్దరు ఏఈలకు అదనపు బాధ్యతలను అప్పగించారు. నిజామాబాద్ అర్బన్‌కు సంబంధించి ఒక్కరే ఏఈ ఉన్నారు. ఇక్కడ సౌత్, నార్త్, సెంట్రల్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక్కరే అధికారి అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి వస్తోంది. ఒక్క బోధన్ డివిజన్లో మాత్రం ఏఈ పోస్టుల్లో రెగ్యులర్ ఇంజినీర్లు ఉన్నారు. మిషన్ కాకతీయకు కీలకమైన నీటిపారుదల శాఖలో ఇంజినీర్ల కొరత ఉండటంతో చెరువుల పునరుద్ధరణ పనులు అటకెక్కాయి. రెండు, మూడు విడతల పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఖాళీ పోస్టుల కారణంగా చెరువుల పునరుద్ధరణ ఆశించినంత మేర వేగంగా సాగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. మిషన్ కాకతీయ పథకం పనులు పూర్తి కావాలంటే ఏఈలు ఎంతో అవసరం. ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరించడంతో పాటు గ్రామాల్లో చెరువులు అభివృద్ధి చెందుతాయి. జిల్లా పరిషత్ ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్యను విన్నవిస్తాం. ఖాళీ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఉద్యమిస్తాం. – గుల్లె రాజేశ్వర్, జెడ్పీటీసీ సభ్యుడు, ఏర్గట్ల -
ఆ ఒక్కరే దిక్కు
వనపర్తి: రోజురోజుకు తగ్గిపోతున్న వనాలు, వన్యప్రాణుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. ఫారెస్టు చట్టాలను మరింత కఠినతరం చేయడమే కాకుండా అటవీప్రాంతాన్ని కాపాడటంతో పాటు పచ్చదనం పెంచేందుకు ఊరుకో నర్సరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 139 గ్రామాల్లో డ్వామా, ఫారెస్టు శాఖల ఆధ్వర్యంలో నర్సరీలు పెంచుతున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి మొక్కలు నాటే దశకు వస్తాయి. కానీ అటవీ ప్రాంతా న్ని రక్షించే వనమాలి(బీట్ ఆఫీసర్) మాత్రం జిల్లాలో ఒక్కరే ఉన్నారు. ఫారెస్ట్ శాఖ లో ఉద్యోగుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. జిల్లాలో 11,083 హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ పచ్చని ప్రాంతంలో వివిధ రకాల చెట్లు, మొక్కలు, అడవి జంతువులు, నెమళ్లు, జింకలు, కుందేళ్లతో పాటు ఇతర జంతువులు ఉన్నాయి. అడవిలో ఉండే చెట్లు, మొక్కలతో పాటు వన్యప్రాణులను సంరక్షించేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు mahaమొత్తం అటవీ ప్రాంతాన్ని 26 బీట్లుగా విభజించారు. ఒక్కో బీటుకు ఒక్కో అధికారి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి. ఒక్కో బీట్ అధికారికి సుమారుగా 500 నుంచి 700 హెక్టార్ల భూభాగాన్ని కేటాయించారు. వారికి కేటాయించిన ప్రాంతంలోని చెట్లు, వన్యప్రాణులను నిరంతరం రక్షిస్తూ ఉండాలి. ఆ ఒక్కరే దిక్కు జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు 26 వనమాలీలు (బీట్ అధికారులు) ఉండాల్సి ఉండగా.. కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. సెక్షన్ అధికారులకు విధులను కేటాయించి వనసంరక్షణ చర్యలు చేపడుతున్నారు. చట్టాలను కఠినతరం చేస్తూ వనాలు, వన్యప్రాణుల రక్షణపై అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడటం, చెట్లు తక్కువగా ఉన్న ప్రాంతంతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటించి పెంచడం, ఆయా బీట్ల పరిధిలో వన్యప్రాణులను రక్షించడం వనమాలి విధులు. ‘వనాల’పర్త జిల్లావ్యాప్తంగా 11,083 హెక్టార్లలో అటవీప్రాంతం ఉండగా వనపర్తి మండలం, ఖిల్లాఘనపురం మండలం, గోపాల్పేట మండలం బుద్దారం, పాన్‌గల్ మండలం, పెద్దమందడి మండలాల్లోని ప్రాంతాల్లో అటవీప్రాంతం ఎక్కువగా ఉంది. వనపర్తి సంస్థానాధీశులు ఫారెస్ట్ కోసం ఇచ్చిన భూభాగమే ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం వనపర్తి మండలం శ్రీనివాసపురం, సవాయిగూడెం, చందాపూర్, దత్తాయపల్లి తదితర ప్రాంతాలను కలుపుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించగా, కేంద్ర రక్షణ బలగాలు ఇక్కడ కొన్నాళ్లూ క్యాంపులు వేసి ఈ భూమిని ఫారెస్టుశాఖకు వర్తింపజేసేలా నీలగిరి చెట్లు, ఇతర రకాల మొక్కలను నాటించి వెళ్లారు. నాటినుంచి భూమి ఫారెస్ట్‌శాఖ ఆధీనంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.! నియామకాల ఊసేది? ఫారెస్టు శాఖలో సెక్షన్, బీట్ అధికారుల నియామకం కోసం ఏడాదిన్నర క్రితం ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఉద్యోగులను ఎంపిక చేశారు. కారణాలు ఏవైనా వారికి ఇప్పటి వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. కొత్త చట్టాలను పకడ్బందీగా అమలుకు ఉద్యోగులను నియమించాల్సి ఉందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. అడవి రక్షణకు చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్న 1967 ఫారెస్టు చట్టంలో మార్పులు చేస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ఫారెస్టుశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చట్టాలను మరింత కఠినతరం చేస్తూ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వనాలు, వన్యప్రాణులు, పచ్చదనం పెంచడం తదితర అశాలపై సుదీర్ఘచర్చ జరిగే అవకాశం ఉంది. పకడ్బందీగా చట్టం అమలు మారుతున్న ఫారెస్టు చట్టాల ప్రకారం గతంలో అడవిలో చెట్లు నరికితే ఏడాది కాలం జైలు శిక్ష ఉండేది. మారిన చట్టాల ప్రకారం కనీసం మూడేళ్లు జైలుశిక్ష, రూ.ఐదువేల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక నుంచి ప్రభుత్వం, ప్రైవేట్ ప్రదేశాల్లో ఎక్కడ చెట్లు నరికినా కఠినచర్యలు తప్పవు. చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలంటే అవసరమైన సిబ్బందిని నియమిస్తే బాగుంటుంది. – బాబ్జిరావు, జిల్లా అటవీ అధికారి, వనపర్తి -
పల్లెల్లో పాట్లు
పాల్వంచరూరల్: నూతన గ్రామపంచాయతీలు సమస్యల లోగిళ్లుగా మారాయి. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు, కనీస వసతులు లేవు. పంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక పలు గ్రామాల్లో అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో ఇటీవల కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కొలువుదీరినా.. అభివృద్ధి పనులు చేయడం వారికి సవాల్‌గానే మారింది. దీనికి తోడు గ్రామ కార్యదర్శుల కొరత కూడా వేధిస్తోంది. జిల్లాలో 479 గ్రామ పంచాయతీలు ఉండగా.. కార్యదర్శులు 88 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఒక్కొక్కరు మూడు, నాలుగు గ్రామాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. ఫలితంగా ఏ గ్రామంలోనూ వారు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. అభివృద్ధి కోసమే పునర్విభజన... చిన్న పంచాయతీలు అయితేనే అభివృద్ధి మరింతగా సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం పంచాయతీల పునర్విభజన చేసింది. 500 మంది జనాభా ఉన్న తండాలు, చిన్న గ్రామాలను కూడా ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. జిల్లాలో గతంలో 203 (భద్రాచలం, సారపాక మినహా) గ్రామ పంచాయతీలు ఉండగా.. పునర్విభజన తర్వాత 479కి పెరిగింది. అన్ని గ్రామాలకు ఈనెల 2వ తేదీన కొత్త పాలకులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్నాయి. కొత్త పంచాయతీలకు భవనాలు కరువు.. జిల్లాలో నూతనంగా ఆవిర్భవించిన 276 గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు కరువయ్యాయి. పాత వాటిలోనూ 43 గ్రామాల్లో సరైన కార్యాలయాలు లేవు. కొత్తగా ఏర్పడిన వాటిలో 20 పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్త పంచాయతీల ఏర్పాటుపై శ్రద్ధ చూపిన ప్రభుత్వం..పక్కా భవనాల నిర్మాణంలో పట్టనట్టుగా వ్యవహరిస్తోందని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు మంజూరు చేసిన నిదులను కొత్త పంచాయతీలకు కూడా జమ చేయాలని, ఆయా గ్రామాల్లో నెలకొన్న సమ స్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వేధిస్తున్న కార్యదర్శుల కొరత... గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ అధికారిగా వ్యవహరించే కార్యదర్శులు ప్రతి పంచాయతీకి ఒకరు ఉండాలి. కానీ జిల్లాలో 387 గ్రామాల్లో కార్యదర్శు లు లేరు. జిల్లా వ్యాప్తంగా 88 మంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా కార్యదర్శులు పర్యవేక్షించాలి. వీధి లైట్లు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరపరా, ఇంటి పన్నుల వసూళ్లు, జనణ, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలు బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. అయితే అన్ని గ్రామాల్లో కార్యదర్శులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
ఇంకా కుదురుకోని ‘సంక్షేమం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంకా విభజన బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. ముఖ్యం గా ఉన్నతోద్యోగుల విభజన కారణంగా సంక్షేమ శాఖల పనితీరు మందగించింది. రాష్ట్ర విభజన జరి గి పధ్నాలుగు నెలలు దాటినా పరిపాలనాపరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు పూర్తిస్థాయిలో ఇంకా కుదురుకోలేదు. కీలకమైన పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ సంక్షేమ భవన్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ డెరైక్టరేట్లలో ఉద్యోగుల కొరత కారణంగా పని ఒత్తిడి పెరిగింది. ఎస్సీ అభివృద్ధిశాఖలో ఒక అదనపు డెరైక్టర్ పోస్టు ఏపీకి కేటాయించడంతో తెలంగాణకు విడిగా ఒక స్థానాన్ని సృష్టించాల్సి వస్తోంది. ఇద్దరు జేడీలు ఉండగా వారిలో ఒకరు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఆ పోస్టును కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఇక సాంఘిక సంక్షేమ అధికారుల(ఎస్‌డబ్ల్యూవో) పోస్టులు మొ త్తం 858 ఉండగా వాటిలో 177 ఖాళీగా ఉన్నాయి. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారుల(డీఎస్‌డబ్ల్యూవో) పోస్టులు 11కుగాను 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎస్‌డబ్ల్యూవో పోస్టులు 61 కాగా అం దులో 8 ఖాళీగా ఉన్నాయి. మల్టీ జోనల్/జోనల్ పోస్టులు కలుపుకుంటే 150 పోస్టులకుగాను 32 ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ శాఖకు సంబంధించి ఏపీకి అడిషనల్ డెరైక్టర్ పోస్టు వెళ్లడంతో ఇక్కడ ఏడీ పోస్టును సృష్టించాల్సి ఉంది. దీనితోపాటు ఒక జేడీ, రెండు డీడీ పోస్టులు, ఆరు సెక్షన్ సూపరింటెండెంట్ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 10 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, రెండు జోనల్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఏడు ఏటీడబ్ల్యూవో పోస్టులు, 83 గ్రేడ్-2 హెడ్మాస్టర్ పోస్టులు, వంటవాళ్లు 201 మంది, 129 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు గ్రేడ్-2 పోస్టులు, 352 సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఏఎస్) పోస్టులు, 259 సెకండరీ గ్రేడ్ టీచర్ల(జీపీఎస్)పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖ అదనపు డెరైక్టర్ పోస్టు ఏపీకి కేటాయించడంతో జాయింట్ డెరైక్టర్ ఇన్చార్జి డెరైక్టర్‌గా కొనసాగిస్తున్నారు. అదనపు డెరైక్టర్ పోస్టును సృష్టించాల్సిన అవసరం ఏర్పడింది. బీసీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు 750కుగాను 200 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1500 కామాటీ, వంట వాళ్లు, వాచ్‌మన్ పోస్టులకుగాను 310 ఖాళీగా ఉన్నాయి. -
దేవాదాయశాఖలో ఉద్యోగుల కొరత!
♦ జిల్లా కమిషనర్ సైతం ఇన్‌చార్జియే ♦ గోదావరి పుష్కరాలకు ఉద్యోగుల సమస్య ♦ తాత్కాలిక ఉద్యోగుల నియామకం జరిగేనా నిజామాబాద్‌కల్చరల్ : జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఉద్యోగుల కొరత వెంటాడుతోంది. దశాబ్దాలపాటు ఈ శాఖలో రెగ్యులర్ పోస్టుల భర్తీ జరగక, పదవీ విరమణ పొందిన వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు అదనపు పనిభారంతో పడరాని పాట్లు పడుతున్నారు. 14 నుంచి 25 వరకు 12 రోజులపాటు జరుగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలోనైనా ఉద్యోగుల నియామకాలు చేపట్టక పోవడంపై చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఆ శాఖ ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. ఏళ్ల నుంచి పదవీ విరమణ పొందిన స్థానంలో కొత్త వారిని బదిలీపై ఆ శాఖ కమిషనర్ కార్యాలయం నియమించకపోవడంతో ఉన్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఈ కార్యాలయంలో ఉండాల్సిన రెగ్యులర్ జిల్లా కమిషనర్ పోస్టుతోసహా మిగితా ఉద్యోగుల ఖాళీలున్నాయి. గత కొన్నేళ్లుగా మెదక్-నిజామాబాద్ జిల్లాలకు కలపి జిల్లా ఇన్చార్జి కమిషనర్ ఒకరే ఉండగా గత ఏడాదిన్నర నుంచి హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా దేవాదాయ,ధర్మదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్‌గా సోమయ్య బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఇన్చార్జిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కార్యాలయాన్ని చక్కదిద్దడంతోపాటు అస్తవ్యస్తంగా ఉన్న కార్యాలయంలోని కొందరు ఉద్యోగుల పనితీరును, జిల్లాలోని శాఖ పరిధిలోకి వచ్చే దేవాలయాల కోర్టు వివాదాల పరిష్కారంపై ప్రత్యేక శ్రద ్ధ కనబరుస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో గల దేవాదాయ, ధర్మదాయ శాఖ కార్యాలయంలో రెగ్యులర్ కమిషనర్ పోస్టుతోపాటు ఒక సీనియర్ అసిస్టెంట్ పోస్టు రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్నారుు. ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకుగాను 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకుగాను రెండు పోస్టులు, టైపిస్టు పోస్టు, రికార్డు అసిస్టెంట్ పోస్టు, రెండు అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఎప్పుడు ఊపుతుందోగాని అప్పటి వరకు తాత్కాలిక ఉద్యోగులనైనా నియమిస్తే ‘గోదావరి పుష్కరాలు’ సవ్యంగా సాగేందుకు అవకాశం ఉంటుందని, ప్రభుత్వం చొరవ చూపాలని ఉద్యోగవర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారుు. -
428 జీవో అమలయ్యేనా?
ఖానాపూర్ : ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో నైపుణ్యం గల ఉద్యోగుల కొరత తీర్చాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 1979-80 విద్యా సంవత్సరంలో వృత్తి విద్యాకోర్సులను ప్రారంభించిం ది. 1985లో సీఎంగా పనిచేసిన ఎన్టీఆర్ ఆదేశాల మేరకు అప్పటి ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఆది నారాయణ వృత్తి విద్యాకోర్సులు చదివిన వారికి సంబంధిత ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని 428 జీవో విడుదల చేశారు. వివిధ శాఖల్లో పనిచేసిన పలువురు కార్యదర్శులు ఈ జీవో అమలుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పశువైద్యశాఖ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ తదితర శాఖల్లో మాత్రమే ఈ జీవో అమలవుతోంది. ఈ కోర్సులను ప్రారంభించినపుడు చదివిన వారి కి ఉద్యోగావకాశాలు లేవు అని చెబితే ఎవరూ ప్రవేశాలు పొందేవారు కాదు. కోర్సు ప్రారంభంలో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉంటాయని ప్రచారం చేసి తీరా కోర్సు పూర్తిచేసిన తర్వాత ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో ఈ వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసినవారు నిరాశకు లోనవుతున్నారు. తమ విలువైన రెండేళ్ల కాల వ్యవధిని ఆయా ప్రభుత్వాలు వృథా చేశాయని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అప్పటి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వృత్తి విద్యా కోర్సులు చదివిన తమతో ఆటలాడుకున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు సంబంధిత శాఖల మం త్రులకు వినతిపత్రాలు అందించినా 428 జీ వో మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదని వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ హ యాంలోనైనా జీవోను పకడ్బందీగా అమలు చేయాలని కోర్సులు పూర్తి చేసిన తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. -
వెతలు తీరుతాయా?
నిజామాబాద్ అర్బన్: మెడికల్ కళాశాలలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో కళాశాల పనితీరు, వైద్యసేవలలో అంతరాయాలు ఏర్పడుతున్నా యి. రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. విధిలేక ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఎనిమిదంతస్థుల అందమైన ఆసుపత్రి ఉన్నప్పటికీ సేవలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. సిబ్బంది నియామకా లు జరుగకపోవడంతో కళాశాలకు అనుమతి ఇవ్వడంలోనూ ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదీ పరిస్థితి 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. అనంతరం ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఉన్నతాధికారులు పరిశీలన జరి పారు. మొత్తం 400 మంది ఉద్యోగులు అవసరమని గుర్తించారు. వీరి నియామకం కోసం 2012 జూన్ ఏడున అప్పటి ప్రభుత్వం జీఓ నం.150 విడుదల చేసింది. కళాశాల ప్రిన్సిపాల్, పరిపాలన విభాగానికి సంబంధించి 50 పోస్టులను మంజూరు చేసింది. ఆసుపత్రిలో 189 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి లభించింది. ఈ నియామకలను తక్షణమే చేపడతారని భావించినా, తీవ్ర జాప్యం జరిగింది. 2013 డిసెంబర్ ఆరున ప్రభుత్వం జీఓలో మార్పులు చేస్తూ 810 పోస్టులతో కూడిన కొత్త ఆదేశాలను జారీ చేసింది. ఇందులో 210 మంది స్టాఫ్‌నర్సులు, 114 మంది వైద్యులు, 63 మంది పారా మెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది 76, మరిన్ని పోస్టులను జత చేశారు. ఇందులో 240 పోస్టులను వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల నుంచి ఆప్షన్ల ద్వారా నియమించాలని పేర్కొన్నారు. దీనికి 2014 జనవరి రెండున ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. అయినా నియామకా లు జరుగలేదు. ఈలోగా సాధారణ ఎన్నికల కోడ్ అమలులోకి వచిచంది. రాష్ట్రం ఏర్పడి, కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేటి వరకు నియామకాల జాడ మాత్రం లేదు. వేధిస్తున్న ఖాళీలు కళాశాలలో ఖాళీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కళాశాల ఏర్పడిన అనంతరం రోగుల సంఖ్య రెండింతలు పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రికి 400కు పైగా అవుట్‌పేషెంట్లు వస్తున్నారు. ఇన్‌పేషెంట్లు 250 వరకు ఉన్నారు. సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. 220 మంది స్టాఫ్‌నర్సులు అవసరం కాగా, 80 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. నాల్గవ తరగతి ఉద్యోగులు 180 మంది అవసరం కాగా, 21 మంది మాత్రమే ఉన్నారు. 120 మంది వైద్యులు అవసరం కాగా, 33 మాత్రమే వైద్యసేవలు అందిస్తున్నారు. నియామకాలు జరుగకపోవడం, అత్యవసర సేవలు అందుబాటులో లేకపోవడంతో బాధితులు ప్రాణాలు కోల్పొతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, ఆత్మహత్య ప్రయత్నాలకు సంబంధించిన కేసులకు అత్యవసర సేవలు అందడం లేదు. నేడు ఉన్నతాధికారుల సమావేశం డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) డిప్యూటీ డెరైక్టర్ ప్రేమ్‌కుమార్, వైద్య విధాన పరిషత్ జాయింట్ సెక్రటరీ అనురాధ గురువారం జిల్లాకు రానున్నారు. మెడికల్ కళాశాలలో వివిధ పోస్టులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల నుంచి అప్షన్లను స్వీకరించనున్నారు. కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. వైద్య విధాన పరిషత్‌లో సుమారు 400 మంది ఉద్యోగులు ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో 1,200 మంది ఉద్యోగులు ఉన్నారు. అన్ని విభాగాల ఉ ద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. ఆసక్తి గల ఉద్యోగులు కళాశాలకు వస్తే ఎంపిక చేస్తారు. ఇందుకోసం కళాశాలలో ఇద్దరు ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వైద్య విధాన పరిషత్ కమిషనర్, డీఎంఈ అధికారులు భేటీ కానున్నారు. సీఎంతో చర్చించి నియామకాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కళాశాల అధికారి ఒకరు పేర్కొన్నారు. -
వైద్యం.. అచేతనం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్యం కరువు వైంది. వైద్యులు.. సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండటంతో ఆరోగ్య కేంద్రాలు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. జ్వరం వచ్చినా ప్రజలు జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సి వస్తోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు జిల్లా కేంద్రానికే పరిమితం అవుతున్నారు. జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ఉండగా.. ఇందులో 24 గంటల పాటు వైద్యసేవలందించే ఆరోగ్య కేంద్రాలు 40 ఉన్నాయి. వీటితో పాటు 16 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ) వైద్య సేవలు అందిస్తున్నాయి. 2012లో క్లస్టర్ల వ్యవస్థను తీసుకొచ్చినా ఉపయోగం లేని పరిస్థితి నెలకొంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను పర్యవేక్షించేందుకు ప్రతి క్లస్టర్‌కు ఒక ఎస్పీహెచ్వోను నియమించారు. ప్రస్తుతం ఓర్వకల్లు, ఆత్మకూరు, కోడుమూరు ఎస్పీహెచ్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర ఎస్పీహెచ్వోలను వాటికి ఇన్‌చార్జీలుగా నియమించారు. ఎస్పీహెచ్వోలు వారి క్లస్టర్ పరిధిలోని పీహెచ్‌సీలను పర్యవేక్షించాల్సి ఉన్నా.. అధిక శాతం ఎస్పీహెచ్వోలు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎస్పీహెచ్వోలతో పాటు ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఆరోగ్య కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉన్నా చుట్టపుచూపుగా విధులకు హాజరవుతున్నారు. సగం మంది వైద్యులు, సిబ్బంది డుమ్మా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వైద్యవిద్యను అభ్యసించే ప్రభుత్వ వైద్యులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్వహించాల్సి ఉండగా అధిక శాతం వైద్యులు ఉదయం 10 గంటల తర్వాత వచ్చి ఒంటి గంటకే తిరిగి వెళ్తున్నారు. జిల్లాలో 210 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉండగా 18 ఖాళీగా ఉన్నాయి. 192 మందిలో 28 మంది ఉన్నత విద్య(పీజీ) కోసం వెళ్లారు. వీరి స్థానంలో ఎవరినీ నియమించలేదు. 164 మందిలో సగం మంది వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పీహెచ్‌సీల్లో పనిచేస్తే పీజీ సీట్లకు రిజర్వేషన్ వస్తుందనే భావనతో చేరుతున్నా విధులు మాత్రం నిర్వర్తించడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. సాధారణ జ్వరమొచ్చినా పల్లె నుంచి పట్టణంలోని ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనికి తోడు ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాలు, పరికరాల కొరతతో పాటు వైద్య సిబ్బంది, ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికి వారు యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా సీహెచ్సీలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఒక్కో సీహెచ్‌సీకి 4 నుంచి 5 పోస్టులు ఉండగా, అక్కడి వైద్యులు వంతుల వారీగా రోజుకొకరు చొప్పున విధులకు హాజరవుతున్నారు. ఏ రోజు సీహెచ్‌సీకి వెళ్లినా పూర్తి స్థాయిలో వైద్యులు ఉండరన్నది బహిరంగ రహస్యం. పత్తికొండ సీహెచ్‌సీలో నలుగురు మెడికల్ ఆఫీసర్లు ఉండగా రాత్రి విధుల్లో డెంటల్ డాక్టర్‌ను నియమించడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని చోట్ల రాత్రి వేళల్లో స్టాఫ్‌నర్సుల సేవలే దిక్కవుతున్నాయి. వైద్యులే విధులకు డుమ్మా కొడుతుండటంతో కింది స్థాయి సిబ్బంది పనితీరు యథారాజా తథాప్రజ అన్నట్లు తయారైంది. వైద్యపరీక్షలూ బరువే... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలతో పాటు వైద్య పరీక్షలు కూడా అటకెక్కాయి. సాధారణ హెచ్‌బీ, బ్లడ్‌షుగర్, బీపీ, మలేరియా శ్యాంపిల్, ఎక్స్‌రే వంటి సాధారణ పరీక్షలు చేసే వారు కూడా పీహెచ్‌సీల్లో కరువయ్యారు. కొన్ని పీహెచ్‌సీల్లో ల్యాబ్ పరికరాలు, ఎక్స్‌రే యూనిట్లు మూలనపడ్డాయి. ఈ నెపంతో అధిక శాతం కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్ కేంద్రాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. దీంతో వైద్యపరీక్షలు చేయించుకోలేక, వ్యాధి ముదిరి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందించడ మే కాకుండా వ్యాధులు ప్రబలకుండా చైతన్యపరచాల్సిన బాధ్యత కూడా వైద్య ఆరోగ్యశాఖపై ఉంది. అయితే ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో ఈ శాఖ పూర్తిగా వెనుకబడింది. ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సిన మాస్ మీడియా విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులు అధిక శాతం డిప్యూటేషన్లపై జిల్లా కేంద్రంలో పనిచేస్తుండటం గమనార్హం.