doctor posts
-
గాంధీ, ఉస్మానియాల్లో డాక్టర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో డాక్టర్ల భర్తీకి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. ఈనెల 9వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 12వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, 13న అభ్యంతరాల స్వీకరణ, 14వ తేదీన నియామకపత్రాలు ఇవ్వనున్నారు.ఈ రెండు ఆస్పత్రుల్లో 235 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందులో ఉస్మానియాలో 8 ప్రొఫెసర్ పోస్టులు, 23 అసోసియేట్ ప్రొఫెసర్, 111 అసిస్టెంట్ ప్రొఫెసర్, 33 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అదేవిధంగా గాంధీ ఆస్పత్రిలో 3 ప్రొఫెసర్, 29 అసిస్టెంట్ ప్రొఫెసర్, 24 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, 4 ట్యూటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 9న గాంధీ మెడికల్ కాలేజీ పరిపాలన భవనంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ సమక్షంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజీ అకడమిక్ బ్లాక్‌లో కమిషనర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ సమక్షంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. -
సీఎం జగన్ పాలనలో వైద్యులకు గౌరవం
గుంటూరు మెడికల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యులకు పదోన్నతులు ఇచ్చారని, వేతనాలు పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆదివారం గుంటూరులో ఏపీ డాక్టర్స్ ఇంట్రాక్షన్ మీట్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యుల త్యాగాలను ఎవరూ మర్చిపోలేరన్నారు. ఈ సందర్భంగా ఆమె వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో వైద్యవృత్తికి, వైద్యులకు గౌరవం పెరిగిందన్నారు. దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య వృత్తికి గుర్తింపు తెచ్చారన్నారు. తొలిసారిగా వైద్యులకు యూజీసీ స్కేల్స్ అమలు చేసిన ఘనత డాక్టర్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. దేశానికే ఏపీ ఆదర్శం వైద్యులకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఏడో వేతన స్కేల్‌ను సీఎం జగన్ అమలు చేశారని గుర్తు చేశారు. 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అడిషనల్ డీఎంఈ ప్రమోషన్లు ఇచ్చామని, ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ విధానంతో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామని, ఈక్రమంలో సుమారు 53 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. వైద్యుల రిక్రూట్మెంట్లో దేశానికే ఏపీ ఆదర్శంగా ఉందని తెలిపారు. రోగులు, ప్రజల అవసరాలను బట్టి నూతనంగా నెఫ్రాలజీ వార్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ట్రైబల్ ప్రాంతాల్లో నియామకాలు చేపట్టి అక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యసేవలు పొందేలా చేశామన్నారు. నాడు–నేడుతో అభివృద్ధి.. నాడు–నేడు కార్యక్రమంతో రాష్ట్రంలో నూతనంగా 17 వైద్య కళాశాలలను రూ.8,500 కోట్లతో ప్రారంభించామన్నారు. వాటిల్లో నేడు ఐదు కళాశాలలు ప్రారంభమైనట్లు చెప్పారు. గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలను రూ.3,820 కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు రూ.17,000 కోట్లతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. వ్యాధులు వచ్చాక చికిత్స అందించే ఆస్పత్రులను బలోపేతం చేయడంతోపాటు, వ్యాధులు రాకుండానే ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. దీన్లో భాగంగా ప్రివెంటివ్ మెడికల్ కేర్ ఏర్పాటు చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా పేదల ఇళ్లకే వైద్యులు వెళ్లి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఇళ్ల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారని పేర్కొన్నారు. -
ఈఎస్ఐలో కొలువుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య కొలువుల భర్తీకి ఈఎస్ఐసీ ఉపక్రమించింది. వివిధ కేటగిరీల్లో ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన డాక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. నాలుగు కేటగిరీల్లో 40 పోస్టులు భర్తీ కానున్నాయి. సీనియర్ రెసిడెంట్ కేటగిరీలో 29 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్)/ సీనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 5 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్)/జూనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 3 ఖాళీలు, స్పెషలిస్ట్ కేటగిరీలో 3 ఖాళీలున్నాయి. రోస్టర్, రిజర్వేషన్ వారీగా పోస్టులను నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ కొలువుల భర్తీ పూర్తిగా మెరిట్, ఇంటర్వ్యూల పద్ధతిలో జరుగుతుంది. సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్/ఎంట్రీలెవల్) గరిష్ట వయోపరిమితి 69 సంవత్సరాలుగా ఖరారు చేయగా.. స్పెషలిస్ట్‌కు 66 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్‌కు 45 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిని నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూరించాలి. నిర్దేశించిన డాక్యుమెంట్లతో ఆయా తేదీల్లో ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే ప్రాధాన్యత ఇస్తారు. ఫలితాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు. అర్హత సాధించిన వైద్యులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా వేతనాలు సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్) / సీనియర్ కన్సల్టెంట్ రూ.2,40,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్) / జూనియర్ కన్సల్టెంట్ రూ.2,00,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) స్పెషలిస్ట్ రూ.1,27,141/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సీనియర్ రెసిడెంట్ రూ.67,000/– + డీఏ, ఎన్పీఏ, హెచ్ఆర్ఏ, ఇతరాలు -
162 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు భర్తీ
సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి చేపట్టిన వాక్–ఇన్ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకూ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులను భర్తీ చేశారు. 14 స్పెషాలిటీల్లో 319 పోస్టులను నోటిఫై చేయగా 316 మంది వైద్యులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇందులో 112 పోస్టులు శాశ్వత, 50 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేశారు. వీటిలో జనరల్ మెడిసిన్ 28, జనరల్ సర్జరీ 27, గైనకాలజీ 33, అనస్తీషియా 22, పాథాలజీ 12, పీడియాట్రిక్స్ 12, మిగిలిన స్పెషాలిటీల్లో ఇతర పోస్టులు ఉన్నాయి. మరోవైపు ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేపట్టేలా అత్యవసర అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. -
భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్ కుదరదు
సాక్షి, హైదరాబాద్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో భార్యాభర్తలకు ప్రాధాన్యం ఉండబోదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి మెరిట్ ఆధారంగానే డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల తాత్కాలిక జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734 పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 209 పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) పరిధిలో ఏడు పోస్టులకు అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. వాస్తవానికి మొత్తం 969 పోస్టులకుగాను 950 మందితో తుది జాబితాను విడుదల చేశారు. దివ్యాంగ అభ్యర్థులు లేకపోవడంతో వారికి కేటాయించిన 39 పోస్టుల్లో 19 మంది అభ్యర్థులే వచ్చారు. దీంతో మిగిలిన 20 పోస్టులను ఖాళీగా వదిలేశారు. వాటిని వచ్చే పోస్టుల భర్తీలో నింపుతారు. అప్పుడు కూడా రాకుంటే వాటిని సాధారణ పోస్టుల జాబితాలో చేరుస్తారు. మొత్తం జాబితాలో అత్యధికంగా మహిళా డాక్టర్లు 509 మంది, పురుష డాక్టర్లు 441 మంది ఉన్నారు. సాధారణంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. అయితే మెరిట్లో వారి రిజర్వేషన్‌కు మించి మహిళా డాక్టర్లు ఉన్నందున రిజర్వేషన్‌ను కాకుండా ప్రతిభ ఆధారంగానే జాబితా విడుదల చేసినట్లు బోర్డు వెల్లడించింది. వారం రోజుల్లో కౌన్సెలింగ్... మూడు విభాగాల్లో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు మొత్తం 4,803 దరఖాస్తులు రాగా వాటిలో రెండో విడతలో 1,860 మంది అర్హులను ఎంపిక చేశారు. వారిలో దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది అర్హులతో 950 మందిని గుర్తించారు. వారం రోజుల్లోగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారు. ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్ లేదా అనారోగ్య సమస్యలు లేదా భార్యాభర్తలకు ఒకచోట లేదా సమీప ఆసుపత్రుల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రాధాన్యాలు ఉండవని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం మెరిట్ ప్రకారం వారిచ్చే ప్రాధాన్యాల ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారు. మొదట వచ్చినవారికి ఇష్టమైన చోటకు పోస్టింగ్ వస్తుంది. తర్వాత వచ్చే వారికి వారి ప్రాధాన్యం ప్రకారం ఉంటే ఇస్తారు... లేకుంటే మరోచోటకు వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. బదిలీల సందర్భంగానే భార్యాభర్తలు, ఇతర ప్రాధాన్యాల ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారని, ఇప్పుడు మాత్రం కుదరదని చెబుతున్నారు. నేటి నుంచి అసిస్టెంట్ వైద్య ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల జాబితా విడుదలతో ఇక 1,147 అసిస్టెంట్ వైద్య ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని బోర్డు సభ్య కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తెలిపారు. ఈ పోస్టులకు మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ భర్తీ ప్రక్రియ ఒక దశకు చేరుకున్నాక నర్సుల పోస్టుల భర్తీపై ప్రకటన విడుదల చేస్తారు. ఇది సరికొత్త రికార్డు: మంత్రి హరీశ్‌రావు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైందన్నారు. 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం ఆరు నెలల్లో బోర్డ్ పూర్తి చేసిందన్నారు. రాత పరీక్ష లేకుండా, నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం విశేషమన్నారు. -
కొత్త మెడికల్ కాలేజీల్లో 200 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేయడానికి 200 వైద్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం మెడికల్ కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది కాలానికి నియమిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి కోరారు. అభ్యర్థులు నిర్దేశిత రూపంలో తమ దరఖాస్తులను ఈ నెల 28లోగా ఆన్లైన్లో సమర్పించాలని కోరారు. అర్హత కలిగిన అభ్యర్థుల తుది జాబితాను 31వ తేదీన ప్రకటిస్తారు. వచ్చేనెల 7లోగా విధుల్లోకి చేరాలి ఎంపికైన అభ్యర్థులు నిర్దేశిత కాలేజీల్లో వచ్చే నెల ఏడో తేదీలోగా చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్లకు నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు రూ. 1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు రూ. 1.25 లక్షలు వేతనంగా చెల్లిస్తామని రమేశ్‌రెడ్డి తెలిపారు. అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పెథాలజీ, మైక్రోబయోలజీ, ఫొరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్, అనెస్థిసియోలజీ, రేడియోడయాగ్నసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. -
ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిధిలో ఖాళీగా ఉన్న 44 వైద్యుల పోస్టులకు దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గురువారం పేర్కొన్నారు. ఎంబీబీఎస్ విద్యార్హత, ఈ ఏడాది జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను cfw.ap.nic.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకు గొల్లపూడిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇవీ చదవండి: ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల రుణం పవర్ ‘ఫుల్ ఆదా’ -
26 పోస్టులకు 3,278 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులకు భారీ డిమాండ్ నెలకొంది. 26 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఏకంగా 3,278 దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ పోస్టులకు కూడా అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభించింది. 2010 తర్వాత ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో మెడికల్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేశారు. ► తాజాగా విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితా ప్రకారం మొత్తం 718 పోస్టులకు 4,430 దరఖాస్తులు వచ్చాయి. ► గైనకాలజీ విభాగంలో 333 పోస్టులుండగా 189 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మార్కెట్లో గైనకాలజిస్టులకు డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లకే మొగ్గు చూపారు. ► దరఖాస్తులపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 16 వరకు రాతపూర్వకంగా ఇవ్వొచ్చు. ► ఆ తర్వాత ఒరిజినల్ మెరిట్ జాబితా ప్రకటించి రెండ్రోజుల్లోనే నియామక ఉత్తర్వులిస్తారు. ► ఎంపికైన వైద్యులు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. -
నిమ్స్‌లో ‘గేమ్స్’
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీ ఏర్పడ్డాయి. నెలకు సగటున ఇద్దరు వైద్యులు పదవీ విరమణ చేస్తుండగా అంతర్గత కుమ్ములాటలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ వేతనాలు చాలా తక్కువగా ఉండటంతో మరికొంత మంది ఆస్పత్రిని వీడుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేస్తున్నప్పటికీ..ఇక్కడ పని చేసేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. వచ్చిన వారు కూడా రెండు మూడేళ్ల తర్వాత ఆస్పత్రిని వీడుతున్నారు. ఉన్నతాధికారులు కూడా వీరిని ఆపే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రస్తుతం 311 పోస్టులకు గాను 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అడిíషనల్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భారీగా ఖాళీగా ఉండటంతో సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్యపైనే కాదు..రోగుల చికిత్సలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనియర్ వైద్యులు లేకపోవడంతో ఆ భార మంతా రెసిడెంట్లపై పడుతుంది. చికిత్సల్లో వారికి సరైన అనుభవం లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. పదవీ విరమణ చేసిన కొంత మంది సీనియర్ వైద్యులు ఆ తర్వాత కూడా ఇక్కడ పని చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ వారిని తీసుకునేందుకు యాజమాన్యం విముఖత ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. ఇమడలేక వీడుతూ.. జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జీఎస్‌ఎన్‌రాజు, ప్రముఖ అనెస్తీయన్ డాక్టర్ గోపినాథ్ సహా మరో వైద్యురాలు ఇటీవల పదవీ విరమణ చేశారు. కొంత మంది వైద్యుల మధ్య నెలకొన్ని అంతర్గత విభేధాల వల్ల న్యూరోసర్జరీ విభాగంలో సీనియర్ సర్జన్ డాక్టర్ మానసపాణిగ్రహి, సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్ కూడా ఆస్పత్రిని వీడారు. పరిపాలనా పరమైన వేధింపులే ఇందుకు కారణమని డాక్టర్ ప్రవీణ్ అప్పట్లో తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం. ఆర్థోపెడిక్ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ రాజీనామా తర్వాత మోకాలి చికిత్సలు 10 నుంచి 15 శాతానికి పడిపోయాయి. రుమటాలజీ విభాగం, హెమటాలజీ విభాగం, ఎండోక్రైనాలజీ విభాగాల్లో చికిత్సలు గగనమయ్యాయి. యూరాలజీ, నెఫ్రాలజీ విభాల్లోనే ఇదే పరిస్థితి. ఇదిలా ఉంటే అనస్తీషియా విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇటీవల వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. అనస్తీషియన్ల కొరత వల్ల పలు ఆపరేషన్ థియేటర్లు కూడా మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో తెలుసుకోవచ్చు. కాలేయ మార్పిడి, గుండె మార్పిడి చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. వైద్యు లను ప్రోత్సహించి చికిత్సల సంఖ్యను పెంచాల్సిన ఉన్నతాధికారులే వీటికి అడ్డుపడుతున్నట్లు విమర్శలు లేకపోలేదు. రెసిడెంట్లపైనే భారం.. పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ట్రైనింగ్ సెంటర్లలో నిమ్స్ దేశంలోనే ప్రతిష్టాత్మాకమైంది. 1986లో పడకల సామర్థ్యం 500 ఉండగా, ప్రస్తుతం 1500 చేరింది . ఉద్యోగుల పదవీ విరమణలతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ వివిధ విభాగాల్లో 423 మంది రెసిడెంట్ డాక్టర్లు చదువుతున్నారు. చదువుకునే సమయంలో ఏ విద్యార్థి అయినా ఒత్తిడికి గురవుతుండటం సహజమే. అయితే రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులను నియమించక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఆస్పత్రికి రోజురోజుకూ రోగుల తాకిడి పెరగడం, వారి నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడం వల్ల రెసిడెంట్లపై పని భారం పడుతోంది. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పని చేయాల్సి వస్తుంది. రెసిడెంట్లకు కనీస విశ్రాంతి, పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లేకపోవడం, పని ప్రదేశంలో అహ్లదకరమైన వాతావరణం లేకపోవడం కూడా మానసిక ఒత్తిడికి గురువుతున్నారు. గత రెండేళ్ల క్రితం నిమ్స్‌లో వెలుగు చూసిన ఓ రెసిడెంట్ డాక్టర్ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ రాజారెడ్డి కమిటీ కూడా ఇదే అంశాన్ని గుర్తించి, 18 సూచనలు కూడా చేసింది. కానీ వాటిలో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవని రె సిడెంట్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. -
వైద్య పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది భర్తీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. బోర్డు ఏర్పాటైన ఏడాది తర్వాత తొలిసారి ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి సంబంధించి 32 స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. అందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ, గైనకాలజీ సహా ఇతర స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా వైద్య, ఆరోగ్యశాఖలోని నియామకాల విషయంలో కోర్టు కేసులుండటంతో విపరీతమైన జాప్యమవు తోంది. అత్యవసర సేవలు అందించాల్సిన వైద్య ఆరోగ్యశాఖలో జాప్యం వల్ల రోగులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తమిళనాడు తరహాలో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును గతేడాది ఏర్పాటు చేసిన సంగ తి తెలిసిందే. దాని ద్వారానే వైద్య ఆరోగ్యశాఖ లోని పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. బోర్డు స్పెషలాఫీసర్‌గా రాజారెడ్డి.. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు స్పెషలాఫీసర్‌గా ఎన్.రాజారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజారెడ్డి వైద్య, ఆరోగ్యశాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేసి కొన్నాళ్ల క్రితమే రిటైరయ్యారు. అయితే బోర్డు స్పెషలాఫీసర్‌గా ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో సర్కారు పేర్కొంది. కాగా తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. బోర్డు చైర్మన్‌గా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, సభ్యుడిగా జాయింట్ డైరెక్టర్ హోదా వారిని బోర్డు కోసం నియమిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. బోర్డు ఏర్పాటు కోసం మొత్తం 24 పోస్టులను మంజూరు చేసింది. బోర్డు కార్యకలాపాల కోసం కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయం ప్రాంగణంలో అవసరమైన భవనాలను కూడా సిద్ధం చేశారు. 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా 500 డాక్టర్ పోస్టులు, 3,300 స్టాఫ్ నర్సు పోస్టులు, మరో 1,000 పారా మెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా ఆ భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. వీటితో పాటు ఆ తర్వాత ఖాళీ అయిన వైద్య సిబ్బంది పోస్టులను కూడా బోర్డు మున్ముందు భర్తీ చేయాల్సి ఉంది. ఏడాదికేడాది ఖాళీలు పెరిగిపోతున్నాయి. సరిపడా డాక్టర్లు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పడుతోంది. దీంతో రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పీహెచ్‌సీల నుంచి... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు మొద లు బోధనాస్పత్రుల వరకు అన్నిచోట్ల పోస్టుల మంజూరు నుంచి భర్తీ వరకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డే చూస్తుంది. ఖాళీలు ఏర్పడగానే ఆ సమాచారం బోర్డుకు చేరుతుంది. అనంతరం బోర్డు ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఆ పోస్టులను భర్తీ చేస్తుంది. ఎంఎన్‌జే కోసం భర్తీ చేయబోయే పోస్టులన్నీ కూడా రాష్ట్రస్థాయి పోస్టులేనని అధికారులు చెబుతున్నారు. ఇక మల్టీజోనల్ పోస్టులు ప్రస్తుతానికి భర్తీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆ పోస్టు ల భర్తీకి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వు ల సవరణ పెండింగ్‌లో ఉండటం వల్ల అవి ఆలస్యమవుతాయని అధికారులు చెబుతున్నారు. -
15వేల డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న దాదాపు 15 వేల డాక్టర్ల పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి వినతిపత్రాన్ని అందించారు. చాలా ఆస్పత్రుల్లో స్పెషలైజ్డ్ డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో వివిధ రకాల రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని వివరించారు. వైద్యం పూర్తి ఉచితంగా ఇవ్వాలని, ఈమేరకు ప్రభుత్వ ఆస్పత్రులను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. వైద్యుల పోస్టులతో పాటు కింది స్థాయి సిబ్బంది ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని మంత్రిని కోరారు. ఆస్పత్రుల్లో ఖాళీల జాబితాను రూపొందించి భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. -
వైద్యుల పోస్టులను భర్తీ చేస్తాం
–రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదోని: ఆలూరు తాలూకా ఆసుపత్రి, ఆదోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు వెంటనే భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన.. పట్టణంలోని స్త్రీలు, పిల్లల ఆసుపత్రిలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆదనపు వార్డులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండు ఆసుపత్రులను పరిశీలించారు. వైద్య సేవలు, వైద్యుల ఖాళీలపై ప్రాంతీయ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ లింగన్న, స్త్రీలు, పిల్లల ఆసుపత్రి చీఫ్ డాక్టర్ మాధవీలత, ఆలూరు తాలూకా ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు. అనంతరం టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ మీనాక్షినాయుడు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలూరు ఆసుపత్రిలో అనస్తీషియా, చిన్నపిల్లల వైద్యులు ఉన్నప్పటికీ గైనకాలిస్ట్ లేక పోవడంతో కాన్పులు జరుగడం లేదని, ఆదోనిలో ప్రాంతీయ ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్యుడు ఉన్నప్పటికీ, అనస్థిషియా, గైనాకాలిస్ట్ లేక పోవడం వల్ల వైద్య సేవలు కుంటుపడుతున్నట్లు వైద్యులు తన దృష్టికి తెచ్చారని అన్నారు. వెంటనే ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనరుకు ఫోన్లో ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రాంతీయ ఆసుపత్రిలో నర్సుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ప్రభుత్వ పరంగా నర్సింగ్ కళాశాల మంజూరు చేసే అవకాశం లేనందున ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ముందుకు వస్తే అనుమతి ఇస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యుల నియామకం జరుగడం వల్ల చాలా మంది ఆసక్తి చూపక పోవడం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయని, అయితే ఇకపై వైద్యుల నియామకం శాశ్వత ప్రాతిపదికన చేపడుతామని తెలిపారు. జిల్లాలో 240 పీహెచ్సీలలో 40 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఆయన వెంట కమీషనరు గోవిందప్ప, తహసీల్దారు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ఆలూరు ఇన్చార్జ్ వీరభద్ర గౌడు, ఎంపీపీ పద్మావతి, బీజీపీ పట్టణ అధ్యక్షుడు కునిగిరి నాగరాజు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ భాస్కరరెడ్డి, కుమార్‌గౌడు పాల్గొన్నారు. -
అంగట్లో డాక్టర్ పోస్టులు!
* ఎన్హెచ్ఎం పరిధిలోని 1,500 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు * డాక్టర్ పోస్టుకు 5 లక్షలు, పారామెడికల్‌కు 3 లక్షల చొప్పున వసూళ్లు? * ఓ కీలక నేత, నలుగురు ఉన్నతాధికారుల కనుసన్నల్లో వ్యవహారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తాత్కాలిక పద్ధతిన నియమించే డాక్టర్, పారా మెడికల్ పోస్టులు అంగట్లో సరుకుగా మారిపోతున్నాయి.. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి.. ఊరూ పేరు లేని, అసలేమాత్రం అర్హత లేని సంస్థల ద్వారా నియామకాలు జరుగుతున్నాయి.. ఒక్కో డాక్టర్ పోస్టుకు రూ. 5 లక్షలు, ఒక్కో పారామెడికల్ పోస్టుకు రూ. 3 లక్షల వరకూ చేతులు మారుతున్నట్లు.. వ్యవహారం మొత్తం ఒక కీలక నేత, నలుగురు ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో తాత్కాలిక పద్ధతిన 1,500 డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాలను రాష్ట్రానికి మంజూరు చేసింది. దీని ప్రకారం డాక్టర్లు, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు తదితర ఏడు కేటగిరీల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసుకుంటే... కేంద్రం నిధులను అందజేస్తుంది. జిల్లా ప్రాథమిక ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో వీరిని జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఉండే జిల్లా ఆరోగ్య సంస్థల (డీహెచ్ఎస్) ఆధ్వర్యంలో నియమించుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని ఓ కీలక నేత గ్రీన్‌సిగ్నల్ మేరకు మొన్నటివరకూ ఎన్హెచ్ఎం ఇన్చార్జి ఎండీగా ఉన్న అధికారి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఈ ఉద్యోగాల భర్తీ బాధ్యతను అప్పగించారు. ఆదిలాబాద్‌లో ఓ యూత్ అసోసియేషన్‌కూ పోస్టుల భర్తీకి అవకాశం ఇవ్వడం వంటి విచిత్రాలూ ఇందులో చోటుచేసుకున్నాయి. అర్హత లేని ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి కోట్లు తీసుకొని పోస్టుల భర్తీ బాధ్యత అప్పగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భర్తీ వ్యవహారం జిల్లాల్లో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా గోప్యంగా సాగుతోంది. ఏజెన్సీలు జిల్లాల్లోని కొన్ని ప్రసిద్ధి చెందిన జిరాక్స్ సెంటర్లలో చిన్న పోస్టర్లు, అంతర్గత ప్రచారం ద్వారా పోస్టులను అమ్మేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే భర్తీ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఏజెన్సీలు 300 డాక్టర్ పోస్టులకు రూ. 5 లక్షల చొప్పున రూ. 15 కోట్లు, ఇతర వైద్య సిబ్బంది 1,200 పోస్టులకు రూ. 3 లక్షల చొప్పున రూ. 36 కోట్లు, మొత్తం రూ. 51 కోట్లకు అమ్మేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇందులో ఒక కీలక నేతకు రూ. 2 కోట్లు, నలుగురు ఉన్నతాధికారులకు మరో రూ. 2 కోట్లు అందినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు.. ఔట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేస్తే భవిష్యత్‌లో శాశ్వత పోస్టుల భర్తీ సమయంలో వారికి వెయిటేజీ లభించదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కు: నర్సింగ్, పారా మెడికల్ సంఘం ఎటువంటి పత్రికా ప్రకటన లేకుండా అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై రాత్రికి రాత్రే ఔట్సోర్సింగ్ ద్వారా 1,500 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించారని తెలంగాణ నర్సిం గ్, పారామెడికల్ సంఘం ఆరోపించింది. ఆ నియామకాలను రద్దు చేయాలని సంఘం అధ్యక్షుడు ఆర్.శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి డి.కోట, కన్వీనర్ నగేష్‌లు సీఎం కార్యాలయంలో వినతిపత్రం అంద జేశారు. ఇన్చార్జి అధికారి తీసుకోకూడదు.. ‘‘పెద్ద ఎత్తున పోస్టుల నియామకానికి సంబంధించి ఇన్చార్జి బాధ్యతలో ఉన్న అధికారి నిర్ణయం తీసుకోకూడదు. ఇన్ని పోస్టుల భర్తీపై నిర్ణయం ఎలా తీసుకున్నారో నాకు తెలియదు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. వివరాలు తెలుసుకుంటాను. వాస్తవాలు పరిశీలిస్తాను.’’ - జ్యోతి బుద్ధప్రకాశ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్. -
ముడుపులిచ్చికో.. పోస్టింగ్ పుచ్చుకో
వైద్యుల నియామకాల్లో భారీగా అవకతవకలు ఇష్టారాజ్యంగా కాంట్రాక్టు సర్వీసు వెయిటేజీ మార్కులు డబ్బులిచ్చిన విదేశీ డిగ్రీ అభ్యర్థులకు దండిగా మార్కులు సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా నియామకాలు లేవు. మరోపక్క వయసైపోతోంది. రాక రాక వచ్చిన నోటిఫికేషన్‌లోనైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిద్దామనుకున్న నిరుద్యోగ వైద్య పట్టభద్రుల కలను ముడుపులందుకున్న అధికారులు చెరిపేస్తున్నారు. ప్రతిభను పక్కనబెట్టి పోస్టులను అమ్ముకుంటున్నారు. ఒక్కో పోస్టును రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు రేటు కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అమ్మకాలతో మొత్తం ఎంపిక జాబితాను తారు మారు చేసి అనర్హులకు పోస్టులు కట్టబెట్టినట్లు వెల్లడైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కోసం చేపట్టిన 1125 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకంలో చాలా అవకతవకలు బయటపడ్డాయి. చివరకు అభ్యర్థులు ధర్నాలు, ఆందోళనలు చేసి ఒత్తిడి తేగా.. అధికారులు వారి అభ్యంతరాలను స్వీకరించారు. ఒకటి కాదు రెండు కాదు 300 మంది దరఖాస్తులను స్వీకరించి వారిని తిరిగి జాబితాలో చేర్చారంటే ఏమేరకు అవినీతి జరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా.. శ్రీలక్ష్మి అనే వైద్యురాలికి తొలి జాబితాలో పేరే లేదు. ఆ తర్వాత గొడవ చేస్తే ఆమెకు 77వ ర్యాంకు కేటాయించారు. ఇదెలా సాధ్యం అంటే సమాధానం లేదు. ఇలాంటివి కోకొల్లలు. అభ్యర్థుల వెయిటేజీ మార్కుల ను తారుమారు చేశారు. కాంట్రాక్టు సర్వీసు వైద్యులకి చ్చే 15 శాతం వెయిటేజీ మార్కులను ఇష్టారాజ్యంగా వేసినట్టు వెల్లడైంది. అంతేకాదు అభ్యర్థి ఎంబీబీఎస్ పాసైనప్పటి నుంచి ఆ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నా, ఆ పని చేయలేదు. ఇక అభ్యర్థుల జోన్లకు జోన్లే మార్చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారి సర్వీసునూ పరిగణనలోకి తీసుకోకుండా మార్కులు వేశారు. రష్యా, చైనా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్ తదితర విదేశాల్లో డిగ్రీలు చేసిన వారు మార్కుల కోసం భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. చివరకు వికలాంగ అభ్యర్థుల శాతాన్ని కూడా లెక్కించకుండా అభ్యర్థులను ఎంపిక చేయడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకులు తారుమారే.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకంలో 300 పైగా దరఖాస్తుదారులను జాబితాలో చేర్చడమంటే పాత ర్యాంకులు తారు మారు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణ చేపట్టడం, ట్రిబ్యునల్ జోక్యం చేసుకోవడం చూస్తుంటే అసలు ఈ జాబితానే నిలిపేసి కొత్త జాబితా రూపొందిస్తారా? అనే అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉండగా వైద్య విధాన పరిషత్‌లోనూ స్పెషలిస్టుల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ నియామకాల్ని సక్రమంగా చేపట్టాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సూచించినట్టు తెలిసింది. -
వైద్యుల నియామకాల్లో అక్రమాలు
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో వైద్యుల నియామకానికి సంబంధించి విడుదల చేసిన మెరిట్ జాబితాలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ పోస్టుకు ఎంపికైన వారి పూర్తి వివరాలను వెల్లడించకుండా, కేవలం హాల్‌టికెట్ నెంబర్‌ను మాత్రమే ఆన్లైన్లో పెట్టడంపై వారు సోమవారం సంబంధిత అధికారులను నిలదీసి, డీహెచ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కాగా, ఒరిజినల్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ అనంతరం తుది జాబితాను విడుదల చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలా ఉండగా, వైద్యుల నియామకాలపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పీకే మహంతి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వైవీ అనురాధను ఆదేశించారు.