అంగట్లో డాక్టర్ పోస్టులు! | Paramedical posts requirements process done in way of illegally | Sakshi
Sakshi News home page

అంగట్లో డాక్టర్ పోస్టులు!

Published Sun, Jan 18 2015 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

అంగట్లో డాక్టర్ పోస్టులు!

అంగట్లో డాక్టర్ పోస్టులు!

* ఎన్‌హెచ్‌ఎం పరిధిలోని 1,500 ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు
* డాక్టర్ పోస్టుకు 5 లక్షలు, పారామెడికల్‌కు 3 లక్షల చొప్పున వసూళ్లు?
* ఓ కీలక నేత, నలుగురు ఉన్నతాధికారుల కనుసన్నల్లో వ్యవహారం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తాత్కాలిక పద్ధతిన నియమించే డాక్టర్, పారా మెడికల్ పోస్టులు అంగట్లో సరుకుగా మారిపోతున్నాయి.. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి.. ఊరూ పేరు లేని, అసలేమాత్రం అర్హత లేని సంస్థల ద్వారా నియామకాలు జరుగుతున్నాయి.. ఒక్కో డాక్టర్ పోస్టుకు రూ. 5 లక్షలు, ఒక్కో పారామెడికల్ పోస్టుకు రూ. 3 లక్షల వరకూ చేతులు మారుతున్నట్లు.. వ్యవహారం మొత్తం ఒక కీలక నేత, నలుగురు ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
 
 కేంద్రం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో తాత్కాలిక పద్ధతిన 1,500 డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాలను రాష్ట్రానికి మంజూరు చేసింది. దీని ప్రకారం డాక్టర్లు, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు తదితర ఏడు కేటగిరీల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసుకుంటే... కేంద్రం నిధులను అందజేస్తుంది. జిల్లా ప్రాథమిక ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో వీరిని జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఉండే జిల్లా ఆరోగ్య సంస్థల (డీహెచ్‌ఎస్) ఆధ్వర్యంలో నియమించుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని ఓ కీలక నేత గ్రీన్‌సిగ్నల్ మేరకు మొన్నటివరకూ ఎన్‌హెచ్‌ఎం ఇన్‌చార్జి ఎండీగా ఉన్న అధికారి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఈ ఉద్యోగాల భర్తీ బాధ్యతను అప్పగించారు.
 
 ఆదిలాబాద్‌లో ఓ యూత్ అసోసియేషన్‌కూ పోస్టుల భర్తీకి అవకాశం ఇవ్వడం వంటి విచిత్రాలూ ఇందులో చోటుచేసుకున్నాయి. అర్హత లేని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నుంచి కోట్లు తీసుకొని పోస్టుల భర్తీ బాధ్యత అప్పగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భర్తీ వ్యవహారం జిల్లాల్లో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా గోప్యంగా సాగుతోంది. ఏజెన్సీలు జిల్లాల్లోని కొన్ని ప్రసిద్ధి చెందిన జిరాక్స్ సెంటర్లలో చిన్న పోస్టర్లు, అంతర్గత ప్రచారం ద్వారా పోస్టులను అమ్మేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే భర్తీ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఏజెన్సీలు 300 డాక్టర్ పోస్టులకు రూ. 5 లక్షల చొప్పున రూ. 15 కోట్లు, ఇతర వైద్య సిబ్బంది 1,200 పోస్టులకు రూ. 3 లక్షల చొప్పున రూ. 36 కోట్లు, మొత్తం రూ. 51 కోట్లకు అమ్మేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇందులో ఒక కీలక నేతకు రూ. 2 కోట్లు, నలుగురు ఉన్నతాధికారులకు మరో రూ. 2 కోట్లు అందినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు.. ఔట్‌సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేస్తే భవిష్యత్‌లో శాశ్వత పోస్టుల భర్తీ సమయంలో వారికి వెయిటేజీ లభించదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కు: నర్సింగ్, పారా మెడికల్ సంఘం
 ఎటువంటి పత్రికా ప్రకటన లేకుండా అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై రాత్రికి రాత్రే ఔట్‌సోర్సింగ్ ద్వారా  1,500 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించారని తెలంగాణ నర్సిం గ్, పారామెడికల్ సంఘం ఆరోపించింది. ఆ నియామకాలను రద్దు చేయాలని సంఘం అధ్యక్షుడు ఆర్.శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి డి.కోట, కన్వీనర్ నగేష్‌లు సీఎం కార్యాలయంలో వినతిపత్రం అంద జేశారు.
 
 ఇన్‌చార్జి అధికారి తీసుకోకూడదు..
 ‘‘పెద్ద ఎత్తున పోస్టుల నియామకానికి సంబంధించి ఇన్‌చార్జి బాధ్యతలో ఉన్న అధికారి నిర్ణయం తీసుకోకూడదు. ఇన్ని పోస్టుల భర్తీపై నిర్ణయం ఎలా తీసుకున్నారో నాకు తెలియదు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. వివరాలు తెలుసుకుంటాను. వాస్తవాలు పరిశీలిస్తాను.’’
 - జ్యోతి బుద్ధప్రకాశ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement