గుంటూరు మెడికల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యులకు పదోన్నతులు ఇచ్చారని, వేతనాలు పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆదివారం గుంటూరులో ఏపీ డాక్టర్స్ ఇంట్రాక్షన్ మీట్‌లో ఆమె పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యుల త్యాగాలను ఎవరూ మర్చిపోలేరన్నారు. ఈ సందర్భంగా ఆమె వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో వైద్యవృత్తికి, వైద్యులకు గౌరవం పెరిగిందన్నారు. దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య వృత్తికి గుర్తింపు తెచ్చారన్నారు. తొలిసారిగా వైద్యులకు యూజీసీ స్కేల్స్ అమలు చేసిన ఘనత డాక్టర్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు.
దేశానికే ఏపీ ఆదర్శం
వైద్యులకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఏడో వేతన స్కేల్‌ను సీఎం జగన్ అమలు చేశారని గుర్తు చేశారు. 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అడిషనల్ డీఎంఈ ప్రమోషన్లు ఇచ్చామని, ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ విధానంతో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామని, ఈక్రమంలో సుమారు 53 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. వైద్యుల రిక్రూట్‌మెంట్‌లో దేశానికే ఏపీ ఆదర్శంగా ఉందని తెలిపారు. రోగులు, ప్రజల అవసరాలను బట్టి నూతనంగా నెఫ్రాలజీ వార్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ట్రైబల్ ప్రాంతాల్లో నియామకాలు చేపట్టి అక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యసేవలు పొందేలా చేశామన్నారు.
నాడు–నేడుతో అభివృద్ధి..
నాడు–నేడు కార్యక్రమంతో రాష్ట్రంలో నూతనంగా 17 వైద్య కళాశాలలను రూ.8,500 కోట్లతో ప్రారంభించామన్నారు. వాటిల్లో నేడు ఐదు కళాశాలలు ప్రారంభమైనట్లు చెప్పారు. గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలను రూ.3,820 కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు రూ.17,000 కోట్లతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. వ్యాధులు వచ్చాక చికిత్స అందించే ఆస్పత్రులను బలోపేతం చేయడంతోపాటు, వ్యాధులు రాకుండానే ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.
దీన్లో భాగంగా ప్రివెంటివ్ మెడికల్ కేర్ ఏర్పాటు చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా పేదల ఇళ్లకే వైద్యులు వెళ్లి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఇళ్ల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment