Outsourcing posts
-
అమ్మకానికి ‘అవుట్సోర్సింగ్’ పోస్టులు
విజయనగరం,అర్బన్: సర్వశిక్షాభియాన్ పర్యవేక్షణలో పనిచేస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ నిరుద్యోగులకు అశనిపాతంగా మారింది. ప్రస్తుత కాంట్రాక్ట్ పద్ధతికి స్వస్తి పలికి అవుట్సోర్సింగ్ విధానంలో పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 – 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితి విద్యతో పాటు పిల్లల ఆసక్తి మేరకు వారికి స్వయం ఉపాధి లభించేలా వివిధ వృత్తి శిక్షణలు ఇప్పించడానికి ఇన్స్ట్రక్టర్లను నియమించాలి. ఇంతకుముందు ఈ పోస్టులను నేరుగా ఎస్ఎస్ఏ అధికారులే కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేవారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు రావడంతో నియామకాలు వివాదాస్పదంగా మారాయి. దీన్ని సాకుగా తీసుకొని వీటి భర్తీ ప్రక్రియను అవుట్ సోర్సింగ్ వ్యవస్థకు ఇటీవల అప్పగించారు. ఇదే అదునుగా కొందరు దళారులు ఆయా ఏజెన్సీ నిర్వాహకులతో సంబంధం ఉందని, తాము కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలుకుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. పార్వతీపురం డివిజన్ పరిధిలోని కేజీబీవీ పాఠశాలల్లో రెండు ఉపాధ్యాయ పోస్టులకు రూ.లక్ష వంతును దళారులు అడ్వాన్స్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపి నిరుద్యోగులను వంచించకుండా విద్యార్హతలు, ప్రతిభ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టాలని మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. 132 ఖాళీలు జిల్లాలో కేజీబీవీల్లో ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, ఇన్స్ట్రక్టర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులు 132 వరకు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో ప్రత్యేక అధికారుల పోస్టులు 4, వివిధ సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయులు (సీఆర్టీలు) 7, పీఈటీలు 1, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 1, ఎంఐఎస్ కోర్డినేటర్లు 15, క్లస్టర్ రిసోర్స్‌పర్సన్స్ (సీఆర్పీ)లు 36, ఇవికాకుండా వివిధ విభాగాలలోని ఖాళీలు కలిపి 132 వరకు పోస్టులున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలని కృపా రూరల్ డవలెప్మెంట్ సొసైటీ (సంతపేట, ఒంగోలు) అనే అవుట్ సోర్సింగ్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఈ పోస్టుల పేరుతో బేరసారాలు జరుగుతున్నాయి. అనేక మంది నిరుద్యోగులు వాటిపై ఆశలు పెట్టుకోవడంతో దాన్ని సొమ్ము చేసుకోవడానికి దళారులు రంగంలోకి దిగారు. నిరుద్యోగులకు దళారులు వల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి అర్హులైన అభ్యర్థులను సమకూర్చి పెట్టడం వరకే ఏజెన్సీల పాత్ర ఉంటుంది. వారిలో ప్రతిభాసామర్థ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఎంపిక చేసే బాధ్యతను కలెక్టర్ చైర్మన్‌గా ఉండే నలుగురు సభ్యుల బృందం ఖరారు చేస్తుంది. ఈ నియామకాలకు ఎస్ఎస్ఏ పీఓ మెంబర్ కన్వీనర్‌గా, జిల్లా డైట్ కళాశాల ప్రిన్సిపల్, డీఈఓలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీనే ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తుంది. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఏజెన్సీకే ఎంపిక బాధ్యత ఉంటుందని, ఈ సంస్థ ఎవరిపేర్లు పంపితే వారి పేర్లతోనే నియామక ఉత్తర్వులు వస్తాయని పలువురు దళారులు నిరుద్యోగులను మభ్యపెడుతున్నట్లు సమాచారం. అమ్మకాలకు పాల్పడుతుందెవరు? జిల్లాలో కేజీబీవీ అవుట్ సోర్సింగ్ పోస్టులను అమ్మకాలు చేపుడుతున్నది ఎవరనేది చర్చనీయంశంగా మారింది. ఏజెన్సీలకు చెందిన నిర్వాహకులా..? లేక వారి పేరుతో ఇతరులు ఎవరైనా ఈ అక్రమాలకు తెగబడుతున్నారా అనేదానిపై స్పష్టత రాలేదు. ఉద్యోగిని సమకూర్చినందుకు నియామక సంస్థకు ప్రభుత్వమే నెలవారీ కమీషన్ ఇస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు. ఒకవేళ జిల్లా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ హక్కు తెచ్చుకోవడానికి భారీగా సూట్‌కేసులు ఇస్తే మాత్రం దండుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులతో దళారులకు సంబంధాలు ఉన్నాయని, అందుకే తాము ఇప్పటికే కొంత అడ్వాన్సుగా ముట్టజెప్పామని బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగి చెప్పారు. మరోవైపు ఈ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే వీటితో సంబంధం లేకుండా దళారులు నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. దళారుల వసూళ్లతో సంబంధం లేదు జిల్లాలోని కేజీబీవీలలో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రాష్ట్రస్థాయిలో చేపడతారు. ఇందుకు సంబంధించిన జిల్లా ఏజెన్సీని ప్రకటించారు. పోస్టుల భర్తీ విషయంలో దళారులు డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. అలాంటివి ఎక్కడైనా జరిగినా ఎస్‌ఎస్‌ఏకి సంబంధం లేదు. –ఎస్.లక్ష్మణరావు, ఎస్ఎస్ఏ పీఓ -
అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో దోపిడీ!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో భారీ దోపిడీ జరుగుతోందని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల వద్ద నుంచి కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో లంచాలను తీసుకుంటున్నారన్నారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పనిచేయిస్తూనే వారికి పూర్తిస్థాయిలో జీతభత్యాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కమీషన్ పేరుతో మూడోవంతు కష్టార్జితాన్ని అప్పనంగా దోచేస్తున్నారని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కలెక్టర్ సమక్షంలోనే ఈ పోస్టుల భర్తీ జరిగితే అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. అవినీతికి పాల్పడే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని సమావేశంలో పాల్గొన్న హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. -
మళ్లీ కదలిక..
♦ కాంట్రాక్టు కోసం బ్లాక్ లిస్టు సొసైటీల ప్రయత్నాలు ♦ గతంలో పోస్టుకు రూ.లక్షన్నర వసూలుకు యత్నం ♦ వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ♦ రిమ్స్‌లో 24 పోస్టుల కోసం సొసైటీల ఎంపికలో అధికారులు ♦ చివరి జాబితాలో నలుగురు పోటాపోటీ ఆదిలాబాద్: జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో మంజూరైన ఔట్సోర్సింగ్ పోస్టుల కోసం బ్లాక్ లిస్టు సొసైటీలు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. 24 పోస్టుల కాంట్రాక్టు కోసం గత ఫిబ్రవరిలో సొసైటీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాంట్రాక్టు రాకముందే తమకే వచ్చిందంటూ ఆయా సొసైటీలు నిరుద్యోగులను మభ్యపెట్టి రూ.లక్షన్నర వసూలు చేసే ప్రయత్నాలు చేశాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో సొసైటీల ఎంపికను కలెక్టర్ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత నామినేటెడ్ ద్వారా సొసైటీలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. దీంతో మళ్లీ సదరు సొసైటీలు కాంట్రాక్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో బ్లాక్‌లిస్టులో ఉన్న సొసైటీలు సైతం ప్రజాప్రతినిధుల అండతో కాంట్రాక్టు దక్కించుకునేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నాలుగు సొసైటీల పరిశీలన.. ప్రస్తుతం రిమ్స్‌కు మంజూరైన 24 పోస్టుల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న సొసైటీల నుంచి నాలుగింటిని ఎంపిక చేశారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల పరిశీలనలో అధికారులు తలమునకలై ఉన్నారు. తుది జాబితాలో ఉన్న సొసైటీల్లో సైతం బ్లాక్ లిస్టులో ఉన్న ఒక సొసైటీ ఉండడం గమనార్హం. జిల్లా కేంద్రానికి ఈ చెందిన ఈ సొసైటీ గతంలో రిమ్స్ కాంట్రాక్టు కింద ఉద్యోగులను నియమించుకుంది. సదరు సొసైటీ నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో స్థానిక పోలీసుస్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం శాశ్వతంగా ఈ సొసైటీని బ్లాక్ లిస్టులో పెట్టింది. మిగతా మూడింటిలో వరంగల్, ఆసిఫాబాద్, హైదరాబాద్‌కు చెందిన సొసైటీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటిలోనూ ఒక కాంట్రాక్టర్ ఇతర జిల్లాల్లో బ్లాక్‌లిస్టులో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నాలుగు సొసైటీల ఫైల్ ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ వద్ద ఉంది. బ్లాక్ లిస్టులో ఉన్న సొసైటీని తీసివేయాలా.. వద్దా.. అనే తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ లిస్టులో.. గతంలో రిమ్స్‌లో కాంట్రాక్టు పొందిన ఈ సొసైటీలు నిర్వహణలో తప్పులు చేయడం, ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో అవకతవకలు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ చెల్లించకపోవడం, తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకుని సొసైటీలను బ్లాక్‌లిస్టులో ఉంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ సొసైటీలు మళ్లీ కాంట్రాక్టు పొందే అవకాశాలు ఉండవు. గతంలో టెండర్లు వేసి 8 సొసైటీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ సొసైటీల్లో మూడు బ్లాక్లిస్టులోనే ఉన్నాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో సొసైటీల ఎంపిక ప్రక్రి య నిలిపివేశారు. మళ్లీ అవే పోస్టుల కోసం నాలుగు సొసైటీలు ప్రయత్నించడం, అందులో బ్లాక్‌లిస్టులో ఉ న్న సొసైటీలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లా ప్రజాప్రతినిధులతో సదరు సొసైటీలు తమకు అ వకాశం ఇవ్వాలంటూ పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సొసైటీల ఎంపిక ప్రక్రియ కలెక్లర్ చేతుల్లో ఉండడంతో ఎంపిక ఎలా జరుగుతోందోనని ఆసక్తి నెలకొంది. సాక్షి కథనంతో వెలుగులోకి... గుట్టుచప్పుడు కాకుండా ఉద్యోగాలను అమ్ముకుందామనుకున్న సొసైటీలు, వాటికి వత్తాసు పలికిన కొంతమంది అధికారుల బాగోతం అప్పట్లో ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి వచ్చింది. సొసైటీల ఎంపిక చేయకముందే అభ్యర్థుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం కలిగించింది. ఫిబ్రవరి 20న సొసైటీలు కొంతమంది అభ్యర్థులతో బేరసారాలు చేశారు. తెల్లారితే తమకు కాంట్రాక్టు వస్తుందని, పోస్టు కావాలంటే రూ.లక్షన్నర ఇచ్చుకోవాలని మభ్యపెట్టారు. దీంతో ఇద్దరు అభ్యర్థులు మరుసటి రోజు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం కాగా, అదే రోజు ఆ సొసైటీల గుట్టు ‘సాక్షి’ బయటపెట్టడంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. అటు అధికారులు సైతం సొసైటీల టెండర్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం రిమ్స్‌లో కాంట్రాక్టు కోసం దరఖాస్తులు చేసుకున్న సొసైటీల అర్హతలు, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేయనున్నారు. పరిశీలనలో ఉన్నాయి.. రిమ్స్‌లో పోస్టుల కోసం సొసైటీ ఎంపిక ప్రక్రియ పరిశీలన చేస్తున్నాం. నాలుగు సొసైటీలకు సంబంధించిన ఫైల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో బ్లాక్ సొసైటీలో ఉన్న సొసైటీపై ఇటీవలే మాకు ఫిర్యాదు వచ్చింది. సదరు సొసైటీని నోటీసులో ఉంచాం. పూర్తి వివరాలు తెలుసుకొని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. – కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ -
మామునూర్ ‘వెటర్నరీ’కి 138 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని మామునూర్ వెటర్నరీ సైన్స్ కాలేజీకి 100 రెగ్యులర్ పోస్టులు, 38 ఔట్సోర్సింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 79 మంది బోధన సిబ్బంది, 21 మంది బోధనేతర సిబ్బంది పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక అసోసియేట్ డీన్‌తోపాటు 17 మంది ప్రొఫెసర్లు, 23 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 11 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 2 సూపరింటెండెంట్, 3 సీనియర్ అసిస్టెంట్, 2 ఫార్మ్ మేనేజర్, క్యాషియర్, రికార్డు అసిస్టెంట్ పోస్టులున్నాయి. -
అంగట్లో డాక్టర్ పోస్టులు!
* ఎన్హెచ్ఎం పరిధిలోని 1,500 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు * డాక్టర్ పోస్టుకు 5 లక్షలు, పారామెడికల్‌కు 3 లక్షల చొప్పున వసూళ్లు? * ఓ కీలక నేత, నలుగురు ఉన్నతాధికారుల కనుసన్నల్లో వ్యవహారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తాత్కాలిక పద్ధతిన నియమించే డాక్టర్, పారా మెడికల్ పోస్టులు అంగట్లో సరుకుగా మారిపోతున్నాయి.. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి.. ఊరూ పేరు లేని, అసలేమాత్రం అర్హత లేని సంస్థల ద్వారా నియామకాలు జరుగుతున్నాయి.. ఒక్కో డాక్టర్ పోస్టుకు రూ. 5 లక్షలు, ఒక్కో పారామెడికల్ పోస్టుకు రూ. 3 లక్షల వరకూ చేతులు మారుతున్నట్లు.. వ్యవహారం మొత్తం ఒక కీలక నేత, నలుగురు ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో తాత్కాలిక పద్ధతిన 1,500 డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాలను రాష్ట్రానికి మంజూరు చేసింది. దీని ప్రకారం డాక్టర్లు, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు తదితర ఏడు కేటగిరీల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసుకుంటే... కేంద్రం నిధులను అందజేస్తుంది. జిల్లా ప్రాథమిక ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో వీరిని జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఉండే జిల్లా ఆరోగ్య సంస్థల (డీహెచ్ఎస్) ఆధ్వర్యంలో నియమించుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని ఓ కీలక నేత గ్రీన్‌సిగ్నల్ మేరకు మొన్నటివరకూ ఎన్హెచ్ఎం ఇన్చార్జి ఎండీగా ఉన్న అధికారి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఈ ఉద్యోగాల భర్తీ బాధ్యతను అప్పగించారు. ఆదిలాబాద్‌లో ఓ యూత్ అసోసియేషన్‌కూ పోస్టుల భర్తీకి అవకాశం ఇవ్వడం వంటి విచిత్రాలూ ఇందులో చోటుచేసుకున్నాయి. అర్హత లేని ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి కోట్లు తీసుకొని పోస్టుల భర్తీ బాధ్యత అప్పగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భర్తీ వ్యవహారం జిల్లాల్లో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా గోప్యంగా సాగుతోంది. ఏజెన్సీలు జిల్లాల్లోని కొన్ని ప్రసిద్ధి చెందిన జిరాక్స్ సెంటర్లలో చిన్న పోస్టర్లు, అంతర్గత ప్రచారం ద్వారా పోస్టులను అమ్మేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే భర్తీ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఏజెన్సీలు 300 డాక్టర్ పోస్టులకు రూ. 5 లక్షల చొప్పున రూ. 15 కోట్లు, ఇతర వైద్య సిబ్బంది 1,200 పోస్టులకు రూ. 3 లక్షల చొప్పున రూ. 36 కోట్లు, మొత్తం రూ. 51 కోట్లకు అమ్మేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇందులో ఒక కీలక నేతకు రూ. 2 కోట్లు, నలుగురు ఉన్నతాధికారులకు మరో రూ. 2 కోట్లు అందినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు.. ఔట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేస్తే భవిష్యత్‌లో శాశ్వత పోస్టుల భర్తీ సమయంలో వారికి వెయిటేజీ లభించదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కు: నర్సింగ్, పారా మెడికల్ సంఘం ఎటువంటి పత్రికా ప్రకటన లేకుండా అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై రాత్రికి రాత్రే ఔట్సోర్సింగ్ ద్వారా 1,500 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించారని తెలంగాణ నర్సిం గ్, పారామెడికల్ సంఘం ఆరోపించింది. ఆ నియామకాలను రద్దు చేయాలని సంఘం అధ్యక్షుడు ఆర్.శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి డి.కోట, కన్వీనర్ నగేష్‌లు సీఎం కార్యాలయంలో వినతిపత్రం అంద జేశారు. ఇన్చార్జి అధికారి తీసుకోకూడదు.. ‘‘పెద్ద ఎత్తున పోస్టుల నియామకానికి సంబంధించి ఇన్చార్జి బాధ్యతలో ఉన్న అధికారి నిర్ణయం తీసుకోకూడదు. ఇన్ని పోస్టుల భర్తీపై నిర్ణయం ఎలా తీసుకున్నారో నాకు తెలియదు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. వివరాలు తెలుసుకుంటాను. వాస్తవాలు పరిశీలిస్తాను.’’ - జ్యోతి బుద్ధప్రకాశ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్. -
ఆప‘రేట్’ @5లక్షలు
సాక్షి, విశాఖపట్నం : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్)లో తాజాగా ఖాళీ అయిన ఔట్సోర్సింగ్ పోస్టులపై తెలుగు తమ్ముళ్ల కన్నుపడింది. జూనియర్ లైన్‌మన్(జేఎల్ఎం) పోస్టుల్ని అమ్ముకోవడానికి అవకాశం కుదరకపోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో ఖాళీ అయిన షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల్ని వేలానికి పెట్టారు. నేరుగా ముఖ్యమంత్రి పేషీ నుంచే నియోజకవర్గాల వారీ ఈ ఖాళీల జాబితా కోసం ఈపీడీసీఎల్‌కు సోమవారం ఆదేశాలొచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు జాబితాను సిద్ధం చేసి అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. ఒక్కో పోస్టుకు రూ.4 లక్షల నుంచి 5 లక్షలు : 2006 తర్వాత జేఎల్ఎం నియామకాలు ఈ ఏడాది చేపట్టారు. ఈపీడీసీఎల్ పరిధిలో 937 పోస్టుల్ని భర్తీ చేశారు. నియామకాల్లో అక్రమాలకు తావులేకుండా ఎప్పటికప్పుడు మార్కులు, రోస్టరుతో సహా వెబ్సైట్లో వివరాలు పొందుపరచడం, ఇంటర్వ్యూల్లేకపోవడంతో చాలా వరకు పారదర్శకంగానే నియామకాలు జరిగాయి. సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లుగా ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న(ఇన్‌సర్వీస్) వారికి 20 శాతం వెయిటేజీ ఇవ్వడంతో ఏకంగా 394 పోస్టులకు వారే ఎంపికయ్యారు. జేఎల్ఎం పోస్టులు ఇప్పిస్తామని కొంద రు నిరుద్యోగుల నుంచి పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. నియామకం పారదర్శకంగా జరగడంతో మాట నిలబెట్టుకోకపోయారు. దీంతో ఔట్ సోర్సింగ్ పోస్టులు ఇప్పించేందుకు సీఎం పేషీ నుంచే పైరవీలు మొదలెట్టారు. విద్యుత్‌శాఖ కార్యదర్శి ద్వారా ఈపీడీసీఎల్ నుంచి వివరాలు సేకరించారు. తమ నియోజకవర్గ పరిధిలోని ఖాళీల్లో తమ వారికి, తమకు భారీగా ముట్టజెప్పుకున్నవారికి అవకాశం కల్పిస్తున్నారు. నెలకు రూ.9 వేల నుంచి రూ.9,500 జీతం వచ్చే ఈ పోస్టుకు ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. చేతులెత్తేసిన అధికారులు : సీఎం పేషీ ఆదేశాలతో ఈపీడీసీఎల్ అధికారులు చేతులెత్తేశారు. ఫిజికల్ టెస్ట్ సమయంలో ఎంపిక కాని వారిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకుంటామని, అందుకు అంగీకరించేవారు అప్పటికప్పుడే తమ అనుమతి తెలపాల్సిందిగా ఈపీడీసీఎల్ అధికారులు సూచించారు. దీనికి వందల సంఖ్యలో అభ్యర్థులు ఆసక్తి చూపారు. 2006 నియామకాల్లో కూడా అప్పటి ఈపీడీసీఎల్ సీఎండీ ప్రవీణ్‌ప్రకాష్ ఇదే తరహాలో మెరిట్ కమ్ రోస్టరు ప్రకారం ఔట్సోర్సింగ్ పోస్టుల్ని భర్తీ చేశారు. ఈసారి కూడా అలానే జరుగుతుందని జేఎల్ఎం పోస్టులకు ఎంపిక కాని నిరుద్యోగ అభ్యర్థులు ఆశించారు. కానీ వారి ఆశల్ని అడియాశలు చేస్తూ అధికారపక్ష ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. దీంతో తాము చేయగలిగేదేమీ లేదని ఏకంగా ఈపీడీసీఎల్ అధికారులే తమకు మొరపెట్టుకునేందుకు వచ్చే అభ్యర్థులకు సెలవిస్తున్నారు. అవకాశముంటే ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు చేసుకోండంటూ ఉచిత సలహాలిస్తున్నారు.