
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీలో భారీ దోపిడీ జరుగుతోందని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల వద్ద నుంచి కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో లంచాలను తీసుకుంటున్నారన్నారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పనిచేయిస్తూనే వారికి పూర్తిస్థాయిలో జీతభత్యాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
కమీషన్ పేరుతో మూడోవంతు కష్టార్జితాన్ని అప్పనంగా దోచేస్తున్నారని, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కలెక్టర్ సమక్షంలోనే ఈ పోస్టుల భర్తీ జరిగితే అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. అవినీతికి పాల్పడే అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని సమావేశంలో పాల్గొన్న హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు.