
గంటాతో విభేదాలపై అయ్యన్నపాత్రుడి స్పందన!
అమరావతి: విశాఖపట్నంలో భూకుంభకోణాల విషయమై సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుతో తనకు విభేదాలు ఉన్నట్టు వస్తున్న కథనాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. మంత్రి గంటాతో తనకు విభేదాలు లేవని ఆయన గురువారం స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు మంత్రి గంటా రాసిన లేఖలో తన పేరు ఎందుకు పేర్కొన్నారో తెలియదని అన్నారు. తన వల్ల ప్రభుత్వ ప్రతిష్ట తగ్గడం కాదు పెరిగిందని చెప్పారు.
విశాఖపట్నంలో వేల ఎకరాల భూమి కబ్జా అయిన మాట వాస్తవమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పినట్టు గుర్తుచేశారు. పేదలకు న్యాయం జరగాలన్నదే తన కోరిక అని, మంత్రి గంటా కూడా అదే కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే సీఎం చంద్రబాబు ఈ వ్యవహారం సిట్ విచారణకు ఆదేశించారని అన్నారు.