విశాఖకు మచ్చ తెచ్చిందెవరు?
♦ జిల్లాను చెరబట్టిన పచ్చ నేతలు
♦ మూడేళ్లలో రూ. వేల కోట్ల భూకుంభకోణాలు
♦ పరువు తీసేసిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు
♦ మంత్రి అయ్యన్న వ్యాఖ్యలు, సిట్‌కు ఇచ్చిన ఆధారాలే సాక్ష్యం
♦ భూ దందాలే కాదు.. మద్యం, ఇసుక, మైనింగ్ మాఫియాగా మారిన దేశం నేతలు
♦ ఎక్కడ చూసినా టీడీపీ నేతల సెటిల్‌మెంట్లే
♦ మూడేళ్ల కిందట ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీపై కుట్రలు
♦ కడప నేతలొస్తే భూ దందాలు పెచ్చుమీరుతాయని విషప్రచారం
♦ మరి ఇప్పుడు టీడీపీ పాలనలో జరిగిందేమిటి?
♦ అన్ని వర్గాల్లోనూ ప్రస్తుతం ఇదే చర్చ
2014 ఎన్నికల వేళ.. వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులపై ఓ పథకం
ప్రకారం విష ప్రచారం..
ప్రత్యేకించి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోటీ చేస్తున్న విశాఖలో అడ్డూఅదుపూ లేకుండా తప్పుడు ప్రచారాలు..
కడప నేతలొస్తే.. బయట జిల్లాల నాయకులొస్తే విశాఖ తీరం కలుషితమైపోతుందని.. భూకబ్జాలకు నిలయమైపోతుందని విషపు రాతలు, విపరీత వాదనలు, దుష్ప్రచారాలతో టీడీపీ ఎన్నికల ప్రచారం మోతెక్కిపోయింది.
ఎక్కడ చూసినా ఇదే రీతిలో విష ప్రచారానికి తెగబడ్డారు. వలస నేతలతో విశాఖ ప్రతిష్టకు మచ్చ వస్తుందని లేని భయం నటించారు..
టీడీపీ నేతలతో అంటకాగిన బీజేపీ నేతలూ ఇలాంటి భయాలే రేపారు.
మరి వర్తమానంలో ఏం జరుగుతోంది.. చూద్దాం రండి..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
విశాఖలో ఏం జరుగుతోంది?.. మూడేళ్లుగా ఏం ఒరిగింది??.. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా విస్పష్టంగా ప్రకటించేశారు. 2014 నుంచే విశాఖ భూ కబ్జాలకు, కుంభకోణాలకు కేంద్రంగా మారిందని కుండ బద్ధలుకొట్టారు. భూ కుంభకోణాలపై విచారణకు నియమించిన సిట్‌కు స్వయంగా ఓ ప్రజాప్రతినిధి.. అందునా సీనియర్ మంత్రి అయ్యన్న వెళ్లడమే ఓ సంచలమైతే.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే భూ కుంభకోణాలకు తెగబడ్డారని సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేయడం విశాఖలో జరిగిన.. జరుగుతున్న దారుణాలకు అద్దం పట్టింది.
ఆధారాలతో సహా..
వివిధ ప్రాజెక్టుల పేరిట చేసిన భూసేకరణల్లో సైతం పరిహారాల సాకుతో టీడీపీ నేతలు కోట్లు మింగేశారని స్వయంగా మంత్రే మీడియాకు వెల్లడించారు. మెడ్‌టెక్ భూ పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి పక్కా ఆధారాలను కూడా సిట్‌కు అందించారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే అమ్మిన దురాగతాలను సిట్ దృష్టికి తీసుకువెళ్లారు. మరో దఫా సిట్‌ను కలిసి మరిన్ని భూ కుంభకోణాలను బయటపెడతాననీ ప్రకటించారు. ఇక టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు సైతం ఇదే తరహా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈనెల 18న సిట్‌ను కలిసి తన వద్దనున్న ఆధారాలను సమర్పిస్తామని ఆయన చెప్పారు. బహిరంగంగా చెప్పకపోయినా విష్ణుకుమార్‌రాజు కూడా ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధుల ఆగడాలపైనే సిట్‌కు ఫిర్యాదు చేయనున్నారనేది బహిరంగ రహస్యం.
ఆరోపణల ఉచ్చులో జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు
యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సహజంగా అధికార పార్టీ నేతలపై విపక్షాలు ఆరోపణలు చేయడం, విమర్శలకు దిగడం సహజమే. కానీ ఇంత తీవ్రస్థాయిలో అవినీతి, అక్రమాల్లో టీడీపీ నేతలు కూరుకుపోవడంపై ప్రజల్లో ఏవగింపు మొదలైంది. భూ కుంభకోణాల్లో ప్రధానంగా వినిపిస్తున్నది భీమిలి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు పేరే. గంటా అండ్ కోపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు స్వయంగా ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నవే. వుడా ల్యాండ్ పూలింగ్ కుంభకోణం, భూదందాలు, ప్రభుత్వ భూములు తనఖాపెట్టి కోట్ల రుణం తీసుకుని బ్యాంకులకు ఎగనామం పెట్టడం.. ఇలా ఆరోపణల ఊబిలో గంటా గ్యాంగ్ కూరుకుపోయిందనే చెప్పాలి.
♦ మంత్రి అయ్యన్నపాత్రుడిపై భూ దందా ఆరోపణలు లేనప్పటికీ.. లేటరైట్ గనుల అక్రమ తవ్వకాలు, ఆర్ అండ్ బీ కాంట్రాక్టులను బినామీల పేరిట చేజిక్కించుకోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
♦ నోరు తెరిస్తే తాను నిజాయితీకి మారుపేరని చెప్పుకునే మాజీ మంత్రి, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మునుపెన్నడూ లేనివిధంగా ఈ మూడేళ్లలో అవినీతి ఆరోపణలు మూటకట్టుకున్నారు. ముదపాక భూముల మాయాజాలంతో పాటు ఆయన తనయుడి వసూళ్లు, క్వారీలు, ఇసుక మాఫియా నుంచి మామూళ్లు, సెటిల్‌మెంట్లతో అప్రతిష్ట పాలయ్యారు. పైగా నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడుతూ బండ బూతల బండారుగా పేరు తెచ్చుకున్నారు.
♦ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మెడ్‌టెక్ భూముల పరిహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన అనుచరుల పేరిట కోట్లు నొక్కేశారన్న విమర్శలు న్నాయి.
♦ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందు వక్ఫ్ భూములను కాజేశారన్న ఆరోపణలతో పాటు లెక్కకు మించిన దందాలతో అప్రతిష్ట మూటకట్టుకున్నారు.
♦ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీవీజీఆర్ గణబాబుపైనా ఘనంగానే ఆరోపణలు ఉన్నాయి. గణబాబు అండతో ఆయన అనుచరులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
♦ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మద్యం మాఫియాలో కీలకంగా ఉండటంతో పాటు నియోజకవర్గంలో మితిమీరిన ఆగడాలు, పంచాయితీలతో నిత్యం అంటకాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
♦ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ దందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారీఎత్తున సెటిల్‌మెంట్లు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం, ఎవరైనా అడ్డుకుంటే రౌడీయిజానికి పాల్పడం ఆయన ఇలాకాలో నిత్యకృత్యాలే.
♦ యలమంచిలి ఎమ్మెల్యే, టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు కూడా తక్కువేమీ తినలేదు. నియోజకవర్గంలో ఇసుక మాఫియాతో చేతులు కలపడంతో పాటు భూ వివాదాల్లో కీలకంగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
♦ చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌రాజుపై అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో అడ్డగోలు మైనింగ్ కింగ్ అంటే ఎవరైనా ఆయన పేరే చెబుతారు.
♦ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమ మైనింగ్ కోసమే ఆయన పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. –ఇక పాయకరావుపేట ఎమ్మెల్యే అనితపై లెక్కకు మించిన ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఇలా ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. వీరి అండతో అనుచరులు, జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏ స్థాయిలో దోపిడీలకు పాల్పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
♦ మూడేళ్లలో వీరంతా కలిసి జిల్లాకు ఏం చేశారంటే ఒక్కరూ సమాధానం చెప్పలేని పరిస్థితి.. కానీ జిల్లా ప్రతిష్టను దెబ్బతీసే విషయంలో మాత్రం ఒకరికొకరు పోటీ పడ్డారనే చెప్పాలి.