సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మొన్నటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న జిల్లా. వైఎస్సార్‌సీపీ రాకతో గత ఎన్నికల్లోనే ఈ కోటకు బీటలు వారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం, ఈ ప్రాంతాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, పారిశ్రామికంగా జరుగుతున్న అభివృద్ధి, పలు ఐటీ కంపెనీల ఏర్పాటు, బడుగు బలహీనవర్గాలకు అందిస్తున్న చేయూత, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషితో టీడీపీ ఇక్కడ కకావికలైంది. ఆ పార్టీకి కార్యకర్తలూ చేజారిపోయారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం వారి నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదు. దీంతో పక్క నియోజకవర్గాలపై దృష్టి సారించారు.
మరోపక్క పార్టీలో ఆధిపత్యం కోసం ఇతర నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ నేతలకే ఎసరు పెడుతున్నారు. దీంతో ఓ నియోజకవర్గం.. వంద గ్రూపుల్లా ఆ పార్టీ వ్యవహారం ఉంది. ఈ గ్రూపుల మధ్య సంక్రాంతికి ముందే కోళ్ల పందేలకు దీటుగా కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. యువగళం ముగింపు సభకు జనసమీకరణ కోసం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారడమే ఇందుకు ఉదాహరణ. యువగళం సభకు వచ్చేది లేదని ఆయనకు తేల్చి చెప్పినట్టు సమాచారం.
గంటా తీరుతో విసిగిపోతున్న విశాఖ నేతలు
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుతో విశాఖ నేతలు విసిగిపోతున్నారు. గంటా గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఈ నాలుగున్నరేళ్లలో అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇటీవలి వరకు ఆయన సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండు మూడు నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసారి ఇక్కడ గెలిచే అవకాశాలు మృగ్యమైపోవడంతో ఆయన భీమిలి వైపు చూస్తున్నారు.
భీమిలిలో వివిధ కార్యక్రమాలకు గంటా హాజరవుతున్నారు. ఇది భీమిలి టికెట్ ఆశిస్తున్న కోరాడ రాజబాబుకు మింగుడుపడటం లేదు. ఆయన గంటా రాకను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలకో నియోజకవర్గం మార్చే గంటాను నమ్మరంటూ అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు. భీమిలిలోనే కాదు.. గంటా శ్రీనివాసరావు పాయకరావుపేట నియోజకవర్గంలోనూ రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ సొంత పార్టీ నేత అనితకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఆయన వర్గం జనసేన అభ్యర్థికి మద్దతుగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
యలమంచిలి నియోజకవర్గంలోనూ ఆయన జనసేనకు మద్దతుగా పనిచేస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీలోకి ఎవరూ రాకుండా కూడా అడ్డుపడుతున్నారని పలువురు తెలిపారు. అంతేకాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి గండి బాబ్జీని కూడా సాగనంపి.. ఇక్కడ జనసేనకు సీటు కేటాయించే అవకాశం ఉందంటూ ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలను పొగబెడుతూ పొరుగు పార్టీని ప్రోత్సహిస్తున్నారని గంటాపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
అనకాపల్లిలో అయ్యన్న కినుక
అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో తన కొడుకుకు హామీ లభించకపోవడంతో అయ్యన్నపాత్రుడు ఆగ్రహంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపించేకొద్దీ అయ్యన్న వర్గం మరింత కఠినంగా వ్యవహరిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ అయ్యన్న ఒత్తిడికి అధిష్టానం తలొగ్గినా, మిగతా నేతలు సహకరిస్తారా అన్నది అనుమానమేనని అంటున్నారు.
మాడుగులలో మూడు ముక్కలాట
మాడుగుల నియోజకవర్గం టీడీపీలో మూడు పందెం కోళ్లు కొట్టుకుంటున్నాయి. ప్రస్తుత ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌తో పాటు రామనాయుడు, పైలా ప్రసాదరావు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది చాలదన్నట్టు.. పెందుర్తిలో బండారుకు సీటు ఇవ్వరని, ఆయనకు మాడుగులలో ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
పెందుర్తి నుంచి బండారును బయటకు పంపేందుకు సొంత పార్టీ నేతలే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జరిగితే మాడుగుల బరిలో నలుగురు ఉన్నట్టే. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్టు దక్కినా మిగిలిన వారు సహకరించే పరిస్థితి లేదు. అరకు నియోజకవర్గం ఇన్‌చార్జిగా దొన్ను దొరను నియమించడంపై అబ్రహం వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దొరకు సహకరించబోమని అబ్రహం వర్గం కరాఖండిగా చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment