రుణాల ఎగవేత కేసులో ఆస్తులు వేలం
రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్‌కు చెందిన రూ.361.96 కోట్ల ఆస్తుల వేలం
వచ్చే నెల 13న వేలం వేస్తున్నట్లు ఎన్సీఎల్టీ ప్రకటన
గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులు వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్
సాక్షి, అమరావతి: రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఉండి, భీమిలి అసెంబ్లీ స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావుకు ఎన్నికలకు రెండు రోజుల ముందు బ్యాంకులు గట్టి షాక్ ఇచ్చాయి. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఆస్తులను వేలం వేయడానికి నోటీసులు జారీ చేశాయి. ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్లు రుణాలు తీసుకున్నారు.
ఇందులో రూ. 826.17 కోట్ల రుణాన్ని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించారు. వడ్డీ కూడా చెల్లించలేదు. ఈ వ్యవహారం తెలిసి బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో ఆయన మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బ్యాంకులు దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో రూ.361.96 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి) హైదరాబాద్ శాఖ పత్రికా ప్రకటనలు జారీ చేసింది.
ఇండ్ భారత్ థర్మల్‌కు చెందిన బ్యాలెన్స్ షీట్‌లో ఉన్న ఆస్తులు రూ.180.98 కోట్లు, తమిళనాడు టూటికోరిన్‌లో ఉన్న 311.72 ఎకరాల ఫ్యాక్టరీ స్థలాలు రూ.164.73 కోట్లు, కర్ణాటకలోని కార్వార్ ప్రాంతంలో ఉన్న 129.73 ఎకరాలు రూ.11.74 కోట్లు, ఇతర సెక్యూరిటీలు, ఆర్థిక ఆస్తులకు రూ.4.51 కోట్లు రిజర్వ్ ప్రైస్‌గా నిర్ణయించింది. ఈ ఆస్తులకు సంబంధించిన జూన్ 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం వేయనున్నట్లు ఎన్సీఎల్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.
రూ.400.37 కోట్లు ఎగవేసిన గంటా శ్రీనివాసరావు
మాజీ మంత్రి, భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.400.37 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి.
గంటాకు చెందిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు ఈ రుణం తీసుకొని, ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఇండియన్ బ్యాంకు ఆస్తుల స్వా«దీనానికి రంగంలోకి దిగింది. విశాఖ నగరం గంగుల వారి వీధిలోని సర్వే నెంబర్ 13లో ఉన్న వాణిజ్య భవనాన్ని వేలానికి పెట్టింది. జూన్ 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వేలం జరుగుతుంది. ఈ భవనం రిజర్వు ధరను రూ.2.84 కోట్లుగా బ్యాంకు నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment