సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చను అడ్డుకుని రాద్ధాంతం చేశారు. ఇతర సభ్యులు ఎవరూ ప్రసంగించకుండా స్పీకర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎంతకీ వారి తీరులో మార్పు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు.
అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి రామకృష్ణ చౌదరి (అనపర్తి), అలికిరి జగదీష్ (గుత్తి), పరకాల కాళికాంబ (నరసాపురం) అకాల మృతికి శాసన సభ సంతాపం ప్రకటించింది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఇంతలో టీడీపీ సభ్యులు నిత్యావసర ధరలపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. చర్చ పూర్తయ్యాక మాట్లాడదామని స్పీకర్ చెప్పారు. ఇందుకు టీడీపీ సభ్యులు అంగీకరించలేదు. ఆ పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని సహా 15 మంది స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.
అచ్చెన్న వెల్‌లో ఉండగా, మిగతా సభ్యులు పోడియం పైకి ఎక్కి స్పీకర్ కురీ్చని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా బిల్లు పత్రాలను చింపి స్పీకర్‌పై చల్లి రగడ సృష్టించారు. స్పీకర్ వారిని ఎంతగా వారించినా పద్ధతి మార్చుకోకపోవడంతో 48 నిమిషాల్లోనే సభను వాయిదా వేశారు. తిరిగి ఉదయం 10.34 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఈసారి విజిల్స్ తీసుకొచ్చి స్పీకర్ చెవుల్లో ఊదడం ప్రారంభించారు.
ఇది సరికాదని, స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, అబ్బయ్య చౌదరి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారించినా పట్టించుకోలేదు. వెలగపూడి రామకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించి స్పీకర్ వద్దనున్న బెల్‌ను అదే పనిగా మోగించడం ప్రారంభించారు. సభలో ఇతర సభ్యులు మాట్లాడేది ఏదీ వినబడకుండా, స్పీకర్ చెప్పేది సభ్యులకు వినిపించకుండా టీడీపీ సభ్యులు నానా రగడా సృష్టించారు.
దీంతో మార్షల్స్ స్పీకర్ తమ్మినేనికి రక్షణగా నిలబడ్డారు. ఎంత వారించినా వినకపోవడంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. వెంటనే వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బ్రేక్ తర్వాత టీడీపీ సభ్యలు 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment