నియోజకవర్గమే కాదు.. పాన్ నెంబరూ మారింది
ఎన్నికల అఫిడవిట్ల సాక్షిగా బయటపడ్డ గంటా బాగోతం
అవి రెండూ వరస నెంబర్లు.. కాబట్టి ఇవేమీ కొత్తగా తీసుకున్నవి కావు
మొదట్నుంచీ రెండు పాన్‌లు... కానీ ఐటీ రిటర్న్‌లూ వేయని తీరు
గతంలో భారీ నగదు చెల్లించి భూముల కొనుగోలు
అది బయటకు తెలియకుండా వేరే పాన్‌ను వాడుకున్న గంటా
ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధం; కమిషన్‌ను తప్పుదోవ పట్టించడమేనన్న అధికారులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు చట్టం తెలియదా? లేకపోతే తననెవరేం చేస్తార్లే అన్న ధీమానా? ఎందుకంటే ఏ వ్యక్తికైనా రెండు పాన్ నెంబర్లుండటం చట్టరీత్యా నేరం. శిక్షార్హులు కూడా. కానీ గంటాది కళ్లు మూసేసుకుని... తననెవ్వరూ చూడటం లేదనుకునే బాపతు. అందుకే... గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తన భార్య పాన్ నంబరును మార్చేశారు.
భార్య శారద పేరుతో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు, ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు సంబంధం లేకపోవటంతో దీనివల్ల ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆయన అనుచరులే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు.... నాటి అఫిడవిట్‌లో తన సతీమణి శారద పాన్ నంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు.
ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చే అలవాటున్న గంటా ఈ సారి పట్టుబట్టి, చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరీ భీమిలి టికెట్టు సాధించుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేస్తూ... అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్లో భార్య శారద పాన్ నంబరును మాత్రం ఏబీపీపీజీ2216ఏగా పేర్కొన్నారు. అంటే... 2215ఏ, 2216ఏ నంబర్లతో దాదాపు ఒకేసారి రెండు పాన్ నంబర్లను తీసుకున్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది.
అంతా నగదు రూపంలోనే...!
ఆదాయపన్నుశాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు రూ.2 లక్షలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరం అవుతుంది. అయితే, గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలో భూమిని కొన్నపుడు పెద్దమొత్తంలో నగదు రూపంలోనే చెల్లించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. రూ.92,98,000ను నగదు రూపంలోనే ఇచ్చినట్టు చూపించారు. అంతేకాకుండా మరో రూ.25 లక్షలను ఆర్‌టీజీఎస్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసినట్టు చూపి సర్వే నంబరు టీఎస్ నంబరు 1,490, బ్లాక్ నంబరు 17, వార్డు నంబరు 24లోని 1,936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు.
ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నంబరును పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గంటా శారద 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్‌లు దాఖలు చెయ్యలేదు. వాస్తవానికి ఆ పాన్ నెంబర్లను చూసినపుడు రెండూ ఒకే సమయంలో తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఐటీ రిటర్నుల కోసం ఒకటి, భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తూ ఉండవచ్చని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయపు పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలావరకూ బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా రెండు పాన్ నెంబర్లను కలిగి ఉండటం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకు ఇది తెలియనిదేమీ కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై ఏడు కేసులున్నాయి. భార్యాభర్తలిద్దరి పేరిటా మొత్తం రూ.23.36 కోట్ల స్థిర, చరాస్తులున్నాయని, కాకపోతే సొంత కారు మాత్రం లేదని గంటా పేర్కొన్నారు.
ఆస్తుల కొనుగోలుకు మరో పాన్
అసలు కథేమిటంటే... 2018లో తన సతీమణి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి కోసం పాన్ నంబర్‌ను ఏబీపీపీజీ2216ఏగా గంటా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా 2019 ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. అంటే... అప్పట్లో కొన్న ఆస్తిని గత ఎన్నికల్లో చూపించలేదు. పైపెచ్చు 2018లో కొనుగోలు చేసిన భూ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే సతీమణి పేరుతో కొనసాగించిన గంటా.. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్‌ను కూడా దాఖలు చెయ్యలేదు.
ఈ వ్యవహారాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భూ లావాదేవీల కోసం పేర్కొన్న పాన్ నంబర్‌ను అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం. నిజానికి ఒకే వ్యక్తికి రెండు పాన్ నంబర్లు ఉండటం చట్టరీత్యా నేరమని, అంతేగాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఎన్నికల అఫిడవిట్‌లో వివరాలివ్వటం కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని ఎన్నికల అధికారులే చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment