
చమర్తి పెత్తనంపై వ్యతిరేకత
రాజంపేట దేశంలో వర్గపోరు
వర్గాలు లేవంటూ కలరింగ్
అధిష్టానంకు కాపుల వ్యతిరేకత
ఇన్‌చార్జి పెండింగ్‌లో పెట్టిన అధిష్టానం
రాజంపేట: తెలుగుదేశం పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేసిన సుగవాసి సుబ్రమణ్యం సైలెంట్ అయ్యారంటే.. అవుననే చెప్పాల్సివస్తోంది. గత కొద్దినెలలుగా అధికారపార్టీకి దూరంగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో సుగవాసికి అధిష్టానం టికెట్ ఇచ్చి పోటీ చేయించినా అధిష్టానం ఆయనను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడంలేదన్న వాదన టీడీపీలో హాట్‌టాపిక్‌గా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఒంటమిట్ట రాములోరి కళ్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తే ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా సుగవాసి కనిపించలేదు. ఆయన పార్టీ వీడనున్నారా? అన్న సందేహాలు రేకేత్తిస్తున్నాయి. రాజంపేటలో కాపు (బలిజ)సామాజికవర్గానికి సరైన ప్రాధాన్యత లేదన్న భావనలు పుట్టుకొస్తున్నాయి.
రాజంపేట వైపు మళ్లీ బత్యాల చూపు?
మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రైల్వేకోడూరుకే పరిమితమయ్యారు. సుగవాసి సుబ్రమణ్యం గత కొద్దిరోజులుగా పారీ్టకి దూరంగా..నియోజకవర్గం పార్టీ కార్యక్రమానికి రాకపోవడంతో బలిజ సామాజికవర్గం మదనపడుతోంది. బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి సుబ్రమణ్యంలు రాజంపేట టీడీపీలో పట్టుకోల్పోయిన తరుణంలో ఆయన వెంట నడిచిన ఆయన సామాజికవర్గ నేతలు, అభిమానులు మాత్రం నిస్తేజంగా ఉండిపోయారు. మళ్లీ బత్యాల చూపు రాజంపేట వైపును మళ్లిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇన్‌చార్జి ఎవరో తేల్చని అధిష్టానం
రాజంపేట టీడీపీలో కుల వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. అధిష్టానం ఇన్‌చార్జి ఎవరో తేల్చుకోలేకుంది. ఇన్‌చార్జి రేసులో ఉన్న వారితో అ«ధికారులు తలపట్టుకుంటున్నారు. ఏ నేత వద్దకు పోతే, మరోనేతకు వ్యతిరేకమవుతామని, ఎవరి దగ్గరికి పోకుంటే పోలా అనే భావనలో పార్టీ క్యాడర్ కొనసాగుతోంది. సీఎం బర్త్‌డే వేడుకలను కలిసికట్టుగా కాకుండా చమర్తి జగన్‌మోహన్‌రాజు, బత్యాల చెంగల్రాయుడు, మేడా విజయశేఖర్‌రెడ్డి వేర్వేరుగా చేసుకున్నారు. మహానాడు తర్వాత ఇన్‌చార్జి ప్రకటిస్తారా? ముందుగానే ప్రకటిస్తారా అనేది టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అధిష్టానం ఎటువైపు
పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రమణ్యంను కాదని, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజుకు అధిష్టానం ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో బలిజ వర్గాలు జీరి్ణంచుకోలేకున్నాయి. రాజంపేట దేశంపారీ్టలో వర్గపోరు అంతర్గతంగా కొనసాగుతోంది. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల విషయంలో చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు ఉన్నాయి. రాజంపేట ప్రాంతీయ వైద్యశాలలో ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో కూడా ఓ నేత చేయి తడిపారనే ఆరోపణలు ఆ పార్టీ వర్గాలే బహిరంగగానే చెప్పుకుంటున్నాయి.