ఆలపాటి రాజా ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి సీటు విషయంలో జనసేన, తెలుగుదేశం మధ్య చిచ్చు రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బుధవారం గుంటూరులో నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, పట్టణ పార్టీ, అన్ని అనుబంధ విభాగాల నేతల నేతలతో రాజా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తెనాలి సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించకపోతే ఈ నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిసింది.
తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న రాజా తర్వాత మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి చర్చలు జరపడం, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. నాదెండ్ల మనోహర్‌ను రాజ్యసభకు పంపించి ఈ సీటు రాజాకు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇటీవల చెప్పారు. దీంతో రాజా ప్రజా పాదయాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. రాజ్యసభకు వెళ్లడానికి మనోహర్ ఇష్టపడలేదు. తెనాలిలోనే ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు.
తెనాలిలోనే ఉంటూ టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కలుస్తూ సీటు తనదేనని చెబుతున్నారు. తనకు సహకరించాలని కోరుతున్నారు. దీంతో తెనాలి సీటు దక్కదన్న అభిప్రాయానికి వచి్చన ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం ఇష్టపడటంలేదు. దీంతో రాజా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ మంగళవారం తన ఇంటికి పిలిపించుకుని, వారితో చర్చలు జరిపారు.
పొత్తులో భాగంగా సీటును జనసేన పార్టీకి ఇస్తే సహించబోమని ఈ సమావేశం అనంతరం నేతలు మీడియాకు తెలిపారు. పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఖుద్దూస్, మాజీ ఎంపీపీలు కేశన కోటేశ్వరరావు, సూర్యదేవర వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ శాఖమూరి చిన్నా, వైకుంఠపురం మాజీ చైర్మన్ జొన్నాదుల మహేష్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ సోమవరపు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఆడుసుమిల్లి వెంకటేశ్వరరావు, దేసు యుగంధర్, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, ఇతర టీడీపీ నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, రావి చిన్ని, రావి సూర్యకిరణ్ తేజ, లాయర్ మద్ది మల్లికార్జునరావు తదితరులతో రాజా ఈ సమావేశం నిర్వహించారు. బుధవారం గుంటూరులో జరిగే సమావేశంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment