Tenali Assembly Constituency
-
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
గుంటూరు, సాక్షి: తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో జరిగిన ఘటనపై యెల్లో మీడియా ఇష్టానుసారం కథనాలు ఇస్తోంది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించారు శివకుమార్. గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను వ్యక్తిగతంగా దుర్భాషలాడానని, అందుకే ఆ గొడవ జరిగిందని ఆయన తెలియజేశారు. ‘‘ఐతానగర్లో నేను నా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లాం. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నన్ను నానా దుర్భాషలాడాడు. వైఎస్సార్సీపీపై ద్వేషంతో రగిలిపోతూ.. నా భార్య ముందే నన్ను తిట్టాడు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడు. గొట్టిముక్కల సుధాకర్ బెంగళూరులో ఉంటున్నారు. టీడీపీకి చెందిన కమ్మ సామాజిక వర్గం వ్యక్తి. ‘‘నువ్వు అసలు కమ్మొడివేనా? అంటూ నన్ను దూషించాడు. ‘‘పోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో అందరి ముందు చాలా దురుసుగా ప్రవర్తించారు. పోలింగ్ బూత్‌లో ఉదయం నుండి అతడు హల్చల్ చేస్తున్నట్లు అక్కడి ఓటర్లే చెప్పారు. టీడీపీ జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో వాళ్ల మనుషులను దింపారు. వాళ్ల ద్వారా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారు అని శివకుమార్ ఆరోపించారు. -
మనోహర్ ఆస్తి పెరిగింది!
తెనాలిరూరల్: జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాదెండ్ల మనోహర్ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు అఫిడడవిట్‌లో పేర్కొ న్నారు. తనపేరిట రూ. 1,48, 03,300 విలువ చేసే చరాస్తులు ఉండగా తన భార్య పేర రూ. 2,49,33,338, కుమారుడి పేర రూ. 3,63,966 చరాస్తులు ఉన్న ట్టు చూపారు.తన పేర రూ, 1.95 కోట్ల విలువ చేసే 6.32 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరిట ద్వారకా తిరుమల, కర్ణాటకలలో రూ. 8.75 కోట్ల విలువ చేసే 8.54 ఎకరాల వ్యవసాయ భూమి, శేరిలింగంపల్లిలో రూ. 2,99,15,000 విలువ చేసే ఫ్లాట్, జూబ్లి హిల్స్‌లో రూ. 4,59,40. 000 విలువ చేసే ప్లాట్ ఉన్నట్టు చూపారు. తన పేరిట రూ. 43,96,641 వాహన రుణం ఉండగా తన భార్యకు రూ. నాలుగు కోట్లు రుణం ఉందని చూపారు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా 2019లో తన ఆస్తి రూ. 10,68,78,117గా మనోహర్ చూపారు. తెనాలిలో మనోహర్ నామినేషన్ తెనాలిరూరల్: నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్, బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఐతాన గర్ లింగారావు సెంటరు నుండి భారీ ర్యాలీగా గాం«దీచౌక్, శివాజీచౌక్‌ల మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన భార్య మనోహరం, ఆలపాటి రాజా తదితరులతో కలసి రిటరి్నంగ్ అధికారి ప్రఖర్ జైన్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. -
జనసేనలో భయం.. భయం
గుంటూరు, సాక్షి: చంద్రబాబు విషకౌగిలిలో చిక్కుకుంటే ఇక తప్పించుకోవడం కష్టం.. పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడిప్పుడే ఆ తత్త్వం మెల్లగా బోధపడుతోంది. జనసేనకు సీట్ల కేటాయింపును ఆఖరి నిమిషం దాకా నాన్చి... చివర్లో అతి కొద్ది సీట్లతో పవన్‌ను కట్టడి చేసేలా చంద్రబాబు పెద్ద ప్రణాళికతో ఉన్నారని ఇప్పటికే జనసేన నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండగా.. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఇప్పటికీ ఆ పార్టీ నేతల్లో స్పష్టత లేదు. దీంతో జనసేన కార్యకర్తలు సందిగ్ధంలో పడిపోయారు. పార్టీ అధినేత పవన్ రెండు మూడు వారాలుగా మౌనంగా ఉండడంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో.. ఈ పొత్తు ఎటు పోయి ఎటు వస్తుందోనని జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. యుద్ధానికి సన్నద్ధమవ్వాల్సిన సమయంలో పార్టీ అధినేత మొదలు.. పార్టీలో ఏ ఒక్క నాయకుడు తాము ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ఇలాగైతే అసలుకే మోసం తమకు ఇన్ని స్థానాలు కావాలని.. ఈ స్థానాలు కేటాయించాల్సిందేనని పవన్ కళ్యాణ్ ఇప్పటి దాకా టీడీపీని స్పష్టంగా కోరలేదు. జనసేనలోను కొందరు కీలక నేతలకు కూడా ఎలాంటి స్పష్టత లేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది గత ఎన్నికల్లోనూ చివరి వరకూ తేల్చలేదు. దీంతో అసలుకే మోసం వచ్చింది. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి పోటీ అనేది ఆఖరి నిమిషం వరకూ గోప్యంగా ఉంచడం ఈ ఎన్నికల్లో ఒక ఎత్తుగడగా భావిస్తున్నారు. వాడుకుని వదిలేస్తారేమో? రెండేళ్లుగా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ రాష్ట్ర పర్యటనకు వచ్చి మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయా? అన్నంత హడావుడి చేసేవారు. సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం ఆయన మౌనంగా ఉండిపోవడం వెనుక చంద్రబాబు జిమ్మిక్కులు ఉన్నాయని జనసైనికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మూడున్నర నెలలుగా వారాహి యాత్రను సైతం పక్కనపెట్టేశారు. ప్రతి పొత్తు సమయంలోనూ చంద్రబాబు తమతో పొత్తు పెట్టుకున్న పార్టీని రాజకీయంగా వాడుకుని ఆ తర్వాత ఆ పార్టీని అణగదొక్కే నైజం అందరికీ తెలిసిందే. ఆ వ్యూహాన్ని ఇప్పుడు జనసేనపైనా మొదలుపెట్టి ఉండొచ్చని పార్టీలో చర్చ సాగుతోంది. పవన్‌కు అవమానం : జనసైనికుల ఆవేదన మొదటి నుంచి చంద్రబాబు వెంట పవన్ కళ్యాణ్ వెంపర్లాడడంతో దాన్ని అలుసుగా తీసుకుని తమ అధినేతను కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేసే ఎత్తుగడలో బాబు ఉన్నాడని ఇప్పటికే జనసేన నేతలు మెల్లగా అర్థం చేసుకుంటున్నారు. తెలుగుదేశం–జనసేనలు కచ్చితంగా కలిసి పోటీ చేస్తాయని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరాఖండీగా ఆ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. నచ్చేవారు ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండి అని కేడర్‌ను అయోమయంలో పడేశారు. తమ అధినేత ఇంత చేస్తే పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయించేదీ చంద్రబాబు తేల్చకపోవడంపై ఆ పార్టీలో పెద్ద ఎత్తున మేధోమథనం సాగుతోంది. తమను చంద్రబాబు చివరిలో ముంచేస్తే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. నెలాఖరు నుంచి పర్యటనలు: నాదెండ్ల నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. అన్ని అసెంబ్లీ స్థానాలు కవర్ చేసేలా, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలతోపాటు బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. పొత్తులు కాదు కత్తులే పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కోరుకుంటున్న గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం మొదలు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న నియోజకవర్గాలన్నింటిలోనూ స్థానిక టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా గత వారం పది రోజులుగా అక్కడి జనసేన నాయకులకు వ్యతిరేకంగా పోటీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. జనసేనలో కీలక నేతగా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ ఆశిస్తున్న గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో జనసేనకు పోటీగా పాదయాత్ర చేస్తుండగా... రాజా అనుచరులు నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశాలు పెట్టి నాదెండ్ల మనోహర్‌పై బహిరంగంగానే విమర్శలకు దిగారు. పొత్తులో సీట్ల కేటాయింపు కొలిక్కి రాకమునుపే చంద్రబాబు మాత్రం తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల గురించి బహిరంగ సభలో ప్రకటిస్తున్నారని జనసేన నాయకులు భగ్గుమంటున్నారు. మండపేట నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ఆ స్థానంలో టీడీపీ పోటీ చేసే అంశాన్ని పేర్కొనడం స్థానికంగా రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది. అక్కడ జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలోని జనసేన కీలక నాయకుడు మనస్తాపం చెంది.. సీట్ల కేటాయింపు తేలేవరకు మండపేట నియోజకవర్గంలో టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన నాయకులకు సందేశాలు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇదే తరహా వాతావరణం ఉండగా, ఉమ్మడి ఉభయగోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ఫొటోలోనే పవన్.. పక్కన అక్కర్లేదా: జనసైనికులు జనసేనలో టికెట్లపై గందరగోళం నెలకొనగా... చంద్రబాబు మాత్రం పవన్ ఫొటోలు పెట్టుకుని వరుసగా తమ పార్టీ రాజకీయ కార్యక్రమాలకు వాడేసుకుంటున్నారు. వెళ్లిన ప్రతిచోట తమ అభ్యర్థులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేసుకుంటున్నారు. మరోవైపు జనసేనలో మాత్రం సీట్ల కేటాయింపు తేలక ఎన్నికల హడావుడి లేకుండా పార్టీ పూర్తి స్తబ్ధుగా తయారైంది. చంద్రబాబు తన ఫొటో పక్కనే పవన్ కళ్యాణ్ ఫొటోలు పెట్టుకొని జనసేనకు ఏమాత్రం సంబంధం లేకుండానే రోజుకు రెండు బహిరంగ సభలు నిర్వహించడం జనసైనికులకు మింగుడుపడడం లేదు. -
Janasena: అల్టిమేటంపై పవన్ రియాక్షన్ ఏంటో?
ఆలు లేదు చూలు లేదు కానీ కొడుకుపేరు మాత్రం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉంది జనసేన తీరు. అసలు జనసేనలో టీడీపీ పొత్తు ఏ స్థాయిలో ఉంటుందో.. ఎన్ని సీట్లు ఇస్తారో.. తమను గౌరవప్రదంగా చూసుకోవాలి అని ఇప్పటికి పవన్ కల్యాణ్ ఎన్నోమార్లు చెప్పినా ఆయన మాటలను టీడీపీ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ వస్తోంది. ఎన్ని సీట్లు ఇస్తే గౌరవం కాపాడినట్లు అన్నదానికి ఒక ప్రామాణికం.. లెక్కా పత్రం లేకపోయినా ఇటు కాపు ఉద్యమనేత చేగొండి హరిరామ జోగయ్య మాత్రం పవన్ కళ్యాణ్ చెవిలో జోరీగ మాదిరి మారి పోరుతూనే ఉన్నారు. మనం ఎక్కడా తగ్గొద్దు .. మన గౌరవం మనం కాపాడుకోవాలి అంటూ నిత్యం పవన్‌ను రెచ్చగొడుతూ కాపుల్లో ఐక్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కోసం మనం ఎందుకు పని చేయాలి అంటూ జోగయ్య బహిరంగ లేఖల్లో పవన్‌ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఒక లెక్క.. నేడు జోగయ్య ఏకంగా యాభై మంది అభ్యర్థులతో ఒక లిస్ట్ కూడా విడుదల చేసేసారు. ఇదిగో ఈ యాభై స్థానాల్లో మన జనసేన అభ్యర్థులు పోటీ చేయాల్సిందే అని అయన అల్టిమేటం ఇచ్చారు. అందులో టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు సొంత నియోజకవర్గం అయిన విజయనగరం కూడా ఉంది. ఆ స్థానాన్ని సైతం జనసేనకు కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేసారు. విజయనగరం సీటును ఘరాన అయ్యలు అనే కాపు నేతకు ఇవ్వాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇంకా తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు టిక్కెట్ ఇవ్వాలని, అక్కడ ఆయనే పోటీ చేయాలనీ ఆ జాబితాలో చేర్చారు. ఇప్పటికే తెనాలిలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అలకబూని ఉన్నారు. తానూ ఐదు సార్లు గెలిచిన తెనాలి సీటును జనసేనకు ఎలా ఇస్తారన్నది ఆలపాటి రాజా ప్రశ్న.. ఇప్పటికే అయన క్యాడర్ తో సమావేశమై రెండ్రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తాను అని హెచ్చరించారు. ఈ సందర్భంగా జోగయ్య తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు కోరుతున్నారు. ఈ జాబితాను టీడీపీ గౌరవించాలని లేదు కానీ జోగయ్య దృష్టిలో నాయకుడిగా గుర్తింపు పొందిన వాళ్లకు టిక్కెట్స్ రాకపోతే ఇప్పుడు వాళ్ళు అలకబూని పార్టీకి దూరం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు జనసేనను దాదాపు ఇరవైసీట్లకు పరిమితం చేసేందుకు టీడీపీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తే తమకు అంత నష్టం అని చంద్రబాబు భవిస్తూ సేనానిని సాధ్యమైనన్ని తక్కువసీట్లకు ఒప్పించాలని చూస్తున్నారు. దీంతోబాటు కూటమి సీఎంగా చంద్రబాబే ఉంటారని మొన్నామధ్యన లోకేష్ చేసిన ప్రకటన సైతం జనసేన గ్రాఫ్ ను పవన్ రాజకీయ పటిమను తగ్గించిందని అంటున్నారు. చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉండేదానికి మేమెందుకు చాకిరీ చేయాలన్నది జనసైనికులు, కాపుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య ఇలా లిస్ట్ విడుదల చేసి కాపు నాయకులను సంఘటితం చేయాలనీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి పవన్ దీనిమీద ఎలా స్పందిస్తారో చూడాలి. ✍️సిమ్మాదిరప్పన్న -
చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి సీటు విషయంలో జనసేన, తెలుగుదేశం మధ్య చిచ్చు రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బుధవారం గుంటూరులో నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, పట్టణ పార్టీ, అన్ని అనుబంధ విభాగాల నేతల నేతలతో రాజా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తెనాలి సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించకపోతే ఈ నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిసింది. తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న రాజా తర్వాత మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి చర్చలు జరపడం, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. నాదెండ్ల మనోహర్‌ను రాజ్యసభకు పంపించి ఈ సీటు రాజాకు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇటీవల చెప్పారు. దీంతో రాజా ప్రజా పాదయాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. రాజ్యసభకు వెళ్లడానికి మనోహర్ ఇష్టపడలేదు. తెనాలిలోనే ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. తెనాలిలోనే ఉంటూ టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కలుస్తూ సీటు తనదేనని చెబుతున్నారు. తనకు సహకరించాలని కోరుతున్నారు. దీంతో తెనాలి సీటు దక్కదన్న అభిప్రాయానికి వచి్చన ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం ఇష్టపడటంలేదు. దీంతో రాజా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ మంగళవారం తన ఇంటికి పిలిపించుకుని, వారితో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా సీటును జనసేన పార్టీకి ఇస్తే సహించబోమని ఈ సమావేశం అనంతరం నేతలు మీడియాకు తెలిపారు. పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఖుద్దూస్, మాజీ ఎంపీపీలు కేశన కోటేశ్వరరావు, సూర్యదేవర వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ శాఖమూరి చిన్నా, వైకుంఠపురం మాజీ చైర్మన్ జొన్నాదుల మహేష్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ సోమవరపు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఆడుసుమిల్లి వెంకటేశ్వరరావు, దేసు యుగంధర్, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, ఇతర టీడీపీ నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, రావి చిన్ని, రావి సూర్యకిరణ్ తేజ, లాయర్ మద్ది మల్లికార్జునరావు తదితరులతో రాజా ఈ సమావేశం నిర్వహించారు. బుధవారం గుంటూరులో జరిగే సమావేశంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. -
పొత్తుల పాలిటిక్స్: జనసేనకు షాకులిస్తున్న టీడీపీ నేతలు!
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తుల కత్తులు వేళ్లాడుతున్నాయి. అధినేతలిద్దరూ పొత్తులు కుదర్చుకుంటారు. కానీ, నియోజకవర్గాల్లో నేతలు సీట్ల కోసం కొట్టుకుంటారు. ప్యాకేజీ స్టార్ పార్టీని అన్ని చోట్లా సైకిల్ పార్టీ నేతలు చితక్కొడుతున్నారు. జనసేన పార్టీలో నెంబర్ టూ నేతకే దిక్కులేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొత్తులు పేరుకేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల మధ్య దిగువ స్థాయిలో ఏం జరుగుతోంది?.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం చేతులు కలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు జైలుకెళ్లగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని ప్రకటించారు. అప్పటినుంచి తరచూ చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. అటు పవన్‌ను కూడా చంద్రబాబు కలుస్తున్నారు. ఇక ఇద్దరూ కలిసి సీట్లు పంచుకుని ముందుకెళ్లడమే తరువాయి అనుకుంటున్న నేపధ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన, టీడీపీల మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య రచ్చ రచ్చ అవుతోంది. తాను తెనాలి నుంచి పోటీ చేస్తానని మూడు నెలల ముందే జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంతేకాదు తెనాలిలో జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయాన్నికూడా ఆయన ప్రారంభించారు. తెనాలి వచ్చినప్పుడల్లా అక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, జనసేన నేత నాదెండ్ల కార్యక్రమాల గురించి పట్టించుకోని తెనాలి టీడీపీ నేతలు తమ పని తాము చేసుకుపోతున్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ కన్నా స్పీడ్ పెంచారు. ఇక్కడనుంచి జనసేన పోటీ చేస్తుంది కదా.. మనకు సీటు లేదని కొన్నిరోజులపాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలోచించారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను కలిశారు. వారిద్దరితో భేటీ తర్వాత ఆలపాటికి ఏం క్లారిటీ వచ్చిందో బయటకు రాలేదుకానీ.. అప్పటినుంచి తెనాలిలో దూకుడు పెంచారు. టీడీపీ కార్యకర్తలకు మన పని మనదే.. జనసేన పని జనసేనదే.. వారికి మనకు సంబంధం లేదు. ఇక్కడనుంచి టీడీపీ అభ్యర్ది ఎన్నికల బరిలో ఉంటారు. ఆ అభ్యర్థిని కూడా నేనే అని పార్టీ నాయకులకు తేల్చిచెప్పేశారట. ఆలపాటి రాజా వ్యవహారం గురించి తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తుంది కదా.. పవన్ కళ్యాణ్ కూడా తెనాలి సీటు నాదే అని చెప్పారు. ఇప్పుడు టీడీపీ అడ్డం తిరగడమేంటి అంటూ షాక్‌కు గురయ్యారట. అయినా.. సరే మేం కూడా మా పని చేసుకుంటాం.. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకే వస్తుంది. తెలుగుదేశం ఇక్కడ పోటీ చెయ్యదని తన క్యాడర్‌కు చెబుతున్నారట. రెండు పార్టీల నేతల ప్రకటనలతో ఎవరు పోటీ చేస్తారో అర్దంకాని పరిస్థితి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజా పాదయాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేద్దామని బయల్దేరారు. ఇది చూసి నాదెండ్ల మనోహర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఒక వైపు సీటు మాదే అంటుంటే.. రాజా పాదయాత్ర ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా పై స్థాయిలో నిర్ణయం జరిగినపుడు టీడీపీ మనకు సపోర్ట్ చెయ్యాలి కదా అని సన్నిహితుల వద్ద వాపోయారట. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ముందుకెళ్దామని అనుకున్నాం.. మేనిఫెస్టోపై రెండు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో టీడీపీ తొండాట ఆడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ నేత ఆలపాటి రాజా తీరుపై అమీ తుమీ తేల్చుకునేందుకు పవన్ వద్ద పంచాయితీ పెట్టాలని నాదెండ్ల మనోహర్ నిర్ణయించుకున్నట్లు తెనాలిలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆలపాటి రాజా మాత్రం పొత్తు ఉన్నా.. లేకపోయినా తెనాలిలో పోటీ చేసేదీ నేనే అంటూ ముందుకుసాగుతున్నారు. తెనాలిలో టీడీపీ, జనసేనల మధ్య జరుగుతున్న సీట్ ఫైట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. -
రాజమండ్రి రూరల్‌లో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు వ్యవహార శైలి టీడీపీ, జనసేన నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై ఎటూ తేల్చకపోవడం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం అది బహిరంగంగా ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు గుప్పించే స్థాయికి చేరింది. తనకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే టికెట్ దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ ఇటీవల విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దానిని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారు. ప్రెస్మీట్లు.. సిగపట్లు.. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పవన్, చంద్రబాబు కలిసే చేస్తారని, కచ్చితంగా తనకే టిక్కెట్ దక్కుతుందని కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గతంలో చంద్రబాబు చేసిన ప్రకటన తమ పొత్తు తర్వాత చెల్లదన్నారు. దీంతో తానే పోటీ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు. దుర్గేష్ ఇలా ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేసి.. అది ఇప్పుడు చెల్లదనడానికి జనసేన నాయకుడు ఎవరని దుర్గేష్‌పై శివాలెత్తారు. ఎవరేమన్నా రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూరల్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని బల్లగుద్ది మరీ ప్రకటించారు. బుచ్చయ్యకు కష్టమేనా.. బుచ్చయ్య రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా రాజమహేంద్రవరం సిటీ స్థానంపైనే ఉండేది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెళ్లగక్కారు. ఆయనకు రూరల్ ఇవ్వని పక్షంలో ఆదిరెడ్డి వాసును ఎంపీగా రంగంలోకి దింపి, సిటీ సీటు బలమైన క్యాడర్ ఉన్న బుచ్చయ్యకు కేటాయిస్తారన్న ప్రచారం కొంతకాలం నడిచింది. బాబు ఇక్కడి సెంట్రల్ జైలుకు వచ్చాక ఆయన కుటుంబం ఇక్కడే ఉండి ఆందోళనల్లో పాల్గొన్నపుడు.. చొరవగా వ్యవహరించిన ఆదిరెడ్డి వాసుకే సిటీ సీటు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. దీంతో బుచ్చయ్యకు సిటీ ఆశ కూడా అడియాసగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బాబు వైఖరితోనే.. చంద్రబాబు వైఖరితోనే రాజమండ్రి రూరల్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ, జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబు విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని గతంలో చంద్రబాబు ప్రకటించేశారు. దీంతో రూరల్ సీటు తనకే అన్న ధీమాలో బుచ్చయ్య ఉండగా.. పొత్తులో భాగంగా దుర్గేష్‌కు ఇద్దామన్న మరో ప్రతిపాదన సైతం బుచ్చయ్య వద్ద ఉంచారు. ఇలా రెండువైపులా అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఇరు వర్గాల మధ్య గొడవలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని జనసేన, టీడీపీ నేతలు అంటున్నారు. గుంటూరులో సిగపట్లు ♦ గుంటూరు పశ్చిమం, తెనాలి కావాలని జనసేన డిమాండ్ ♦ ఆ రెండూ తమ పార్టీకి బలమైన సీట్లు అంటున్న నేతలు ♦ కానీ, తెనాలిలో పాదయాత్ర మొదలుపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ♦ గుంటూరు పశ్చిమ.. మా సిట్టింగ్ సీటు అంటున్న తెలుగుదేశం సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు తలనొప్పిగా మారుతోంది. టీడీపీకి పట్టున్న రెండు సీట్లను జనసేన డిమాండ్ చేస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా, జనసేన నుంచి ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీపడుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఇక్కడ్నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్, జనసేన తరఫున మరో రెండుసార్లు ఓటమి చవిచూశారు. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు మళ్లీ తెనాలి నుంచి టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా సమ్మతించారు. అయితే, ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మరోసారి పోటీచేయాలని చూస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే గెలుస్తామన్న భావనతో ఆయన పార్టీపరంగా లైన్ క్లియర్ చేసుకునేందుకు లోకేశ్‌తో టచ్‌లో ఉన్నారు. నియోజకవర్గంలోనూ ఆయన పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో జనసేనకు 29 వేల ఓట్లు రాగా టీడీపీకి 76 వేల ఓట్లు వచ్చాయి. తమకు బలమైన సీటును వదులుకోవడానికి సిద్ధంగాలేమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గుంటూరు పశ్చిమం కోసం జనసేన పట్టు.. ఇక జనసేన అడుగుతున్న రెండో సీటు గుంటూరు పశ్చిమం. ఈ సీటు 2014, 2019లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తమ సిట్టింగ్ సీటును ఇచ్చేదిలేదని వారు తెగేసి చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం బలంతో పాటు కాపు ఓటింగ్ కూడా గణనీయంగా ఉండటంతో ఇక్కడ పోటీచేయాలని జనసేన భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ సీటు కోసం పట్టుపడుతున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం కూడా గుంటూరు జనసేన నేతలు పవన్‌ను కలిసి ఈ సీటు కావాల్సిందేనని, ఏ విధంగా గెలుస్తామో ఆయనకు వివరించారు. మరోవైపు.. టీడీపీ కూడా ఇక్కడ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని బరిలోకి దిగడంతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బరిలోకి దింపేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న ఎన్ఆర్ఐలు తమ కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఏ సీటు వదులుకోవాలో, ఏ సీటు ఉంచుకోవాలో తెలీక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.