ఆలు లేదు చూలు లేదు కానీ కొడుకుపేరు మాత్రం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉంది జనసేన తీరు. అసలు జనసేనలో టీడీపీ పొత్తు ఏ స్థాయిలో ఉంటుందో.. ఎన్ని సీట్లు ఇస్తారో.. తమను గౌరవప్రదంగా చూసుకోవాలి అని ఇప్పటికి పవన్ కల్యాణ్ ఎన్నోమార్లు చెప్పినా ఆయన మాటలను టీడీపీ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ వస్తోంది. ఎన్ని సీట్లు ఇస్తే గౌరవం కాపాడినట్లు అన్నదానికి ఒక ప్రామాణికం.. లెక్కా పత్రం లేకపోయినా ఇటు కాపు ఉద్యమనేత చేగొండి హరిరామ జోగయ్య మాత్రం పవన్ కళ్యాణ్ చెవిలో జోరీగ మాదిరి మారి పోరుతూనే ఉన్నారు.
మనం ఎక్కడా తగ్గొద్దు .. మన గౌరవం మనం కాపాడుకోవాలి అంటూ నిత్యం పవన్ను రెచ్చగొడుతూ కాపుల్లో ఐక్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కోసం మనం ఎందుకు పని చేయాలి అంటూ జోగయ్య బహిరంగ లేఖల్లో పవన్‌ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఒక లెక్క.. నేడు జోగయ్య ఏకంగా యాభై మంది అభ్యర్థులతో ఒక లిస్ట్ కూడా విడుదల చేసేసారు. ఇదిగో ఈ యాభై స్థానాల్లో మన జనసేన అభ్యర్థులు పోటీ చేయాల్సిందే అని అయన అల్టిమేటం ఇచ్చారు.
అందులో టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు సొంత నియోజకవర్గం అయిన విజయనగరం కూడా ఉంది. ఆ స్థానాన్ని సైతం జనసేనకు కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేసారు. విజయనగరం సీటును ఘరాన అయ్యలు అనే కాపు నేతకు ఇవ్వాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇంకా తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు టిక్కెట్ ఇవ్వాలని, అక్కడ ఆయనే పోటీ చేయాలనీ ఆ జాబితాలో చేర్చారు. ఇప్పటికే తెనాలిలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అలకబూని ఉన్నారు. తానూ ఐదు సార్లు గెలిచిన తెనాలి సీటును జనసేనకు ఎలా ఇస్తారన్నది ఆలపాటి రాజా ప్రశ్న.. ఇప్పటికే అయన క్యాడర్ తో సమావేశమై రెండ్రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తాను అని హెచ్చరించారు.
ఈ సందర్భంగా జోగయ్య తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు కోరుతున్నారు. ఈ జాబితాను టీడీపీ గౌరవించాలని లేదు కానీ జోగయ్య దృష్టిలో నాయకుడిగా గుర్తింపు పొందిన వాళ్లకు టిక్కెట్స్ రాకపోతే ఇప్పుడు వాళ్ళు అలకబూని పార్టీకి దూరం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు జనసేనను దాదాపు ఇరవైసీట్లకు పరిమితం చేసేందుకు టీడీపీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తే తమకు అంత నష్టం అని చంద్రబాబు భవిస్తూ సేనానిని సాధ్యమైనన్ని తక్కువసీట్లకు ఒప్పించాలని చూస్తున్నారు.
దీంతోబాటు కూటమి సీఎంగా చంద్రబాబే ఉంటారని మొన్నామధ్యన లోకేష్ చేసిన ప్రకటన సైతం జనసేన గ్రాఫ్ ను పవన్ రాజకీయ పటిమను తగ్గించిందని అంటున్నారు. చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉండేదానికి మేమెందుకు చాకిరీ చేయాలన్నది జనసైనికులు, కాపుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య ఇలా లిస్ట్ విడుదల చేసి కాపు నాయకులను సంఘటితం చేయాలనీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి పవన్ దీనిమీద ఎలా స్పందిస్తారో చూడాలి.
✍️సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment