‘‘సరే మద్దతు కోరి వచ్చారు.. ముందు కూర్చోండి.. ఇదీ ఉప్మా తినండి.. కాఫీలు తాగారా.. ఇప్పుడు చెప్పండి.. అసలు జనసేనకు టీడీపీకి పొత్తు ఏ ప్రాతిపదికన కుదిరింది. ఎవరికీ ఎన్ని సీట్లు ఇస్తున్నారు... ఎక్కడెక్కడ ఇస్తున్నారు.. పోనీ కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు ఎన్నిమంత్రిపదవులు ఇస్తారు.. ఆదేశికారంలో జనసేనకు, టీడీపీకి ఏ నిష్పత్తిలో అధికార పంపిణీ ఉంటుంది.. పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి గట్రా ఉందా.. దోస వేసుకోండి... ఒరేయ్ చట్నీ వెయ్యరా మనోళ్లకు అంటూనే.. ఆ ఇప్పుడు చెప్పండి.. రెండు పార్టీల మధ్య ఒప్పందం ఎలా జరిగింది.. అన్నీ చెప్పండి.. అప్పుడు నేను తప్పకుండా జనసేనలో చేరుతాను’’ అన్నారు ముద్రగడ.
ఈ లోపు ఇడ్లీలు అయ్యాయి.. వేడి పూరీ వచ్చింది.. ‘‘దీన్ని కూడా వేసుకోండి’’ అని కొసరికొసరి వడ్డించిన ముద్రగడ ‘‘ఆ... ఇప్పుడు కాఫీ తాగి చెప్పండి.. గెలిస్తే మన కాపులకు ఒరిగేది ఏమిటి? మన వాళ్లకు ఎన్ని పదవులు.. ఈ లెక్కాపత్రం ఏమైనా ఉందా’’ అని వరుస ప్రశ్నలు వేయడంతో జనసేన ప్రతినిధుల గొంతులో ఉప్మా అడ్డం పడింది.. ‘‘అదేంటండి అన్ని ప్రశ్నలు ఒకేసారి వేశారు’’ అంటూ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ కాపీ తాగి.. ‘‘టిఫిన్లు బాగున్నాయండి.. కానీ మీరు అడిగిన ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేదండి’’ అన్నారు తీరిగ్గా..
ఈసారి ముద్రగడకు మరింత చిర్రెత్తుకొచ్చింది... ‘‘సరే తిన్నారా... చేతులు కడుక్కుని మళ్ళీ కూర్చోండి’’ అని కుర్చీలు చూపించి.. ‘‘మన కాపులకు.. జనసేనకు ఎన్ని సీట్లు.. ఎక్కడెక్కడ ఇస్తారో తెలీదు... ఎవరెవరికి ఇస్తారో తెలీదు... ఎన్నికల ఖర్చులు ఎవరివో తెలీదు.. గెలిస్తే పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో తెలీదు.. ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి ఇలాంటివి జనసేనకు ఉన్నాయో లేదో తెలీదు.. మరి ఏమీ తెలీకుండా చంద్రబాబు కావిడి మోయడానికి మీకు సిగ్గు లేకపోతే లేదు.. నాకైనా ఆలోచన ఉండాలి కదా.. ప్రతిఫలం ఆశించకుండా.. అధికారంలో వాటా కోరకుండా బేషరతుగా తెలుగుదేశం గెలుపుకోసం ఎందుకు పని చేయాలి.. ఇలా ఎవరైనా చేస్తారా ? మీరు రాజకీయ నాయకులా.. కూలీలా... కనీసం బుద్ధీ బుర్రా ఉండక్కర్లా’’ అన్నట్లుగా ఎదురు ప్రశ్నలు ఫటా ఫట్ సంధించడంతో జనసేన ప్రతినిధుల మొహాల్లో వరుసగా క్వశ్చన్ మార్కులు పడ్డాయి.
‘‘ముందు మనకు చంద్రబాబు ఏమి ఇస్తాడో చెప్పండి.. అప్పుడే నేను జనసేనలో చేరతాను.. పార్టీ కోసం పని చేస్తాను.. ఏమీ తెలీకుండా గుడ్డిగా చేరలేను.. చంద్రబాబుకు సేవ చేయలేను.. నా ఆత్మగౌరవం చంపుకోలేను’’ అంటూ.. నేను మీలాంటోడిని కాదని క్లారిటీ ఇచ్చారు.. దీంతో అయన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని జనసేన ప్రతినిధులు మొహాలు దిగాలుగా పెట్టుకుని వెనక్కు వచ్చారు. దీంతో ప్రస్తుతం ముద్రగడ జనసేనలో చేరిక ప్రశ్నార్ధకమైంది.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment