పవన్‌.. ఇంత దానికి అంత బిల్డప్‌ అవసరమా? | Ksr Comments On Pawan Kalyan's Strange Statements | Sakshi
Sakshi News home page

పవన్‌.. ఇంత దానికి అంత బిల్డప్‌ అవసరమా?

Published Thu, Apr 4 2024 12:25 PM | Last Updated on Thu, Apr 4 2024 1:21 PM

Ksr Comments On Pawan Kalyan's Strange Statements - Sakshi

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. చివరికి జనసేన కార్యకర్తలను ఆయన బ్లేడ్ బ్యాచ్‌లతో పోల్చుతున్నారు. ఇది అమాయకత్వంగా చేసినా లేక అహంభావంతో చేసినా పవన్‌కు ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏమిటో ప్రజలకు అర్దం అయిపోతోంది. జనం ఎక్కువ మంది తన వద్ద పోగైనప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్ తీసుకు వచ్చి తనను, తన సిబ్బందిని గాయపరుస్తున్నారని దారుణమైన ఆరోపణ చేశారు. ప్రత్యర్ధి పార్టీ పన్నాగాలు తెలుసు కదా! అంటూ ముక్తాయింపు ఇచ్చారు.

నిజానికి ఆయన వద్దకు వెళ్లేవారంతా మెజార్టీ సినిమా అభిమానులే. లేదా జనసేన కార్యకర్తలు. నిజంగానే వచ్చినవారు ఎవరితోనైనా ప్రమాదం ఉందని భావిస్తే, మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసుకుని, ఎవరి వద్ద అయినా అభ్యంతరకర వస్తువులు ఉంటే తీసేసుకోవచ్చు. అలా చేయకుండా తనను అభిమానంతో చూడడానికి వచ్చినవారిని బ్లేడ్ బ్యాచ్‌తో పోల్చడం కేవలం అహంకారం తప్ప మరొకటి కాదు.

ఎందుకు ఈయన ఈ ప్రకటన చేశారో తెలుసా? కొద్ది రోజుల క్రితం పవన్‌ కల‍్యాణ్‌ బస చేసిన చోట జనసేన కార్యకర్తలు కొంతమంది గుమికూడి ఆయనను కలవడానికి ప్రయత్నించారట. ఆయన సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు వారిని అనుమతించలేదు. గంటల సేపు వేచి చూసినా తమ నాయకుడిని కలుసుకోలేకపోయారు. అంతలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ తన అనుచరులతో కలిసి పవన్‌ కల‍్యాణ్‌ బసకు వచ్చారట. వెంటనే ఆయనను, అనుచరులను లోనికి పంపించేశారట. అది చూసి ఒళ్లు మండిన ఒక జనసేన కార్యకర్త తమకు ఇంత అవమానం చేస్తారా అని ప్రశ్నిస్తూ ఒక ఆడియో టేప్‌ను సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయింది. ఆయన దృష్టికి కూడా అది వెళ్లి ఉండాలి. దాంతో ఆయన స్వరం మార్చి కొత్త రాగం ఆలపించారన్నమాట.

'నిజంగానే ఎవరైనా బ్లేడ్ తీసుకుని ఆయన చేతిమీదో, లేక సెక్యూరిటీ సిబ్బంది చేతుల మీదో కోస్తే గాయం అవుతుంది కదా! అప్పుడు రక్తం వస్తుంది కదా! లేదా బట్టలు చిరుగుతాయి కదా! ఇన్నాళ్లుగా ఒక్కసారైనా అలాంటివి జరిగినట్లు పవన్‌కల‍్యాణ్‌ చెప్పలేదే!' పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు జరిగిన అవమానం నుంచి దారి మళ్ళించేందుకు పవన్ ఈ కొత్త డ్రామా ఆడాడని అనుకోవడంలో ఆశ్చర్యం ఏమి ఉంటుంది.

'పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరిని కలవాలన్నది తన కోరిక అని, ప్రతి ఒక్కరితో ఫోటో దిగాలన్నది తన అభిలాష' అని చెప్పారు. వచ్చిన జనసైనికులను కలవడానికి ఇష్టం ఉండదు కానీ, ఓట్ల కోసం పిఠాపురం ప్రజలందరితో ఫోటో దిగాలని ఉందని అంటే ఎవరు నమ్ముతారు? నిజంగానే అలా ఉంటే ప్రతీ ఊరుకు వెళ్లి అక్కడివారితో ఫోటో దిగండి. ఎవరు అడ్డుపడుతారు? అదే ఎన్నికల ప్రచారం అనుకోండి.. అప్పుడు పిఠాపురం అవసరాలు, సమస్యల గురించి తెలుసుకోవలసిన అవసరం లేకుండా పోతుందేమో!

ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 'టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మను ఇదే పవన్‌కల‍్యాణ్‌ 2019 ఎన్నికలలో పేకాట క్లబ్‌లు నడిపే వ్యక్తిగా అభివర్ణించి అవమానించారు. ఇప్పుడు అదే వర్మను తనను గెలిపించాలని వేడుకుంటున్నారు'. గతంలో సముద్రం ఎవరి వద్దకు రాదు.. పర్వతాలు ఎవరికి తలవంచవు అంటూ డైలాగులు చెప్పిన పవన్‌కల‍్యాణ్‌ ఇప్పుడు తెలుగుదేశం నేతలను బతిమిలాడుకుంటున్నారు. తన జనసైనికుల మీద కన్నా టీడీపీ వారే బెటర్ అని ఆయన భావిస్తున్నారు. తన గెలుపు బాధ్యత వర్మ చేతులలో పెడుతున్నానని ఆయన చెప్పారు. ప్లీజ్.. ఈ ఒక్కసారైనా తనను గెలిపించాలని అభ్యర్ధిస్తున్నానని అంటున్నారు. ఎందుకింత బేలతనం! 'ఒక పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇలా మాట్లాడతారా? నలుగురిని గెలిపించాల్సిన తమ నేతే ఇలా దిగజారి మాట్లాడుతున్నారంటే జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి సంకేతం పంపుతుంది'!

జనసేన ఎన్నికల గుర్తు గ్లాస్ గురించి ఆయన మాట్లాడుతూ గ్లాస్ పగిలితే మరింత పదును తేలుతుందని ఓ పిచ్చి డైలాగు చెప్పారు. పగిలిన గ్లాస్ ఎవరికి ఉపయోగపడదు. జాగ్రత్తగా, ఎవరికీ ప్రమాదం లేకుండా ఆ ముక్కలను బయట పడేస్తారు. పగిలిన గ్లాస్ ముక్కను జనసేన కార్యకర్తలు పట్టుకున్నా, వారికి చేతులు తెగుతాయి తప్ప ప్రయోజనం ఉండదు. ఆ సంగతి కూడా తెలియకుండా సినిమా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం. 'పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటానని ఆయన చెబుతున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ గతంలో భీమవరంలో పోటీచేసినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. కానీ అక్కడ ఓడిపోయిన తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇప్పుడు పిఠాపురంలో ఉంటానంటే ఎవరు నమ్ముతారు?' సినిమా షూటింగ్‌లు మానుకుని ఇక్కడ ఉంటానంటే నమ్మడానికి ప్రజలు కాదు కదా, జనసైనికులు కూడా విశ్వసించరు.

తమ పార్టీ కొత్త నాయకులను తయారు చేస్తుందని పవన్‌ కల‍్యాణ్‌ అన్నారు. సంతోషమే. కానీ 'పదేళ్ల జనసేన ప్రస్తానంలో ఎందరు నాయకులు తయారయ్యారు. చివరికి టీడీపీ నుంచి పొందిన ముష్టి 24 సీట్లలో మూడు తగ్గించుకుని, అందులో కూడా ఓ ఆరేడు సీట్లు టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు ఎందుకు ఇచ్చారో చెప్పాలి'. పొత్తులో ఉన్న పార్టీల నుంచి నేతలను ఎవరైనా తీసుకుంటారా?అలా చేశారంటే ఏమిటి దాని అర్దం! జనసేనకు నేతలు లేరనే కదా? ఉన్న జనసేన నేతలు పనికిరారని పవన్‌ భావిస్తున్నట్లే కదా?
 

జనసేనలో కొత్తగా చేరిన టీడీపీ నేత మండలి బుద్ద ప్రసాద్‌కు అవనిగడ్డ టిక్కెట్ ఇచ్చారు.
పాలకొండ సీటును కూడా జనసేనలో చేరిన టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకు ఇవ్వబోతున్నారట.
టీడీపీతో సన్నిహితంగా మెలిగిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి టిక్కెట్ ఇచ్చారు.
భీమవరంలో టీడీపీ నేత పి.రామాంజనేయులును జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన ఆరణి శ్రీనివాసులుకు తిరుపతి టిక్కెట్ ఇవ్వడంపై అక్కడి జనసేన, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మచిలీపట్నం లోక్‌సభ సీటును వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన బాలశౌరికి కేటాయించారు.

ఇవన్నీ గమనిస్తే ఏమి తెలుస్తుంది? పదేళ్లలో పట్టుమని పది నియోజకవర్గాలలో జనసేన నుంచి నేతలను తయారు చేసుకోలేకపోయారనే కదా! ఈ పాటి దానికి ఇంత బిల్డప్ అవసరమా అని కొందరు సామాన్యులు ఎద్దేవ చేస్తున్నారు!. 'షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు కానీ, తాను అలా చేయలేదని పవన్‌కల‍్యాణ్‌ అంటున్నారు. ఆమె పార్టీని విలీనం చేసినా, పవన్‌కల‍్యాణ్‌ టీడీపీలో విలీనం చేయకుండా ఆ పార్టీకి తాకట్టు పెట్టినా పెద్ద తేడా ఏముందన్నది విశ్లేషకుల ప్రశ్న'.

2019లో సుమారు 140 నియోజకవర్గాలలో పోటీచేసిన జనసేన 2024లో పద్దెనిమిది నియోజకవర్గాలలో సొంత నేతలను పోటీలో ఉంచలేకపోయింది. ఈ సంగతి ప్రజలకు తెలియదా! పవన్‌కల‍్యాణ్‌ ఎంతగా భయపడుతున్నారంటే, మతపరమైన రాజకీయాలు చేయడానికి వెనుకాడడం లేదు. గుడులలో ఏదో జరిగిందని, దోషులను పట్టుకోలేదంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసే దుస్థితికి వచ్చారు. వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అని పవన్‌ అంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ మొత్తం మీద తిరుగుతోందని ఆయన ఒప్పుకున్నారు. కానీ అదే సమయంలో తన గ్లాస్ పగిలిపోయిందని పవన్ కల్యాణే ఒప్పుకుంటున్నారు. తన చుట్టూ బ్లేడ్ బ్యాచ్‌లు తిరుగుతున్నాయని ఆయనే చెబుతున్నారు కనుక, ఆయన అభిమానులు కూడా జాగ్రత్తగా ఉండడమే బెటర్!.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement