ULTIMATUM
-
గేమింగ్ యాప్‌ల యాక్సెస్ ఆపేయండి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమింగ్ యాప్‌లకు తెలంగాణలో యాక్సెస్ లేకుండా చేయాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ఆ సంస్థల నిర్వాహకులను కోరింది. రాష్ట్రంలో ఆన్ లైన్ గేమింగ్ వ్యసనంతో అప్పులై ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత వివరాలతో బుధవారం ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్(ఏఐజీఎఫ్), ఫెడరే షన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్, ప్రధాన గేమింగ్ ప్లాట్‌ఫాం వ్యవ స్థాపకులు, సీఈవోలతో టీజీసీఎస్బీ కీలక సమావేశం నిర్వహించింది. తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్ ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించడానికి చర్యలను అన్వేషిస్తున్నట్టు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయెల్ స్పష్టం చేశారు. రాష్ట్రం తీసుకొచ్చిన గేమింగ్ చట్టం, చట్టపరమైన నిబంధనలు, గేమింగ్ కార్యకలాపాలకు వర్తింపచేసే అంశంపై నొక్కి చెప్పారు. ఈవారంలో తెలంగాణలో నమోదైన కేసులకు సంబంధించిన గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. రాష్ట్రంలో వారి ప్లాట్‌ఫారమ్‌లను నిలిపివేయాలని ఆదేశించినట్టు శిఖాగోయెల్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జియోఫెన్సింగ్, కఠిన కేవైసీ నిబంధనలు పాటించని, స్థానిక చట్టాలను ఉల్లంఘించే గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై నియంత్రణ చర్యలు, అందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. భారతీయ, ఆఫ్‌షోర్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను పర్యవేక్షించడానికి, రాష్ట్ర నిర్దిష్ట చట్టాల నిబంధనలకు అనుగుణంగా ఉండేలా కేంద్రీకృత నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖకు అధికారికంగా నివేదిక ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు శిఖాగోయెల్ తెలిపారు. -
మణిపూర్ మంటలు: ప్రభుత్వానికి మైతేయి సంఘాల అల్టిమేటం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణలు మరోసారి చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇందుకు జిరిబామ్ జిల్లాలో మైతేయి వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు హత్యకు గురవ్వడమే కారణం. వీరిని కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని భావిస్తుండటంతో రాష్ట్రంలో అల్లర్లు రాజుకున్నాయి. వీరి హత్యను నిరసిస్తూ నిరసనకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలో మణిపూర్ పరిణామాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సోమవారం సాయంత్రం మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.అయితే శాంతి భద్రతలపై సమీక్షించిన ఈ భేటికి 11 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి కారణాలు వెల్లడించకుండానే గైర్హాజరు అయ్యారు.మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని మళ్లీ అమలు చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని, జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ మిలిటెంట్లకు వ్యతిరేకంగా వారం రోజుల్లోగా భారీ ఆపరేషన్ చేయాలని తీర్మానం డిమాండ్ చేస్తుంది. అయితే మూడు కీలక హత్య కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి బదిలీ చేయాలని శాసనసభ్యులు డిమాండ్ చేశారు. జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ తీవ్రవాదులను చట్టవిరుద్ధమైన సంస్థ’ సభ్యులుగా ప్రకటించేందుకు అంగీకరించారు.పై తీర్మానాలను నిర్ణీత వ్యవధిలోగా అమలు చేయకుంటే ఎన్డీయే శాసనసభ్యులందరూ రాష్ట్ర ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి సచివాలయం విడుదల చేసిన తీర్మానంలో పేర్కొంది.అయితే ఈ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను మైతేయి పౌర సమాజ సంస్థలు తిరస్కరించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల సమావేశం కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కొకొమి (కోఆర్డినేషన్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ) అధికార ప్రతినిధి ఖురైజం అథౌబా అన్నారు. ‘ ఈ తీర్మానాలతో మణిపూర్ ప్రజలు సంతృప్తి చెందలేదు. జిరిబామ్‌లో ఆరుగురు అమాయక మహిళలు, పిల్లలను చంపిన కుకీ మిలిటెంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ ఇది కేవలం జిరిబామ్‌లో మాత్రమే జరగలేదు. 2023 నుంచి మణిపూర్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో జరుగుతున్నాయి. కాబట్టి కుకీ మిలిటెంట్ల చెందిన గ్రూపులపై (SoO groups) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాసనసభ్యులను మణిపూర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు’ అని తెలిపారు.అన్ని SoO సమూహాలను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించాలని, కుకీ తిరుగుబాటుదారులతో కార్యకలాపాల సస్పెన్షన్ ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేయాలని మైతేయి పౌర సమాజ సంఘం డిమాండ్ చేసింది. ‘ప్రభుత్వం లేదా శాసనసభ్యులు మళ్లీ ప్రజలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదు. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. వచ్చే 24 గంటల్లో ప్రభుత్వం ఈ తీర్మానాన్ని సమీక్షించి మంచి తీర్మానంతో తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం. వారు అలా చేయకపోతే మా ఆందోళనను తీవ్రతరం చేస్తాం. ఇందులో భాగంతా ముందుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తాం’ కొకొమి ప్రతినిధి పేర్కొన్నారు.మరోవైపు అల్లర్లను అదుపు చేయలేకపోవడం, హింసాకాండ ఎక్కువడంతో ఇప్పటికే ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) తన మద్దతు ఉపసంహరించుకుంది. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్పీపీ మద్దతు ఉపసంహరించినప్పటికీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, జేడీ(యూ)కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక మైతేయి, కుకీ వర్గాల మధ్య హింసాకాండలో ఇప్పటి వరకు 220 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. -
పనులన్నీ వదిలేసి వెళ్లిపోండి!
‘మీరు చేస్తున్న పనులు ఉన్నది ఉన్నట్టుగా వదిలేసి వెళ్లిపొండి..! లేదంటే కేసులు ఎదుర్కోవడానికి సిద్ధపడండి..! మీ కంపెనీ తరఫున మేం పనులు చేస్తాం.. బిల్లులు కూడా మేమే తీసుకుంటాం..!’ – తస్మదీయ కాంట్రాక్టర్లకు టీడీపీ ముఖ్యనేతల అల్టిమేటం.‘అలాగైతే.. మీరు చేసే అక్రమాలకు మేం బాధ్యత వహించాల్సి వస్తుంది..! మాకు ఇవ్వాల్సిన బిల్లులు ఇచ్చేసి.. ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్ఫెసిఫికేషన్స్) 60 సీ నిబంధన కింద కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయండి! కావాలంటే ఈ వ్యవహారంపై మేం కోర్టులో సవాల్ చేయబోమని హామీ కూడా ఇస్తాం!’ – కాంట్రాక్టర్ల ప్రతిపాదన.సాక్షి, అమరావతి: గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన మాదిరిగానే 2014–19 తరహాలోనే 60 సీ నిబంధన కింద పనుల ఒప్పందాలను రద్దు చేసి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. అస్మదీయులకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునేందుకు టీడీపీ ముఖ్యనేతలు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల వరకు వివిధ శాఖల పరి«ధిలో చేపట్టిన నిర్మాణ పనులపై కన్నేసి అస్మదీయ కాంట్రాక్టర్లను పనులు చేసుకునేందుకు అనుమతిస్తున్న టీడీపీ నేతలు.. తస్మదీయ కాంట్రాక్టర్లను మాత్రం అడ్డుకుంటున్నారు.ఉన్నఫళంగా పనులు వదిలేసి వెళ్లిపోవాలంటూ హుంకరిస్తున్నారు. తమకే పనులు అప్పగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మీ కంపెనీ తరఫున పనులు చేస్తాం.. బిల్లులు మేం తీసుకుంటామని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంట్రాక్టు సంస్థలు ఒప్పుకోవడం లేదు. చేసిన పనుల్లో ఏవైనా లోపాలు తలెత్తితే వాటికి తాము బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తనకు రూ.2 వేల కోట్ల మేర బిల్లులు రావాలని.. వాటిని ఇప్పించి, తాను చేస్తున్న పనుల కాంట్రాక్టు ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని ఓ బడా కాంట్రాక్టు సంస్థ అధినేత టీడీపీ ముఖ్యనేతలకు సూచించారు. పాత విధానంలో దూకుడుగాకాంట్రాక్టర్లు తమ ఒత్తిళ్లకు లొంగకపోవడంతో 2014–19లో అమలు చేసిన విధానానికే టీడీపీ నేతలు మరింత పదును పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల పనుల వరకూ తస్మదీయ కాంట్రాక్టు సంస్థలు చేస్తున్న పనులను 60 సీ కింద రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన పనులకు 2024–25 ఎస్ఎస్ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం అంచనాలను రూపొందించి.. ఎక్కువ కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకు వాటిని కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు. -
ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే!
ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ మిల్లు నుంచి గత సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో ప్రభుత్వం ఇచ్చిన 10 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను రికవరీ చేసుకునేందుకు ధాన్యం కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. తీరా అక్కడికి వెళితే మిల్లులో ధాన్యం నిల్వలు లేవు. మిల్లులో ఉన్న ధాన్యం చెడిపోతుందని అమ్మివేసినట్లు మిల్లర్ ఒప్పుకున్నాడు. దీంతో క్వింటాల్‌కు రూ. 2,259 లెక్కన 10 మెట్రిక్ టన్నులకు రూ. 2,25,900 చెల్లించాలని లెక్క చెప్పి వెళ్లారు. సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా సాఫీగా సాగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు మిల్లర్లకు దడపుట్టిస్తోంది. గత సంవత్సరం యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయలేమని రాష్ట్రంలోని మిల్లర్లంతా చేతులెత్తేయడంతో ఆగిపోయిన సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా మిల్లుల్లోనే నిల్వ చేసిన ధాన్యం నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం వేలం వేసి, బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలకు ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులను అప్పగించింది. గన్నీ బ్యాగులతో కలిపి క్వింటాలుకు సగటున రూ. 2,007 లెక్కన ధాన్యం కాంట్రాక్టు పొందిన సంస్థలు తమకు కేటాయించిన జిల్లాల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టాయి. తీరా ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని మిల్లులకు వెళితే అక్కడ ధాన్యం కనిపించడం లేదు. దీంతో మిల్లర్ల నుంచి క్వింటాలు ధాన్యానికి బదులుగా రూ. 2,259 లెక్కన డబ్బులు వసూలు చేయాలని కాంట్రాక్టు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించడంతో మిల్లర్లు బెంబే లెత్తుతున్నారు. వేలంలో 6 సంస్థలకు ధాన్యం అప్పగింత 2022–23 సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 20 ఎల్ఎంటీ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ కింద బాయిల్డ్ బియ్యంగా మిల్లింగ్ చేసి అప్పగించారు. మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, మిల్లింగ్ చేయలేదు. దీంతో నిల్వ ఉన్న ధాన్యాన్ని గత ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12 లాట్ల కింద వేలం వేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో కేవలం ఏడు సంస్థలే బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అందులో ఓ సంస్థ తిరస్కరణకు గురికాగా మిగతా ఆరు సంస్థలు ఈ బిడ్లను దక్కించుకున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ భండార్, నాకాఫ్ కూడా ఉన్నాయి. వేలంలో క్వింటాలు ధాన్యానికి సగటున రూ. 2,007 లెక్కన (గన్నీ బ్యాగులతో కలిపి) ప్రభుత్వానికి చెల్లించేలా బిడ్లు ఆమోదం పొందాయి. ఈ బిడ్డింగ్ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో సదరు సంస్థలు ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు.. గత యాసంగి సీజన్లో సీఎంఆర్ చేయ కుండా నిల్వ చేసినట్లు మిల్లర్లు చెప్పినప్పటికీ, ఏ మిల్లర్ దగ్గరా సరిపడా ధాన్యం నిల్వలు లేవు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశం సందర్భంగా మిల్లర్లే ఒప్పుకున్నారు. తడిసి న, నిల్వ ఉంచిన ధాన్యం పాడైపోతుందనే కార ణంగా చాలా వరకు విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మీడియాకు కూడా చెప్పారు. అయి తే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని రికవరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు క్వింటాలుకు బిడ్డింగ్‌లో రూ.1,852 నుంచి 2,260 వరకు ధర పలికింది. సగటున క్వింటాలుకు రూ.1879 కాగా, రూ.125 గన్నీ బ్యాగుల కింద .. మొత్తంగా క్వింటాలుకు రూ. 2,007 చొప్పున లెక్క చూపారు. ఆయా సంస్థలు ఎంతకు ధాన్యం కొనుగోలు టెండర్లు దక్కించుకున్నా య నే విషయాన్ని పక్కనబెట్టి క్వింటాలు ధాన్యం ఇవ్వకపోతే, దాని బదులు రూ. 2,259 చెల్లించాలని అల్టిమేటం ఇస్తున్నట్లు పలువురు మిల్లర్లు తెలిపారు. సన్న ధాన్యం టెండరును క్వింటాలుకు రూ. 2,260కి దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ నిజామాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంది. మిల్లర్లు సన్న ధాన్యం ఇవ్వని పక్షంలో క్వింటాలుకు రూ.2,500కు పైగా వసూలు చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 50 నుంచి 100 మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీకి కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ పొందినట్లు చెపుతున్నారు. -
మరాఠా రిజర్వేషన్ ఉద్యమం.. ప్రభుత్వానికి అల్టిమేటం
ముంబయి: మహారాష్ట్రాలో మరాఠా కోటా ఉద్యమం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రభుత్వానికి మరాఠా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే అల్టిమేటం జారీ చేశారు. రేపు(శనివారం) ఉదయం 11 గంటల వరకు తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని గడువు విధించారు. మరాఠా కోటా అంశంలో ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని జరాంగే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముంబయిలోని ఆజాద్ మైదానంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశం అనంతరం పొరుగున ఉన్న నవీ ముంబైలోని శివాజీ చౌక్‌లో నిరసనకారులను ఉద్దేశించి జరాంగే ప్రసంగించారు. "నేను రేపు మధ్యాహ్నం 12 గంటలకు నా నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ మేము ఆజాద్ మైదాన్‌కు వెళితే.. నేను దానిని వెనక్కి తీసుకోను" అని జరాంగే చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు మంజూరు చేసే వరకు నిరసనకారులు ఆందోళనను మధ్యలోనే ఆపేది లేదని ఆయన పిలుపునిచ్చారు. అయితే.. మరాఠా ఉద్యమకారుల డిమాండ్లను ఆమోదించినట్లు మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ చెప్పారు. ప్రభుత్వ విధానాల ప్రకారం వాటిని అమలు చేస్తామని అన్నారు. ఇదీ చదవండి: బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో నితీష్ మళ్లీ సీఎం? -
Janasena: అల్టిమేటంపై పవన్ రియాక్షన్ ఏంటో?
ఆలు లేదు చూలు లేదు కానీ కొడుకుపేరు మాత్రం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉంది జనసేన తీరు. అసలు జనసేనలో టీడీపీ పొత్తు ఏ స్థాయిలో ఉంటుందో.. ఎన్ని సీట్లు ఇస్తారో.. తమను గౌరవప్రదంగా చూసుకోవాలి అని ఇప్పటికి పవన్ కల్యాణ్ ఎన్నోమార్లు చెప్పినా ఆయన మాటలను టీడీపీ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ వస్తోంది. ఎన్ని సీట్లు ఇస్తే గౌరవం కాపాడినట్లు అన్నదానికి ఒక ప్రామాణికం.. లెక్కా పత్రం లేకపోయినా ఇటు కాపు ఉద్యమనేత చేగొండి హరిరామ జోగయ్య మాత్రం పవన్ కళ్యాణ్ చెవిలో జోరీగ మాదిరి మారి పోరుతూనే ఉన్నారు. మనం ఎక్కడా తగ్గొద్దు .. మన గౌరవం మనం కాపాడుకోవాలి అంటూ నిత్యం పవన్‌ను రెచ్చగొడుతూ కాపుల్లో ఐక్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కోసం మనం ఎందుకు పని చేయాలి అంటూ జోగయ్య బహిరంగ లేఖల్లో పవన్‌ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఒక లెక్క.. నేడు జోగయ్య ఏకంగా యాభై మంది అభ్యర్థులతో ఒక లిస్ట్ కూడా విడుదల చేసేసారు. ఇదిగో ఈ యాభై స్థానాల్లో మన జనసేన అభ్యర్థులు పోటీ చేయాల్సిందే అని అయన అల్టిమేటం ఇచ్చారు. అందులో టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు సొంత నియోజకవర్గం అయిన విజయనగరం కూడా ఉంది. ఆ స్థానాన్ని సైతం జనసేనకు కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేసారు. విజయనగరం సీటును ఘరాన అయ్యలు అనే కాపు నేతకు ఇవ్వాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇంకా తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు టిక్కెట్ ఇవ్వాలని, అక్కడ ఆయనే పోటీ చేయాలనీ ఆ జాబితాలో చేర్చారు. ఇప్పటికే తెనాలిలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అలకబూని ఉన్నారు. తానూ ఐదు సార్లు గెలిచిన తెనాలి సీటును జనసేనకు ఎలా ఇస్తారన్నది ఆలపాటి రాజా ప్రశ్న.. ఇప్పటికే అయన క్యాడర్ తో సమావేశమై రెండ్రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తాను అని హెచ్చరించారు. ఈ సందర్భంగా జోగయ్య తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు కోరుతున్నారు. ఈ జాబితాను టీడీపీ గౌరవించాలని లేదు కానీ జోగయ్య దృష్టిలో నాయకుడిగా గుర్తింపు పొందిన వాళ్లకు టిక్కెట్స్ రాకపోతే ఇప్పుడు వాళ్ళు అలకబూని పార్టీకి దూరం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు జనసేనను దాదాపు ఇరవైసీట్లకు పరిమితం చేసేందుకు టీడీపీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తే తమకు అంత నష్టం అని చంద్రబాబు భవిస్తూ సేనానిని సాధ్యమైనన్ని తక్కువసీట్లకు ఒప్పించాలని చూస్తున్నారు. దీంతోబాటు కూటమి సీఎంగా చంద్రబాబే ఉంటారని మొన్నామధ్యన లోకేష్ చేసిన ప్రకటన సైతం జనసేన గ్రాఫ్ ను పవన్ రాజకీయ పటిమను తగ్గించిందని అంటున్నారు. చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉండేదానికి మేమెందుకు చాకిరీ చేయాలన్నది జనసైనికులు, కాపుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య ఇలా లిస్ట్ విడుదల చేసి కాపు నాయకులను సంఘటితం చేయాలనీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి పవన్ దీనిమీద ఎలా స్పందిస్తారో చూడాలి. ✍️సిమ్మాదిరప్పన్న -
మా వల్ల కాదు బాబూ..
సాక్షి, నంద్యాల : రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోటీకి ముందే టీడీపీ చేతులెత్తేస్తోందా? భూమా అఖిల ప్రియ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అల్టీమేటం జారీ చేశారా? తనకే టికెట్ ఇస్తున్నట్లు మంగళవారం నాటి సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారా? మరోవైపు ఆమె ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయారా? పార్టీ కోసం కనీస ఖర్చులు సైతం పెట్టుకోలేని స్థితికి చేరుకున్నారా? అనుచరులందరూ చేజారి పోతున్నారా? తన విచిత్ర వైఖరితో అందరినీ దూరం చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ స్థానికులు ‘అవును’ అని సమాధానం చెబుతున్నారు. మంగళవారం (నేడు) పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘రా కదలిరా’ సభకు ఏర్పాట్ల విషయంలో ఆ పార్టీ వైఖరి తేటతెల్లమైంది. పార్టీ అధ్యక్షుడు వస్తున్నారంటే టికెట్ ఆశిస్తున్న వారు ఎవరైనా జనసమీకరణపైనే దృష్టి పెడతారు. నియోజకవర్గంలో తన బలం చెక్కుచెదరలేదని ఎలాగైనా సరే నిరూపించుకోవడానికి ఎన్ని పాట్లయినా పడతారు. కానీ ఆళ్లగడ్డలో మాత్రం అందుకు విరుద్ద పరిస్థితి కనిపిస్తోంది. నేటి సభకు జన సమీకరణ, ప్రజలకు భోజనాలు, తరలింపు ఏర్పాట్లు.. ఇలా ఏమీ కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. వాస్తవానికి మంగళవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభను టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందితో సభను నిర్వహించి తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. సభ నిర్వహణకు కనీసం రూ.రెండు కోట్లు ఖర్చవుతుందని, ఆమాత్రం ఖర్చుతో ఏర్పాట్లు చేయాలని పార్టీ అధిష్టానం నుంచి సూచనలు అందినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఈ మాత్రం ఖర్చు పెట్టేందుకు కూడా ఆళ్లగడ్డ టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీనమేషాలు లెక్కిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే తనకే టికెట్ ఇస్తామని సభలో ప్రకటించాలని డిమాండ్ చేసినట్లు తెలియవచ్చింది. అఖిల ఆరి్థక పరిస్థితి, ఇతరత్రా విషయాలన్నీ పూర్తిగా తెలుసుకున్న అధిష్టానం అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని, సభ నిర్వహణ అంతా పార్టీనే చూసుకుంటుందని, ఆ మేరకు జన సమీకరణ ఏర్పాట్లు జిల్లాలోని ఇతర టీడీపీ నేతలకు అప్పగించినట్లు ఆ పారీ్టకి చెందిన ఓ నాయకుడు తెలిపారు. జన సమీకరణ ఎలా? సభకు అయ్యే ఖర్చు పెట్టుకోలేనని తెగేసి చెప్పిన అఖిలప్రియ.. మరో వైపు ఎలాగైనా టికెట్ తనే దక్కించుకోవాలని ప్రయాసపడుతోంది. అయితే ఆమెకు సొంత పార్టీ నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతోంది. మరోవైపు తమ నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలిస్తే ఆ క్రెడిట్ అంతా అఖిలప్రియకు దక్కుతుందని.. ఇలా చేస్తే మనకేంటి లాభమని టీడీపీ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. సభ విజయవంతమైతే తన వల్లే సభ సక్సెస్ అయ్యిందని.. విఫలమైతే ఆ నెపం తమ మీద వేస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన సమీకరణ బాధ్యత మీదే కదా అని జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు నేరుగా అఖిలప్రియను ప్రశి్నంచినట్లు సమాచారం. మరోవైపు ఆళ్లగడ్డ టికెట్ తమకేనంటూ జనసేన నాయకులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, ఆళ్లగడ్డ పట్టణంలోని బీబీఆర్ పాఠశాల సమీపంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న తన స్థలాన్ని పాడు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆళ్లగడ్డ బీజేపీ కన్వినర్ భూమా కిశోర్ రెడ్డి చెబుతున్నారు. మరోవైపు భూమా అఖిలప్రియ భర్త భార్గవరాంతో నియోజకవర్గ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సభ ఖర్చులను పూర్తిగా తమ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సభ నిర్వహణ గురించి పట్టించుకోకుండా.. సభకు ఏవీ సుబ్బారెడ్డి వస్తే బాగోదంటూ భూమా అఖిలప్రియ హెచ్చరించడం కొసమెరుపు. -
18లోగా బకాయిలు చెల్లించకపోతే కరెంట్ కట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన రూ.930 కోట్ల బకాయిలను ఈనెల 18 లోగా చెల్లించని పక్షంలో రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో గడువులోగా బకాయిలు చెల్లించేందుకు తెలంగాణ ట్రాన్స్ కో యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. బకాయిలు చెల్లించడంలో విఫలమైతే ఎన్టీపీసీ నుంచి రాష్ట్రానికి వస్తున్న విద్యుత్ సరఫరా ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి నిలుపుదల కానుంది. ఉత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కి సంబంధించిన బిల్లులను నిర్దేశిత గడువులోగా చెల్లించడంలో విఫలమైతే ఆయా రాష్ట్రాలకు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలని రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం లేట్ పేమెంట్ సర్‌చార్జ్ రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారమే రాష్ట్రానికి విద్యుత్ ఆపేస్తామని ఎన్టీపీసీ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు సకాలంలో బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తున్నాయి. -
రూ. లక్ష పెంచితేనే ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల పనులు!
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ లోపాలతో ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన రెండు పడక గదుల ఇళ్ల విషయంలో కొత్త సమస్య తలెత్తింది. ప్రాజెక్టు యూనిట్ కాస్ట్‌ను భారీగా పెంచాలని కాంట్రాక్టర్లు గృహనిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు. ఒక్కో ఇంటిపై రూ.లక్ష చొప్పున యూనిట్ కాస్ట్‌ను సవరించాలని, లేని పక్షంలో పనులు కొనసాగించలేమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇప్పుడు అధికారులు ఇదే విషయాన్ని కొత్త ప్రభుత్వం ముందు ప్రతిపాదించనున్నారు. అసలే ఖజానాకు తీవ్ర భారంగా మారిన ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టి గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పనులు ప్రారంభించిన ఇళ్లను మాత్రం పూర్తి చేసి, టెండర్లు పిలవాల్సిన వాటిని ప్రారంభించకపోవటమే మంచిదన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పుడు కాంట్రాక్టర్ల కొత్త డిమాండ్‌తో, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయటం కొత్త సవాల్‌గా మారబోతోంది. ఎందుకు పెంచుతున్నారంటే.. ఇల్లు లేని పేదలకు ఏకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందించాలని అప్పట్లో బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కావటంతో ఒక్కో ఇంటికి ప్రాంతాల వారీగా రూ.5.10 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ మొత్తం కూడా సరిపోదని, యూనిట్ కాస్ట్‌ను పెంచాలని పథకాన్ని ప్రారంభించిన కొత్తలోనే కాంట్రాక్టర్లు కోరారు. దీంతో చాలా ప్రాంతాల్లో టెండర్లకు స్పందన కూడా లేకుండా పోయింది. కాంట్రాక్టర్లతో పలువురు మంత్రులు స్వయంగా భేటీ అవుతూ, ఇతర ప్రాజెక్టుల్లో పనులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొనటంతో కొన్ని ప్రాంతాల్లో టెండర్లకు స్పందన వచ్చింది. ఆ క్రమంలో పనులు మొదలైనా, ఆ యూనిట్ కాస్ట్‌తో ప్రాజెక్టులు పూర్తి చేయటం కష్టమంటూ చాలా మంది పనులను నెమ్మదిగా చేస్తూ వచ్చారు. తాజాగా ఇప్పుడు యూనిట్ కాస్ట్‌ను పెంచకుంటే పనులు చేయలేమని, ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని, రూ.లక్ష మేర పెంచాలంటూ ఇటీవల వారు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం రాష్ట్రవ్యాప్తంగా 2.93 లక్షల ఇళ్లను నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, 2.29 లక్షల ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. వీటిల్లో ఇప్పటి వరకు 1.55 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 74 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. వీటిల్లో 45 వేలు తుది దశలో ఉన్నాయి. వీటిని కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో యూనిట్ కాస్ట్ పెంచాల్సిందే. ఈ మేరకు ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం. కాగా, లబ్ధిదారుల జాబితా రూపొందించకుండానే పనులు జరుపుతున్న తీరును తప్పుపడుతూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాసయోజన నిధులు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో నిధుల కోసం తీవ్ర ఇబ్బందులు ఉన్న తరుణంలో, అదనంగా భారం పడటం పథకానికి శరాఘాతంగా మారనుంది. -
మిషన్ 2024.. పట్నాలో నేడే విపక్షాల సమావేశం
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు. ఈ సమావేశం మొట్టమొదటిది కావడంతో అత్యంత సంక్లిష్టమైన ప్రధాని అభ్యర్థి, సీట్ల సర్దుబాటు వంటి అంశాల జోలికి పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి మోదీపై పోరుబాట పట్టే వ్యూహాలు రచించనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారమే పట్నాకి చేరుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలుసుకున్న ఆమె బీజేపీని తాము ఉమ్మడిగా ఒక కుటుంబంలా ఎదుర్కొంటామన్నారు. ఇలా విపక్ష పార్టీలన్నీ ఏకం కావడం శుభారంభమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటమ్ విపక్ష పార్టీల సమావేశానికి ఒక్క రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల్నిపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటంలో తమకు మద్దతుగా నిలవకపోతే విపక్ష పార్టీల సమావేశాన్ని బహిష్కరిస్తామని అల్టిమేటమ్ ఇచ్చింది. -
అఖిలప్రియ పోటీ చేస్తే నేనే బరిలో దిగుతా: ఏవీ సుబ్బారెడ్డి కూతురు
-
అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి అల్టిమేటం
సాక్షి, నంద్యాల: ప్రతీసారి ఉమెన్‌కార్డును చూపిస్తూ సింపథీ కోసం ప్రయత్నిస్తోందంటూ టీడీపీ నేత భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి మండిపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఆమె.. అఖిలప్రియపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా నాన్న అఖిలప్రియను సొంత కూతురిలా పెంచి పెద్ద చేశాడని, అయితే అఖిల ప్రియ మాత్రం చివరకు తన తండ్రిని చంపడానికి కూడా వెనుకాడలేదని జశ్వంతి ఆవేదన వ్యక్తం చేశారు ప్రెస్మీట్లకు పిల్లాడిని తీసుకురాకుండా.. సరిగ్గా అరెస్ట్ సమయంలో సంకలో పిల్లాడిని ఏస్కుని సింపథీ కోసం ప్రయత్నిస్తోందంటూ అఖిలప్రియపై జశ్వంతిరెడ్డి మండిపడ్డారు. అఖిలప్రియ నీచమైన బతుకు బతుకుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఏదైతే చేశావో. తగిన శాస్తి జరుగుతుందని అఖిలప్రియకు శాపనార్థాలు పెట్టారు. అఖిలప్రియకు గనుక టికెట్ ఇస్తే.. తాను, తండ్రి ఏవీ సుబ్బారెడ్డి, ఏవీ వర్గం అంతా ఆమెను ఓడించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పార్టీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు జశ్వంతి. అలాగే పార్టీ గనుక ఆదేశిస్తే.. తాను, తన తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరం పోటీకి దిగుతామని స్పష్టం చేశారామె. పార్టీ సిద్ధాంతాలు ఫాలో అవుతూ.. ఏ ప్రెస్‌మీట్ పెట్టలేదని, కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టత ఇచ్చేందుకే తాను లైవ్ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారామె. -
గహ్లోత్‌కు సచిన్ పైలట్ అల్టిమేటం
జైపూర్: రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దూకుడు పెంచారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అవినీతిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్న తన డిమాండ్‌ను ఈ నెలాఖరులోగా నెరవేర్చకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామంటూ సొంత పార్టీకే చెందిన సీఎం అశోక్ గహ్లోత్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఈ డిమాండ్ సాధనలో భాగంగా ఆయన చేపట్టిన ఐదు రోజుల పాదయాత్ర సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా తన మద్దతు దారులైన 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జైపూర్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్పీఎస్సీ)ని రద్దు చేసి, పునర్వ్యవస్థీకరించాలని, పేపర్ లీక్‌తో పరీక్షలను రద్దు వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలన్న రెండు కొత్త డిమాండ్లను వినిపించారు. నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల సమ్మె
-
Swati Maliwal: ఢిల్లీ పోలీసులకు ఎన్సీడబ్ల్యూ అల్టిమేటం
ఢిల్లీ: దేశ రాజధాని పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ తాజాగా అల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్‌ను వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యల పూర్తి నివేదికను రెండు రోజుల్లోగా తమ ముందు ఉంచాలని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ.. ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. స్వాతి మలివాల్‌తో తప్పతాగిన ఓ వ్యక్తి బుధవారం అర్ధరాత్రి పూట అనుచితంగా ప్రవర్తించాడని, కారుతో పాటు కొద్దిదూరం లాక్కెళ్లాడని మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకుంది జాతీయ మహిళా కమిషన్. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఢిల్లీ కమిషనర్‌కు రేఖా శర్మ లేఖ రాశారు. అంతకు ముందు ఇదే విషయంపై ఆమె ట్వీట్ కూడా చేశారు. కారుతో ఈడ్చుకెళ్లిన తాగుబోతు! ఇదిలా ఉంటే.. ఢిల్లీలో మహిళ భద్రతను పర్యవేక్షించే క్రమంలో ఎయిమ్స్ గేట్ వద్ద అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో తన టీంతో నిఘా పెట్టారు డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్. అయితే తప్పతాగి కారులో వచ్చిన వ్యక్తి ఆమెతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ప్రతిఘటించే సమయంలో ఆమెను కారుతో పాటు లాక్కెళ్లే యత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వాతి మలివాల్.. భగవంతుడి దయతో బయటపడ్డానని, లేకుంటే తాను మరో అంజలి సింగ్‌ను అయ్యేదానిని అంటూ వ్యాఖ్యానించారు కూడా. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి.. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు కారును పోలీసులు సీజ్ చేశారు కూడా. -
‘నాతో గేమ్స్ ఆడొద్దు’..!, ట్విటర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ వార్నింగ్!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌ను కోర్టుకీడ్చేందుకు ఆ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో మస్క్ ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేశారు. సంస్థకు సంబంధించిన రహస్యాల్ని బయట వ్యక్తులు, మీడియా సంస్థలతో షేర్ చేయొద్దని తెలిపారు. సమాచారం అందిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక అల్టిమేటంను అర్ధం చేసుకున్నామని సూచించేలా ఉద్యోగులు సంతకం చేయాలని మస్క్ డిమాండ్ చేశారు టెక్ సంస్థల్లో జరిగే విషయాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ‘ప్లాట్ప్లామర్’ తాజాగా నివేదిక విడుదల చేసింది. పింక్ స్లిప్‌లు అందుకున్న 7500 ట్విటర్ ఉద్యోగుల్లో కొంత మంది మస్క్‌ను కోర్టుకుకీడ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిబంధనలు విరుద్ధంగా తమను సంస్థ నుంచి ఫైర్ చేశారంటూ మాజీ ఉద్యోగులు శాన్ ఫ్రాన్సిస్కో కోర్టును ఆశ్రయించారు. వాళ్లు ఎంతమంది ఉన్నారనేది స్పష్టత లేదు. ఈ తరుణంలో మాజీ ఉద్యోగులకు తీరుతో మస్క్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంస్థ రహస్యాలు, మాజీ ఉద్యోగుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు ఇతర విషయాలు చాలా సీక్రెట్‌గా ఉంచాలంటూ ఉద్యోగులకు ట్విటర్ బాస్ ఆదేశించినట్లు ప్లాట్ఫామర్ తెలిపింది. ట్విటర్లో చేరే సమయంలో ఎన్డీఏ (non-disclosure agreement) అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం ఉద్యోగులు ప్రవర్తించాలి. అలా కాకుండా అగ్రిమెంట్ అతిక్రమిస్తే సంస్థకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు, తన ఆదేశాలను అర్థం చేసుకున్న ఉద్యోగులకు సంబంధిత ప్రతిజ్ఞపై సంతకం చేయాలని ఉద్యోగుల్ని కోరాడని, స్పందించడానికి శనివారం సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారని పేర్కొంది. చదవండి👉 వైరల్: ‘ట్విటర్లో మా ఉద్యోగాలు ఊడాయ్’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు -
ఆయుధాలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ సర్కార్‌కు అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావుపై దాడి ఘటనతో.. అటవీశాఖ సిబ్బంది డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆయుధాలు ఇస్తేనే తాము విధులు నిర్వహిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలో రేపటి నుంచి(గురువారం) నుంచి విధుల బహిష్కరణకు ఫారెస్ట్ సిబ్బంది పిలుపు ఇచ్చారు. పోలీసులకు ఇచ్చినట్లే ప్రభుత్వం తమకూ ఆయుధాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. స్పష్టమైన హామీ ఇస్తేనే విధులకు హాజరు అవుతామని తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు వాళ్లు. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ప్రకటన ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఖమ్మం ఈర్లపుడిలో గుత్తికోయల దాడిలో మరణించిన శ్రీనివాసరావుకు అంత్యక్రియలు ఇవాళ(బుధవారం) ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. ఫారెస్ట్ సిబ్బంది తమ నిరసన తెలియజేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆరు నెలల క్రితమే గోత్తి కోయలు, శ్రీనివాసరావు హత్యకు ప్లాన్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడి అటవీశాఖ సిబ్బంది. తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు ఆయన తమ వద్ద ప్రస్తావించిన అంశాన్ని సైతం వాళ్లు లేవనెత్తారు. ఫారెస్ట్ సిబ్బందిపై దాడుల అంశాన్ని చాలాకాలంగా ప్రభుత్వాల ముందు ఉంచుతున్నామని, ఈ పర్వంలో శ్రీనివాసరావు మృతి ఆఖరిది కావాలంటూ నినాదాలు చేశారు వాళ్లు. ఈ క్రమంలో దాడులను నిరసిస్తూ ఫారెస్టు సిబ్బంది ఆందోళన చేపట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు వాళ్లను అడ్డుకునే యత్నం చేశారు. -
ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్
న్యూఢిల్లీ: హార్డ్‌కోర్ అంటూ ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ జారీ చేసిన అల్టిమేటంపై వందలాదిమంది ఉద్యోగులు అనూహ్యంగా స్పందించారు. ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ హార్డ్‌కోర్‌గా ట్విటర్లో ఉంటారా, ఇంటికి చెక్కేస్తారా అన్న ప్రశ్నకు చాలామంది ఎగ్జిట్ ఆఫ్షన్‌ను ఎంచుకోవడంపై మస్క్ స్పందించారు. చాలా మంది ఉద్యోగులు తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దీంతో కంపెనీ తన కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది. నవంబరు 21 సోమవారం వరకు ట్విటర్ కార్యాలయాలు మూసివేస్తున్నట్టు ట్విటర్ అధికారిక ప్రకటన జారీ చేసింది. అలాగే కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కాన్పిడెన్షియల్ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా గానీ, మీడియా ద్వారాగానీ బహిర్గంతం చేయొద్దని కూడా కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అసలు ట్విటర్లో అసలు ఏం జరుగుతోంది అనే చర్చ తీవ్రమైంది. సామూహిక రాజీనామాల కారణంగా ట్విటర్ ఆఫీసులు మూత పడిన కొన్ని గంటల తరువాత మస్క్ ట్విటర్లో స్పందించారు. బెస్ట్ పీపుల్ ఉంటున్నారు. కాబట్టి తనకేమీ ఆందోళన లేదని మస్క్ ట్వీట్ చేశారు.అంతేకాదు వాడకంలో ట్విటర్ కొత్త గరిష్టాన్ని తాకిందంటూ ట్వీట్ చేయడం గమనార్హం. (ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు: అమెజాన్ కీలక నిర్ణయం) మరోవైపు తాజా పరిమాణాల నేపథ్యంలో ట్విటర్లో RIPTwitter హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. The best people are staying, so I’m not super worried — Elon Musk (@elonmusk) November 18, 2022 ఇవీ చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలక్.. ఇప్పుడేం చేస్తావ్! త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన Goodbye twitter, been a good run. #RIPTwitter pic.twitter.com/fkkUZWz2oQ — Bish 🗽 (@thebishundercov) November 18, 2022 Everyone on Twitter to Elon Musk right now #RIPTwitter #TwitterTakeover pic.twitter.com/m03XswU9QN — Abhishek Rathore ✿ (@AbhishekSachib) November 18, 2022 -
సీట్ల కోసం పొత్తు పెట్టుకోవడం లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు తెలంగాణ జనసమితి అల్టిమేటం ఇచ్చిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశా రు. సీట్ల కోసం తాము పొత్తు పెట్టుకోవడం లేదని వెల్లడించారు. ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు, ఆ కార్యాచరణ అమలు, జనసమితికి గౌరవప్రద స్థానం కోసం మహాకూటమితో చర్చలు జరుగుతున్నాయని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాల కోసమే తమ పోరాటమని, దాని కోసం మేం తొందరపడుతున్నది వాస్తవమేనన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఒక నిర్ణయం వస్తుందని తమకు సమాచా రం ఉందన్నారు. తెలంగాణ ప్రజాప్రయోజనాల దృష్ట్యా మహాకూటమి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలని, అప్పుడే అందరం కలసి ఒక బలమైన ఎజెండా ను ముందుకు తీసుకెళ్లగలమన్నారు. దురదృష్టవశాత్తు చర్చలు ముందుకు సాగట్లేదని, ఇంకా కలిస్తే బాగుంటుంది అనే దశలోనే ఉందని వివరించారు. టీజేఎస్‌కు 3 నుంచి 5 సీట్లు అన్నది ప్రచారం మాత్రమే అని కోదండరాం పేర్కొన్నారు. తన పోటీపై పార్టీయే నిర్ణయిస్తుందన్నారు. బీజేపీతో వెళ్లే ఆలోచన ఇప్పటివరకు లేదని, కూటమిలో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆలోచిస్తామన్నారు. కార్యకర్తలు, ప్రజలు ప్రశ్నిస్తుంటే తామేం సమాధానం చెప్పాలని.. అం దుకే తొందరపడుతున్నామన్నారు. ఏ రోజూ సీట్ల గురించి బహిరంగంగా మాట్లాడలేదన్నారు. ఈ విష యంలో తమకు స్పష్టత ఉందని, ఇన్ని సీట్లు ఇవ్వాలి అని తాము అధికారికంగా చెప్పలేదని తెలిపారు. టీజేఎస్‌లో చేరిన న్యాయవాది ప్రహ్లాద్.. గతంలో కోదండరాంతో విభేదించి జేఏసీ నుంచి బయటకి వెళ్లిన న్యాయవాది ప్రహ్లాద్ గురువారం కోదందరాం సమక్షంలో టీజేఎస్‌లో చేరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇస్తామని ఆశ పెట్టడంతోనే కోదండరాంపై తాను విమర్శలు చేసినట్లు ప్రహ్లాద్ తెలిపారు. -
48 గంటల్లోగా తేల్చండి; కోదండరాం అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పరిరక్షణ వేదిక (మహాకూటమి)లో తమకు కేటాయించే స్థానాలపై 48 గంటల్లోగా స్పష్టతను ఇవ్వాలంటూ తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత ఎం.కోదండరాం అల్టిమేటం జారీ చేశారు. పొత్తుల్లో పార్టీలకు కేటాయించే సీట్లు తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయడంపై కోదండరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీజేఎస్‌తోపాటు టీటీడీపీ, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీలకు సీట్లను కేటాయించకుండా కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారాన్ని ఎలా ప్రారంభిస్తుందని కోదండరాం ప్రశ్నించారు. తమకు కేటాయించే సీట్లపై 48 గంటల్లోగా (గురువారం సాయంత్రం) స్పష్టతను ఇవ్వాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అల్టిమేటం ఇచ్చారు. పొత్తుల్లో భాగంగా టీజేఎస్ 19 సీట్లలో పోటీచేయాలని నిర్ణయించిందని చెప్పారు. తాము కోరుకుంటున్న 19 స్థానాలపై ఎల్లుండిలోగా స్పష్టత ఇవ్వకుంటే 21 మందితో టీజేఎస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తామని కోదండరాం మంగళవారం హెచ్చరించారు. కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ పొత్తుల విషయంలో నాన్చివేత ధోరణిని అవలంభిస్తూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం సాగించడం వల్ల ఇబ్బందులు వస్తాయని కోదండరాం అభిప్రాయపడ్డారు. వెంటనే పొత్తుల అంశాన్ని పూర్తిచేయాలని కోరారు. తాము చెప్పినట్టుగా 48 గంటల్లో 21 మందితో టీజేఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఆ తరువాత మరో 25 మందితో రెండో జాబితాను ప్రకటిస్తామని కోదండరాం స్పష్టం చేశారు. కోదండరాంతో రమణ భేటీ.. కోదండరాంతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మంగళవారం భేటీ అయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలోనే వీరు సమావేశమయ్యారు. పొత్తుల్లో కోరుతున్న స్థానాలు, కాంగ్రెస్ వైఖరి, లాభనష్టాలు, అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై వీరిద్దరూ చర్చించారు. పొత్తుల్లో సీట్ల సంఖ్య, అభ్యర్థులను వీలైనంత త్వరలో పూర్తిచేయడానికి కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. పొత్తుల్లో సీట్లు, అభ్యర్థులను తేల్చకపోతే జరిగే నష్టాన్ని నివారించాలని నిర్ణయించారు. -
కంత్రీ డ్రైవర్లపై ఖాకీలకు మెసేజ్
బనశంకరి: వెకిలిచేష్టలు చేయడం, వేధించడం, ఖరీదైన వస్తువులను లాక్కోవడం, అశ్లీలంగా ఫొటోలు తీయడం, దారి మళ్లించి భయభ్రాంతులకు గురిచేయడం.. ఇలా యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణించే మహిళలపై కొందరు ఘరానా డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఆపదలో చిక్కుకుంటే వారు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అత్యవసర మెసేజ్ అందించే వ్యవస్థను ఓలా యాప్‌లో అమర్చాలని ఆ సంస్థకు నగర పోలీస్ శాఖ ఆదేశించింది. ఇందుకు ఓలా కంపెనీ సమ్మతించింది. ఇటీవల ఒక మహిళను ఓలా క్యాబ్ డ్రైవర్ బెదిరించి అర్ధనగ్నంగా ఫొటోలు తీసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇక నేరుగా పోలీసులకు సందేశం ఓలా యాప్ క్యాబ్ ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడితే వారి బంధువులకు సమాచారం అందించడానికి అత్యవసర సంఖ్యకు గతంలోనే అవకాశం కల్పించింది. ఇందులో తమకు ముఖ్యమైన ఐదుగురి నంబర్లను నమోదు చేసుకోవచ్చు. అత్యవసర వేళల్లో వారికి సందేశం పంపడానికి వీలవుతుంది. కానీ దీని బదులుగా యాప్ ద్వారా మొదట పోలీసులకే సమాచారం అందించే వ్యవస్థను కల్పించాలని ఆదేశించారు. ఓలా కంపెనీ తమ క్యాబ్‌లు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయో తరచూ పరిశీలిస్తుండాలి. సంచరించే మార్గం మళ్లించడం, అర్ధంతరంగా ట్రిప్ ముగించడం తదితరాల్లో ఏమైందో విచారించాలి. దీంతోపాటు మీపై నిఘా పెట్టి ఉంచామని డ్రైవర్లకు స్పష్టం చేయాలని అదనపు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్‌సింగ్ తెలిపారు. బెంగళూరు పోలీస్‌శాఖ ఇప్పటికే సురక్ష యాప్ విడుదల చేసింది. అత్యవసర సమయాల్లో ఎస్వోఎస్ను నొక్కితే పోలీస్‌కంట్రోల్ రూమ్‌కు సందేశం వెళ్తుంది. అక్కడ నుంచి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందుతుంది. ఇదే తరహాలో ఓలా యాప్‌లో వ్యవస్థ ఉండాలని ఓలా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సలహా ఇచ్చామని సింగ్ తెలిపారు. ఈ భద్రతా చర్యలను నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేయాలని, తమకు నివేదిక అందజేయాలని ఆదేశించామన్నారు. -
మిలటరీ సాయం నిలిపేస్తున్నాం
వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఉగ్రవాదానికి వంతపాడుతున్న పాకిస్తాన్‌కు అమెరికా మరోమారు హెచ్చరికలు జారీచేసింది. పాక్‌కు ఏటా భారీగా ఇస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.66 వేల కోట్లు) భద్రతా సాయంలో కోతతోపాటుగా మిలటరీ సామగ్రి సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో సహా పలు ఉగ్రవాద సంస్థలను అడ్డుకోవటంలో, పాక్‌లో వారి స్థావరాలను నిర్వీర్యం చేయటంలో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు్ల ప్రకటించింది. అమెరికా కోరుకుంటున్నట్లు ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటే సాయం మళ్లీ మొదలవుతుందని సూచించింది. అయితే.. అమెరికా, అంతర్జాతీయ సమాజం కోరుకున్నట్లే వ్యవహరిస్తున్నామని పాక్ పేర్కొంది. భద్రత సాయం నిలుపుదలపై అమెరికా ప్రభుత్వాధికారులతో మాట్లాడుతున్నామని వెల్లడించింది. అలా చేస్తే మళ్లీ సాయం: అమెరికా ‘మేం పాకిస్తాన్‌కు జాతీయ భద్రత సాయాన్ని నిలిపివేస్తున్నాం. పాక్ ప్రభుత్వం అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోనంతకాలం ఇది కొనసాగుతుంది. ఈ ఉగ్రవాద సంస్థలు అమెరికన్లను లక్ష్యంగా చేసుకోవటంతోపాటు దక్షిణాసియా ప్రాంతంలో అశాంతి చెలరేగేందుకు కారణమవుతున్నారు. అందుకే వీరిని నిర్వీర్యం చేయటంలో విఫలమవుతున్న పాక్‌కు మేం భద్రతాపరమైన సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీతర్ నార్ట్ పేర్కొన్నారు. ఈ నిధుల నిలుపుదలలో .. 2016 సంవత్సరానికి విదేశీ మిలటరీ నిధి రూపంలో ఇవ్వాలనుకున్న 225 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,425 కోట్లు), 2017 సంవత్సరానికి సంకీర్ణ మద్దతు నిధి రూపంలో ఇవ్వాలనుకున్న 900 మిలియన్ డాలర్ల (రూ.5.7వేల కోట్లు) సాయం ఉన్నాయి. అమెరికా నిర్ణయాన్ని గౌరవించనంతకాలం పాకిస్తాన్‌కు మిలటరీ పరికరాలను, సంబంధింత నిధులనూ నిలిపేస్తున్నట్లు ఆమె తెలిపారు. ‘ట్రంప్ కొంతకాలంగా దీనిపై స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. టిల్లర్సన్, మాటిస్‌లు పాక్ ప్రభుత్వాన్ని కలిసి మరీ తమ ఆందోళన తెలియజేశారు. ఇది శాశ్వతంగా సాయాన్ని నిలిపేయటం కాదు. మేం చెప్పినట్లు చేస్తే (ఉగ్రవాదంపై చర్యలు) నిలిపేసిన సాయం మళ్లీ వారికే అందుతుంది’ అని నార్ట్ స్పష్టం చేశారు. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను విడుదల చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికీ.. తాజాగా సాయం నిలిపివేతకు ఎటువంటి సంబంధం లేదని కూడా నార్ట్ ప్రకటించారు. మేం చేయాల్సింది చేస్తున్నాం: పాక్ ‘అస్పష్ట లక్ష్యాలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోలేము’ అని అమెరికా తీరుపై పాకిస్తాన్ అసంతృప్తిని తెలియజేసింది. తాజా నిర్ణయాల నేపథ్యంలో భద్రతాపరమైన సాయంపై అమెరికా అధికారులతో మాట్లాడుతున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ సమాజం, అమెరికా భద్రత ప్రయోజనాలకు అనుగుణంగానే పాకిస్తాన్ వ్యవహరిస్తోందని.. ఉగ్రవాదంపై పోరును కొనసాగిస్తోందని ప్రకటించింది. ‘అల్‌కాయిదా సహా ఇతర ఉగ్రవాద గ్రూపులను నిర్వీర్యం చేయటంలో అమెరికాకు సాయం చేశాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవటంలో, అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య రాజకీయ పరిస్థితులు నెలకొనేలా చొరవతీసుకున్నాం’ అని పాక్ పేర్కొంది. అమెరికా 15 ఏళ్లుగా పాకిస్తాన్‌కు ఏటా భారీ స్థాయిలో భద్రతా సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. -
సమస్యలు పరిష్కరించకుంటే రేషన్ బంద్
♦ ప్రభుత్వానికి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అల్టిమేటం సాక్షి, హైదరాబాద్: నామమాత్రపు కమీషన్లతో అనేక సమస్యలతో రేషన్ షాపులు నడుపుతున్నామని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. తొమ్మిది రకాల సరుకుల విక్రయం నుంచి రెండు సరుకులకే కుదించడంతో ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని సంఘం తెలిపింది. ప్రభుత్వం ముందుంచిన తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఆగస్టు నుంచి రేషన్ షాపులను మూసివేస్తామని అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి తమ నిర్ణయాన్ని తెలిపామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించా లని, లేదంటే కనీసం రూ.30 వేల గౌరవ వేతనం చెల్లించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డీలర్లను బ్యాంకింగ్ కార్పొరేట్ ఏజెంట్లుగా గుర్తించాలని, డీలర్లకు ప్రభుత్వ హెల్త్ కార్డులు ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. మొత్తంగా 18 డిమాండ్లతో మంత్రి ఈటలకు ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. -
రాజకీయాలా.. వ్యాపారాలా?
ఏది కావాలో తేల్చుకోవాలని పార్టీలోని పైరవీకారులకు సీఎం అల్టిమేటం ► తరచూ ‘పనుల’ కోసం వస్తున్న నేతలకు మందలింపు ► కొందరు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకూ ససేమిరా సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో కొందరు నేతలు పదేపదే సాగిస్తున్న పైరవీలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు! రాజకీ యాలు కావాలో లేక వ్యాపారాలు కావాలో తేల్చుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు! ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో, ఆ తర్వాత కూడా కొద్దిరోజులపాటు నేతల పైరవీల విషయంలో పచ్చజెండా ఊపిన సీఎం కేసీఆర్...రానురానూ వారి వ్యవహా రం శ్రుతి మించడంతో సీరియస్‌గానే స్పందించారని తెలిసింది. ఇటీవల తన వద్దకు పనుల కోసం వచ్చిన కొందరు నాయకులకు సీఎం ఝలక్ ఇచ్చారని సమాచారం. మూడేళ్లుగా కొందరు పైరవీల్లోనే... తమ ప్రభుత్వంలో రాజకీయ అవినీతిని రూపుమాపామని సీఎం కేసీఆర్ గత మూడే ళ్లుగా వివిధ సందర్భాల్లో ప్రకటించినప్పటికీ ప్రభుత్వంలో కొందరు నిత్యం పైరవీల్లో మునిగి ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొందరు నాయకులు తమ వ్యాపారాల కోసం, తమ వర్గం వారి కోసం నిత్యం ఏదో ఒక పనిని సీఎం దగ్గరకు తీసుకువెళుతున్నారని ప్రచా రం జరుగుతోంది. వివిధ శాఖల్లో మంత్రుల స్థాయిలో కుదరని ‘పనుల’ను సదరు నేతలు సందర్భం చిక్కినప్పుడల్లా సీఎం వద్దకు సిఫారసులు తీసుకుపోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయని చెబు తున్నారు. ఓ ఎంపీ, మరో ఎమ్మెల్సీకి ఝలక్... పార్టీ ఎంపీ ఒకరు సీఎంను కలిసే ప్రతి సందర్భంలోనూ బదిలీల ఫైళ్లు పట్టుకు వెళ్లేవారని, మొదట్లో సదరు ఎంపీ పనుల విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం... ఆ తర్వాత అనుమానం వచ్చి సదరు బదిలీల సిఫారసులను పరిశీలిం చారని తెలిసింది. ఆ ఎంపీ బదిలీల సిఫా రసులన్నీ ఒకే కులానికి చెంది ఉండడాన్ని గమనించి ఆ తర్వాత నుంచి ఆ ఎంపీని పక్కనపెట్టారని చెబుతున్నారు. అలాగే గత మూడేళ్లుగా విద్యా రంగ పైరవీలు సాగి స్తున్న ఓ ఎమ్మెల్సీ ఇటీవల మరోసారి అదే పనిపై సీఎం వద్దకు వెళ్లారని, ఈ సమయంలోనే ‘నీకు రాజకీయాలు కావాలా లేక విద్యా వ్యాపారం కావాలా?’ తేల్చు కోవాలని ముఖ్యమంత్రి తీవ్రంగానే చెప్పారని వినికిడి. పైరవీ నేతలకు నో అపాయింట్మెంట్... కొందరు ఎమ్మెల్యేలు సైతం పైరవీ లు చేస్తుండగా సదరు ఎమ్మెల్యేలకు సీఎం కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. మొదట్లో నిత్యం సీఎం అధికారిక నివాసంలో తచ్చాడిన ఓ ఎమ్మెల్యేను కూడా పూర్తిగా పక్కన పెట్టారు. చివరకు తన అపాయింట్మెంట్ లేకుండా ప్రగతి భవన్‌కు ఎవరూ రావొ ద్దని, నేతలంతా ఉండాల్సింది నియోజక వర్గాల్లో తప్ప తన చుట్టూ కాదని సీఎం చెప్పారని సమాచారం. దీంతో పైరవీల ఫైళ్లతో తిరిగే నేతలకు చెక్ పెట్టినట్టయ్యిం దనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బిల్లులు కట్టకుంటే కరెంట్ కట్
ట్రాన్స్‌కోకు ఎన్టీపీసీ వెల్లూరు ప్లాంట్ అల్టిమేటం ► రూ.134 కోట్ల బకాయిలపై డిస్కంలకు నోటీసులు ► ఈ నెల 26లోగా చెల్లించాలని డిమాండ్ ► 109 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు చెల్లించనిపక్షంలో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తమిళనాడులోని ఎన్టీపీసీ వెల్లూరు ప్లాంట్ యాజమాన్యం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)కు అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీకి ఎన్టీపీసీ వెల్లూరు యాజమాన్యం తాజాగా లేఖ రాసింది. గతేడాది నవంబర్ నుంచి పేరుకుపోయిన రూ. 134.15 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలను ఈ నెల 26లోగా చెల్లించనిపక్షంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లోని విద్యుత్ సరఫరా నియంత్రణ నిబంధనలను ప్రయోగిస్తామని ఈ లేఖలో స్పష్టం చేసింది. నిబంధనల మేరకు తెలంగాణ ట్రాన్స్‌కోకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతోపాటు విద్యుత్‌ను ఇతర కొనుగోలుదారులకు మళ్లిస్తామని తేల్చి చెప్పింది.1,500 మెగావాట్ల వెల్లూరు ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఒప్పందం మేరకు రాష్ట్రానికి 109 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరుగుతోంది. బిల్లుల బకాయిలు చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు సైతం ఎన్టీపీసీ వెల్లూరు నోటిసులు జారీ చేసింది. డిస్కంలపై తీవ్ర ఒత్తిడి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన రూ. వేల కోట్ల బిల్లుల చెల్లింపుల విషయంలో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేస్తున్న జా ప్యంపై విద్యుదుత్పత్తి కంపెనీలు ప్రతి నెలా గగ్గోలు పెడుతున్నాయి. తెలంగాణ, ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)లకు రాష్ట్ర డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.5 వేల కోట్లకుపైనే ఉన్నాయి. అదే విధంగా కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాలు (సీజీఎస్), ఇతర ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు కలిపి మొత్తం మరో రూ.వెయ్యి కోట్ల బిల్లుల బకా యిలు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ చార్జీల వసూళ్లతో వచ్చే ఆదాయంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే విద్యుత్ సబ్సిడీ నిధులతో విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల బకాయిలు చెల్లిస్తున్నా ప్రతి నెలా రూ. 6 వేల కోట్ల బకాయిలు అలానే మిగిలిపోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి వరకు మొండి బకాయిలు రూ. 9 వేల కోట్లకు పేరుకుపోవడంతో డిస్కంలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 వేల కోట్లను పెట్టుబడి మూలధనంగా డిస్కంలకు మంజూ రు చేయడంతో బకాయిలు రూ. 6 వేల కోట్లకు తగ్గాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగింపు కోసం ప్రతి నెలా డిస్కంలకు చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీ నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం తరచూ జాప్యం చేస్తుండటంతో తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల యాజమాన్యాలపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. కాగా, రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలతోపాటు పలు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలు గతంలోనూ అల్టిమేటాలు జారీ చేశాయని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి.