ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే! | contracting company ultimatum to millers: telangana | Sakshi
Sakshi News home page

ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే!

Published Sun, Mar 24 2024 4:38 AM | Last Updated on Sun, Mar 24 2024 4:56 PM

contracting company ultimatum to millers: telangana - Sakshi

మిల్లర్లకు కాంట్రాక్టు సంస్థల అల్టిమేటం

క్వింటాల్‌కు రూ.2,259 లెక్కన ఇవ్వాలని స్పష్టీకరణ 

మిల్లర్ల నుంచి ధాన్యం వసూలుకు కాంట్రాక్టు సంస్థల వ్యూహం

నిరుటి యాసంగి సీజన్‌లోని 35 ఎల్‌ఎంటీ ధాన్యం వేలం వేసిన సర్కార్‌

బిడ్డింగ్‌లో ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులు దక్కించుకున్న ఆరు సంస్థలు 

అయితే ఇప్పటికే ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు

దీంతో డబ్బులు అడుగుతున్న కాంట్రాక్టు సంస్థలు 

ఆందోళనలో మిల్లర్లు

ఇటీవల కరీంనగర్‌ జిల్లాలోని ఓ మిల్లు నుంచి గత సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్‌లో ప్రభుత్వం ఇచ్చిన 10 మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలను రికవరీ చేసుకునేందుకు ధాన్యం కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. తీరా అక్కడికి వెళితే మిల్లులో ధాన్యం నిల్వలు లేవు. మిల్లులో ఉన్న ధాన్యం చెడిపోతుందని అమ్మివేసినట్లు మిల్లర్‌ ఒప్పుకున్నాడు. దీంతో క్వింటాల్‌కు రూ. 2,259 లెక్కన 10 మెట్రిక్‌ టన్నులకు రూ. 2,25,900 చెల్లించాలని లెక్క చెప్పి వెళ్లారు. 

సాక్షి, హైదరాబాద్‌: కొన్నేళ్లుగా సాఫీగా సాగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్‌ ప్రక్రియ ఇప్పుడు మిల్లర్లకు దడపుట్టిస్తోంది. గత సంవత్సరం యాసంగి సీజన్‌లో వచ్చిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేయలేమని రాష్ట్రంలోని మిల్లర్లంతా చేతులెత్తేయడంతో ఆగిపోయిన సీఎంఆర్‌ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. కస్టమ్‌ మిల్లింగ్‌ చేయకుండా మిల్లుల్లోనే నిల్వ చేసిన ధాన్యం నుంచి 35 లక్షల మెట్రిక్‌ టన్నులను ప్రభుత్వం వేలం వేసి, బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలకు ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులను అప్పగించింది. గన్నీ బ్యాగులతో కలిపి క్వింటాలుకు సగటున రూ. 2,007 లెక్కన ధాన్యం కాంట్రాక్టు పొందిన సంస్థలు తమకు కేటాయించిన జిల్లాల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టాయి.

తీరా ప్రభుత్వం నుంచి రిలీజింగ్‌ ఆర్డర్‌ తీసుకొని మిల్లులకు వెళితే అక్కడ ధాన్యం కనిపించడం లేదు. దీంతో మిల్లర్ల నుంచి క్వింటాలు ధాన్యానికి బదులుగా రూ. 2,259 లెక్కన డబ్బులు వసూలు చేయాలని కాంట్రాక్టు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించడంతో మిల్లర్లు బెంబే లెత్తుతున్నారు. 

వేలంలో 6 సంస్థలకు ధాన్యం అప్పగింత
2022–23 సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 20 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్‌ కింద బాయిల్డ్‌ బియ్యంగా మిల్లింగ్‌ చేసి అప్పగించారు. మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముడి బియ్యం (రా రైస్‌)గా సీఎంఆర్‌ అప్పగించాల్సి ఉండగా, మిల్లింగ్‌ చేయలేదు. దీంతో నిల్వ ఉన్న ధాన్యాన్ని గత ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 12 లాట్‌ల కింద వేలం వేశారు.

రూ. 300 కోట్ల టర్నోవర్‌ కలిగిన సంస్థలకే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో కేవలం ఏడు సంస్థలే బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అందులో ఓ సంస్థ తిరస్కరణకు గురికాగా మిగతా ఆరు సంస్థలు ఈ బిడ్లను దక్కించుకున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ భండార్, నాకాఫ్‌ కూడా ఉన్నాయి. వేలంలో క్వింటాలు ధాన్యానికి సగటున రూ. 2,007 లెక్కన (గన్నీ బ్యాగులతో కలిపి) ప్రభుత్వానికి చెల్లించేలా బిడ్లు ఆమోదం పొందాయి. ఈ బిడ్డింగ్‌ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో సదరు సంస్థలు ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించాయి.

ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు..
గత యాసంగి సీజన్‌లో సీఎంఆర్‌ చేయ కుండా నిల్వ చేసినట్లు మిల్లర్లు చెప్పినప్పటికీ, ఏ మిల్లర్‌ దగ్గరా సరిపడా ధాన్యం నిల్వలు లేవు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశం సందర్భంగా మిల్లర్లే ఒప్పుకున్నారు. తడిసి న, నిల్వ ఉంచిన ధాన్యం పాడైపోతుందనే కార ణంగా చాలా వరకు విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మీడియాకు కూడా చెప్పారు. అయి తే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని రికవరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు క్వింటాలుకు బిడ్డింగ్‌లో రూ.1,852 నుంచి 2,260 వరకు ధర పలికింది.

సగటున క్వింటాలుకు రూ.1879 కాగా, రూ.125 గన్నీ బ్యాగుల కింద .. మొత్తంగా క్వింటాలుకు రూ. 2,007 చొప్పున లెక్క చూపారు. ఆయా సంస్థలు ఎంతకు ధాన్యం కొనుగోలు టెండర్లు దక్కించుకున్నా య నే విషయాన్ని పక్కనబెట్టి క్వింటాలు ధాన్యం ఇవ్వకపోతే, దాని బదులు రూ. 2,259 చెల్లించాలని అల్టిమేటం ఇస్తున్నట్లు పలువురు మిల్లర్లు తెలిపారు.

సన్న ధాన్యం టెండరును క్వింటాలుకు రూ. 2,260కి దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ నిజామాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంది. మిల్లర్లు సన్న ధాన్యం ఇవ్వని పక్షంలో క్వింటాలుకు రూ.2,500కు పైగా వసూలు చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 50 నుంచి 100 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రికవరీకి కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి రిలీజింగ్‌ ఆర్డర్‌ పొందినట్లు చెపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement