Grain storage
-
ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే!
ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ మిల్లు నుంచి గత సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో ప్రభుత్వం ఇచ్చిన 10 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను రికవరీ చేసుకునేందుకు ధాన్యం కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. తీరా అక్కడికి వెళితే మిల్లులో ధాన్యం నిల్వలు లేవు. మిల్లులో ఉన్న ధాన్యం చెడిపోతుందని అమ్మివేసినట్లు మిల్లర్ ఒప్పుకున్నాడు. దీంతో క్వింటాల్‌కు రూ. 2,259 లెక్కన 10 మెట్రిక్ టన్నులకు రూ. 2,25,900 చెల్లించాలని లెక్క చెప్పి వెళ్లారు. సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా సాఫీగా సాగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు మిల్లర్లకు దడపుట్టిస్తోంది. గత సంవత్సరం యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయలేమని రాష్ట్రంలోని మిల్లర్లంతా చేతులెత్తేయడంతో ఆగిపోయిన సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా మిల్లుల్లోనే నిల్వ చేసిన ధాన్యం నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం వేలం వేసి, బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలకు ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులను అప్పగించింది. గన్నీ బ్యాగులతో కలిపి క్వింటాలుకు సగటున రూ. 2,007 లెక్కన ధాన్యం కాంట్రాక్టు పొందిన సంస్థలు తమకు కేటాయించిన జిల్లాల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టాయి. తీరా ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని మిల్లులకు వెళితే అక్కడ ధాన్యం కనిపించడం లేదు. దీంతో మిల్లర్ల నుంచి క్వింటాలు ధాన్యానికి బదులుగా రూ. 2,259 లెక్కన డబ్బులు వసూలు చేయాలని కాంట్రాక్టు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించడంతో మిల్లర్లు బెంబే లెత్తుతున్నారు. వేలంలో 6 సంస్థలకు ధాన్యం అప్పగింత 2022–23 సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 20 ఎల్ఎంటీ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ కింద బాయిల్డ్ బియ్యంగా మిల్లింగ్ చేసి అప్పగించారు. మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, మిల్లింగ్ చేయలేదు. దీంతో నిల్వ ఉన్న ధాన్యాన్ని గత ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12 లాట్ల కింద వేలం వేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో కేవలం ఏడు సంస్థలే బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అందులో ఓ సంస్థ తిరస్కరణకు గురికాగా మిగతా ఆరు సంస్థలు ఈ బిడ్లను దక్కించుకున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ భండార్, నాకాఫ్ కూడా ఉన్నాయి. వేలంలో క్వింటాలు ధాన్యానికి సగటున రూ. 2,007 లెక్కన (గన్నీ బ్యాగులతో కలిపి) ప్రభుత్వానికి చెల్లించేలా బిడ్లు ఆమోదం పొందాయి. ఈ బిడ్డింగ్ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో సదరు సంస్థలు ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు.. గత యాసంగి సీజన్లో సీఎంఆర్ చేయ కుండా నిల్వ చేసినట్లు మిల్లర్లు చెప్పినప్పటికీ, ఏ మిల్లర్ దగ్గరా సరిపడా ధాన్యం నిల్వలు లేవు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశం సందర్భంగా మిల్లర్లే ఒప్పుకున్నారు. తడిసి న, నిల్వ ఉంచిన ధాన్యం పాడైపోతుందనే కార ణంగా చాలా వరకు విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మీడియాకు కూడా చెప్పారు. అయి తే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని రికవరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు క్వింటాలుకు బిడ్డింగ్‌లో రూ.1,852 నుంచి 2,260 వరకు ధర పలికింది. సగటున క్వింటాలుకు రూ.1879 కాగా, రూ.125 గన్నీ బ్యాగుల కింద .. మొత్తంగా క్వింటాలుకు రూ. 2,007 చొప్పున లెక్క చూపారు. ఆయా సంస్థలు ఎంతకు ధాన్యం కొనుగోలు టెండర్లు దక్కించుకున్నా య నే విషయాన్ని పక్కనబెట్టి క్వింటాలు ధాన్యం ఇవ్వకపోతే, దాని బదులు రూ. 2,259 చెల్లించాలని అల్టిమేటం ఇస్తున్నట్లు పలువురు మిల్లర్లు తెలిపారు. సన్న ధాన్యం టెండరును క్వింటాలుకు రూ. 2,260కి దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ నిజామాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంది. మిల్లర్లు సన్న ధాన్యం ఇవ్వని పక్షంలో క్వింటాలుకు రూ.2,500కు పైగా వసూలు చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 50 నుంచి 100 మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీకి కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ పొందినట్లు చెపుతున్నారు. -
ధాన్యం నిల్వ చేయండిలా..
మందమర్రి రూరల్ : ఖరీఫ్ ముగిసింది. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తుంది. ఇంటికొచ్చిన ధాన్యాన్ని ఎలా భద్ర పర్చుకోవాలో తెలియక రైతులు తికమక పడుతుంటారు. ధాన్యాన్ని పండించడం ఒకత్తై దానిని నిల్వ చేయడం మరో ఎత్తు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పండించిన పంటలో 10 శాతం నష్టపోయే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ అధికారి సుజాత అంటున్నారు. ధాన్యాన్ని నిల్వ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ధ్యానం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి అవసరాలు, విత్తనాలు, కూలీలు ఇలా సుమారు రెండేళ్ల వరకైనా ధాన్యాన్ని నిల్వ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో నాణ్యత తగ్గుతుంది. ధాన్యం రంగు, రుచిలో తేడా వస్తుంది. ముఖ్యంగా వరి కోత సమయంలో గింజలో 20 శాతం తేమ ఉంటుంది. గింజలు ఆరిన మూడు నాలుగు రోజుల తర్వాత 3 నుంచి 6 శాతం తేమ తగ్గవచ్చు. ధాన్యంలో 14 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే బూజు పట్టే అవకాశం ఉంది. నిల్వ చేసే పద్ధతి సరిగా లేనప్పుడు కూడా ధాన్యానికి కీటకాలు ఆశించి నష్ట పరుస్తాయి. ఎలుకలు తినడమే కాకుండావాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు 3 రకాల కీటకాలు నష్టం కలిగిస్తాయి. అవేంటంటే.. వడ్ల చిలుక ధాన్యానికి వడ్ల చిలుక ఆశిస్తే చెడు వాసన వస్తుంది. తల్లి కీటకం వడ్ల గింజలపై గుంపుగా లేదా విడిగా గుడ్లు పెడుతుంది. గుడ్డు పగిలి లార్వా (గొంగళి పురుగు) గింజలోపలికి తొలచుకొనిపోయి బియ్యపు గింజను తింటుంది. అనంతరం ప్యూపా దశ చేరకముందే పైపొట్టులో చిన్న రంధ్రం చేస్తుంది. ప్రౌఢ దశకు చేరిన తర్వాత ఆ రంధ్రం ద్వారా వడ్ల చిలుక బయటకు వస్తుంది. ఇది వ డ్ల మూటల మీద, గిడ్డంగి గోడల మీద కనిపిస్తుంది. ముక్క పురుగు ముక్క పురుగు పంట కోయడానికి ముందే నష్టం కల్గించడం ప్రారంభిస్తుంది. బియ్యంలో తెల్లని పరుగులుగా కనిపించేవి లార్వా దశలో ఉన్న ఈ కీటకాలే. తల్లి కీటకం వడ్ల గింజకు చిన్న రంధ్రం చేసి లోపల గుడ్ల పెట్టి తన నోటి నుంచి వెలుబడే కొవ్వు పదార్థంతో రంధ్రాన్ని మూసి వేస్తుంది. లార్వా, ప్రౌఢ దశలోని ముక్క పురుగు గింజలోపల బియ్యం తింటూ నష్టం కలిగిస్తుంది. ప్రౌఢ దశలోని కీటకం 3 మి.మీ పొడువు ఉంటుంది. ఇది ఎగరదు. నుసి పురుగు దీనిని పుచ్చపురుగు లేదా పెంకు పరుగు అంటారు. ఇది గొట్టపు ఆకారంలో చాలా చిన్నగా 3 మి.మీ. పొడవుంటుంది. ఫౌడ కీటకం గింజలకు నష్టం కలిగిస్తుంది. ఇది ప్రారంభ దశలో చెత్తను, తర్వాత గింజపై పొరను ఆతర్వాత లోపలి బియ్యపు గింజను తింటు తీవ్ర నష్టం కలిగిస్తుంది. లార్వా దశలో గింజ ముక్కలను తింటుంది. తక్కువ ధాన్యం నిల్వ ఉంచే పద్ధతులు తక్కువ ధాన్యాన్ని నిల్వ ఉంచాల్సి వస్తే అంటే ఒక్క సంవత్సరం 50 బస్తాలు నిల్వ ఉంచినప్పుడు వెదురు గాదెలు, సిమెంట్ గాదెలు, లోహపు గాదెలు పుసా బిన్స్‌ల ద్వారా నిల్వ ఉంచుకోవచ్చు. వెదురు గాదెలు ఈ గాదెలు వెదురుతో రెండు పొరల గోడలతో అల్లుతారు. రెండు గోడల మధ్యలో పాలిథిన్ కవర్ పెడతారు. దీనివల్ల తేమ, వర్షపు నీరులోనికి పోకుండా ఉంటుంది. బయట పేడతో అలుకుతారు. ఇది ఖర్చుతక్కువ. కానీ లోపాలు ఉంటాయి. లోహపు గాదెలు ఇనుము లేదా అల్యూమినియంతో 18 నుంచి 20 గెజ్ రేకుతో తయారు చేస్తారు. రెండు క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంచాలంటే దీని తయారీకి సుమారుగా రూ.7000 వరకు ఖర్చవుతుంది. రూ.40 వేలతో తయారు చేయిస్తే 10 క్వింటాళ్ల ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ ఉంచుకోవచ్చు. ఈ గాదెల్లోకి నీరు, తేమ, ఎలుకలు, కీటకాలు చేరవు. వర్షపు నీరుకు తడవకుండా నెలమీద కొంత ఎత్తు దిమ్మ కట్టించి దానిపై ఉంచాలి. అంతే కాకుండా ఇటుకలతో కట్టిన నిర్మాణంలో కూడా 500 కిలోల నుంచి 4000ల కిలోల ధాన్యాన్ని దాచి ఉంచవచ్చు. గాదెల్లో నిల్వ చేసిన ధాన్యం కీటకాలు ఆశించకుండా రెండు శాతం వేపగింజల పొడి లేదా పనుపు కొమ్మల పొడి కలపడం మంచిది. 100 కిలోల ధాన్యానికి రెండు కిలొల చొప్పున వేపగింజలు పొడి లేదా పనుపు కొమ్ముల పొడి కలిపి నిల్వ చేస్తే 8 నెలల వరకు కీటకాలు ఆశించవు. కీటకాల నివారణకు ఇథైల్‌డైబ్రోమైడ్ అనే రసాయనం కూడా దొరుకుతుంది. ఇది చిన్న గొట్టంలో ప్యాక్ చేసి అమ్ముతారు. వాయువుకూడా బయటకుపోని కట్టుదిట్టమైన గాదెలలో దీనిని వాడవచ్చు. ఎక్కువ ధాన్యం నిల్వ చేసే పద్ధతులు అమ్మాలనుకునే ధాన్యాన్ని రైతులు ఎక్కువ ధర వచ్చే వరకు నిల్వ ఉంచుతారు. పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వ ఉంచాల్సి వస్తే గోదాములు లేదా గిడ్డంగులను సిమెంట్ కాంక్రీటుతో నిర్మిస్తే పూర్తి రక్షణ ఉంటుంది. పాత ఇంటిలో అయితే కీటకాలు, తే మ, వర్షపు నీరులోనికి ప్రవేశించకుండా గోడలు, నెల పైకప్పులలో పగుళ్లు , రంధ్రాలు లేకుండా సిమెంట్‌తో పూడ్చి వేయాలి. ఎలుక కన్నాలను గాజు ముక్కలు, సిమెంటు కాంక్రీట్‌తో మూసివేయాలి, పక్షలు రాకుండా కిటికీలు, ఇనుప జాలీలు బిగించి దుమ్ముధూళీ లేకుండా శుభ్రం చేయాలి. ధాన్యం నిల్వకు కొత్త గోనే సంచులు ఉపయోగించాలి. ధాన్యం నింపే ముందు గోనె సంచుల మీద లోపల మలథాయన్ లేదా ఎండోసల్ఫాన్ ద్రావణం స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన మరునాడు వాటిని ఎండలో పెట్టాలి. ఏ విధమైన పురుగు మందు వడ్లకు కలుపరాదు. ఇది చట్టరీత్యానేరం. ఎలుకల నివారణకు చర్యలు గిడ్డంగి చుట్టూ పక్కల చెత్త లేకుండా ప్రతీరోజు తుడిచి శుభ్రం చేయాలి. ఎలుకలు గిడ్డంగిలోకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రకాలైన బోనులు, బుట్టలు ఉపయోగించి ఎలుకలను చంపివేయాలి. ఒకే రకం బోనును ఎప్పుడు వాడకూడదు. గిడ్డంగి తలుపుల కింద భాగాలకు జింకు రేకులు అమర్చాలి. తూములు, రంధ్రాలకు వైర్‌మెష్ మూతలు అమర్చాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ధాన్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు.