Contracting company
-
పనులన్నీ వదిలేసి వెళ్లిపోండి!
‘మీరు చేస్తున్న పనులు ఉన్నది ఉన్నట్టుగా వదిలేసి వెళ్లిపొండి..! లేదంటే కేసులు ఎదుర్కోవడానికి సిద్ధపడండి..! మీ కంపెనీ తరఫున మేం పనులు చేస్తాం.. బిల్లులు కూడా మేమే తీసుకుంటాం..!’ – తస్మదీయ కాంట్రాక్టర్లకు టీడీపీ ముఖ్యనేతల అల్టిమేటం.‘అలాగైతే.. మీరు చేసే అక్రమాలకు మేం బాధ్యత వహించాల్సి వస్తుంది..! మాకు ఇవ్వాల్సిన బిల్లులు ఇచ్చేసి.. ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్ఫెసిఫికేషన్స్) 60 సీ నిబంధన కింద కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయండి! కావాలంటే ఈ వ్యవహారంపై మేం కోర్టులో సవాల్ చేయబోమని హామీ కూడా ఇస్తాం!’ – కాంట్రాక్టర్ల ప్రతిపాదన.సాక్షి, అమరావతి: గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన మాదిరిగానే 2014–19 తరహాలోనే 60 సీ నిబంధన కింద పనుల ఒప్పందాలను రద్దు చేసి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. అస్మదీయులకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునేందుకు టీడీపీ ముఖ్యనేతలు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల వరకు వివిధ శాఖల పరి«ధిలో చేపట్టిన నిర్మాణ పనులపై కన్నేసి అస్మదీయ కాంట్రాక్టర్లను పనులు చేసుకునేందుకు అనుమతిస్తున్న టీడీపీ నేతలు.. తస్మదీయ కాంట్రాక్టర్లను మాత్రం అడ్డుకుంటున్నారు.ఉన్నఫళంగా పనులు వదిలేసి వెళ్లిపోవాలంటూ హుంకరిస్తున్నారు. తమకే పనులు అప్పగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మీ కంపెనీ తరఫున పనులు చేస్తాం.. బిల్లులు మేం తీసుకుంటామని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంట్రాక్టు సంస్థలు ఒప్పుకోవడం లేదు. చేసిన పనుల్లో ఏవైనా లోపాలు తలెత్తితే వాటికి తాము బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తనకు రూ.2 వేల కోట్ల మేర బిల్లులు రావాలని.. వాటిని ఇప్పించి, తాను చేస్తున్న పనుల కాంట్రాక్టు ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని ఓ బడా కాంట్రాక్టు సంస్థ అధినేత టీడీపీ ముఖ్యనేతలకు సూచించారు. పాత విధానంలో దూకుడుగాకాంట్రాక్టర్లు తమ ఒత్తిళ్లకు లొంగకపోవడంతో 2014–19లో అమలు చేసిన విధానానికే టీడీపీ నేతలు మరింత పదును పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల పనుల వరకూ తస్మదీయ కాంట్రాక్టు సంస్థలు చేస్తున్న పనులను 60 సీ కింద రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన పనులకు 2024–25 ఎస్ఎస్ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం అంచనాలను రూపొందించి.. ఎక్కువ కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకు వాటిని కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు. -
న్యాయవిచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం..పర్యవేక్షణ లోపంతోనే రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి సుంకిశాల పంప్‌హౌస్ నీట మునిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆగస్టు 2న ఘటన జరిగినా అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయకుండా..రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెట్టిందన్నారు. సీఎంకు సమాచారం లేదంటే ఆయనకు పాలనపై పట్టు లేనట్టేనని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి తెలంగాణభవన్‌లో శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.పంప్‌హౌస్ నీట మునిగిన సమాచారం తెలియనంత మొద్దునిద్రలో ప్రభుత్వం ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారుల ఒత్తిడితో హడావుడిగా గేట్లు, మోటార్లు బిగించడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. మున్సిపల్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్‌రెడ్డి వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, సీఎం పదవికి ఆయన అనర్హుడు అని విమర్శించారు. ‘చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టి కఠినచర్యలు తీసుకోవాలి. సుంకిశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి. త్వరలో రిటైర్డ్ ఇంజనీర్లు, పార్టీ నాయకులతో కలసి సుంకిశాలను సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం’ అని కేటీఆర్ ప్రకటించారు.వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు‘గతంలో మేడిగడ్డ కుంగుబాటు ఘటన జరిగిన వెంటనే కాంట్రాక్టు సంస్థ ఎల్‌అండ్‌టీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి న ఘటనపై తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు మంత్రులు బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మా మీద బట్టకాల్చి మీద వేస్తే సహించేది లేదు.ప్రాజెక్టు డిజైన్ కాదు.. భట్టి ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది. గతంలో మేడిగడ్డపై హడావుడి చేసిన ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఎందుకు రాలేదు. దీనిపై బీజేపీ నాయకులు, కేంద్ర సంస్థలు ఎందుకు స్పందించడం లేదు. పంప్‌హౌస్ మునకతో కోట్లాది రూపాయల సంపద నీటి పాలైంది. హైదరాబాద్ మహానగర ప్రజలకు తీరని నష్టం వాటిల్లింది. నీళ్ల విషయంలో కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ బురదచల్లే ప్రయత్నాలు చేస్తోంది’ అని కేటీఆర్ విమర్శించారు. -
ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే!
ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ మిల్లు నుంచి గత సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో ప్రభుత్వం ఇచ్చిన 10 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను రికవరీ చేసుకునేందుకు ధాన్యం కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. తీరా అక్కడికి వెళితే మిల్లులో ధాన్యం నిల్వలు లేవు. మిల్లులో ఉన్న ధాన్యం చెడిపోతుందని అమ్మివేసినట్లు మిల్లర్ ఒప్పుకున్నాడు. దీంతో క్వింటాల్‌కు రూ. 2,259 లెక్కన 10 మెట్రిక్ టన్నులకు రూ. 2,25,900 చెల్లించాలని లెక్క చెప్పి వెళ్లారు. సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా సాఫీగా సాగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు మిల్లర్లకు దడపుట్టిస్తోంది. గత సంవత్సరం యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయలేమని రాష్ట్రంలోని మిల్లర్లంతా చేతులెత్తేయడంతో ఆగిపోయిన సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా మిల్లుల్లోనే నిల్వ చేసిన ధాన్యం నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం వేలం వేసి, బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలకు ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులను అప్పగించింది. గన్నీ బ్యాగులతో కలిపి క్వింటాలుకు సగటున రూ. 2,007 లెక్కన ధాన్యం కాంట్రాక్టు పొందిన సంస్థలు తమకు కేటాయించిన జిల్లాల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టాయి. తీరా ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని మిల్లులకు వెళితే అక్కడ ధాన్యం కనిపించడం లేదు. దీంతో మిల్లర్ల నుంచి క్వింటాలు ధాన్యానికి బదులుగా రూ. 2,259 లెక్కన డబ్బులు వసూలు చేయాలని కాంట్రాక్టు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించడంతో మిల్లర్లు బెంబే లెత్తుతున్నారు. వేలంలో 6 సంస్థలకు ధాన్యం అప్పగింత 2022–23 సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 20 ఎల్ఎంటీ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ కింద బాయిల్డ్ బియ్యంగా మిల్లింగ్ చేసి అప్పగించారు. మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, మిల్లింగ్ చేయలేదు. దీంతో నిల్వ ఉన్న ధాన్యాన్ని గత ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12 లాట్ల కింద వేలం వేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో కేవలం ఏడు సంస్థలే బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అందులో ఓ సంస్థ తిరస్కరణకు గురికాగా మిగతా ఆరు సంస్థలు ఈ బిడ్లను దక్కించుకున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ భండార్, నాకాఫ్ కూడా ఉన్నాయి. వేలంలో క్వింటాలు ధాన్యానికి సగటున రూ. 2,007 లెక్కన (గన్నీ బ్యాగులతో కలిపి) ప్రభుత్వానికి చెల్లించేలా బిడ్లు ఆమోదం పొందాయి. ఈ బిడ్డింగ్ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో సదరు సంస్థలు ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు.. గత యాసంగి సీజన్లో సీఎంఆర్ చేయ కుండా నిల్వ చేసినట్లు మిల్లర్లు చెప్పినప్పటికీ, ఏ మిల్లర్ దగ్గరా సరిపడా ధాన్యం నిల్వలు లేవు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశం సందర్భంగా మిల్లర్లే ఒప్పుకున్నారు. తడిసి న, నిల్వ ఉంచిన ధాన్యం పాడైపోతుందనే కార ణంగా చాలా వరకు విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మీడియాకు కూడా చెప్పారు. అయి తే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని రికవరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు క్వింటాలుకు బిడ్డింగ్‌లో రూ.1,852 నుంచి 2,260 వరకు ధర పలికింది. సగటున క్వింటాలుకు రూ.1879 కాగా, రూ.125 గన్నీ బ్యాగుల కింద .. మొత్తంగా క్వింటాలుకు రూ. 2,007 చొప్పున లెక్క చూపారు. ఆయా సంస్థలు ఎంతకు ధాన్యం కొనుగోలు టెండర్లు దక్కించుకున్నా య నే విషయాన్ని పక్కనబెట్టి క్వింటాలు ధాన్యం ఇవ్వకపోతే, దాని బదులు రూ. 2,259 చెల్లించాలని అల్టిమేటం ఇస్తున్నట్లు పలువురు మిల్లర్లు తెలిపారు. సన్న ధాన్యం టెండరును క్వింటాలుకు రూ. 2,260కి దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ నిజామాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంది. మిల్లర్లు సన్న ధాన్యం ఇవ్వని పక్షంలో క్వింటాలుకు రూ.2,500కు పైగా వసూలు చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 50 నుంచి 100 మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీకి కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ పొందినట్లు చెపుతున్నారు. -
ఎస్ఎల్బీసీపై ముందుకెళ్లేదెలా?
♦ నేడు అన్ని పక్షాల నేతలతో సీఎం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం ♦ 1983లో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ప్రస్థానం ♦ 2005 ఆగస్టులో రూ.2,813 కోట్లకు పరిపాలనా అనుమతులతో తొలి అడుగు ♦ ప్రస్తుతం 43.89 కిలోమీటర్ల సొరంగం పనుల్లో పూర్తయింది 24 కిలోమీటర్లు ♦ ఇప్పటి వరకు రూ.1,925 కోట్ల పనుల్లో రూ.1,185 కోట్ల పనులు పూర్తి ♦ మిగిలి ఉన్న మరో రూ.700 కోట్ల పనులు పెండింగ్ ♦ ఎస్కలేషన్ ఖర్చుల కింద రూ.783కోట్లు అడుగుతున్న కాంట్రాక్టు సంస్థ ♦ అడ్వాన్సు కింద రూ.150 కోట్లు తక్షణం ఇవ్వాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీ జలాలను వినియోగించుకొని తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో పురుడు పోసుకున్న శ్రీశైలం ఎడమ కాల్వ(ఎస్ఎల్బీసీ) సొరంగం పనులపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రాజెక్టు ఆరంభం నుంచీ ఓ ప్రహసనంలా మారిపోయిన సొరంగ పనుల్లో వేగంపెంచే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. పనులు ప్రారంభించి పదే ళ్లు గడుస్తున్నా సగం పనులు సైతం పూర్తికాకపోవడం, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా దీనిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశంపై అన్ని పక్షాలతో గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చ సం దర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం1983లో.. పనుల ఆరంభం 2005లో.. శ్రీశైలం నుంచి నీటిని తరలించాలంటే గ్రావిటీ ద్వారా సాధ్యం కాదని ఎప్పుడో నిపుణలు తేల్చారు. సొరంగం ద్వారా నీటిని తరలించడమే మార్గమని తేల్చిచెప్పారు. దీంతో తొలిసారిగా 1983లో ఎస్ఎల్బీసీకి పునాది పడింది. సొరంగం తవ్వకానికి రూ.480కోట్ల మేర అంచనాలు వేశారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సొరంగం పనులను పక్కనపెట్టి ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ నుంచి అంతే స్థాయి నీటిని ఎత్తిపోతల ద్వారా ఇచ్చేందుకు నిర్ణయించడం, ఎత్తిపోతల పనులను సైతం వేగిరం చేసి దాన్ని పూర్తి చేయడంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తిగా మరుగునపడ్డాయి. మధ్యలో 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగం పనులకు అంచనా వేయించగా అది రూ.967కోట్లుగా, 1997లో టీడీపీ ప్రభుత్వం మరోమారు అంచనా వేస్తే అది రూ.1,250 కోట్లకు పెరుగుతూ వచ్చింది. అంచనాలు వేసినా పనులు మాత్రం ఎక్కడా ప్రారంభం కాలేదు. తిరిగి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొరంగం పనులకు అంకురార్పణ చేసింది. అయితే అప్పటికే సొరంగం పనుల అంచనా ఏకంగా రూ.2,813 కోట్లమేర పెరిగింది. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం 2005 ఆగస్టులో టెండర్లు పిలవగా రూ.1,925కోట్ల పనులను కోట్ చేసిన జయప్రకాశ్ అసోసియేట్ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించింది. ఈ పనులను 2010 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలు, వరదలు పనులను ఆలస్యం చేశాయి. పూర్తయింది రూ.1185 కోట్ల పనులే! ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల్లో రెండు సొరంగాలు తవ్వాల్సి ఉండగా మొదటిదాన్ని శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్నెవారిపల్లె వరకు తవ్వాల్సి ఉంది. మొత్తం 43.89 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉండగా ఇందులో ఇప్పటి వరకు కేవలం 24 కిలోమీటర్లు పూర్తికాగా మరో 19.8 కిలోమీటర్ల మేర ఇంకా సొరంగం తవ్వాల్సి ఉంది. ఇక రెండో సొరంగం నల్లగొండ జిల్లాలో 7.25 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఇది పూర్తయినా, ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటికోసం ఇప్పటికే రూ.1185.38 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా పనులు పూర్తి చేసేందుకు మరో రూ.700ల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉండగా, పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యా సదరు కాంట్రాక్టు సంస్థ గతంలో ఇచ్చిన జీవో 13 మేరకు ఎస్కలేషన్ చార్జీలను భరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అలా రూ.783 కోట్ల వరకు చెల్లిస్తేనే పనులు వేగిరం అవుతాయని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో తన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వెంటనే రూ. 150 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం చేయలేదు. ఇక వీటితో పాటే ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్ కింద 2.20లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు పరిధిలోని లోయర్ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(7.6 టీఎంసీలు), మరో లక్ష ఎకరాలకు నీరందించే ఉదయసముద్రం(6.7టీఎంసీలు) ప్రాజెక్టు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. వీటి పరిధిలో ముంపునకు గురయ్యే సుమారు 3వేల ఎకరాల భూమికి పరిహారం చెల్లించాల్సి ఉంది. గతంలో ఇచ్చిన పరిహారం చాలా తక్కువగా ఉన్న దృష్ట్యా దానిని పునఃపరిశీలన జరపాలన్న డిమాండ్ అక్కడి నిర్వాసితుల నుంచి వస్తోంది. ఈ అంశాలను పరిష్కరిస్తేనే ఎస్ఎల్బీసీ పనులు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న టెండర్‌ను కొనసాగించడమా, లేక రద్దు చేయడమా, రద్దు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? లేదా కాంట్రాక్టు సంస్థ కోరుతున్నట్లుగా రూ.150 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాలా అనే అంశాలపై గురువారం వివిధ పార్టీల నేతలు, నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో చర్చించనున్నారు. -
‘సేవ్ ఎనర్జీ’కి ‘షార్ట్ సర్క్యూట్’
‘తక్కువ ఖర్చుతో ఎక్కువ కాంతి’ని నగరానికి ప్రసాదించాలన్న ధ్యేయంతోప్రారంభమైన పథకం రాజమండ్రిలో కొడిగట్టింది. నగర పాలక సంస్థ అధికారుల నిర్వాకమే ఇందుకు కారణమని కాంట్రాక్టు సంస్థ అంటుండగా.. కాంట్రాక్టు సంస్థదే బాధ్యత అని అధికారులు చెపుతున్నారు. మొత్తమ్మీద వెలుగుల పథకం..షార్ట్ సర్క్యూట్‌తో మాడిపోయిన విద్యుద్దీపంలా మిగిలింది. సాక్షి, రాజమండ్రి :‘సేవ్ ఎనర్జీ’ (విద్యుత్‌ను ఆదా చేద్దాం) నినాదంతో దేశంలోనే తొలిసారిగా చారిత్రకనగరం రాజ మండ్రిలో అమలు చేసిన ఎల్ఈడీ వీధిలైట్ల పథకంపై చీకటి కమ్ముకుంది. వెలుగులు విరజిమ్మాల్సిన దీపాలు వెలవెలబోతున్నాయి. ఇందుకు నెపాన్ని నగర పాలకసంస్థ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. ఈ పథకం కింత హైదరాబాద్‌కు చెందిన హైపీరియన్ గ్రీన్ ఎనర్జీ సంస్థతో 2009 నవంబరులో నగరపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం హైపీరియన్ సొంత ఖర్చుతో ఎల్ఈడీ బల్బులు అమర్చి, ఏడేళ్ల పాటు రూ.3.90 వంతున వీధిలైట్ల కరెంటు బిల్లుకు ఏడాదికి రూ.1.91 కోట్లు కార్పొరేషన్ వెచ్చిస్తోంది. నగరంలో మొత్తం 11 వేల లైట్ల మార్పిడి ద్వారా కనీసం 60 శాతం విద్యుత్ ఆదా సాధించాలన్నది ఈ పథకం లక్ష్యం. కాంట్రాక్టు కాలంలో అలా ఆదా అయిన మొత్తాన్ని హైపీరియన్‌కు కొంత శాతాన్ని నగర పాలక సంస్థ ఇవ్వాలి. ఎవరేం చేయాలి... ఎల్ఈడీ లైట్ల వల్ల కరెంటు ఆదాను చూపించాల్సిన బాధ్యత హైపీరియన్దే. లైటు వరకూ నెట్వర్క్ అంటే స్విచ్చులు, వైరింగ్, విద్యుత్తు సరఫరా, మీటర్లు వంటి వాటిని సక్రమంగా ఉంచే బాధ్యత నగరపాలక సంస్థది. ఆదా అయిన విద్యుత్తు విలువలో మొదటి రెండు సంవత్సరాలు 90:10, మూడు, నాలుగు సంవత్సరాల్లో 85:15, ఐదు నుంచి ఏడేళ్ల వరకు 80:20 నిష్పత్తిలో హైపీరియన్, నగరపాలక సంస్థలు పంచుకోవాలి. ఆ సొమ్మునే హైపీరియన్కి ఇచ్చే లీజు మొత్తంగా పరిగణిస్తారు. అయితే 2009 నుంచి 2012 వరకూ ఎన్నిలైట్లు మార్చారు, ఏ ఏడాది ఎంత ఆదా అయింది, ఆ ప్రకారం హైపీరియన్కి ఎంత చెల్లించాలనే గణాంకాలను అధికారులు నిక్కచ్చిగా నమోదు చేయలేదని, దీనిపై ఆడిట్ అభ్యంతరాలు కూడా వచ్చాయని తెలుస్తోంది. రోజుకు 11 గంటల కాలాన్ని వీధిలైట్లు వెలిగే సమయంగా పరిగణించి వినియోగం, ఆదాపై అంచనాలు వేయాలని, వేసవిలో కరెంటు కోత కాలంలో వినియోగం, ఆదా రెండూ లెక్కించరాదని ఒప్పందం. కానీ కోత సమయాలను పరిగణనలోకి తీసుకోలేదు. లైట్ల చోరీ జరిగినా, ప్రమాదాలు, తుపాన్ల వల్ల లైట్లు పాడైనా నగరపాలక సంస్థ భరించాలి. ఇందుకు మొత్తం లైట్లన్నింటికీ బీమా చేయించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 2013లో జల్ తుపానుతో లైట్లకు వాటిల్లిన నష్టం ఎవరు భరించాలన్న వివాదం నేటికీ తేలలేదు. అధికారుల నిర్లక్ష్యంతో రూ.50 లక్షల మేర నగరపాలక సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాగా అధికారులు తాము తప్పించుకునేందుకు బాధ్యత తమదేనంటున్నారని కాంట్రాక్టు సంస్థ చెపుతోంది. తప్పుడు లెక్కలతో లక్షల బొక్కుడు.. విద్యుత్తు ఆదా 74 శాతం వరకూ ఉన్నా 60 శాతం మాత్రమే ఉన్నట్టు చూపుతున్నారని, ఈ విధమైన వ్యత్యాసాల ద్వారా నగర పాలక సంస్థ అధికారులు లక్షలు దిగమింగారని ఆరోపణలున్నాయి. ఏడాదికి రూ.26 లక్షల వరకు పక్కదారి పట్టాయంటున్నారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా..‘ఎలాగోలా’ సర్దుబాటు చేసుకున్న అధికారులు.. నగర పాలక సంస్థ చూసుకోవలసిన నెట్ వర్కింగ్ లోపాల నిర్వహణనూ హైపీరియన్ మీదే వేసి, ఆ మేరకు కూడా సొమ్ము చేసుకున్నట్టు చెపుతున్నారు. మొత్తమ్మీద అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు మధ్యన విభేదాలు తలెత్తడంతో ఎల్ఈడీ లైట్లు ఆలనాపాలనా ఎరుగని ‘అనాథ’ల్లా మారాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2013 జూన్‌లో నగరపాలక సంస్థ అధికారులు సర్వే చేయించగా 70 శాతం పైగా లైట్లు వెలగడం లేదని తేలింది. ఆ సంస్థ నుంచి కమిషన్లు దండుకున్నట్టు ఆరోపణలున్న అధికారులు వాటి నుంచి గట్టెక్కేందుకు ఇదే అదనుగా లైట్ల అధ్వానస్థితికి పూర్తి బాధ్యతను కాంట్రాక్టు సంస్థపై నెట్టేస్తూ లేఖలు, నోటీసులు జారీ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టుకెక్కింది. మాకు తీవ్రనష్టం తెచ్చారు.. కార్పొరేషన్ చేయాల్సిన వైరింగ్ వంటి పనులను కూడా మా చేతే చేయించారు. మాకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టి, ఇప్పుడు తప్పంతా మాదేనంటున్నారు. ఎల్ఈడీ లైట్లతో ఆశించిన 60 శాతం కన్నా ఎక్కువగా 74 శాతం ఆదా అయినా తగ్గించి చూపేందుకు యత్నించారు. ఇప్పుడు అసలు ఆదాయే కావడం లేదని నెపం మాపై వేస్తున్నారు. వెలిగే లైట్ల వద్దే ఎక్కువ కరెంటు ఖర్చయ్యే లైట్లు బిగిస్తున్నారు. ఎల్ఈడీ లైట్ల వరకే మా బాధ్యత. నెట్ వర్కింగ్‌ను మున్సిపల్ సిబ్బంది చేయడం లేదు. - డాక్టర్ కె.విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, హైపీరియన్ మరమ్మతుల్ని కార్పొరేషన్ చేయించింది.. లైట్ల నిర్వహణ బాధ్యత అంతా కాంట్రాక్టు సంస్థదే. ఇదే విషయాన్ని సూచిస్తూ గతంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సలహా మేరకు కంపెనీకి లేఖలు రాశాం. హైపీరియన్ సంస్థ మరమ్మతులు చేయకపోతే వాటిని కార్పొరేషన్ ద్వారా చేయించి ఆ ఖర్చును కంపెనీకి ఇచ్చే నిర్వహణా వ్యయం నుంచి మినహాయించాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. - రవీంద్రబాబు, కమిషనర్, రాజమండ్రి నగర పాలక సంస్థ