ఎస్‌ఎల్‌బీసీపై ముందుకెళ్లేదెలా? | Crucial all-party meeting on SLBC today | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎల్‌బీసీపై ముందుకెళ్లేదెలా?

Published Thu, Nov 20 2014 2:14 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

ఎస్‌ఎల్‌బీసీపై ముందుకెళ్లేదెలా? - Sakshi

ఎస్‌ఎల్‌బీసీపై ముందుకెళ్లేదెలా?

నేడు అన్ని పక్షాల నేతలతో సీఎం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం   
1983లో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ప్రస్థానం
2005 ఆగస్టులో రూ.2,813 కోట్లకు పరిపాలనా అనుమతులతో తొలి అడుగు
ప్రస్తుతం 43.89 కిలోమీటర్ల సొరంగం పనుల్లో పూర్తయింది 24 కిలోమీటర్లు
ఇప్పటి వరకు రూ.1,925 కోట్ల పనుల్లో రూ.1,185 కోట్ల పనులు పూర్తి
మిగిలి ఉన్న మరో రూ.700 కోట్ల పనులు పెండింగ్
ఎస్కలేషన్ ఖర్చుల కింద రూ.783కోట్లు అడుగుతున్న కాంట్రాక్టు సంస్థ
అడ్వాన్సు కింద రూ.150 కోట్లు తక్షణం ఇవ్వాలని విజ్ఞప్తి
 
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీ జలాలను వినియోగించుకొని తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో పురుడు పోసుకున్న శ్రీశైలం ఎడమ కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రాజెక్టు ఆరంభం నుంచీ ఓ ప్రహసనంలా మారిపోయిన  సొరంగ పనుల్లో వేగంపెంచే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. పనులు ప్రారంభించి పదే ళ్లు గడుస్తున్నా సగం పనులు సైతం పూర్తికాకపోవడం, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా దీనిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశంపై అన్ని పక్షాలతో గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చ సం దర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  

నిర్ణయం1983లో..
పనుల ఆరంభం 2005లో.
.
శ్రీశైలం నుంచి నీటిని తరలించాలంటే గ్రావిటీ ద్వారా సాధ్యం కాదని ఎప్పుడో నిపుణలు తేల్చారు. సొరంగం ద్వారా నీటిని తరలించడమే మార్గమని తేల్చిచెప్పారు. దీంతో తొలిసారిగా 1983లో ఎస్‌ఎల్‌బీసీకి పునాది పడింది. సొరంగం తవ్వకానికి రూ.480కోట్ల మేర అంచనాలు వేశారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సొరంగం పనులను పక్కనపెట్టి ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ నుంచి అంతే స్థాయి నీటిని ఎత్తిపోతల ద్వారా ఇచ్చేందుకు నిర్ణయించడం, ఎత్తిపోతల పనులను సైతం వేగిరం చేసి దాన్ని పూర్తి చేయడంతో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పూర్తిగా మరుగునపడ్డాయి.

మధ్యలో 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగం పనులకు అంచనా వేయించగా అది రూ.967కోట్లుగా, 1997లో టీడీపీ ప్రభుత్వం మరోమారు అంచనా వేస్తే అది రూ.1,250 కోట్లకు పెరుగుతూ వచ్చింది. అంచనాలు వేసినా పనులు మాత్రం ఎక్కడా ప్రారంభం కాలేదు. తిరిగి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొరంగం పనులకు అంకురార్పణ చేసింది. అయితే అప్పటికే సొరంగం పనుల అంచనా ఏకంగా రూ.2,813 కోట్లమేర పెరిగింది. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం 2005 ఆగస్టులో టెండర్లు పిలవగా రూ.1,925కోట్ల పనులను కోట్ చేసిన జయప్రకాశ్ అసోసియేట్ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించింది. ఈ పనులను 2010 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలు, వరదలు పనులను ఆలస్యం చేశాయి.
 
పూర్తయింది రూ.1185 కోట్ల పనులే!
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనుల్లో రెండు సొరంగాలు తవ్వాల్సి ఉండగా మొదటిదాన్ని శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్నెవారిపల్లె వరకు తవ్వాల్సి ఉంది. మొత్తం 43.89 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉండగా ఇందులో ఇప్పటి వరకు కేవలం 24 కిలోమీటర్లు పూర్తికాగా మరో 19.8 కిలోమీటర్ల మేర ఇంకా సొరంగం తవ్వాల్సి ఉంది. ఇక రెండో సొరంగం నల్లగొండ జిల్లాలో 7.25 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఇది పూర్తయినా, ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

వీటికోసం ఇప్పటికే రూ.1185.38 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా పనులు పూర్తి చేసేందుకు మరో రూ.700ల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉండగా, పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యా సదరు కాంట్రాక్టు సంస్థ గతంలో ఇచ్చిన జీవో 13 మేరకు ఎస్కలేషన్ చార్జీలను భరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అలా రూ.783 కోట్ల వరకు చెల్లిస్తేనే పనులు వేగిరం అవుతాయని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో తన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వెంటనే రూ. 150 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం చేయలేదు. ఇక వీటితో పాటే ఎస్‌ఎల్‌బీసీ హై లెవెల్ కెనాల్ కింద 2.20లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు పరిధిలోని లోయర్ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(7.6 టీఎంసీలు), మరో లక్ష ఎకరాలకు నీరందించే ఉదయసముద్రం(6.7టీఎంసీలు) ప్రాజెక్టు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. వీటి పరిధిలో ముంపునకు గురయ్యే సుమారు 3వేల ఎకరాల భూమికి పరిహారం చెల్లించాల్సి ఉంది.

గతంలో ఇచ్చిన పరిహారం చాలా తక్కువగా ఉన్న దృష్ట్యా దానిని పునఃపరిశీలన జరపాలన్న డిమాండ్ అక్కడి నిర్వాసితుల నుంచి వస్తోంది. ఈ అంశాలను పరిష్కరిస్తేనే ఎస్‌ఎల్‌బీసీ పనులు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న టెండర్‌ను కొనసాగించడమా, లేక రద్దు చేయడమా, రద్దు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? లేదా కాంట్రాక్టు సంస్థ కోరుతున్నట్లుగా రూ.150 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాలా అనే అంశాలపై గురువారం వివిధ పార్టీల నేతలు, నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement