ధరల సర్దుబాటుకు అఖిలపక్షం ఓకే
ఎస్‌ఎల్‌బీసీపై ఏకాభిప్రాయం
ప్రస్తుత కాంట్రాక్టర్ చేతనే పనులు చేయించేందుకు అంగీకారం
రూ. 750 కోట్ల చెల్లింపుపై సభానాయకులతో నేడు మరోభేటీ
సాక్షి, హైదరాబాద్: sశ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ పనుల తవ్వకాన్ని ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌తోనే కొనసాగించేందుకు అన్ని పార్టీలు తమ సమ్మతి తెలిపాయి. కాంట్రాక్టర్ ఆర్థికపరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ ధరలు సర్దుబాటు చేసేందుకు అంగీకరించాయి. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేసేలా అన్నిచర్యలు తీసుకోవాలని సూచించాయి.
అయితే ధరలు ఎలా ఉండాలన్న దానిపై మాత్రం సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై శుక్రవారం మరోమారు అన్నిపార్టీల సభానాయకులతో, కాంట్రాక్టర్‌తో కలిపి సమవేశం నిర్వహించి ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం సంకల్పించింది. శుక్రవారం నాటి నిర్ణయానికి అనుగుణంగా ఎస్‌ఎల్‌బీసీ పనులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు 43.89కిలోమీటర్ల తవ్వాల్సిన సొరంగ మార్గంలో ఇప్పటిరవకు 24 కిలోమీటర్లు పూర్తికాగా మరో 19.8కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. అయితే ఆర్థికభారం కారణంగా సొరంగం పనులను ముందుకు తీసుకెళ్లడం తనకు కష్టంగా మారిందని, పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యా తనకు రూ.750 కోట్లవరకు ఎస్కలేషన్ చెల్లింపులతో పాటు, మరో రూ.150కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరుతున్న విషయం విదితమే.
బుధవారం సభలో చేసిన ప్రకటన మేరకు పనుల కొనసాగింపు, కాంట్రాక్టర్‌కు ఆర్థికఇబ్బందులపై గురువారం అసెంబ్లీ కమిటీహాల్‌లో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. దీనికి ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, మంత్రులు టి.హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్, జిల్లా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి, ప్రభాకర్‌రెడ్డి, గొంగిడి సునీత, శేఖర్‌రెడ్డి, కిశోర్,బాలరాజులతో పాటు బీజేపీ తరఫున ఎన్‌వీవీఎస్ ప్రభాకర్, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు ప్రాజెక్టు పనులు, కాంట్రాక్టర్ కోరుతున్న ధరల సర్దుబాటు అంశాలపై చర్చించారు.
కాంట్రాక్టర్‌ను మారిస్తే రూ.5,800 కోట్ల భారం
దీనిపై మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగిన పనులను గణాంకాలతో వివరించారు. మరో 20 కిలోమీటర్ల సొరంగం తవ్వకానికి రెండేళ్లకు మించి పట్టేలా ఉందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినా నిర్ణీత గడువులో పని పూర్తికావడం అసాధ్యమన్నారు. కొత్త కాంటారక్టర్‌కు పనులు అప్పగించిన పక్షంలో ప్రాజెక్టుపై మరో రూ.5,800ల కోట్ల భారం పడుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలో తెలపాలని పార్టీల అభిప్రాయాలను కోరారు. దీనిపై అన్నిపార్టీలు దాదాపు ఒకే విధంగా స్పందించాయి.
ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌తోనే పనులు కొనసాగించాలని సూచించాయి. అదే సమయంలో 2005లో పనులు చేపట్టే సమయంలో సిమెంట్, స్టీలు, ఇంధన ధరలు ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉందని, ఈ దృష్ట్యా కాంట్రాక్టర్ కోరుతున్న విధంగా ధరల సర్దుబాటు సబబే అన్న భావన వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసు మేరకు 5 శాతం పైన పెరిగిన ధరలను సవరించేందుకు అంగీకారం తెలిపాయి.
అయితే కాంట్రాక్టర్ కోరుతున్న ధరల సర్దుబాటు విలువ సుమారు రూ.750 కోట్లవరకు ఉన్నందున దీనిపై ఎలాంటి నిర్ణయం చేయాలన్న దానిపై శుక్రవారం మరోమారు కాంట్రాక్టర్ సమక్షంలో పార్టీ సభా నాయకులతో చర్చిద్దామని నిర్ణయించారు. వీటితో పాటే కొందరు ఎమ్మెల్యేలు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయసముద్రం ఎత్తిపోతల పనులు సత్వరమే పూర్తిచేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని సమావేశం అనంతరం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు.