సాక్షి, హైదరాబాద్: ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) లోని టన్నెల్ పనులను తిరిగి గాడిలో పెట్టే పనులు మొదలయ్యాయి. పనుల పూర్తికి అవసరమయ్యే నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఆ దిశగా అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ప్రాజెక్టు పనులు చేస్తున్న ఏజెన్సీకి రూ. 80 కోట్ల మేర అడ్వాన్సు కింద చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. పెండింగ్ బిల్లులు సైతం చెల్లించనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉండగా, మొదటి టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా, మరో 10 కి.మీలకు పైగా టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కి.మీ. టన్నెల్ పూర్తవగా.. తర్వాత ఐదేళ్లలో 9 కి.మీ. మేర తవ్వారు.
ఈ టన్నెల్‌ను రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తుండగా.. శ్రీశైలం నుంచి తవ్వుతున్న పనులు 3 నెలలుగా నిలిచిపోయాయి. కన్వేయర్ బెల్ట్ మార్చాల్సి ఉండటం, ఇతర యంత్రాలను మార్చాల్సి రావడంతో వాటిని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. ఔట్‌లెట్ టన్నెల్ బోరింగ్ మెషీన్ మరమ్మతులకు సమయం పడుతోంది. దీనికి తోడు ప్రస్తుతం సీపేజీ కారణంగా గంటకు 9,600 లీటర్ల మేర నీరు ఉబికి వస్తుండగా, ఏజెన్సీ వద్ద కేవలం 6 వేల లీటర్ల నీటిని తోడే సామర్థ్యం గల మోటార్లే పనిచేస్తున్నాయి. టన్నెల్ బోరింగ్ మెషీన్ మునగకుండా చూసుకోవడమే పెద్ద సమస్యగా మారింది. సీపేజీ నీటిని తోడాలంటే ఏకంగా 3 స్టేజుల్లో పంపింగ్ చేయాల్సి వస్తుందని, దీనికే రూ. 20 కోట్ల వరకు అవసరం ఉంటుందని ఇటీవల ఏజెన్సీ ప్రభుత్వం ముందు మొర పెట్టుకుంది. దీనికి తోడు మెíషీన్ మరమ్మతులకు మరో రూ. 60 కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరింది.
2022లోపు పూర్తి చేసే అవకాశం..
ప్రస్తుత పరిస్థితుల్లో వేరే వారికి పనులు అప్పగించే పరిస్థితులు లేకపోవడం, అడ్వాన్సులు ఇస్తే పనులు కొనసాగే అవకాశం లేని దృష్ట్యా రూ. 80 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఫైలు సైతం నీటి పారుదల శాఖ నుంచి కదిలింది. దీంతో ప్రాజెక్టు పరిధిలో రూ. 585 కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉండగా ప్రాధాన్యతా క్రమంలో వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పనులు ఇప్పటికిప్పుడు తిరిగి మొదలు పెట్టినా పనులను మాత్రం 2022 ఏడాదిలో పూర్తి చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.
ఎస్‌ఎల్‌బీసీకి రూ. 80 కోట్లు
Published Sun, Jan 13 2019 2:34 AM | Last Updated on Sun, Jan 13 2019 2:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment