కేసీఆర్‌వి అన్నీ అబద్ధాలే
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ధ్వజం
తెలంగాణ సీఎం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు మాటలు మీరారని, విపరీతబుద్ధి ప్రదర్శించారని, అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ధ్వజమెత్తారు. శనివారం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ నోట్లో నోరు పెట్టదల్చుకోలేదని, అయితే ఆయన చెప్పిన విషయాలన్నీ అబద్ధాలేనని ప్రజలకు స్పష్టత ఇవ్వదలుచుకున్నామని చెప్పారు. జీవోలు 69, 107ను అర్థం చేసుకునే సామర్థ్యం ఆయనకు లేకో, తప్పుడు సలహాలు తీసుకోవడం వల్లో.. అవాకులు, చవాకులు పేలారని విమర్శించారు. ఈ జీవోల్లో.. శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి వినియోగం ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఈ జీవోలను పాటిస్తామని కృష్ణా బోర్డు సమావేశాల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని, ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సంతకాలు కూడా చేశారని వెల్లడించారు. నిబంధనల మేరకు.. మిగులు జలాలుంటే తప్ప ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి చేయకూడదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం స్థాయిని 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచుతూ 2004లో 107 జీవో జారీ చేసిన ప్రభుత్వంలో ఇప్పటి తెలంగాణ సాగునీటి మంత్రి హరీష్‌రావు మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా 834 అడుగుల నీటిమట్టం వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందంటూ తప్పుబట్టారు. హిందూజా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం యాజమాన్యాన్ని ఏపీ ప్రభుత్వం బెదిరించిందన్న కేసీఆర్ మాటల్లో నిజం లేదన్నారు.
ఇక్కడ బొగ్గు,అక్కడ విద్యుత్.. నిజం కాదు
ఏపీ ప్రభుత్వం మహానది, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు కొనుగోలు చేస్తోందని, సింగరేణిలో కేంద్రం చేసిన కేటాయింపుల మేరకు బొగ్గు తీసుకుంటోందని పరకాల చెప్పారు. ఇక్కడి(తెలంగాణ) బొగ్గు తీసుకెళ్లి అక్కడ(ఏపీలో) విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. కేసీఆర్ శుక్రవారం పొద్దుపోయిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారంటూ.. ‘పొద్దుపోయిన తర్వాత’ మాటను పరకాల పదేపదే వినియోగించారు. పొద్దుపోయాక చంద్రబాబు కూడా చాలాసార్లు విలేకరుల సమావేశాలు పెట్టారని, అలా పెట్టడం తప్పా? అని అడగ్గా.. తప్పని తాను చెప్పట్లేదని, పొద్దుపోయాక జరిగిందని మాత్రమే చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు.
కేసీఆర్ వ్యాఖ్యలు సిగ్గుసిగ్గు: మంత్రులు
ఒక రాష్ట్రానికి సీఎంగా వ్యహహరిస్తూ వీధి రౌడీలా మాట్లాడిన కేసీఆర్ తీరుకు తెలుగు జాతి యావత్తూ సిగ్గుతో తలదించుకుందని ఏపీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్‌బాబు శనివారం నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై దుమ్మెత్తిపోశారు. సీఎం పదవికే అప్రతిష్ట తెచ్చిన కేసీఆర్‌ను చూసి దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలూ అవాక్కయ్యారని, సీఎం స్థాయి వ్యక్తి ఇంతలా దిగజారతారా? అని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ నాయకుడైన చంద్రబాబుతో పోల్చుకునే అర్హత కేసీఆర్‌కు ఎంత మాత్రమూ లేదన్నారు. కేసీఆర్ స్థాయికి అంతర్జాతీయ స్థాయి కలిగిన చంద్రబాబు బహిరంగ చర్చకు రానవసరం లేదని, ఆయన సవాల్‌కు తాము సిద్ధమని, జూనియర్ మంత్రులు కావాలో.. సీనియర్ మంత్రులు రావాలో.. కేసీఆరే తేల్చుకోవాలని సవాలు రువ్వారు.