The production of electricity
-
బీపీఎల్ భూములు వెనక్కి!
రామగుండం : సుమారు 14 ఏళ్ల క్రితం బ్రిటీష్ ఫిజికల్ లాబొరేటరీ (బీపీఎల్) విద్యుత్ కేంద్రం స్థాపనకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు లేఖ నంబర్ బీ/233/2014, 09/09/2014 పేరిట పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం నుంచి బీపీఎల్ యాజమాన్యానికి శుక్రవారం ఉత్తర్వులు చేరాయి. బీపీఎల్‌కు కేటాయించిన మొత్తం భూమి 1,817.03 ఎకరాలు. ఇందులో ప్రైవేటు భూములు 1,271.38 ఎకరాలు, మిగిలిన 543.05 ఎకరాలు ప్రభుత్వ భూమి. రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో ఈ స్థలాన్ని ఎన్టీపీసీకి కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. దీనిని గుర్తించిన బీపీఎల్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించి స్థలాలపై స్టేటస్-కో పొందింది. అయితే కోర్టు ఉత్తర్వులు ప్రభుత్వ భూములకు వర్తించవని, సదరు స్థలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోవద్దో తెలపాలని రెవెన్యూ అధికారులు మూడుసార్లు సంజాయిషీ నోటీసులు జారీచేశారు. దీనిపై యాజమాన్యం తమ సంజాయిషీని జిల్లా కలెక్టర్‌కు నివేదించినప్పటికీ మొదటిసారి పంపిన లేఖనే మళ్లీ శుక్రవారం సాయంత్రం పంపించి.. శనివారం సంబంధిత భూమలు రికార్డులను స్వాధీనం చేసుకుంది. బీపీఎల్‌ను వదిలించుకునేందుకేనా..? విద్యుత్ ఉత్పత్తి విషయంలో బీపీఎల్, ప్రభుత్వం మధ్య పొసగకపోవడంతోనే భూములు స్వాధీనంచేసుకునేందుకు కుట్ర పన్నిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతిస్తే 28 నెలల్లోపు ఉత్పత్తి చేసి ఇస్తామని చెప్పినా.. ఇదే విషయాన్ని పలుమార్లు జాయింట్ కలెక్టర్‌కు విన్నవించినా.. తీరా సమయానికి ఉన్న భూములు లాక్కుందని మండిపడుతున్నారు. బీపీఎల్‌కు కేటాయించిన భూములన్నీ ఒకేచోట లేవని, ఆ స్థలాలను స్వాధీనం చేసుకున్నంతమాత్రాన ప్రయోజనం ఉండదని, అదే తమ సంస్థకే విద్యుత్ ఉత్పత్తికి అనుమతిస్తే స్థలాలను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తి చేసేవారమని పేర్కొంటున్నారు. భూముల స్వాధీనంపై ప్రభుత్వ వైఖరి అంతుచిక్కడం లేదని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచా రం. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేర కు భూములను స్వాధీనం చేసుకున్నామని తహశీల్దార్ శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్వాధీనంచేసుకున్న భూములు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న బీపీఎల్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు.. మల్యాలపల్లి శివారు పరిధిలో 87.08 ఎకరాలు కుందనపల్లి శివారులో 4.23 ఎకరాలు రామగుండం శివారులో (విడివిడిగా) 128.11 ఎకరాలు, 5.21 ఎకరాలు, 45.15 ఎకరాలు, 2.32 ఎకరాలు రాయదండిలో 227.10 , 0.36 ఎకరాలు బ్రాహ్మణపల్లిలో 33.35 ఎకరాలు ఎల్లంపల్లిలో 4.01 ఎకరాలు గోలివాడలో 5.13 ఎకరాలు -
తెలంగాణకు ఒక్క యూనిట్టూ రాదు!
ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడి పవన విద్యుత్‌పై వారికి అడిగే హక్కే లేదు హైదరాబాద్: ఎన్ని నిజాలు చెప్పినా, గణాం కాలతో వివరించినా, తెలంగాణ మంత్రులు, అధికారులు అబద్ధాలు ఆడటం మానలేదని, అప్పుడు అబద్ధాల డైలీసీరియల్గా ఉండేదని, ఇప్పుడది వీక్లీ సీరియల్‌గా మార్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. శనివారం ఆయన సచివాల యంలో విలేకరులతో మాట్లాడారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న పవన విద్యుత్ (విండ్‌పవర్)లో ఒక్క యూనిట్కూడా తెలంగాణకు వాటాలేదని, ఇది పూర్తిగా సీపీడీసీఎల్ నుంచి ఎస్పీడీసీఎల్కు బదిలీ అయిందని, ఆమాత్రం కూడా తెలంగాణ వారికి అవగాహన లేదని అన్నారు. తాము ఇప్పటికే విండ్‌పవర్ కోసం ఉత్పత్తిదారులకు రూ.468 కోట్లు చెల్లించామని, ఒకవేళ తెలంగాణకు వాటా ఉంటే విద్యుత్ కొనుగోళ్ల చెల్లింపుల్లో ఎందుకు భాగస్వామ్యం కాలేకపోయారని ప్రశ్నించారు. ఎంతసేపూ సీలేరు విద్యుత్ ఉత్పత్తి గురించి మాట్లాడుతున్నారంటూ... జూరాలలో 118 మిలియన్ యూనిట్లు, శ్రీశైలం(లెఫ్ట్) 1,307 ఎంయూ, నాగార్జున సాగర్ నుంచి 897 ఎంయూ మొత్తం 2,322 మిలియన్ యూనిట్లు తెలంగాణ వాడుకుందని, మరి జూరాల పవర్లో ఏపీ వాటా కోసం ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. మొత్తం 54:46 నిష్పత్తిలో తెలంగాణకు 2,107 మిలియన్ యూనిట్లు రావాల్సి ఉంటే, 2,322 మిలియన్ యూనిట్లు వాడుకుంటున్నారని, అదే ఏపీకి 1,803 మిలియన్ యూనిట్లు రావాల్సి ఉంటే, కేవలం 1,612 మిలియన్ యూనిట్లు మాత్రమే వస్తోందన్నారు. రావాల్సినదాని కంటే ఎక్కువ విద్యుత్‌ను తీసుకుంటూ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అబద్ధాలు చెప్పడం విస్మయపరుస్తోందన్నారు. కృష్ణపట్నం పీపీఏల నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ మొదలే కాలేదని, అసలు కృష్ణపట్నం గురించి అడిగే హక్కే తెలంగాణకు లేదని పరకాల అన్నారు. తెలంగాణ దురాగతాలపై ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ అధికారులపై తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఫిర్యాదు చేశారన్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి పరిశీలించారని, నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. మొన్న నిథంలో అధికారులకు జరిగిన అవమానం, నిన్న లేబర్ కమిషనర్‌ను నిర్బంధించడం వంటివన్నీ కేంద్రం దృష్టికి తీసుకొచ్చినట్టు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. -
శ్రీశైలంలో నీటిమట్టాన్ని కాపాడండి
గవర్నర్ నరసింహన్‌కు ఏపీ సర్కారు వినతి హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టున తెలంగాణ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పడిపోతోందని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలోజోక్యం చేసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆదివారం ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నీటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గవర్నర్‌కు వివరించానని తెలిపారు. తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల శ్రీశైలంలో ఇప్పటికే నీటిమట్టం 856 అడుగులకు పడిపోయిందని.. కనీస నీటిమట్టం 854 అడుగులకు తగ్గితే రాయలసీమకు నీళ్లివ్వడం సాధ్యం కాదని వివరించానని చెప్పారు. గవర్నర్ స్పందన ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘వాస్తవాలను గవర్నర్‌కు వివరించాను. 69, 107 జీవోలను గవర్నర్ కూడా అధ్యయనం చేశారు’’ అని చెప్పారు. ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపు శ్రీశైలం ఎడమ గట్టున తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మళ్లీ విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం గల రెండు జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన చేపట్టారు. -
కేసీఆర్‌వి అన్నీ అబద్ధాలే
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ధ్వజం తెలంగాణ సీఎం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని వ్యాఖ్య హైదరాబాద్: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు మాటలు మీరారని, విపరీతబుద్ధి ప్రదర్శించారని, అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ధ్వజమెత్తారు. శనివారం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ నోట్లో నోరు పెట్టదల్చుకోలేదని, అయితే ఆయన చెప్పిన విషయాలన్నీ అబద్ధాలేనని ప్రజలకు స్పష్టత ఇవ్వదలుచుకున్నామని చెప్పారు. జీవోలు 69, 107ను అర్థం చేసుకునే సామర్థ్యం ఆయనకు లేకో, తప్పుడు సలహాలు తీసుకోవడం వల్లో.. అవాకులు, చవాకులు పేలారని విమర్శించారు. ఈ జీవోల్లో.. శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి వినియోగం ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఈ జీవోలను పాటిస్తామని కృష్ణా బోర్డు సమావేశాల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని, ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సంతకాలు కూడా చేశారని వెల్లడించారు. నిబంధనల మేరకు.. మిగులు జలాలుంటే తప్ప ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి చేయకూడదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం స్థాయిని 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచుతూ 2004లో 107 జీవో జారీ చేసిన ప్రభుత్వంలో ఇప్పటి తెలంగాణ సాగునీటి మంత్రి హరీష్‌రావు మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా 834 అడుగుల నీటిమట్టం వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందంటూ తప్పుబట్టారు. హిందూజా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం యాజమాన్యాన్ని ఏపీ ప్రభుత్వం బెదిరించిందన్న కేసీఆర్ మాటల్లో నిజం లేదన్నారు. ఇక్కడ బొగ్గు,అక్కడ విద్యుత్.. నిజం కాదు ఏపీ ప్రభుత్వం మహానది, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు కొనుగోలు చేస్తోందని, సింగరేణిలో కేంద్రం చేసిన కేటాయింపుల మేరకు బొగ్గు తీసుకుంటోందని పరకాల చెప్పారు. ఇక్కడి(తెలంగాణ) బొగ్గు తీసుకెళ్లి అక్కడ(ఏపీలో) విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. కేసీఆర్ శుక్రవారం పొద్దుపోయిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారంటూ.. ‘పొద్దుపోయిన తర్వాత’ మాటను పరకాల పదేపదే వినియోగించారు. పొద్దుపోయాక చంద్రబాబు కూడా చాలాసార్లు విలేకరుల సమావేశాలు పెట్టారని, అలా పెట్టడం తప్పా? అని అడగ్గా.. తప్పని తాను చెప్పట్లేదని, పొద్దుపోయాక జరిగిందని మాత్రమే చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలు సిగ్గుసిగ్గు: మంత్రులు ఒక రాష్ట్రానికి సీఎంగా వ్యహహరిస్తూ వీధి రౌడీలా మాట్లాడిన కేసీఆర్ తీరుకు తెలుగు జాతి యావత్తూ సిగ్గుతో తలదించుకుందని ఏపీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్‌బాబు శనివారం నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై దుమ్మెత్తిపోశారు. సీఎం పదవికే అప్రతిష్ట తెచ్చిన కేసీఆర్‌ను చూసి దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలూ అవాక్కయ్యారని, సీఎం స్థాయి వ్యక్తి ఇంతలా దిగజారతారా? అని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ నాయకుడైన చంద్రబాబుతో పోల్చుకునే అర్హత కేసీఆర్‌కు ఎంత మాత్రమూ లేదన్నారు. కేసీఆర్ స్థాయికి అంతర్జాతీయ స్థాయి కలిగిన చంద్రబాబు బహిరంగ చర్చకు రానవసరం లేదని, ఆయన సవాల్‌కు తాము సిద్ధమని, జూనియర్ మంత్రులు కావాలో.. సీనియర్ మంత్రులు రావాలో.. కేసీఆరే తేల్చుకోవాలని సవాలు రువ్వారు. -
ఎవరేం చేశారో చర్చిద్దాం
టీ సర్కారుకు ఏపీ సీఎం చంద్రబాబు సవాల్ అన్ని అంశాలపైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం ఏదో ఒక వివాదం ఉంటే తప్ప టీఆర్ఎస్కు మనుగడ లేదు అందుకే శ్రీశైలం ఎడమగట్టున విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.. ఆ పార్టీకి రెండు రాష్ట్రాల్లో ఆఫీసుల్లేవు.. అందుకే బాధ్యతారాహిత్యం 300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి సిద్ధం హైదరాబాద్: ఏదో వివాదం ఉంటే తప్ప టీఆర్ఎస్కు మనుగడ లేదని, అందుకే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వివాదం సృష్టిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. నాలుగు నెలల్లో ఎవరేం చేశారో తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. అన్నింటిపై తెలంగాణ ప్రభుత్వంతో తాను బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. కృష్ణాబోర్డు చేసిన సూచనను కూడా పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. తెలంగాణకు తాను హితవు చెబుతున్నానని, వివాదాలు పెట్టుకోవడం లేదన్నారు. తాను ముందుచూపుతో వ్యవహరించి విద్యుత్‌ను కొన్నానని, తెలంగాణ ప్రభుత్వానికి దూరదృష్టి లేక.. కరెంటు కష్టాలకు బాబే కారణమని ప్రచారం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ వాళ్లు ఇళ్లల్లో కాపురం చేయకపోయినా నేను కారణమా?అని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇలా,,, ►శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నీటి వినియోగంలో అనుసరించాల్సిన విధానాన్ని జీవో 69, 107లో వివరించారు. ఆ నిబంధనల మేరకు.. శ్రీశైలం నీటి మట్టం 885 అడుగులు దాటిన తర్వాతే ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి చేయాలి. జూలై నుంచి అక్టోబర్ వరకు పీక్ టైమ్‌లో అవసరమైతే కేవలం 11 వేల క్యూసెక్కులను వాడుకుని ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. వినియోగించుకున్న 11 వేల క్యూసెక్కుల నీటిని తిరిగి ప్రాజెక్టులోకి అదే రోజు రివ ర్స్ పంప్ చేయాలి. నీటి మట్టం 875 అడుగులు ఉన్నప్పుడు చెన్నైకి తాగునీరిళ్లివ్వాలి. తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాల్వ (ఎస్ఆర్బీసీ)కు నీళ్లివ్వాలి. విద్యుదుత్పత్తికి పక్షం రోజుల్లో 6 టీఎంసీలే వాడాలి. 854 అడుగులకు చేరినప్పుడు చెన్నైకి తాగునీరు, కుడిగట్టున విద్యుత్ ఉత్పత్తికి పక్షం రోజుల్లో 6 టీఎంసీల నీటిని విని యోగించుకోవచ్చు. తెలుగుగంగ, ఎస్ఆర్బీసీకి నీళ్లివ్వ కూడదు. 854 అడుగుల కంటే దిగువన నీటిమట్టం ఉంటే.. నాగార్జునసాగర్‌కు పరిస్థితిని బట్టి నీళ్లివ్వాలి. ప్రకాశం బ్యారేజీకి నీళ్లు విడుదల చేయాలి. విద్యుత్ సంక్షోభం ఉంటే పీక్ టైమ్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి పక్షం రోజుల్లో గరిష్టంగా 6 టీఎంసీలే వాడాలి. ► శ్రీశైలంలో ప్రస్తుతం (బుధవారం ఉదయానికి) 857.6 అడుగుల నీటిమట్టం ఉంది. 854 అడుగుల మట్టానికి (మినిమం డ్రా డౌన్ లెవల్)కు చేరడానికి ఇంకా 9.6 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. కుడికాల్వకు 17 టీఎంసీల నికర జలాలు ఇవ్వాలి. ఇప్పుడు ప్రాజెక్టులో 9.6 టీఎంసీలున్నారుు. అంటే దాదాపు 8 టీఎంసీల కొరత ఉంది. తాగునీటి అవసరాలూ ఉన్నాయి. మళ్లీ ఎగువ నుంచి నీళ్లు వస్తే తప్ప కొరత తీరే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని అంచనా వేసి.. ఈనెల 18నే కుడిగట్టున విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశాం. ఎడమ గట్టున కూడా నిలిపివేయమని తెలంగాణకు విజ్ఞప్తి చేశాం. శ్రీశైలం ప్రాజెక్టులో గత పదేళ్లలో ఎప్పుడూ 871 అడుగుల కంటే నీటిమట్టం తగ్గిపోయిన దాఖలాలు లేవు. ఇప్పుడు 857 అడుగులకు పడిపోయింది. ► శ్రీశైలంలో కాకుండా నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేసుకోమని తెలంగాణకు సూచి స్తున్నా. పులిచింతల ప్రాజెక్టు కింద గ్రామాల పునరావాసం చేపట్టడానికి తెలంగాణకు ఇప్పటికే డబ్బులు ఇచ్చాం. త్వరగా పునరావాసం చేపడితే.. పులిచింతలలో పూర్తిస్థాయిలో నీటి మ ట్టం ఉంచడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి చేస్తే పులి చింతలలో నిల్వ చేసుకోవచ్చు. ► జీవో 69, 107లో పేర్కొన్న నిబంధనల ప్రకా రం నడుచుకోవాలని, ప్రాజెక్టులో కనీస నీటి నిల్వకు భంగం కలిగించకూడదని పేర్కొంటూ కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటికీ బోర్డు సూచనను తెలంగాణ ప్రభుత్వం గౌరవించలేదు. నేను వివాదాలు పెట్టుకోవాలనుకోవడం లేదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళితే రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి. ఒకస్థాయి దాటిన తర్వాత కేంద్రం, కోర్టులు ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేయడం, ఎస్ఎంఎస్లు ఇచ్చి టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయించ డం మంచిది కాదు. టీఆర్ఎస్కు రెండు రాష్ట్రాల్లో ఆఫీసుల్లేవు. అందుకే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. జూరాల విద్యుత్ కేంద్రం మునిగిపోతే ఉత్పత్తి చేయలేకపోతున్నారు. తొమ్మిది, పదో షెడ్యూళ్లలో లేని 40 సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. చట్టం ప్రకారం అవి ఏపీకే చెందుతాయి. వాటికోసం మాట్లాడానా? ► తెలంగాణకు మొదట 200 మెగావాట్ల విద్యు త్ ఇస్తామని చెప్పాం. తర్వాత 300 మెగావాట్లు ఇవ్వడానికీ సిద్ధపడ్డాం. విభజన చట్టంలో పేర్కొ న్న మేరకు 54 శాతం విద్యుత్‌ను తెలంగాణకు ఇస్తున్నాం. వీటీపీఎస్ను 90 శాతం సామర్థ్యంతో పనిచేయిస్తూ వాటా ఇస్తున్నాం. రెగ్యులేటరీ కమిషన్ అప్రూవల్ లేని కృష్ణపట్నం, హిందూజాల్లో వాటా ఇవ్వాలని చట్టంలో లేదు. భవిష్యత్‌లో వచ్చే ప్రాజెక్టుల్లోనూ వాటా అడగడం ప్రజాస్వామ్యం కాదు. గ్యాస్ ఆధారిత ప్రాజెక్టుల్లో ఉత్పత్తి మొదలైతే 2,000 మెగావాట్ల వరకు ఇస్తాం. 30న హెల్త్‌కార్డుల పథకం ప్రారంభం ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నామని సీఎం తెలిపారు. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో.. చికిత్స గరిష్ట వ్యయంపై పరిమితి తొలగించే విషయంలో ఆయన స్పష్టత ఇవ్వలేదు. విశాఖవాసులు తుపానును జయించారు బీచ్ రోడ్డులో కాగడాల ప్రదర్శన ఏటా అక్టోబరు 12న విశాఖలో పునరంకిత సభ: బాబు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖప్రజల ఉక్కు సంకల్పం, ఆత్మస్థైర్యం ముందు హుదూద్ తుపాను ఓడిపోయిందని సీఎం చంద్రబాబు చెప్పారు.తుపాను తాకిడికి దెబ్బతిన్న విశాఖపట్నానికి పూర్వవైభవం తేవడమే కాదు ప్రపంచంలోనే అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతానని భరోసానిచ్చారు. హుదూద్ వల్ల కలిగిన కష్టాలు, నష్టాలు ఇంకా తీరలేదని... తాత్కాలికంగానే కొంత కోలుకున్నారని చెప్పారు. ‘హుదూద్ తుపానును జయిద్దాం’ అనే నినాదంతో విశాఖపట్నం బీచ్‌రోడ్డులో బుధవారం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ... విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధిని వేగవంత చేస్తామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి తుపానులనైనా ఎదుర్కోగల రీతిలో అత్యాధునిక పరిజ్ఞానంతో నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. తుపానుపై విజయానికి గుర్తుకు ఏటా అక్టోబరు 12న విశాఖ బీచ్‌రోడ్డులో పునరంకిత సభను నిర్వహిస్తామన్నారు. విశాఖను ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దుతారని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడుతూ చెప్పారు. కాగా తుపాను భాదితుల సహాయార్థం విశాఖ స్టీల్‌ప్లాంట్ రూ.5 కోట్లు ప్రకటించింది. గురువారం సీఎం చంద్రబాబుకు స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ ఈ మేరకు చెక్కును అందచేయనున్నారు. -
పరిశ్రమలకు కోతలు పెంపు
రెండు రోజులు పవర్‌హాలిడే ఈ నెల 9 నుంచి అమలు ఎన్పీడీసీఎల్ ప్రకటన వరంగల్ : కరెంటు కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఖరీఫ్ పంటలు చేతికి వచ్చే సమయంలో కోతలు పెరగడంలో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఇదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఇంకా ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌లో కోత మరింత పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపి ణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) నిర్ణయించింది. పరిశ్రమలకు ఇప్పటికే వారంలో ఒక రోజు పూర్తిగా కరెంటు కోతలు విధిస్తున్నారు. ఈ నెల 9 నుం చి దీన్ని రెండు రోజులకు పెంచనున్నారు. పరి శ్రమలకు రెండు రోజులపాటు విధించే కరెంటు కోతలను అధికారికంగా పేర్కొంటూ ఎన్పీడీసీఎల్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాల మేరకు పరిశ్రమలకు విద్యుత్ కోతలపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో డివిజన్ల వారీగా కోతలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. ఐదు జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించి ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో వారంలో రెండు రోజులు పరిశ్రమలకు కరెంటు కోతలు విధించనున్నారు. వరంగల్ సర్కిల్లో ప్రస్తుతం బుధవారంపవర్ హాలిడే ఉండగా... ఈ నెల 9వ తేదీ నుంచి బుధవారంతోపాటు గురువారం కూడా పరిశ్రమలకు విద్యుత్ కోత అమలు కానుంది. -
మేధావులను మెప్పించిన ‘మోడల్’ విద్యార్థి
సిద్దిపేట ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న మధ్యతరగతి విద్యార్థిని ఆవిష్కరించిన ప్రదర్శనకు జాతీయ స్థాయిలో చోటు లభించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్‌లో మెతుకుసీమ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది. మెదక్ మండలంలోని తిమ్మాయిపల్లికి చెందిన విద్యార్థిని మానస రెండేళ్ల క్రితం జరిగిన జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న విషయం విదితమే. ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఇర్కోడ్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని కృష్ణశ్రీ ఆవిష్కరించిన ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ క్రమంలో ఈ నెల 22నుంచి 24వ వరకు వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో కృష్ణశ్రీ ప్రయోగం జాతీయ స్థాయికి ఎంపికైంది. ఈ పోటీలకు పది జిల్లాల నుంచి 696 ప్రదర్శనలు రాగా న్యాయనిర్ణేతలు వీటిలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన 35 ప్రయోగాలను జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గురువారం ‘సాక్షి’ కృష్ణశ్రీని అభినందించి తన మనోభాలను తెలుసుకుంది. విద్యుత్ కొరతే ఆవిష్కరణకు నాందిగా... ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరత, నీటి వృథాను నియంత్రించే లక్ష్యంతో పాఠశాల ప్రిన్సిపల్, సబ్జెక్ట్ టీచర్ చొరవతో మురుగు నీటితో విద్యుత్ ఉత్పత్తి ప్రదర్శనకు నాంది పలికినట్లు విద్యార్థిని కృష్ణశ్రీ తెలిపింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ చిన్నారి ఇర్కోడ్ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు స్వరూప, నగేష్‌లు ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. 7వ తరగతి వరకు సిద్దిపేటలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో చదివిన కృష్ణశ్రీ ఇర్కోడ్‌లోని ఆదర్శ పాఠశాలలో 8వ తరగతిలో ప్రవేశం పొందింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డుల ఎంపికకు వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తోందని తెలుసుకున్న కృష్ణశ్రీకి ‘వ్యర్థజలాలతో విద్యుత్ ఉత్పత్తి’ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలకు చెందిన గైడ్ టీచర్ ముఖేష్ సహకారంతో తన ఆలోచనకు పదును పెట్టింది. స్థానికంగా దొరికే వస్తువులతో ప్రయోగాన్ని ప్రారంభించి విజయవంతంగా ప్రదర్శించింది. మెదక్‌లో జరిగిన జిల్లా స్థాయి ప్రదర్శనలో ఈ ప్రయోగం ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అక్కడ కూడా తన ప్రయోగం, వాక్చాతుర్యం ద్వారా న్యాయనిర్ణేతల మెప్పు పొంది తన ప్రదర్శనను జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా సత్తాచాటింది. ఆవిష్కరణ సమగ్ర రూపం అంశం: మురుగు నీటితో విద్యుత్ ఉత్పత్తి. కావలసిన పరికరాలు: అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బాక్స్‌లు, ప్లాస్టిక్ పైప్‌లు, డైనమో, మోటార్, చిన్న ఫ్యాన్, ఫ్లైవుడ్, గ్రీన్ సీట్. ప్రయోగ విధానం: మురుగు కాల్వల నుంచి వచ్చే నీటిని ఒక గది (చాంబర్)లో నిల్వ చేయాలి. దానిని 20 నుంచి 30 రోజుల వరకు నిల్వ ఉంచాలి. అలా నిల్వ ఉంచడం వల్ల దానిలో సూక్ష్మజీవులు పెరుగుతాయి. దీనివల్ల ఈ నీటిలో సీహెచ్4 (మిథేన్ గ్యాస్) ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన గ్యాస్‌ను, మిథేన్ చాంబర్లో నిల్వ చేయాలి. నిల్వ చేసిన మిథేన్‌ను పైప్‌ల ద్వారా ఫర్నెన్స్ అనే చాంబర్లోకి పంపించాలి. దీనిలో గ్యాస్‌ను మండించడం వల్ల ఉష్ణం వెలువడుతుంది. దీన్ని హీట్ ఎక్స్చేంజర్ చాంబర్లోకి పంపించాలి. నిల్వ ఉంచిన గది నుంచి మురుగు నీటిని పైప్‌ల ద్వారా బాయిలర్‌లోకి పంపిస్తాం. బాయిలర్‌లో మురికి నీరు, ఉష్ణం కలవడం వల్ల నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరిని మనం పైప్‌ల ద్వారా ఫర్నెన్స్ గదిలోకి పంపిస్తాం. నీటి ఆవిరి వేగంగా ఫర్నెన్స్ను తిప్పుతాయి. దీని వల్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మరోవైపు విద్యుత్ ఉత్పాదన సమయంలో కొంత స్వచ్ఛమైన నీరు ఏర్పడుతుంది. ఆ నీటిని మనం వ్యవసాయ, ఇతర నిర్మాణ రంగాలకు వాడుకోవచ్చు. ఉపయోగాలు... ఈ ప్రయోగం ద్వారా అనేక ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం ఉండదు. నీరు వృథా కాదు, భూగర్భ జలాశయాలను కాపాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. మిగిలిన స్వచ్ఛమైన నీటిని వ్యవసాయ, ఇతర పనులకు వాడుకోవచ్చు. -
ఏపీలో నిరంతర విద్యుత్ హుళక్కేనా!
అక్టోబర్ 2 నుంచి పథకం కొన్ని ప్రాంతాలకే పరిమితం వ్యవసాయానికి 9 గంటలపైనా అస్పష్టత నేడు ఢిల్లీలో మంత్రుల భేటీ హైదరాబాద్: గృహావసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా హామీ అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఈ పథకాన్ని కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలన్న ఆలోచన కూడా చేస్తోంది. దీంతోపాటే వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న ఎన్నికల హామీని కూడా పక్కకు నెట్టే ప్రయత్నంలో ఉంది. గృహావసరాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలన్న కేంద్ర పథకానికి ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేయడం, అక్టోబర్ 2 నుంచి ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాల్సిన సంగతి తెలిసిందే. తొందరపడి 24 గంటల సరఫరా మొదలు పెడితే సరఫరా పరంగా ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని అధికారులు వివరించారు. దీంతో పథకం అమలుపై ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 122.37 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, డిమాండ్ 123.50 మిలియన్ యూనిట్లు ఉంది. 24 గంటల విద్యుత్ సరఫరాతోపాటు, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలనే ఎన్నికల హామీని నెరవేరిస్తే డిమాండ్ ఆరు రెట్లు పెరగొచ్చని అంచనా. విశాఖపట్టణం, తిరుపతి వంటి నగరాలతో పాటు, కొన్ని మండలాలు, అందులోనూ కొన్ని గ్రామాలనే పథకం అమలుకు ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే రాష్ట్రాల విద్యుత్ మంత్రుల భేటీపై ఆంధ్రప్రదేశ్ సర్కారు గంపెడాశలు పెట్టుకుంది.