తెలంగాణకు ఒక్క యూనిట్టూ రాదు!
ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడి పవన విద్యుత్‌పై వారికి అడిగే హక్కే లేదు
హైదరాబాద్: ఎన్ని నిజాలు చెప్పినా, గణాం కాలతో వివరించినా, తెలంగాణ మంత్రులు, అధికారులు అబద్ధాలు ఆడటం మానలేదని, అప్పుడు అబద్ధాల డైలీసీరియల్‌గా ఉండేదని, ఇప్పుడది వీక్లీ సీరియల్‌గా మార్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. శనివారం ఆయన సచివాల యంలో విలేకరులతో మాట్లాడారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న పవన విద్యుత్ (విండ్‌పవర్)లో ఒక్క యూనిట్‌కూడా తెలంగాణకు వాటాలేదని, ఇది పూర్తిగా సీపీడీసీఎల్ నుంచి ఎస్పీడీసీఎల్‌కు బదిలీ అయిందని, ఆమాత్రం కూడా తెలంగాణ వారికి అవగాహన లేదని అన్నారు. తాము ఇప్పటికే విండ్‌పవర్ కోసం ఉత్పత్తిదారులకు రూ.468 కోట్లు చెల్లించామని, ఒకవేళ తెలంగాణకు వాటా ఉంటే విద్యుత్ కొనుగోళ్ల చెల్లింపుల్లో ఎందుకు భాగస్వామ్యం కాలేకపోయారని ప్రశ్నించారు. ఎంతసేపూ సీలేరు విద్యుత్ ఉత్పత్తి గురించి మాట్లాడుతున్నారంటూ... జూరాలలో 118 మిలియన్ యూనిట్లు, శ్రీశైలం(లెఫ్ట్) 1,307 ఎంయూ, నాగార్జున సాగర్ నుంచి 897 ఎంయూ మొత్తం 2,322 మిలియన్ యూనిట్లు తెలంగాణ వాడుకుందని, మరి జూరాల పవర్‌లో ఏపీ వాటా కోసం ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు.
మొత్తం 54:46 నిష్పత్తిలో తెలంగాణకు 2,107 మిలియన్ యూనిట్లు రావాల్సి ఉంటే, 2,322 మిలియన్ యూనిట్లు వాడుకుంటున్నారని, అదే ఏపీకి 1,803 మిలియన్ యూనిట్లు రావాల్సి ఉంటే, కేవలం 1,612 మిలియన్ యూనిట్లు మాత్రమే వస్తోందన్నారు. రావాల్సినదాని కంటే ఎక్కువ విద్యుత్‌ను తీసుకుంటూ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అబద్ధాలు చెప్పడం విస్మయపరుస్తోందన్నారు. కృష్ణపట్నం పీపీఏల నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ మొదలే కాలేదని, అసలు కృష్ణపట్నం గురించి అడిగే హక్కే తెలంగాణకు లేదని పరకాల అన్నారు.
తెలంగాణ దురాగతాలపై ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ అధికారులపై తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఫిర్యాదు చేశారన్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి పరిశీలించారని, నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. మొన్న నిథంలో అధికారులకు జరిగిన అవమానం, నిన్న లేబర్ కమిషనర్‌ను నిర్బంధించడం వంటివన్నీ కేంద్రం దృష్టికి తీసుకొచ్చినట్టు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు.