బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వచ్చేది మేమే.. వందరెట్లు వడ్డీతో బదులు తీర్చుకుంటాం
సిరిసిల్లలో ఈఆర్సీ విచారణకు హాజరు విద్యుత్ చార్జీల పెంపును అడ్డుకుంటామని స్పష్టీకరణ
సిరిసిల్ల: ‘మహా అయితే.. ఏం చేస్తారు.. ఏవో తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతారు.. ఏం కేసులు పెడుతారో పెట్టుకోండి. ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంతకు వందరెట్లు వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. వచ్చేది మేమే.. నేనే.. ’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. విద్యుత్ సంస్థల చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో త్వరలో రాజకీయ బాంబులు పేలతాయనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ముందు ఆయనపై జరిగిన ఈడీ దాడులు, బీజేపీ వాళ్లతో రహస్య ఒప్పందాలు, సీఎం బామ్మర్దితో కాంట్రాక్టు ఒప్పందాలు ఇవన్నీ చూసుకోవాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూ.4,500 కోట్ల వ్యవహారం చూసుకోవాలి. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడం. చంద్రబాబునాయుడు వంటి వాళ్లతోనే కొట్లాడినం.
ఈ చిట్టినాయుడు ఎంత..’అని అన్నారు. తానింకా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్‌లో చేరలేదంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, మరి సీఎం రేవంత్‌రెడ్డితో ఎందుకు కండువా కప్పించుకున్నారని, బీఆర్‌ఎస్‌లో ఉంటూ కాంగ్రెస్‌తో కలవడమంటే రాజకీయంగా వ్యభిచారం చేసినట్టేనని అన్నారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన వారంతా రాజకీయ వ్యభిచారులేనని వ్యాఖ్యానించారు.
పదేళ్లలో పైసా విద్యుత్ చార్జీలు పెంచలేదు
ఈఆర్సీ బహిరంగ విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో పైసా విద్యుత్ చార్జీలు కూడా పెంచకుండా నెలకు రూ.వెయ్యి కోట్లు భరిస్తూ పాలన అందించామని కేటీఆర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల వాతలు పెడుతోందని విమర్శించారు. పెద్ద పరిశ్రమలను, కుటీర పరిశ్రమలను ఒకే గాటన కట్టి, కుటీర పరిశ్రమకు రాయితీలను ఎత్తివేసే కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అదానీతో సమానంగా సూక్ష్మ, చిన్న, కుటీర పరిశ్రమల యజమానులు ఎలా విద్యుత్ చార్జీలు చెల్లిస్తారని ప్రశ్నించారు.
విద్యుత్ చార్జీలు పెంచే ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామని, డిస్కంలపై రూ.18,000 కోట్ల ఆర్థిక భారాన్ని మోపే ప్రయత్నాలను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్నతరహా, కుటీర పరిశ్రమలకు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి సబ్సిడీ టారిఫ్‌తో విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. నేతన్నల సంక్షేమం కోసం 10 హెచ్‌పీల వరకు ఉన్న 50 శాతం విద్యుత్ రాయితీని 30 హెచ్‌పీల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. బహిరంగ విచారణలో ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు మహావీర్‌రాజు, కృష్ణయ్య, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాప్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ అరుణ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.
దద్దమ్మ పాలనలో దద్దరిల్లుతున్న రాష్ట్రం
దద్దమ్మ పాలనలో రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతోందని కేటీఆర్ విమర్శించారు. దిక్కుమాలిన పాలనలో ప్రజల జీవితాలు దిక్కూమొక్కూ లేకుండా తయారయ్యాయని శుక్రవారం ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు. ‘అలంపూర్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, గ్రామ సచివాలయం నుండి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు ధర్నాలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతులు మొదలుకుని రైస్ మిల్లర్ల వరకు, కారి్మకులు మొదలు కాంట్రాక్టర్ల వరకు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
టీచర్ల నుంచి పోలీస్ కుటుంబాల దాకా, అవ్వతాతలు, ఆడబిడ్డలు, విద్యార్థులు, విద్యావంతులు, నిరుద్యోగులు , ఉద్యోగులు రోడ్లెక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రజాపతినిధులు, ప్రతిపక్ష నాయకుల నుంచి వృద్దులు, బడి పిల్లలు కూడా ప్రభుత్వ తీరుపై ఆందోళనలకు దిగుతున్నారు. కాంగ్రెస్ పాలన వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు కష్టాలు తెచ్చి పెట్టింది..’అని కేటీఆర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment