సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో కేసీఆర్ పాలన విద్యుత్ రంగానికి స్వర్ణయుగమని అన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసంబద్ధమైన విద్యుత్ ఛార్జీలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందనా కేటీఆర్ తెలిపారు. అలాగే, ఇప్పుడు పెంచుతున్న విద్యుత్ ధరలను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ..‘2014లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో పారిశ్రామికవేత్తలు పవర్ హాలీడే వద్దని రోడ్డెక్కారు. నేతన్నలు పవర్ లేక ఇబ్బంది పడ్డారు. ఇవాళ మళ్లీ పది నెలల నుంచి కోతలు మొదలయ్యాయి. ఇప్పుడు పెంచుతున్న విద్యుత్ ధరలను మేం వ్యతిరేకిస్తున్నాం. మధ్యతరగతి నడ్డి విరిచే నిర్ణయం ఇది. ఈ ఆర్థిక సంవత్సరం కోసం వివిధ విద్యుత్ సంస్థలు 12 వందల కోట్ల రాబడి కోసం చేసిన ప్రతిపాదనను మేం ఖండిస్తున్నాం.
మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల విద్యుత్ భారాన్ని నాడు ప్రభుత్వం భరించిందే తప్ప ప్రజలపై భారం వేయలేదు. ఇళ్లకు 300 యూనిట్లు దాటితే 50 రూపాయలు యూనిట్‌కు పెంచడం దుర్మార్గం. 300 యూనిట్లు 70 శాతం ప్రజలు దాటడం ఖాయం. అసంబద్ధమైన విద్యుత్ ఛార్జీలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమలన్నింటినీ ఒకే మాదిరిగా లెక్క కట్టడం సరికాదు. దీంతో కుటీర పరిశ్రమలు ఇంకా కుంటుపడే అవకాశం ఉంది. రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తూ పదేళ్ల పాలనలో రూపాయి ఛార్జీలు పెంచలేదు. కానీ, ఈ ప్రభుత్వం పది నెలల్లోనే 18 వేల కోట్ల అదనపు భారాన్ని ఎందుకు మోపుతున్నారో ఈ సర్కారు సమాధానం చెప్పాలి.
బాధ్యతాయుతమైన ఈఆర్సీ ప్రజాకోణంలో యోచించాలి. ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేయాలి. తెలంగాణలో సహకార విద్యుత్ సంస్థ ఒకే ఒక్కటి మన సిరిసిల్ల జిల్లాలో ఉంది. డిస్కంలతో పోలిస్తే మా సెస్ ఎంతో బెటర్. కాబట్టి సెస్‌ను కాపాడాలని కోరుతున్నాను. సెస్‌లో డిమాండ్‌కు తగ్గట్టు ఏడు హెచ్‌పీ మోటార్ల వరకు సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాను. సెస్ కోసం వచ్చే సబ్సిడీ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి. రైతులే నడిపించే సంస్థ సెస్. ఈ పది నెలల్లోనే పదిమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం.
బాంబులు అంటే పొంగులేటి ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ల గురించి చెబుతారేమో బహుశా?. మామీద కేసులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండి. చిట్టినాయుడు బెదిరింపులకి మేము భయపడం. ఒరిజినల్ బాంబులకే మేము భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడం. మళ్ళీ మేము వస్తాం. ఒక్కొక్కడి సంగతి చెబుతాం. జగిత్యాల ఎమ్మెల్యే గాడిదలు కాయడానికి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకున్నాడా?. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రాజకీయ వ్యభిచారి. రాజకీయ వ్యభిచారం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులనే చంపుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాడు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment