ఎవరేం చేశారో చర్చిద్దాం
టీ సర్కారుకు ఏపీ సీఎం చంద్రబాబు సవాల్ అన్ని అంశాలపైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం
ఏదో ఒక వివాదం ఉంటే తప్ప టీఆర్‌ఎస్‌కు మనుగడ లేదు
అందుకే శ్రీశైలం ఎడమగట్టున విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు..
ఆ పార్టీకి రెండు రాష్ట్రాల్లో ఆఫీసుల్లేవు.. అందుకే బాధ్యతారాహిత్యం
300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి సిద్ధం
హైదరాబాద్: ఏదో వివాదం ఉంటే తప్ప టీఆర్‌ఎస్‌కు మనుగడ లేదని, అందుకే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వివాదం సృష్టిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. నాలుగు నెలల్లో ఎవరేం చేశారో తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. అన్నింటిపై తెలంగాణ ప్రభుత్వంతో తాను బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. కృష్ణాబోర్డు చేసిన సూచనను కూడా పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. తెలంగాణకు తాను హితవు చెబుతున్నానని, వివాదాలు పెట్టుకోవడం లేదన్నారు. తాను ముందుచూపుతో వ్యవహరించి విద్యుత్‌ను కొన్నానని, తెలంగాణ ప్రభుత్వానికి దూరదృష్టి లేక.. కరెంటు కష్టాలకు బాబే కారణమని ప్రచారం చేస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్ వాళ్లు ఇళ్లల్లో కాపురం చేయకపోయినా నేను కారణమా?అని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇలా,,,
►శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నీటి వినియోగంలో అనుసరించాల్సిన విధానాన్ని జీవో 69, 107లో వివరించారు. ఆ నిబంధనల మేరకు.. శ్రీశైలం నీటి మట్టం 885 అడుగులు దాటిన తర్వాతే ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి చేయాలి. జూలై నుంచి అక్టోబర్ వరకు పీక్ టైమ్‌లో అవసరమైతే కేవలం 11 వేల క్యూసెక్కులను వాడుకుని ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. వినియోగించుకున్న 11 వేల క్యూసెక్కుల నీటిని తిరిగి ప్రాజెక్టులోకి అదే రోజు రివ ర్స్ పంప్ చేయాలి. నీటి మట్టం 875 అడుగులు ఉన్నప్పుడు చెన్నైకి తాగునీరిళ్లివ్వాలి. తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాల్వ (ఎస్‌ఆర్‌బీసీ)కు నీళ్లివ్వాలి. విద్యుదుత్పత్తికి పక్షం రోజుల్లో 6 టీఎంసీలే వాడాలి. 854 అడుగులకు చేరినప్పుడు చెన్నైకి తాగునీరు, కుడిగట్టున విద్యుత్ ఉత్పత్తికి పక్షం రోజుల్లో 6 టీఎంసీల నీటిని విని యోగించుకోవచ్చు. తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీకి నీళ్లివ్వ కూడదు. 854 అడుగుల కంటే దిగువన నీటిమట్టం ఉంటే.. నాగార్జునసాగర్‌కు పరిస్థితిని బట్టి నీళ్లివ్వాలి. ప్రకాశం బ్యారేజీకి నీళ్లు విడుదల చేయాలి. విద్యుత్ సంక్షోభం ఉంటే పీక్ టైమ్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి పక్షం రోజుల్లో గరిష్టంగా 6 టీఎంసీలే వాడాలి.
► శ్రీశైలంలో ప్రస్తుతం (బుధవారం ఉదయానికి) 857.6 అడుగుల నీటిమట్టం ఉంది. 854 అడుగుల మట్టానికి (మినిమం డ్రా డౌన్ లెవల్)కు చేరడానికి ఇంకా 9.6 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. కుడికాల్వకు 17 టీఎంసీల నికర జలాలు ఇవ్వాలి. ఇప్పుడు ప్రాజెక్టులో 9.6 టీఎంసీలున్నారుు. అంటే దాదాపు 8 టీఎంసీల కొరత ఉంది. తాగునీటి అవసరాలూ ఉన్నాయి. మళ్లీ ఎగువ నుంచి నీళ్లు వస్తే తప్ప కొరత తీరే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని అంచనా వేసి.. ఈనెల 18నే కుడిగట్టున విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశాం. ఎడమ గట్టున కూడా నిలిపివేయమని తెలంగాణకు విజ్ఞప్తి చేశాం. శ్రీశైలం ప్రాజెక్టులో గత పదేళ్లలో ఎప్పుడూ 871 అడుగుల కంటే నీటిమట్టం తగ్గిపోయిన దాఖలాలు లేవు. ఇప్పుడు 857 అడుగులకు పడిపోయింది.
► శ్రీశైలంలో కాకుండా నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేసుకోమని తెలంగాణకు సూచి స్తున్నా. పులిచింతల ప్రాజెక్టు కింద గ్రామాల పునరావాసం చేపట్టడానికి తెలంగాణకు ఇప్పటికే డబ్బులు ఇచ్చాం. త్వరగా పునరావాసం చేపడితే.. పులిచింతలలో పూర్తిస్థాయిలో నీటి మ ట్టం ఉంచడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి చేస్తే పులి చింతలలో నిల్వ చేసుకోవచ్చు.
► జీవో 69, 107లో పేర్కొన్న నిబంధనల ప్రకా రం నడుచుకోవాలని, ప్రాజెక్టులో కనీస నీటి నిల్వకు భంగం కలిగించకూడదని పేర్కొంటూ కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటికీ బోర్డు సూచనను తెలంగాణ ప్రభుత్వం గౌరవించలేదు. నేను వివాదాలు పెట్టుకోవాలనుకోవడం లేదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళితే రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి. ఒకస్థాయి దాటిన తర్వాత కేంద్రం, కోర్టులు ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేయడం, ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చి టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయించ డం మంచిది కాదు. టీఆర్‌ఎస్‌కు రెండు రాష్ట్రాల్లో ఆఫీసుల్లేవు. అందుకే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. జూరాల విద్యుత్ కేంద్రం మునిగిపోతే ఉత్పత్తి చేయలేకపోతున్నారు. తొమ్మిది, పదో షెడ్యూళ్లలో లేని 40 సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. చట్టం ప్రకారం అవి ఏపీకే చెందుతాయి. వాటికోసం మాట్లాడానా?
► తెలంగాణకు మొదట 200 మెగావాట్ల విద్యు త్ ఇస్తామని చెప్పాం. తర్వాత 300 మెగావాట్లు ఇవ్వడానికీ సిద్ధపడ్డాం. విభజన చట్టంలో పేర్కొ న్న మేరకు 54 శాతం విద్యుత్‌ను తెలంగాణకు ఇస్తున్నాం. వీటీపీఎస్‌ను 90 శాతం సామర్థ్యంతో పనిచేయిస్తూ వాటా ఇస్తున్నాం. రెగ్యులేటరీ కమిషన్ అప్రూవల్ లేని కృష్ణపట్నం, హిందూజాల్లో వాటా ఇవ్వాలని చట్టంలో లేదు. భవిష్యత్‌లో వచ్చే ప్రాజెక్టుల్లోనూ వాటా అడగడం ప్రజాస్వామ్యం కాదు. గ్యాస్ ఆధారిత ప్రాజెక్టుల్లో ఉత్పత్తి మొదలైతే 2,000 మెగావాట్ల వరకు ఇస్తాం.
30న హెల్త్‌కార్డుల పథకం ప్రారంభం
ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నామని సీఎం తెలిపారు. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో.. చికిత్స గరిష్ట వ్యయంపై పరిమితి తొలగించే విషయంలో ఆయన స్పష్టత ఇవ్వలేదు.
విశాఖవాసులు తుపానును జయించారు
బీచ్ రోడ్డులో కాగడాల ప్రదర్శన ఏటా అక్టోబరు 12న విశాఖలో పునరంకిత సభ: బాబు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖప్రజల ఉక్కు సంకల్పం, ఆత్మస్థైర్యం ముందు హుదూద్ తుపాను ఓడిపోయిందని సీఎం చంద్రబాబు చెప్పారు.తుపాను తాకిడికి దెబ్బతిన్న విశాఖపట్నానికి పూర్వవైభవం తేవడమే కాదు ప్రపంచంలోనే అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతానని భరోసానిచ్చారు. హుదూద్ వల్ల కలిగిన కష్టాలు, నష్టాలు ఇంకా తీరలేదని... తాత్కాలికంగానే కొంత కోలుకున్నారని చెప్పారు. ‘హుదూద్ తుపానును జయిద్దాం’ అనే నినాదంతో విశాఖపట్నం బీచ్‌రోడ్డులో బుధవారం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ... విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధిని వేగవంత చేస్తామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి తుపానులనైనా ఎదుర్కోగల రీతిలో అత్యాధునిక పరిజ్ఞానంతో నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. తుపానుపై విజయానికి గుర్తుకు ఏటా అక్టోబరు 12న విశాఖ బీచ్‌రోడ్డులో పునరంకిత సభను నిర్వహిస్తామన్నారు. విశాఖను ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దుతారని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడుతూ చెప్పారు. కాగా తుపాను భాదితుల సహాయార్థం విశాఖ స్టీల్‌ప్లాంట్ రూ.5 కోట్లు ప్రకటించింది. గురువారం సీఎం చంద్రబాబుకు స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ ఈ మేరకు చెక్కును అందచేయనున్నారు.