సిద్దిపేట ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న మధ్యతరగతి విద్యార్థిని ఆవిష్కరించిన ప్రదర్శనకు జాతీయ స్థాయిలో చోటు లభించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్‌స్పైర్ సైన్స్ ఫెయిర్‌లో మెతుకుసీమ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది.
మెదక్ మండలంలోని తిమ్మాయిపల్లికి చెందిన విద్యార్థిని మానస రెండేళ్ల క్రితం జరిగిన జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న విషయం విదితమే. ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఇర్కోడ్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని కృష్ణశ్రీ ఆవిష్కరించిన ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.
ఈ క్రమంలో ఈ నెల 22నుంచి 24వ వరకు వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో కృష్ణశ్రీ ప్రయోగం జాతీయ స్థాయికి ఎంపికైంది. ఈ పోటీలకు పది జిల్లాల నుంచి 696 ప్రదర్శనలు రాగా న్యాయనిర్ణేతలు వీటిలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన 35 ప్రయోగాలను జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గురువారం ‘సాక్షి’ కృష్ణశ్రీని అభినందించి తన మనోభాలను తెలుసుకుంది.
విద్యుత్ కొరతే ఆవిష్కరణకు నాందిగా...
ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరత, నీటి వృథాను నియంత్రించే లక్ష్యంతో పాఠశాల ప్రిన్సిపల్, సబ్జెక్ట్ టీచర్ చొరవతో మురుగు నీటితో విద్యుత్ ఉత్పత్తి ప్రదర్శనకు నాంది పలికినట్లు విద్యార్థిని కృష్ణశ్రీ తెలిపింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ చిన్నారి ఇర్కోడ్ మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు స్వరూప, నగేష్‌లు ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. 7వ తరగతి వరకు సిద్దిపేటలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో చదివిన కృష్ణశ్రీ ఇర్కోడ్‌లోని ఆదర్శ పాఠశాలలో 8వ తరగతిలో ప్రవేశం పొందింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్ అవార్డుల ఎంపికకు వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తోందని తెలుసుకున్న కృష్ణశ్రీకి ‘వ్యర్థజలాలతో విద్యుత్ ఉత్పత్తి’ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలకు చెందిన గైడ్ టీచర్ ముఖేష్ సహకారంతో తన ఆలోచనకు పదును పెట్టింది. స్థానికంగా దొరికే వస్తువులతో ప్రయోగాన్ని ప్రారంభించి విజయవంతంగా ప్రదర్శించింది. మెదక్‌లో జరిగిన జిల్లా స్థాయి ప్రదర్శనలో ఈ ప్రయోగం ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అక్కడ కూడా తన ప్రయోగం, వాక్చాతుర్యం ద్వారా న్యాయనిర్ణేతల మెప్పు పొంది తన ప్రదర్శనను జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా సత్తాచాటింది.
ఆవిష్కరణ సమగ్ర రూపం అంశం: మురుగు నీటితో విద్యుత్ ఉత్పత్తి.
కావలసిన పరికరాలు: అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బాక్స్‌లు, ప్లాస్టిక్ పైప్‌లు, డైనమో, మోటార్, చిన్న ఫ్యాన్, ఫ్లైవుడ్, గ్రీన్ సీట్.
ప్రయోగ విధానం: మురుగు కాల్వల నుంచి వచ్చే నీటిని ఒక గది (చాంబర్)లో నిల్వ చేయాలి. దానిని 20 నుంచి 30 రోజుల వరకు నిల్వ ఉంచాలి. అలా నిల్వ ఉంచడం వల్ల దానిలో సూక్ష్మజీవులు పెరుగుతాయి. దీనివల్ల ఈ నీటిలో సీహెచ్4 (మిథేన్ గ్యాస్) ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన గ్యాస్‌ను, మిథేన్ చాంబర్‌లో నిల్వ చేయాలి. నిల్వ చేసిన మిథేన్‌ను పైప్‌ల ద్వారా ఫర్నెన్స్ అనే చాంబర్‌లోకి పంపించాలి. దీనిలో గ్యాస్‌ను మండించడం వల్ల ఉష్ణం వెలువడుతుంది. దీన్ని హీట్ ఎక్స్‌చేంజర్ చాంబర్‌లోకి పంపించాలి.
నిల్వ ఉంచిన గది నుంచి మురుగు నీటిని పైప్‌ల ద్వారా బాయిలర్‌లోకి పంపిస్తాం. బాయిలర్‌లో మురికి నీరు, ఉష్ణం కలవడం వల్ల నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరిని మనం పైప్‌ల ద్వారా ఫర్నెన్స్ గదిలోకి పంపిస్తాం. నీటి ఆవిరి వేగంగా ఫర్నెన్స్‌ను తిప్పుతాయి. దీని వల్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మరోవైపు విద్యుత్ ఉత్పాదన సమయంలో కొంత స్వచ్ఛమైన నీరు ఏర్పడుతుంది. ఆ నీటిని మనం వ్యవసాయ, ఇతర నిర్మాణ రంగాలకు వాడుకోవచ్చు.
ఉపయోగాలు...
ఈ ప్రయోగం ద్వారా అనేక ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం ఉండదు. నీరు వృథా కాదు, భూగర్భ జలాశయాలను కాపాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. మిగిలిన స్వచ్ఛమైన నీటిని వ్యవసాయ, ఇతర పనులకు వాడుకోవచ్చు.
మేధావులను మెప్పించిన ‘మోడల్’ విద్యార్థి
Published Thu, Sep 25 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM
Advertisement
Advertisement