
సిద్దిపేట: మళ్లీ ఎన్నికలు వస్తే అధికారం తమదేనని అంటున్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రజతోత్సవ సంబరాలకు బీఆర్ఎస్(టీఆర్ఎస్) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. దీనిలోభాగంగా ఈరోజు(శనివారం) ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్ లో ఈ మూడు జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారితో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల కూడా తగ్గిపోయాయి. రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదు. కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మళ్లీ ఎన్నికల్లో అధికారం మనదే’ అని కేసీఆర్ శ్రేణులకు ధైర్యం నూరిపోశారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఎలా సన్నద్ధం కావడంపై కేసీఆర్ పార్టీ నాయకులకు వివరించినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులతో పాటు ప్రజలను బహిరంగ సభకు తరలించే అంశాలను ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
