
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ మనసంతా విషాన్ని నింపుకొని ప్రసంగించారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎల్కతుర్తిలో కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పుల అంశాన్ని కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదంటూ పొంగులేటి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను కేసీఆర్ విలన్‌లా చూపిస్తూ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా?. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. అభివృద్ధి, సంక్షేమాన్ని సమంగా ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.
‘‘కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీకి ఎప్పుడూ రాలేదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్లు మొక్కిన విషయం గుర్తుకు లేదా?. దొరపాలన చేసింది మీరు కాదా?. బీఆర్‌ఎస్‌కు రెండుసార్లు అధికారం ఇస్తే ఏం చేశారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ కావాలనే కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ వల్ల ధనిక తెలంగాణ.. అప్పుల రాష్ట్రంగా మారింది. వరి వస్తే ఉరి అన్నది మీరు కాదా?. సర్పంచ్‌లకు బకాయిలు పెట్టింది మీరు కాదా?’’ అంటూ పొంగులేటి ప్రశ్నాస్త్రాలు సంధించారు.
‘‘అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. కేసీఆర్ పదేళ్లలో కలిపి లక్ష ఇళ్లు కూడా ఇవ్వలేదు. మేం నాలుగున్నర లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం.’’ అని పొంగులేటి పేర్కొన్నారు.
మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసీఆర్‌కు ఉందా? మంత్రి సీతక్క
ఒక నియంత అధికారని కోల్పోయి మాట్లాడినట్లు ఉంది కేసీఆర్ స్పీచ్. నీ కుటుంబంలో చీలికలు, పేలికలు పెరుగుతున్నాయన్న బాధ కేసీఆర్‌లో కనిపించింది. పది నెలల్లో 59,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. మీరెంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ బిడ్డ మంచి మంచి కార్లలో తిరుగుతుంది. మా పేద ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో తిరగకూడదా?. కేసీఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరు వాడుకోలేదు. 60 వేల కోట్ల కరెంట్ బిల్లుల బకాయిలను పెట్టి వెళ్లిపోయావు. ధర్నా చౌక్‌లలో కేసీఆర్ ధర్నాలు కూడా చేయనీయలేదు. కేసీఆర్ సభ దగ్గర రైతుల కాలువలను పూడ్చి సభ నిర్వహించారు. అసెంబ్లీని సొల్లు కబురు అని కేసీఆర్ అవమానించారు. మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసీఆర్‌కు ఉందా?. అసెంబ్లీ సొల్లు కబురు అయితే నీ కొడుకు, నీ అల్లుడ్ని అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నావు?

‘విలన్’ వ్యాఖ్యలు కేసీఆర్ ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ విలన్ అంటూ చేసిన కేసీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేరన్న విషయం కేసీఆర్‌కు తెలుసు. కేసీఆర్ సభకు జనం రాకపోతే పోలీసుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేపం నెట్టడం సరైనది కాదు. అగ్గిపెట్ట రాజకీయానికి ప్రాణాలర్పించిన తెలంగాణ వాళ్లకు కనీసం నీవాళ్లు అర్పించారా?. కేసీఆర్ సభకు జనం రాకపోవడం వల్లే... అర్థగంటసేపు ఆయన ప్రాంగణానికి వచ్చి కూడా వేదిక పైకి రాలేదు.