
భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. వరంగల్‌లో జరిగిన పార్టీ రజతోత్సవ సభను విజయవంతంగా నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ సభ పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు, నేతల ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఉపయోగపడుతుందని విశ్లేషకుల అంచనా. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పాలనపై ఇప్పటికే అసంతృప్తి ఏర్పడ్డ నేపథ్యంలో ప్రజల దృష్టి బీజేపీవైపు కాకుండా బీఆర్‌ఎస్‌కు అధికారం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఏర్పడేందుకు కూడా వరంగల్ బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఉపయోగపడుతుంది.
2023లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం అనూహ్యమే. దీంతో పార్టీ శ్రేణుల్లోనూ నైరాశ్యం నెలకొంది. ఆ తరువాత జరిగిన పార్లమెంటు, శాసన మండలి ఎన్నికల్లోనూ ఓటమే ఎదురు కావడంతో పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. రాజకీయాలలో ఒడిదుడుకులు ఉండటం సహజం. రాజకీయ పార్టీలకు ఇలాంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎదుర్కొన్నాయి. 1983 నుంచి 1989 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 1989 లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత 1991లో 13 సీట్లు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్నారు. కానీ ఆయన ఒంటెద్దు పోకడల ఆరోపణలు, వ్యతిరేకత ఉందని తెలిసి సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వడం వంటి అనేకానేక కారణాల వల్ల 2023 ఎన్నికల్లో పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదానైతే దక్కించుకుంది కానీ.. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కొంత నష్టం చేసింది.
రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం, తదితర అంశాలపై విచారణ కమిషన్లు వేయడం కూడా పార్టీపై వ్యతిరేక ప్రచారం జరిగేందుకు అవకాశమిచ్చింది. దీన్ని అధిగమించడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజలలో వ్యతిరేకత పెంచడానికి కేసీఆర్ ఈ రజతోత్సవ సభను వాడుకున్నారు. తన పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడాను వివరించి, ప్రస్తుతం తెలంగాణ ఆగమవుతోందని, అది చూసి తనకు దుఃఖం వేస్తోందని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణ ఉద్యమం నాటి సంగతులు, 1956 నుంచి జరిగిన రాజకీయ పరిణామాలు అన్నింటినీ ప్రజలకు వివరించడం ద్వారా మరోసారి సెంటిమెంట్‌ను ప్రయోగించే యత్నం చేసినట్లు స్పష్టంగా బోధపడుతుంది. ఈ క్రమంలో 1956లో ప్రజలంతా తెలంగాణ, ఏపీలో కలపడానికి వ్యతిరేకించారని ఆయన చెప్పడం కొంత వక్రీకరించడమే అవుతుంది. ఎందుకంటే అప్పట్లో తెలంగాణ, ఆంధ్రలు కలవడానికి అంగీకరించని వారు కొంతమంది ఉండవచ్చు కానీ, హైదరాబాద్ శాసనసభలో ఉమ్మడి ఏపీకి అనుకూలంగా మెజార్టీ సభ్యులు మాట్లాడారు.
అంతేకాదు.. అంతకుముందు ప్రముఖుల సారథ్యంలో తెలంగాణలో సైతం ఆంధ్ర మహాసభలు జరిగేవి. చరిత్రను ఎవరికి అనుకూలంగా వారు చెప్పుకోవచ్చు. అది వేరే విషయం. 2009లో సోనియాగాంధీ తెలంగాణ ప్రకటన చేయడం కీలకమైన మలుపు. టీఆర్‌ఎస్‌కు అప్పట్లో ఇద్దరు ఎంపీలే ఉండేవారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం, తదనంతరం జరిగిన పరిణామాలలో తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు పలువురు ప్రత్యేక రాష్ట్ర సాధనకు కట్టుబడి ఉండటం, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వంటి అంశాలు కలిసి వచ్చాయి.
తెలంగాణ వాదంతో కాంగ్రెస్, టీడీపీలను కేసీఆర్ భయపెట్టగలిగారు. ఆ పార్టీలను తనదారిలోకి తెచ్చుకోగలిగారు. అంతవరకు ఉన్న రాజకీయ ఉద్యమం, ప్రజా ఉద్యమంగా మారే పరిస్థితులు ఏర్పడడం కలిసి వచ్చిన అంశం అని చెప్పాలి. ఏది ఏమైనా తెలంగాణకు సంబంధించినంత వరకు గతంలో నాయకత్వం వహించిన చెన్నారెడ్డి, తదితరులకు భిన్నంగా కేసీఆర్ పనిచేసిన మాట నిజం. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వాదానికే కట్టుబడి రాజకీయం చేశారు. నిజానికి ఇదంతా గతం. ఇప్పుడు ఆ అంశాలను ప్రస్తావించి కాంగ్రెస్ ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలనే అని చెప్పడంలో హేతుబద్దత ఎంత ఉందన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, పొన్నం, సీతక్కలు ప్రశ్నించారు.
అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తారు. అదే పని కేసీఆర్ చేశారు. బీజేపీపై మాత్రం నామమాత్రపు విమర్శలు చేశారనే చెప్పాలి. అంత భారీ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడటం కూడా విశేషమే. సాధారణంగా ఇలాంటి సభలలో నాయకుడు వచ్చేలోగా పలువురు నేతలు మాట్లాడుతుంటారు. ఈసారి అలా చేయలేదు. కాకపోతే పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు అయిన కేటీఆర్ ప్రాముఖ్యతను మరింత పెరిగేలా ఈ సభలలో జాగ్రత్తపడ్డారని అనుకోవాలి. సభా వేదికపై కూడా కేసీఆర్‌తోపాటు ఆయన ఫోటో కూడా ఉంచారు. కేసీఆర్ తన స్పీచ్‌ను మరీ ఎక్కువ సేపు చేయలేదు. అంతేగాక.. పరుష పదాలతో కాంగ్రెస్‌ను తీవ్రంగా రెచ్చగొట్టే యత్నం కూడా చేసినట్లు అనిపించదు. కాంగ్రెస్ పాలనపై గట్టి విమర్శలే చేస్తూ, ప్రధానంగా తెలంగాణ ఆగమైందని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని, రైతులు పాట్లు పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రస్తావించి వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్లు ప్రస్తావించకుండా ప్రసంగించడం కూడా చెప్పుకోదగిన అంశమే.
కాంగ్రెస్ పార్టీ హామీలపై బాండ్లు రాసిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో వాస్తవం ఉందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కొన్ని వాగ్దానాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపయోగం లేదని ఆయన తేల్చారు. తన పాలన గురించి చెబుతూ ప్రత్యేకించి రాష్ట్రంలో నీరు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించడంలో నెంబర్ వన్‌గా ఉన్నామని, భూముల విలువలు పెరగడానికి దోహదపడ్డామని, రైతుబంధును అమలు చేయడం ద్వారా రైతులకు మేలు చేశామని ఆయన వివరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని, పోలీసులకు రాజకీయాలు వద్దని ఆయన సూచించారు. ఆయా సందర్భాలలో సభలోని వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై చేస్తున్న ఆరోపణలు, అధిక అప్పుల భారం, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాల జోలికి వెళ్లలేదు.
కేసీఆర్ స్పీచ్ ముగిసిన వెంటనే మంత్రులు గట్టిగానే జవాబు ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ఆయన చేసిన విమర్శలపై చర్చకు సిద్దమని అన్నారు. పొన్నం ప్రభాకర్ అయితే గ్రీన్‌మ్యాట్ వేసి ప్రజలు అధికంగా వచ్చినట్లు చూపే యత్నం జరిగిందని ఆరోపించారు. కాకపోతే గతంలో మాదిరి కాకుండా, ఇప్పుడు కనుచూపు మేర కుర్చీలు వేశారు. రాజకీయ సభల నిర్వహణలో చాలా మార్పులు వస్తున్నాయి. ఏ పార్టీ సభ జరిగినా, గతంలో ఒకటి, రెండు బ్లాక్‌లు తప్ప, అంతా కిందే కూర్చునేవారు. ఇప్పుడు అలా చేయడం లేదు. విశేషం ఏమిటంటే కేసీఆర్‌పై విమర్శలు చేసిన మంత్రులలో పొంగులేటి, జూపల్లి గతంలో బీఆర్‌ఎస్ ప్రముఖులు. గత ఎన్నికల సమయంలో వారు కాంగ్రెస్ పక్షాన పోటీచేసి గెలిచారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకంటే చిన్నవాడు కావడం, కొందరు మంత్రులు గతంలో తన వద్ద పని చేసినవారు కావడం తదితర కారణాల వల్ల బహుశా ఆయన ఈగో సమస్య ఎదుర్కొంటున్నారని అది కేసీఆర్ స్పీచ్‌లో కనిపించిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది కొంతవరకు నిజమే కావచ్చు. ఓవరాల్‌గా పరిశీలిస్తే రజతోత్సవ సభకు జనం బాగానే వచ్చారు. స్పందన కూడా బాగానే ఉంది.
కానీ, ఇదే వరంగల్‌లో ఉద్యమ సమయంలో ఇంతకన్నా భారీ బహిరంగ సభలే జరిగాయి. అయినా భారీ సభలే అన్నిటికి కొలమానం కావు. కాకపోతే జనంలో పార్టీ పట్ల ఒక నమ్మకాన్ని పెంచడానికి రజతోత్సవ సభ కొంతమేర అవకాశం కలిగిస్తుంది. కేసీఆర్ ఒక్కరే మాట్లాడడం వల్ల ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కేసీఆర్ పూర్వపు స్పీచ్‌ల మాదిరి మరీ ఘాటుగా మాట్లాడలేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అదేమీ తప్పు కాదు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉన్నప్పటికీ, ఈ సభ ద్వారా తాను మళ్లీ బయటకు వచ్చి జనంలో తిరుగుతానని కేసీఆర్ చెబుతున్నారు. ఇప్పటికీ కేసీఆర్ గ్లామర్ పైనే బీఆర్ఎస్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇది కీలకం.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.