sewage water
-
మురుగునీటి పరీక్షలతో.. కోవిడ్ కొత్త రకాల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: మురుగునీటిని తరచూ పరీక్షిస్తుండటం ద్వారా కోవిడ్ రాక, కొత్త రూపాంతరితాలను గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతే కాకుండా సామాజిక స్థాయిలో వ్యాధి వ్యాప్తిని, వైరస్ మోతాదును అంచనా వేసేందుకు ఇది చౌక పద్ధతిగా దోహదపడుతుందన్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్, బీమ్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్ బెంగళూరులో 28 చోట్ల నుంచి మురుగునీటిని సేకరించి జన్యు పరీక్షలు నిర్వహించాయి. గతేడాది జనవరి నుంచి జూన్ వరకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ నమూనాలను ఆర్టీ–పీసీఆర్ పరీక్షలకు జరిపాయి. ఈ ఫలితాల ఆధారంగా వైరస్ వ్యాప్తి, వాటిల్లో జరుగుతున్న మార్పులను తెలుసుకోవడం వీలైందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఫరా ఇష్టియాక్ తెలిపారు. సాధారణ పద్ధతులతో పోలిస్తే మురుగునీటిలో జన్యువుల కోసం పరీక్షలు జరపడం ద్వారా ఎక్కువ రూపాంతరితాలు గుర్తించామని వివరించారు. ఈ పద్ధతిని భవిష్యత్తులో ఇతర వైరస్ల గుర్తింపునకు కూడా ఉపయోగించవచ్చని టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఈ అధ్యయనం వివరాలు లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్ ఈస్ట్ ఆసియా తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
హైదరాబాద్‌లో నిత్యం ఎంత మురుగు వస్తుందంటే...
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో మురుగు శుద్ధి ప్రహసనంగా మారింది. దేశంలో పట్టణ ప్రాంతాల్లో రోజువారీగా వెలువడుతోన్న వ్యర్థజలాల్లో కేవలం 28 శాతమే శుద్ధి జరుగుతోందని ఇటీవల నీతిఆయోగ్ ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. ఈ నేపథ్యంలో మన నగరంలో రోజువారీగా సుమారు 2000 మిలియన్ లీటర్ల మురుగు జలాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో కేవలం వెయ్యి మిలియన్ లీటర్ల వ్యర్థజలాల శుద్ధి జరుగుతోంది. మిగతా సగం ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్, జంటజలాశయాలు, చారిత్రక మూసీ నదిని ముంచెత్తుతుండడంతో ఆయా జలవనరులు కాలుష్యకాటుకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా దుస్థితి ఇదీ... నీతిఆయోగ్ ఇటీవల ‘అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా’ పేరుతో విడుదల చేసిన తాజా నివేదికలో పలు ఆందోళనకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 323 నదుల్లో 351 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షించగా..ఇందులో 13 శాతం తీవ్రంగా..మరో 17 శాతం మధ్యస్థ కాలుష్యం ఉన్నట్లు తేలింది. ఆయా జలాశయాల నీటిలో భారలోహాలు, ఆర్సినిక్, ఫ్లోరైడ్స్ విషపూరిత రసాయనాలు, ఫార్మా అవశేషాలున్నట్లు గుర్తించారు. సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు సైతం కలుషితమైనట్లు గుర్తించారు. గ్రేటర్ సిటీలో పరిస్థితి ఇలా... ► గ్రేటర్ పరిధిలో నిత్యం గృహ,వాణిజ్య,పారిశ్రామిక వాడల నుంచి 2 వేల మిలియన్ లీటర్ల మురుగు జలాలు ఉత్పన్నమౌతున్నాయి. ► ఇందులో సుమారు వెయ్యి మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను సుమారు 25 మురుగు శుద్ధి కేంద్రాల్లో జలమండలి శుద్ధి చేస్తోంది. ► మిగతా మురుగు నగరవ్యాప్తంగా ఉన్న జలవనరుల్లో కలుస్తోంది. కాగా భవిష్యత్‌లో మురుగు నగరాన్ని ముంచెత్తుతోందన్న అంచనాతో మిగతా వెయ్యి మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేందుకు దశలవారీగా మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించాలని సంకల్పించింది. రాబోయే ఐదేళ్లలో నగరంలో మూడు ప్యాకేజీలుగా 31 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నట్లు జలమండలి ప్రకటించింది . ► తొలివిడతగా రూ.1280 కోట్లతో నగరంలో పలు చోట్ల 17 ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులు ఈ ఏడాది చివరి వరకు పూర్తయ్యే అవ కాశాలున్నాయి. ఇక మరో 14 ఎస్టీపీలను దశలవారీగా నగరంలో నిర్మించనున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. మొత్తంగా 31 ఎస్టీపీలను రూ.3866.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని.. వీటిలో రోజువారీగా 1000– 1282 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేయవచ్చని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి) -
షాకింగ్ బీర్: వావ్ అంటారా? యాక్ అంటారా?
బీర్ అంటే ఇష్టపడని మందుబాబులు ఎవరైనా ఉంటారా? మార్కెట్లో విభిన్న ఫ్లేవర్లలో, రక రకాల బ్రాండ్లలో బీర్లు లభ్యమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త రకమైన బీర్ అందుబాలోకి వచ్చింది. ఈ వెరైటీ బీరుకు లభిస్తున్న ఆదరణ చూస్తే.. మరి వావ్.. అనాల్సిందే. వాస్తవానికి ఆ బీర్ దేనితో తయారువుతుందో తెలిస్తే షాక్ అవుతారు. ఇది తెలిసి వావ్ అంటారో లేదంటే.. యాక్ అంటారో మీరు తేల్చుకోండి. ఎందుకంటే ఈ బీర్ యూరిన్‌తో తయారవుతుంది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే దాదాపు 20 సంవత్సరాల నాటి మురుగునీటిని శుద్ధిచేసి మరీ తయారుచేస్తున్న 'యూరిన్ బీర్'ను గ్రీన్ బీర్‌గా ప్రచారం చేస్తోంది. సింగప్‌పూర్‌లోని న్యూబ్రూ కంపెనీ. సింగపూర్ న్యూబ్రూ ఉత్పత్తి చేస్తున్న యూరిన్ బీర్‌కు భారీ ఆదరణ లభిస్తుండటం విశేషం. పలురకాల పరీక్షలు, వివిధ దశల్లో వడపోత తర్వాత ఆరోగ్యకరమైన బీర్‌ను తయారు చేస్తున్నామని, త్రాగడానికి సురక్షితమని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా తమ స్పెషల్ బీరు ఆరోగ్యానికి ఆరోగ్యం, అద్భుతమైన రుచి కూడా అని తెలిపింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, నీటి కొరతపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టిన ప్రభుత్వ నీటి సంస్థ, ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న పరిష్కారాల్ని అన్వేషిస్తోంది. బీర్లో 90 శాతం నీరు ఉంటుందనీ అందుకే అల్ట్రా-క్లీన్ హై-గ్రేడ్ రీసైకిల్ వాటర్‌తో తయారు చేస్తున్నామని కంపెనీ తెలిపింది. సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్, వాటర్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ వాటర్ ఏజెన్సీ, స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ 'Brewerkz' న్యూబ్రూ ఏప్రిల్ 8న ప్రారంభించింది. నీటి రీసైక్లింగ్, పునర్వినియోగంపై అవగాహన కల్పించేందుకే న్యూబ్రూ సింగపూర్ 'గ్రీనెస్ట్ బీర్' ఆవిష్కరణ అని కంపెనీ ఎండీ ర్యాన్ యుయెన్ వెల్లడించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా నీళ్లు, టీ, తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం బీర్. వికీపీడియా, ఫార్చ్యూన్ బిజినెస్ ఇన్సైట్స్ అందించిన అంచనాల ప్రకారం, 2021లో 768.17 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ బీర్ మార్కెట్ 2028 నాటికి 989.48 బిలియన్ల డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. -
హైదరాబాద్‌కు ఒక్కరోజే ... 5,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంగా మారుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధి, మంచినీటి సరఫరా కోసం ఒక్కరోజులోనే రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని.. ఇలా నిధులివ్వడం దేశచరిత్రలో ఇదే మొదటిసారి అని ఐటీ, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని.. శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిధులిచ్చారని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి సమస్యకు 95శాతం పరిష్కారం చూపాం. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో రాష్ట్రమంతటా మంచినీటి సరఫరా చేస్తున్న ప్రభుత్వం మాది. జీహెచ్ఎంసీ పరిధిలో సగటు రోజుకు 1,650 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం 772 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేసే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నా యి. అందుకే జీహెచ్ఎంసీలో 100% మురుగునీటి శుద్ధి చేయాలనే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. భవిష్యత్తులో నాలాలు, చెరువులను బాగు చేయాలంటే మొదట మురుగునీటి శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడున్న అవసరంతోపాటు రాబోయే పదేళ్ల అవసరాలకు ఎస్టీపీలు నిర్మించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేశాం. ప్రస్తుతమున్న 772 ఎంఎల్డీల శుద్ధి సామర్థ్యానికి అదనంగా మరో 1,260 ఎంఎల్డీల శుద్ధి సామర్థ్యమున్న ఎస్టీపీలను నిర్మించడానికి ప్రభుత్వం రూ.3,866.20 కోట్లను గురువారం మంజూరు చేసింది..’’అని కేటీఆర్ తెలిపారు. నగరంలోని 31 ప్రాంతాల్లో ఎస్టీపీలను నిర్మిస్తామని.. అవి పూర్తయితే సిటీ పరిధిలోని, శివారు ప్రాంతాల్లోని చెరువులు, నాలాలు బాగుపడతాయని చెప్పారు. నాలాలను పునరుద్ధరిస్తాం.. ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు) తరహాలో ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు)ని ప్రభుత్వం చేపడుతోందని కేటీఆర్ తెలిపారు. ‘‘భారీ వర్షాలు, వరదలతో ఒక్క కుటుంబం కూడా ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును తలపెట్టాం. నాలాల పరిధిలో ఉన్న ఇళ్లు, ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇప్పటికే సర్వే నిర్వహించి నివేదిక తయారు చేశాం. ఇళ్లు కూడా నిర్మించి సిద్ధం చేశాం. ఒక్కో ఇంటిని రూ.9 లక్షలతో చేపట్టాం. బహిరంగ మార్కెట్లో వాటి ధర రూ.40–50 లక్షల వరకు ఉంటుంది..’’అని కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ అనుమతితోపాటు ప్రజల సహకారం ఉంటేనే ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని పేర్కొన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు రిజర్వాయర్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1,200 కోట్లు విడుదల చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ శివార్లలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 137 మిలియన్ లీటర్ల సామర్థ్యమున్న రిజర్వాయర్లను నిర్మించనున్నాం. దాదాపు 2,100 కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు ఏర్పాటు చేసి.. కొత్తగా 2లక్షల మంచినీటి కనెక్షన్లు ఇస్తాం. అదనంగా దాదాపు 20 లక్షల జనాభాకు శుద్ధమైన తాగునీరు అందుతుంది. రానున్న రెండేళ్లలోనే ఎస్టీపీలు, రిజర్వాయర్ల నిర్మణ పనులు పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం..’’అని కేటీఆర్ వెల్లడించారు. దేశంలో వందశాతం మురుగు నీటిని శుద్ధి చేసే నగరం కేవలం జీహెచ్ఎంసీ మాత్రమే అవుతుందని.. విశ్వనగర కల సాకారం దిశగా ఇదో గొప్ప పరిణామమని పేర్కొన్నారు. మంచినీటి సరఫరా పనులను పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఏర్పాటు చేస్తామని.. ఎస్టీపీల నిర్వహణను హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో చేపడతామని వివరించారు. -
దేశంలోనే మనది నెంబర్ వన్ సిటీ: కేటీఆర్
బాలానగర్: ‘దేశంలో ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్ నగరంలో జరిగింది. అందుకే మన సిటీ నెంబర్ వన్ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఎల్బీఎస్ నగర్లో జలమండలి ఆధ్వర్యంలో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రేటర్ నగరం రోజు రోజుకి విస్తరిస్తోందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తుండటంతో ప్రజలు నగరం నలుమూలలకు తమ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు ఎంసీహెచ్ 150 నుంచి 160 చదరపు కిలోమీటర్ల మేరకు ఉండేదని, జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందిన తర్వాత నగరం 625 చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగిందన్నారు. దీంతో ప్రతిరోజు నగరంలో 1950 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పన్నమవుతోందని, దీనిలో 94 శాతం మురుగు నీరు గ్రావిటి ద్వారా మూసీనదిలోకి వెళుతుందని పేర్కొన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయకుంటే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలుపుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భోలక్‌పూర్‌లో మంచినీరు కలుషతిమై 9 మంది చనిపోయారని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 శాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని అన్నారు. నగరం చుట్టూ ఉన్న చెరువులను సుందరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ‘మూసీ నదిని జీవనదిగా మార్చాలి. మన నగరాన్ని విశ్వనగరంగా మార్చాలి. ఇందుకు అందరూ సహకరించాలి’ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రజలు నాలాలు, మురికి కాల్వల్లో చెత్తను వేయవద్దని చెప్పారు. మనందరం కలిసి మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందిద్దాం అన్నారు. ఈ సందర్భంగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తాను అడిగిన వెంటనే నియోజకవర్గంలోని 9 చెరువులకు నిధులు మంజూరు చేశారని కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, ముద్దం నర్సింహయాదవ్, శిరీష బాబురావు, సబిహా బేగం, జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మురుగు నీటిలోనూ కరోనా వైరస్ ఆనవాళ్లు
హైదరాబాద్: మహానగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ సీసీఎంబీ కీలక విషయాలను వెల్లడించింది. కరోనా వైరస్ కేవలం ముక్కు, నోటి నుంచి వెలువడే స్రావాల ద్వారా మాత్రమే వ్యాప్తిచెందుతుండగా తాజాగా మురుగు నీటిలోనూ వైరస్ ఆనవాళ్లు ఉంటాయని సీసీఎంబీ తెలిపింది. అయితే మురుగు నీటిలో వైరస్ ఉనికి గుర్తించినా ఇది వేరొకరికి సంక్రమించదని స్పష్టం చేసింది. సీసీఎంబీతో కలిసి సీఎస్ఐర్, ఐఐసీటీ తదితర సంస్ధలు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 80 శాతం మురుగు నీటి కేంద్రాల్లో వైరస్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ పరీక్షలన్ని సీసీఎంబీ కరోనా పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు. మరోవైపు ఈ పరీక్షలలో పాల్గొనడానికి ఐఐసీటీ నుండి మునుపాటి హేమలత, హరీష్ శంకర్, వెంకట్ మోహన్, సీసీఎంబీ నుంచి ఉదయ్ కిరణ్, కుంచా సంతోష్ కుమార్, రాకేశ్ మిశ్రాలు పాల్గొన్నారు. వివిధ అధ్యయనాల చేయడం ద్వారానే వైరస్ మూలాలను కనుక్కోవచ్చని, తద్వారా వైరస్ నిరోధానికి ప్రణాళికలు రచించవచ్చని సీసీఎంబీ పేర్కొంది. చదవండి: మధుమేహ నిర్ధారణకు కొత్త మార్గం! -
మురుగునీటిలోనూ కరోనా వైరస్
యశవంతపుర: కరోనా సోకిన బాధితుడు తుమ్మడం, దగ్గడం వల్ల వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందని ఇప్పటిదాకా తెలుసు. కానీ, మురుగునీటి వల్ల కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని కర్ణాటకలోని ప్రముఖ పర్యావరణవేత్త యల్లప్పరెడ్డి చెప్పారు. బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్తలు నిర్మలగౌడ, డాక్టర్ నిధి పలివాల్ తదితరులతో కలిసి ఆయన నగరంలో పరిశోధనలు చేశారు. మురుగునీటిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరులోని మురుగునీరు వృషభారతి, అర్కావతి నదుల్లో కలుస్తోంది. పాదరాయనపుర, బాపూజీనగర వార్డులో ఎక్కువ మంది కరోనా రోగులున్నారు. ఇక్కడి డ్రైనేజీ నీరు నేరుగా వృషభావతి నదిలోకి వెళ్తోంది. కరోనా బాధితుల నుంచి వైరస్ తొలుత మురుగు నీటి, అక్కడి నుంచి నదిలో చేరుతోందని యల్లప్పరెడ్డి పేర్కొన్నారు. -
మురుగు శుద్ధిలో గ్రేటర్ నం.1
సాక్షి, హైదరాబాద్: మురుగునీటి శుద్ధిలో గ్రేటర్ హైదరాబాద్ నగరం మహానగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మన సిటీలో నిత్యం గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడే మురుగు నీటిలో 43 శాతం శుద్ధి జరుగుతుండటం విశేషం. ఇటీవల ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. మహానగరాల్లో వెలువడే మురుగు నీటిని సాంకేతిక పద్ధతులతో శుద్ధి చేసి నిర్మాణ రంగం, పరిశ్రమలు, గార్డెనింగ్, వాహనాల క్లీనింగ్ వంటి అవసరాలకు వినియోగించాలని ఈపీటీఆర్ఐ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కాగా దేశంలో పలు మెట్రో నగరాలకు మురుగు ముప్పు పొంచి ఉంది. రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న మురుగు నీటిలో శుద్ధి ప్రక్రియ 40 శాతానికి మించకపోవడం ఆందోళన కలిగి స్తోంది. మెట్రో నగరాలైన ముంబైలో 40%, బెంగళూర్‌లో 39, చెన్నైలో 37, ఢిల్లీలో 35, కోల్‌కతాలో 34 శాతమే శుద్ధి జరుగుతున్నట్లు ఈ నివేదికలో స్పష్టం చేసింది. మురుగు మాస్టర్ ప్లాన్ ఇదీ... ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు విస్తరించిన మహానగరంలో మురుగు అవస్థలకు శాశ్వతంగా చరమగీతం పాడేందుకు సీవరేజి మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది. సిటిజన్లకు మురుగు అవస్థలు లేకుండా చూసేందుకు రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర సీవరేజి మాస్టర్‌ప్లాన్ అమలు చేసేందుకు జలమండలి ముంబైకి చెందిన షా కన్సల్టెన్సీ నిపుణుల సౌజ న్యంతో ఈ మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నిత్యం వెలువడుతోన్న 2,133 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రతి రెండుమూడు చెరువులకు ఒకటి చొప్పున సుమారు రూ.5వేల కోట్ల అం చనా వ్యయంతో 65 వికేంద్రీకృత మురుగుశుద్ధి కేంద్రాలు నిర్మించనున్నారు. వీటిలోకి మురుగునీటిని మళ్లించేందుకు సుమారు రూ.3 వేల కోట్లతో ట్రంక్ మెయిన్, లేటరల్ మెయిన్ పైపులైన్లను ఏర్పాటు చేశారు. ఇందుకు వీలుగానగరాన్ని 48 సీవరేజి జోన్లుగా విభజించారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణం స్వీకరించి పూర్తిచేస్తే మహానగరానికి 2,036 సంవత్సరం వరకు మురుగు కష్టాలు ఉండవని జలమండలి వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ ఆదర్శమిలా... గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం వెలువడుతున్న 2వేల మిలియన్ లీటర్ల మురుగు నీటిలో 860 మిలియన్ లీటర్ల నీటిని 22 కేంద్రాల్లో శుద్ధి చేస్తున్నారు. ఈ నీటి నాణ్యతను పరిశీలించేందుకు వివిధ పరిశోధన సంస్థల సేవలను జలమండలి వినియోగిస్తోంది. నూతనంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంకుంట వద్ద మూవింగ్ బెడ్ బయోరియాక్టర్ అధునాతన సాంకేతికతతో మురుగుశుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులో దీన్ని ప్రారంభించనున్నారు. ఇదే స్ఫూర్తితో నగరంలో మురుగు మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేసింది. వ్యర్థాలకు సరికొత్త అర్థం తెచ్చేలా.. గ్రేటర్ నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఔటర్‌రింగ్ రోడ్డు పరిధి వరకు సమగ్ర మురుగునీటి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశాం. దీంతో శివారు వాసులకు మురుగునీటితో అవస్థలు తప్పనున్నాయి. గ్రేటర్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణం పెంపొందించడం, మూసీతోపాటు చెరువులు, కుంటలు తదితర విలువైన జలవనరులు కాలుష్యం బారిన పడకుండా కాపాడవచ్చు. మురుగు శుద్ధి కోసం నిర్మించనున్న ఎస్టీపీల్లో పర్యావరణహిత సాంకేతికత వినియోగించనున్నాం. -ఎం.దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ. -
నీలగిరిలో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం
సాక్షి, నల్లగొండ: నీలగిరి పట్టణంలో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. సీడీఎంఏ అధికారులు రా ష్ట్రంలోని 15 మున్సిపాలిటీల్లో మలమూత్ర వ్యర్థ శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. ఇందులో నీలగిరి మున్సిపాలిటీ కూడా ఉంది. ఇప్పటికే నీలగిరి మున్సిపాలిటీకి సంబందించి శేషమ్మగూడెం డంపింగ్‌యార్డులో నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోనే టెండర్ల ద్వారా ఓ ఏజెన్సీకి అప్పగించారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో శేషమ్మగూడెం డంపింగ్ యార్డులో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి పట్టణంలోని సెప్టిక్ ట్యాంకులనుంచి అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేయనున్నారు. దాదాపు 700 ఎంఎల్డీ సామర్థ్యం గల ప్లాంట్ నిర్మించి మలమూ త్ర వ్యర్థాలను ఎరువుగా తయారు చేసి రైతులకు విక్రయించనున్నారు. పట్టణంలో సెప్టిక్ ట్యాంకులు నిండితే మున్సిపాలిటీ వారు నిర్ణయించే ధరకు సంబంధిత ఏజన్సీ వారు డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి ఎరువుగా తయారు చేసా ్తరు. పట్టణంలోని మలమూత్ర వ్యర్థాలు వృథా కాకుండా దానిని శుద్ధి చేసి ఎరువుగా మార్చాలని సీడీఎంఏ అధికారులు ఎప్పటినుంచో ఆలో చన చేస్తున్నారు. ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తోంది. ఈ శుద్ధి కేంద్రం నిర్మాణానికి సంబంధించి టెండరు ప్రక్రియ కూడా కావడంతో సంబంధిత ఏజన్సీ నిర్వాహకులు సోమవారం వచ్చి మున్సిపల్ కమిషనర్‌కు కలిశారు. శుద్ధి కేంద్రం నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. -
మురికిగుంట ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ: ‘మీరు మాకు ఓటేయండి.. మేము మీకు మలేరియా, డెంగ్యూ లాంటివి ఇస్తాం’ ఇదీ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల పేరిట వెలిసిన పోస్టర్లు. నడివీధిని మురుగు నీరు ముంచెత్తి, బహిరంగ చెరువును తలపిస్తున్న దృశ్యాన్ని నిరసిస్తూ ఓ రొబోటిక్ ఇంజినీర్ తన నిరసనను ఇలా వ్యక్తం చేశారు. ‘ఓపెన్ ఎయిర్ సీవేజ్ లేక్’ ప్రారంభోత్సవం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎంపీ మీనాక్షి లేఖి, ఎమ్మెల్యే శివచరణ్‌లను ఆయన ఆహ్వానించారు. ముందుగా చెప్పుకున్న పోస్టర్లలో వీరిద్దరి ఫొటోలు చేర్చారు. అసలే ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతున్న కార్యక్రమమంటే మాటలా? దీంతో దుర్గంధభరిత పరిసరాల్ని శుభ్రం చేసే పని మొదలైంది. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు ప్రజాపనుల విభాగం ట్రక్కులు ఒక దాని వెనక మరొకటి వచ్చి మురుగు నీటిని తొలగించి అక్కడి డ్రైనేజీ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టారు. ఎన్నికల సమయం కూడా కావడంతో సమస్య త్వరగా పరిష్కారమైందని అంటున్నారు ఆ ఇంజినీర్ తరుణ్ భల్లా. ఈ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ‘హింసాత్మక మార్గంపై నాకు ఆసక్తి లేదు. అలాగే, మునిసిపల్ అధికారుల చేతికి గ్రీజు అంటించాలని కూడా అనుకోలేదు. ఓ సామాన్యుడిగా ఇతరుల మద్దతు కూడగట్టడమే నా బలం’ అని సమస్య పరిష్కారం సందర్భంగా తరుణ్ వ్యాఖ్యానించారు. శుభ్రంగా మారిన రోడ్డు -
ఈ నగరానికి ఏమైంది?
జిల్లా కేంద్రంలోని ఒంగోలు నగరం నడిబొడ్డునున్న కూరగాయల మార్కెట్ సమీపంలోని ప్రాంతమది. అక్కడ నివసించే మూడు కాలనీల ప్రజలకు నిత్యం మురుగుతో యుద్ధం చేస్తున్నారు. వర్షాకాలంలో అయితే ఇళ్లల్లో కూడా ఉండలేని దుస్థితి. కాలువల గుండా మురుగునీరు ప్రవహించే మార్గం లేకపోగా, ఇతర కాలనీల్లోని మురుగంతా అక్కడకొచ్చి చేరుకుంటుంది. దీనికి తోడు ఇక్కడికి సమీపంలో ఉన్న చేపల మార్కెట్లో వ్యర్ధాలన్నీ ఈ కాలనీల్లోని కాలువల్లో వచ్చి చేరుతున్నాయి. నీరు, ఇతర వ్యర్ధాలు బయటకు పోయే మార్గం లేక ఐదడుగుల వెడల్పు కాల్వలు కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. వినియోగంలో లేని కాల్వల నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పడు ఎలాంటి రోగాల బారిన పడాల్సివస్తుందోనని కాలనీల ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించానని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు నగర నడిబొడ్డున ఈ కాలనీల దుస్థితి చూసి సిగ్గు పడాలి. ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ నుంచి అద్దంకి బస్టాండు మీదుగా పోతురాజు కాలువలోకి మురుగు నీరు వెళ్లేందుకు ఇటీవల కాలువ నిర్మించారు. నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా దానిని వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచన నగర పాలక సంస్థ అధికారులకు రాలేదు. కాలువలు నిర్మించామా లేదా.. అవి ప్రజలకు కనబడుతున్నాయా లేదా. అంతేచాలు అన్నట్లుగా ఉంది నగర పాలక సంస్థ అధికారుల తీరు. కాలువలు నిర్మించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. కొత్త కూరగాయల మార్కెట్ నుంచి అద్దంకి బస్టాండు మీదుగా నిర్మించిన కాలువకు కనెక్షన్ ఇస్తే ఇక్కడి మంగళపాలెం, చాకలివారివీధి, వడ్డిపాలెం కాలనీవాసులకు కష్టాలు తొలగుతాయి. మెయిన్ లైన్ కాలువకు కనెక్షన్ ఇవ్వకుండా వదిలేయడంతో చేపల మార్కెట్లోని వ్యర్ధాలన్నీ ఆ మూడు కాలనీలపై దాడి చేస్తూనే ఉన్నాయి. నిత్యం.. ప్రాణ సంకటం.. ఆ మూడు కాలనీల్లో నివసించే ప్రజలు ఇళ్లముందు కాలువల్లో మురుగు నీరు ఉన్నప్పటికీ తమ తలరాతలు ఇంతేనని గడుపుతూ వస్తున్నారు. శనివారం మాత్రం చేపల మార్కెట్లోని వ్యర్థాలన్నీ ఆ కాలువ గుండా ఇళ్ల మధ్యకు చేరుకున్నాయి. అసలే దుర్గంధం వెదజల్లుతూ, దోమల బారిన పడుతూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ఆ కాలనీవాసుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. చేపల వ్యర్ధాలతో భరించలేని దుర్వాసన వెదజల్లుతుండటంతో అనేక మందికి ప్రాణసంకటంగా మారింది. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండటంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో ఆ కాలువలో పడిపోయిన ఓ చిన్నారిని అదృష్టవశాత్తు గమనించి బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. అభివృద్ధి అంటే ఇదేనా..? ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేశానంటూ పదేపదే చెప్పుకుంటున్న స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దనరావు ఒంగోలు నగరంలోని ఈ మూడు కాలనీల్లో పర్యటిస్తే ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు పేర్కొన్నారు. ఈ కాలనీల ప్రజలతో కలిసి శనివారం ఆయన కాలువ గట్టుపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కాంట్రాక్టర్ల కోసం కాలువలు కట్టడం తప్పితే ప్రజల కోసం కాదని విమర్శించారు. చేపల మార్కెట్లోని వ్యర్ధాలన్నీ ఈ మూడు కాలనీల్లోకి వస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారన్నారు. ఊరచెరువులో ఏడు ఎకరాల స్థలం ఉందని, దానిలో నుంచి అద్దంకి బస్టాండు మీదుగా మురుగు నీరు చెరువులోకి వెళ్లే మార్గం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే కాలువలు తవ్వి వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు. -
స్వచ్ఛతే... స్వస్థత...
తరతరాలుగా తరగని సమస్య. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచినా తీరని సమస్య. ఇటీవలి కాలం వరకు పాలకులకు పెద్దగా పట్టని సమస్య. కాలకృత్యాలు తీర్చుకోవడానికి తగిన మరుగు, పరిశుభ్రమైన పరిసరాలు దొరకక పడరాని పాట్లు పడుతున్న వారు మన దేశంలో కోట్ల సంఖ్యలోనే ఉన్నారు. ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకోవలసిన పరిస్థితుల్లో మహిళలు పడుతున్న అగచాట్లు వర్ణనాతీతం. పారిశుద్ధ్యంలో మన వెనుకబాటును అంతర్జాతీయ సమాజం వేలెత్తి చూపడంతో అనివార్యమైన దశలో ప్రభుత్వం నాలుగేళ్ల కిందట ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని తలపెట్టింది. ‘స్వచ్ఛ భారత్’ కింద టాయిలెట్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల, ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడి వంటి పనుల కోసం ఏటా రూ.60 కోట్ల నిధులు విడుదల చేస్తోంది. అయినా లక్ష్యానికి ఇంకా దూరంగానే ఉన్నాం.వెనుకబడిన దేశాల సంగతి సరే, ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌లో దాదాపు 48 శాతం జనాభా ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకోవలసిన దుర్భర పరిస్థితులు నేటికీ కొనసాగుతున్నాయి. ఒకవైపు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నప్పటికీ మరుగుదొడ్లు లేక ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకుంటున్న వారి జనాభా అత్యధికంగా గల దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ముక్కున వేలేసుకుంటోంది. స్వచ్ఛ భారత్ పథకం మొదలైన తర్వాత గడచిన నాలుగేళ్లలో 38 శాతం మేరకు మాత్రమే అందుబాటులో ఉన్న గ్రామీణ పారిశుద్ధ్యం 80 శాతానికి చేరుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికీ బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలే టాయిలెట్ సౌకర్యానికి దూరంగా ఉంటున్నాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో 2019 అక్టోబర్ 2 నాటికి వందశాతం జనాభాకు టాయిలెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా పరిస్థితులను పరిశీలిస్తే, ఈ లక్ష్యానికి ఇంకా దూరంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏడాది కిందట ‘వాటర్ ఎయిడ్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచ దేశాల్లో టాయిలెట్ సౌకర్యాల స్థితిగతులపై ఒక నివేదిక విడుదల చేసింది. ‘ఔటాఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ టాయిలెట్స్’ పేరిట విడుదల చేసిన ఆ నివేదిక ప్రకారం భారత్‌లో 73.2 కోట్ల జనాభా ఇంకా టాయిలెట్ సౌకర్యానికి దూరంగానే ఉన్నారు. ఈ జనాభాలో 35.5 కోట్ల మంది మహిళలు, బాలికలే. మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల వీరంతా నానా అగచాట్లు పడుతున్నారు. తరచు వ్యాధుల బారిన పడుతున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలైన ఈ నాలుగేళ్ల వ్యవధిలో ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకునే వారి సంఖ్య కేవలం 40 శాతం మాత్రమే తగ్గింది. అంటే ఈ నాలుగేళ్లలో అదనంగా దాదాపు 10 కోట్ల మందికి మాత్రమే టాయిలెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు కాకుంటే దేశంలోని పరిస్థితులు మరింత దుర్భరంగా తయారయ్యేవి. ‘వాటర్ ఎయిడ్’ నివేదిక ప్రకారం టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోని లేని జనాభా అత్యధికంగా ఉంటున్న దేశాల్లో భారత్ ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. ఈ విషయంలో పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్ మనకంటే మెరుగ్గా ఉన్నాయి.టాయిలెట్ చరిత్రటాయిలెట్లు ఆధునిక సృష్టి ఏమీ కాదు. తొలినాటి నాగరికతలు విలసిల్లిన కాలంలోనే టాయిలెట్లు వాడుకలో ఉండేవి. సింధులోయ నాగరికత కాలంలో ప్రస్తుత వాయవ్య భారత్, పాకిస్తాన్ ప్రాంతాల్లో దాదాపు ఆధునిక టాయిలెట్లను తలపించే పద్ధతుల్లో మరుగుదొడ్లను వినియోగించేవారు. సింధులోయ ప్రజలు మరుగుదొడ్లలోని వ్యర్థాలను నీటితో ఫ్లష్ చేసేవారు. వ్యర్థాలు జనాలకు ఇబ్బంది లేకుండా బయటకు పోవడానికి వీలుగా కట్టుదిట్టమైన మురుగునీటి కాల్వల వ్యవస్థను నిర్మించుకున్నారు. క్రీస్తుపూర్వం రెండువేల ఏళ్ల నాడే భారత భూభాగంలో ఇంత చక్కటి వ్యవస్థ ఉండేదంటే ఆధునిక భారతీయులకు ఆశ్చర్యం కలుగక మానదు. సింధులోయ నాగరికత ప్రజలకు గల పారిశుద్ధ్య స్పృహ ఆధునిక భారతీయుల్లో లోపించడం వల్లనే దేశంలో పారిశుద్ధ్య పరిస్థితులు దిగజారాయి. క్రీస్తుపూర్వం 1200 ఏళ్లనాడు ఈజిప్టులో కొద్దిమంది ధనవంతులు మాత్రమే ఇళ్లలో ఇసుక నింపిన టాయిలెట్లు ఉపయోగించేవారు. వాటిని బానిసలు శుభ్రం చేసేవారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్దిలో రోమన్ సామ్రాజ్యంలో దాదాపు సింధులోయ నాగరికతలో వినియోగించిన మాదిరి టాయిలెట్లు, కట్టుదిట్టమైన మురుగునీటి పారుదల వ్యవస్థ వాడుకలో ఉండేవి. రోమన్ సామ్రాజ్యంలో పబ్లిక్ టాయిలెట్లు కూడా అందుబాటులో ఉండేవి. రోమన్లకు ‘క్లోవాసినా’ అనే మురుగు వ్యర్థాల అధిదేవత కూడా ఉండేది. ‘క్లోవాసినా’ను పూజించే రోమన్లు పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. రోమన్ సామ్రాజ్యం క్రీస్తుశకం ఐదో శతాబ్దిలో పతనమైన తర్వాత అక్కడి టాయిలెట్ వ్యవస్థ కూడా కనుమరుగైంది. తిరిగి కోలుకోవడానికి శతాబ్దాలు పట్టింది. అలెగ్జాండర్ కమ్మింగ్ 1775లో ఫ్లషింగ్ లావెటరీకి పేటెంట్ తీసుకున్న యూరోపియన్ దేశాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడింది. లండన్‌లో తొలిసారిగా 1852 పబ్లిక్ టాయిలెట్ అందుబాటులోకి వచ్చింది. తర్వాతి కాలంలో మిగిలిన నగరాల్లో కూడా పబ్లిక్ టాయిలెట్లు ఏర్పడ్డాయి. ఫ్లషింగ్ టాయిలెట్లు తొలినాళ్లలో కొద్దిమంది ధనికులకు పరిమితమైన విలాసవంతమైన సౌకర్యంగా మాత్రమే ఉండేవి. పంతొమ్మిదో శతాబ్దిలో మాత్రమే ఇవి సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రావడం మొదలైంది. ఇరవయ్యో శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు ఇంటింటా ఆధునిక టాయిలెట్లు వాడుకలోకి వచ్చాయి. వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్‌తో మార్పుఇరవై ఒకటో శతాబ్దికి చేరుకున్నా ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, వెనుకబడిన నిరుపేద దేశాల్లోను టాయిలెట్ సౌకర్యానికి దూరంగా ఉంటున్న ప్రజల సంఖ్య కోట్లలో ఉండటంతో అంతర్జాతీయ సమాజంలో కదలిక వచ్చింది. ఫలితంగా 2001 సంవత్సరంలో వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. రెస్ట్రూమ్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ వ్యవస్థాపకుడు, స్వచ్ఛంద కార్యకర్త జాక్ సిమ్ వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్‌ను నెలకొల్పాడు. పట్టుమని పదిహేను మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు ఏకంగా 53 దేశాలకు చెందిన 151 స్వచ్ఛంద సంస్థలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ సంస్థ ఏటా వరల్డ్ టాయిలెట్ సమ్మిట్ నిర్వహిస్తూ వస్తోంది. తొలిసారిగా 2001 నవంబర్ 19 నుంచి 21 వరకు సింగపూర్‌లో నిర్వహించిన సదస్సులో నవంబర్ 19వ తేదీని వరల్డ్ టాయిలెట్ డేగా ప్రకటించారు. భారత్‌లో తొలిసారిగా 2007లో న్యూఢిల్లీలో ఈ సదస్సు జరిగింది. వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా ‘అర్జెంట్ రన్’ వంటి కార్యక్రమాల ద్వారా టాయిలెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, టాయిలెట్ల ఏర్పాటు, పారిశుద్ధ్య సౌకర్యాల మెరుగుదల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంతో చైనా, భారత్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సానుకూలమైన కదలిక వచ్చింది. వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ ఏర్పడటానికి ఏడాది ముందే అంటే, 2000 ఏప్రిల్ 1న అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం సమీకృత గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని, సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు నామమాత్రపు ఫలితాలను మాత్రమే సాధించగలిగాయి. మన్మోహన్ సింగ్ హయాంలో 2012 ఏప్రిల్ 1న ‘నిర్మల్ భారత్ అభియాన్’ పేరిట పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ‘నిర్మల్ భారత్’ కూడా చెప్పుకోదగిన ఫలితాలను సాధించడంలో విఫలమైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక ‘నిర్మల్ భారత్’ కార్యక్రమానికే కొన్ని మార్పులు చేసి, ‘స్వచ్ఛభారత్’గా అమలులోకి తెచ్చింది. ‘స్వచ్ఛభారత్’ అమలులోకి వచ్చాక 2015లో న్యూఢిల్లీలో వరల్డ్ టాయిలెట్ సమ్మిట్ జరిగింది. అప్పటి నుంచి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణం కొంత వేగం పుంజుకుంది. ‘స్వచ్ఛభారత్’ను ప్రపంచంలోనే అతిపెద్ద పారిశుద్ధ్య ఉద్యమంగా ప్రపంచబ్యాంకు అభివర్ణించింది. ఈ ఏడాది టాయిలెట్ డే కార్యక్రమాలుపారిశుద్ధ్యం, పరిశుభ్రమైన టాయిలెట్ల వినియోగంపై అవగాహన కల్పించడానికి ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి, ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ సంస్థలు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట ఇన్ఫ్లేటబుల్ టాయిలెట్‌ను ప్రదర్శించనున్నారు. నైజీరియా రాజధాని అబుజాలో హోప్స్ప్రింగ్ వాటర్ చారిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోప్స్ప్రింగ్ రన్ పేరిట ఐదు కిలోమీటర్ల పరుగు నిర్వహించనున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మనీలా వాటర్ ఫౌండేషన్ పారిశుద్ధ్యంపై అవగాహన కోసం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనుంది. వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం సహకారంతో ఘనాలో శానిటేషన్ హ్యాకథాన్ నిర్వహించనున్నారు. ఇవే కాకుండా పలు దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో పారిశుద్ధ్యం, సురక్షితమైన టాయిలెట్ల వినియోగంపై అవగాహన కల్పించడానికి సదస్సులు, చర్చా కార్యక్రమాలు, మారథాన్లు, ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.దక్షిణాది రాష్ట్రాలే మెరుగుటాయిలెట్ల వాడుక, పారిశుద్ధ్య సౌకర్యాల అందుబాటులో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కొంత మెరుగ్గానే ఉన్నాయి. కేరళ ఈ అంశంలో దేశంలోనే ముందంజలో ఉంది. కేరళ జనాభాలో టాయిలెట్లు వినియోగిస్తున్నవారు 98 శాతానికి పైగానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ‘స్వచ్ఛ భారత్’ అమలులోకి వచ్చిన తర్వాత గడచిన నాలుగేళ్లలో దాదాపు 8 కోట్ల టాయిలెట్లను నిర్మించారు. అయితే, టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి సారించిన ప్రభుత్వం వాటి నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు లేకపోలేదు. దేశవ్యాప్తంగా 96.5 శాతం గ్రామీణ ప్రాథమిక పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మించగా, వాటిలో దాదాపు 27.7 శాతం టాయిలెట్లు సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా పడి ఉన్నాయని ‘ఏన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’ (ఏఎస్ఈఆర్) వెల్లడించింది. టాయిలెట్లు అందుబాటులో లేకపోవడం వల్లనే చాలామంది బాలికలు చదువులకు దూరమవుతున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా పాఠశాలలకు వెళుతున్న బాలికల్లో ఏటా దాదాపు 23 శాతం మంది ఇదే కారణం వల్ల అర్ధంతరంగానే చదువు మానుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. దాదాపు 95.8 శాతం పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మించగా, వాటిలో కేవలం 54.9 శాతం మాత్రమే వాడుకోగలిగే స్థితిలో ఉన్నాయని వెల్లడించింది. టాయిలెట్లు లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్న టాయిలెట్లు వాడుకోవడానికి వీల్లేనంత అపరిశుభ్రంగా ఉండటం మరో సమస్య. ‘స్వచ్ఛభారత్’ కింద నిర్మించిన టాయిలెట్ల సంఖ్యలపైనే ప్రచారం చేసుకుంటున్న పాలకులు, నిర్మించిన తర్వాత వాడుకలో వాటి అతీ గతీ ఎలా ఉంటున్నాయో పట్టించుకుంటున్న దాఖలాల్లేవు. ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకోవడం వల్ల మాత్రమే కాదు, అపరిశుభ్రమైన టాయిలెట్ల వల్ల కూడా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీటి కాలుష్యం వల్ల వ్యాపించే వ్యాధులన్నింటికీ సరైన టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడమే అసలు కారణమని, మానవ విసర్జకాల్లోని సూక్ష్మజీవులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం వల్ల ప్రమాదకర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. డ్రైనేజీల్లోని మురుగునీరు రోడ్లపైకి చేరడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెబుతున్నారు. స్వచ్ఛభారత్ అమలులోకి వచ్చాక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7.95 కోట్ల టాయిలెట్లు నిర్మించడం వల్ల దేశంలో దాదాపు 1.82 లక్షల డయేరియా మరణాలను నివారించగలిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా అంచనాలో వెల్లడించింది. స్వచ్ఛభారత్ ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకునేవారి సంఖ్య 45 శాతం మేరకు తగ్గినట్లు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా 2017–18 నివేదిక ప్రకటించింది. ·ఆరోగ్యభంగం... ఆర్థికభారం...మెరుగైన పారిశుద్ధ్య వసతుల కొరత, పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల దేశ జనాభాలో అత్యధికులు తరచు డయేరియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ తదితర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులైతే అకాల మరణాల పాలవుతున్నారు. కొందరు చిన్నారులు ఎదుగుదల లోపాలతో బాధపడుతున్నారు. ఏటా డయేరియా కారణంగానే దాదాపు 1.17 లక్షల మంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 38 శాతం మంది ఎదుగుదల లోపాలతో, నులిపురుగుల కారణంగా తలెత్తే రక్తహీనతతో బాధపడుతున్నారు. మహిళలు, బాలికలు రక్తహీనత బారిన పడుతున్నారు. మరుగుదొడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాల కొరత వల్ల దేశ ఆర్థికరంగంపై గణనీయమైన భారం పడుతోంది. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం పారిశుద్ధ్య సౌకర్యాల కొరత వల్ల స్థూల జాతీయోత్పత్తిపై (జీడీపీ) దాదాపు 6.4 శాతం వార్షిక భారం పడుతోంది. పారిశుధ్య కొరత వల్ల నీటి కాలుష్యం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల మాత్రమే కాకుండా, పర్యాటక రంగానికి సైతం వాటిల్లే నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, మన దేశ ఆర్థిక రంగానికి ఏటా దాదాపు రూ.2.4 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే, ప్రభుత్వం ఈ ఏడాది ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బడ్జెట్ కేటాయింపుల్లో 7 శాతం మేరకు కోత పెట్టింది. ప్రాథమిక ఆరోగ్యరంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో 2.7 శాతం మేరకు కోత పెట్టింది. స్వచ్ఛభారత్‌పై పాలకుల చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో బడ్జెట్ కేటాయింపుల్లోని ఈ కోతలే తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలో అందరికీ పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నట్లయితే ప్రజల ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, జనాభా తలసరి ఆదాయం కనీసం రూ.50 వేల మేరకు పెరిగే అవకాశాలు ఉంటాయని యూనిసెఫ్ ఒక అధ్యయనంలో అంచనా వేసింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు మొదలైన తర్వాత ఇప్పటి వరకు కొంత పురోగతి సాధ్యమైంది. దేశంలోని పదకొండు రాష్ట్రాలు, 419 జిల్లాలు ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకోవలసిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా 62.45 శాతం ఇళ్లకు టాయిలెట్లు ఏర్పడ్డాయి. ప్రభుత్వం వెల్లడించిన తాజా లెక్కల ప్రకారం టాయిలెట్లను వినియోగించేవారి సంఖ్య 91 శాతానికి చేరుకుంది. టాయిలెట్ ట్రివియాటాయిలెట్ ట్రివియాటాయిలెట్ల వల్ల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. మరుగు ఉండటం వల్ల ఆత్మగౌరవానికి భంగం కలగదు. అలాగని టాయిలెట్ల వల్ల ఉపయోగాలే కాదు, ఒక్కోసారి ప్రమాదాలూ సంభవించవచ్చు. టాయిలెట్లలో జరిగే ప్రమాదాల వల్ల ఏటా 40 వేల మంది అమెరికన్లు ఆస్పత్రుల పాలవుతున్నారు. మన దేశంలో ఇలాంటి ప్రమాదాలపై ఎలాంటి గణాంకాలూ సేకరించిన దాఖలాల్లేవు. టాయిలెట్లో జారిపడటం వల్లనే బ్రిటిష్ చక్రవర్తి రెండో జార్జ్ 1760లో ప్రాణాలు కోల్పోయాడు.టాయిలెట్‌ను ఫ్లష్ చేసేటప్పుడు సూక్ష్మజీవులు ఆరడుగుల దూరం వరకు వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఫ్లష్ చేసేటప్పుడు టాయిలెట్ సీటును కవర్ చేయడం మంచిది.ఇదివరకటి కాలంలో అతి అరుదుగా నగా నట్రా వంటివి టాయిలెట్లలో పొరపాటున పోగొట్టుకునే వారు. ఆధునికత మితిమీరిన తర్వాత టాయిలెట్లలో సెల్ఫోన్లనే చేజార్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అమెరికాలో దాదాపు 70 లక్షల మంది టాయిలెట్లలో సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు.అత్యంత ఖరీదైన టాయిలెట్ ఎక్కడుందో తెలుసా? భూమ్మీద మాత్రం కాదు. అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంది. దీని తయారీకైన ఖర్చు 19 మిలియన్ డాలర్లు (రూ.137.7 కోట్లు). -
చెరువులకు పూర్వ వైభవం తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో మురికి కూపాలుగా మారిన చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వీలుగా కఠినంగా వ్యవహరించాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందులో భాగంగా చెరువుల్లోకి వ్యర్థాలను వదిలే మార్గాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేయాలని హైదరాబాద్ సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ప్రజలకు సైతం హెచ్చరికలు జారీ చేయాలంది. అవసరమైతే కఠిన చర్యలకు సైతం వెనుకాడొద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో అవసరాన్ని బట్టి తాము తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. లోటస్ పాండ్, ఖాజాగూడ పెద్ద చెరువు, నాచారం పెద్ద చెరువు, మీర్ ఆలం చెరువు, కూకట్పల్లి రంగథాముని చెరువుల నుంచే ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణ, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అం శంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్‌లు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగాఇప్పటికే పలుమార్లు విచారించింది. ఏమైనా చేయండి.. చెరువుల్లోకి మురికి నీటిని వదలకూడదని ప్రజలకు తెలియజేయాలని, పరిస్థితిని బట్టి హెచ్చరికలు కూడా చేయాలని ధర్మాసనం పేర్కొంది. చెరువుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థాలు చేరడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం వల్లే చెరువులకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాల్సిందేనని, ఇందుకు ఏం కావాలంటే అది చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. చెరువుల్లోకి వ్యర్థాలను తీసుకొచ్చే మార్గాలను ధ్వంసం చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని జీహెచ్ఎంసీ న్యాయవాదిని ప్రశ్నించింది. 4 వారాలు పడుతుందని జీహెచ్ఎంసీ న్యాయవాది చెప్పగా, అంత గడువు ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికల విధుల్లో అధికారులు బిజీగా ఉన్నారని చెప్పగా, ఈ సమాధానం తమకు అవసరం లేదంది. ఏది అడిగినా కూడా ఎన్నికలని చెప్పడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వండి... మొత్తం వ్యవహారంపై తమకు నివేదిక ఇవ్వాలని, వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఏయే మార్గాల ద్వారా వస్తున్నాయి. వీటి ధ్వం సానికి ఎన్నిరోజుల సమయం పడుతుంది తదితర వివరాలను అందులో పొందుపరచాలని సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితరులను ఆదేశించింది. ఈ సమయంలో హెచ్ ఎండీఏ తరఫు న్యాయవాది రామారావు జోక్యం చేసుకుంటూ, తాము చర్యలు తీసుకుంటే, వా టిపై కొందరు హైకోర్టును ఆశ్రయించి, సింగిల్ జడ్జి వద్ద స్టే పొందుతున్నారని ధర్మాసనం దృష్టి కి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఒకవేళ అలాంటి ఉత్తర్వులు ఏవైనా వస్తే వాటిని తమ దృష్టికి తీసుకురావాలంది. ఇదే ధర్మాసనం చెరువుల శుద్ధీకరణకు జియో ట్యూబ్ టెక్నాలజీ అత్యుత్తమమైనదని, ఇందుకు చాలా తక్కువ వ్య యం అవుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విషయం పై ఓ నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీలకు ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘వాడిన నీరూ’ పంటకు మంచిదే!
ఇళ్లలో, పరిశ్రమల్లో వాడిన నీటిని శుద్ధి చేయకుండా నేరుగా పంటల సాగుకు వాడుకోవటం అనే ప్రమాదకరమైన అలవాటు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉంది. ఈ మురుగు నీటిలోని ప్రమాదకరమైన భారఖనిజాలు, హానికరమైన సూక్ష్మజీవుల వల్ల భూసారానికి, కలుషిత నీటితో పెరిగిన ఆహారాన్ని తినే మనుషులు, గడ్డిని తినే పశువుల ఆరోగ్యానికి తీరని హాని జరుగుతోంది. అసలు, మురుగు నీటిని పంటలకు వాడాల్సిన అవసరం ఏమొచ్చింది..?? ఇళ్లలో, పరిశ్రమల్లో వాడిన నీటితో కూడిన కాలువలు ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. అన్ని గ్రామాల్లోనూ, అన్ని పట్టణాలు, నగరాల పరిసరాల్లోనూ ఈ మురుగు నీరు ఎర్రని ఎండాకాలంలో, కటిక కరువు కాలంలో కూడా అందుబాటులో పారుతూ ఉంటుంది. రబీ, వేసవి పంటల సాగు కాలాల్లో చాలా మంది రైతులకు, ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులకు సాగు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అటువంటి అనివార్య పరిస్థితుల్లో మురుగు నీటిని రైతులు వాడుకోవాల్సి వస్తున్నది. మురుగు నీటిని శుద్ధి చేసుకోవటానికి సులువైన పద్ధతి ఏదీ అందుబాటులో లేదు! ఇందువల్ల మురుగు నీటిని నేరుగా వాడక తప్పని పరిస్థితి వస్తోంది! ఇప్పుడిక ఆ బాధ లేదు. ఐరోపా యూనియన్‌తో కలిసి అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ(ఇక్రిశాట్) మురుగు నీటిని గ్రామస్థాయిలోనే అతి సులువుగా, ఖర్చులేని రీతిలో, రసాయనాలేవీ వాడకుండానే సహజంగా శుద్ధి చేసుకునే శాస్త్రీయ పద్ధతిని రూపొందించింది. ఈ పద్ధతిపై ‘సాగుబడి’ ప్రత్యేక కథనం.. స్వచ్ఛమైన సాగు నీరు అందుబాటులో లేని కష్ట కాలంలో శుద్ధి చేయని మురుగు నీటినే పంటలకు వాడుకోక తప్పని పరిస్థితులు మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. శుద్ధిచేయని మురుగు నీటితో ఆహార ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పశుగ్రాసం సాగవుతున్న విస్తీర్ణం ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. మన దేశంలో 15% సాగు నీరు.. మురుగు నీరే! అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) అంచనాల ప్రకారం మురుగు నీటిని యథాతథంగా పంటల సాగులో వాడుతున్న పంట భూముల విస్తీర్ణం.. ప్రపంచం మొత్తంలోని సాగు భూముల విస్తీర్ణంలో 65% వరకు ఉంటుందట! ఈ కలుషిత నీటితో సాగైన ఆహారం తిని 88.5 కోట్ల మంది పౌరులు రోగాల పాలవుతున్నారు. మన దేశంలో నీటి తడులతో పంటలు సాగు చేస్తున్న పొలాల్లో కనీసం 15% విస్తీర్ణంలో శుద్ధి చేయని మురుగు నీటిని నేరుగా వాడుతున్నారని ‘ఇక్రిశాట్’ అంచనా వేసింది. ఇళ్లలో వంటావార్పునకు, స్నానాలకు, బట్టలు ఉతకటానికి వాడుతున్న నీరు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలతో కూడిన కాలువలు ఏడాది పొడవునా పారుతూనే ఉంటాయి. కరువొచ్చి బోర్లు ఎండిపోయినా, ఎండలు మండిపోతున్నా సరే ఈ మురుగు నీటి కాలువలు పూర్తిగా ఎండి పోవు. ఈ కారణంగానే ఇక ఏ నీరూ దిక్కు లేని రబీ, వేసవి పంట కాలాల్లో మురుగు నీటిని పంటలకు వాడుతున్నారు. తాజా నీరు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ మురుగు నీటికి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. గుజరాత్లో కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటిని వాడుకునే హక్కు కోసం ఏటా వేలం పాట నిర్వహించే పరిస్థితి కూడా ఉందని అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి ఏడాది పొడవునా అందుబాటులో ఉండే మురుగు నీటిని చక్కగా శుద్ధి చేసే పద్ధతులను ఉపయోగించటం ఎంతైనా అవసరం. ఇక్రిశాట్ ఆధ్వర్యంలో నాలుగేళ్ల ప్రాజెక్టు ఐరోపా యూనియన్ – భారత్ మధ్య అతిపెద్ద శాస్త్రీయ భాగస్వామ్యంలో ఇళ్ల నుంచి, పరిశ్రమల నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధి చేసి, హాని లేని రీతిలో వ్యవసాయానికి వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు నాలుగేళ్ల నుంచి ప్రత్యేకమైన పరిశోధనా ప్రాజెక్టు(వాటర్4క్రాప్స్) ప్రారంభమైంది. హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరులో గల ఇక్రిశాట్ ప్రధాన కేంద్రంగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లోని 28 గ్రామాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్రిశాట్లో పరిశోధనా కార్యక్రమం (ఆసియా) సంచాలకులు డా. సుహాస్ పి. వాణి మురుగునీటి శుద్ధిపై పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నిధులు సమకూర్చిన ఈ ప్రాజెక్టు సత్ఫలితాలు సాధించింది. అతి తక్కువ ఖర్చుతో గ్రామస్థాయిలోనే రసాయన రహిత పద్ధతుల్లో ఇళ్లలో నుంచి, పరిశ్రమల నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధి చేసుకొని, నిస్సంకోచంగా పంటలకు వాడుకోవచ్చని తమ క్షేత్రస్థాయి పరిశోధనల్లో రుజువైందని డా. సుహాస్ ‘సాగుబడి’కి తెలిపారు. కర్నూలు జిల్లా పెండేకల్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి, భానూర్ తదితర గ్రామాల్లో ఇళ్ల నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధి చేసే యూనిట్లను నిర్మించారు. కొన్ని పారిశ్రామిక సంస్థల సీఎస్ఆర్ నిధులతోనూ కొన్ని గ్రామాల్లో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశామని డా. సుహాస్ తెలిపారు. మురుగునీటి శుద్ధి ఎలా జరుగుతుంది? సగటున ప్రతి వ్యక్తికి రోజుకు 40 లీటర్ల చొప్పున మురుగు నీరు వెలువడుతుందని అంచనా. కనీసం 200 కుటుంబాలు లేదా వెయ్యి మంది ఉండే గ్రామంలో సిమెంటు కాలువలు నిర్మించి.. మురుగు నీటిని ఊరి బయటకు చేర్చిన తర్వాత శుద్ధి చేయాల్సి ఉంటుంది. మురుగు నీటి కాలవ పైనే నీటి శుద్ధికి అవసరమైన బెడ్స్‌ను పాక్షికంగా భూమి లోపలికి ఉండేలా నిర్మిస్తారు. అనేక రకాల సైజుల్లో గులక రాళ్లు, ఇసుకను దొంతర్లుగా వేసి బెడ్స్‌ను నిర్మిస్తారు. బెడ్స్ ద్వారా మురుగు నీరు వాలు దిశగా నెమ్మదిగా ప్రవహించే ఏర్పాటు చేస్తారు. నీటి శుద్ధి వ్యవస్థను గ్రామస్థాయిలో ఏర్పాటు చేయడానికి రూ. 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుందని డా. సుహాస్ తెలిపారు. మెట్ట తామర, తుంగ మొక్కలతో నీటి శుద్ధి! బెడ్స్‌పై మెట్ట తామర (CANNA INDICA), తుంగ (TYPHA LATIFOLIA) వంటి అత్యంత వేగంగా పెరుగుతూ, కలుషితాలను భారీగా పీల్చుకునే ప్రత్యేక జాతి మొక్కలను పెంచుతారు. వీటిని రెండు, మూడు నెలలకోసారి కోసి కంపోస్టు తయారీకి వాడతారు. భారఖనిజాలు, అధిక సాంద్రతలో ఉన్న లవణాలు తదితర అవాంఛిత పదార్థాలను ఈ మొక్కలు చప్పున గ్రహించి నీటిని శుద్ధి చేస్తాయి. నాచు, అజొల్లా తదితరాలను నీటిపైన పెంచటం ద్వారా ఆక్సిజన్ నిల్వలను నియంత్రిస్తారు. పోషకాల సాంద్రతను తగ్గించడానికి సూక్ష్మజీవరాశిని వినియోగిస్తారు. ఎటువంటి రసాయనాలు వాడకుండానే సహజమైన పద్ధతుల ద్వారానే మురుగు నీటిని శుద్ధి చేస్తారు. శుద్ధి అయిన నీరు ఈ బెడ్స్‌కు కింది వైపు వాలులో నిర్మించిన కుంటలోకి చేరుకుంటుంది. ఆ నీటిని రైతులు మోటార్లతో తోడుకొని పంటలకు వినియోగించుకోవచ్చు. బీహెచ్ఈఎల్ కాలనీ నుంచి వెలువడే మురుగు నీరు ఇక్రిశాట్ ఆవరణలోకి వచ్చి చేరుతున్నది. ఈ నీటిని శుద్ధి చేసి పాలీహౌస్లో టమాటోలను పెంచుతున్నారు. ఈ టమాటోలు భారతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని డా. సుహాస్ చెప్పారు. ఈ నీటితో నిస్సందేహంగా పంటలు పండించుకోవచ్చని, వినియోగదారుల ఆరోగ్యానికి ఎటువంటి హానీ ఉండబోదన్నారు. మురుగు నీటిని గ్రామస్థాయిలోనే సులువుగా, సహజంగా శుద్ధి చేసుకునే పద్ధతులను రూపొందించిన ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభినందనీయులు. శుద్ధిచేసిన నీటిపై అపోహలు వద్దు.. సేంద్రియ సాగుకూ వాడుకోవచ్చు.. ఇళ్లలో స్నానానికి, వంటకు, బట్టలు ఉతకడానికి వాడిన నీటిని.. పరిశ్రమల నుంచి వెలువడే నీటిని వేర్వేరుగా చాలా సులువుగా, రసాయనాలు వాడకుండా, తక్కువ ఖర్చులో గ్రామస్థాయిలోనే కేవలం రెండు రోజుల్లో శుద్ధిచేసుకోవచ్చు. భారఖనిజాలు, సేంద్రియ – సేంద్రియేతర పదార్థాలు, లవణాలు, రోగకారక క్రిములను ఈ మురుగు నీటి నుంచి అత్యంత ప్రభావశీలంగా తొలగించి, నీటిని శుద్ధి చేసే శాస్త్రీయ పద్ధతులను మేం రూపొందించాం. పరీక్షించి చూశాం. శుద్ధి చేసిన నీరును పరీక్షించగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ప్రభుత్వం నిర్దేశించిన నీటి ప్రమాణాలకు నూటికి నూరుశాతం అనుగుణంగా ఉన్నాయి. శుద్ధి చేసిన నీటితో ఎటువంటి సంకోచం లేకుండా పంటల సాగుకు ఉపయోగించుకోవచ్చు. ఈ నీటితో టమాటోలు, చెరకు, మొక్కజొన్న, జొన్న తదితర పంటలను ఇక్రిశాట్లో సాగు చేస్తున్నాం. ఆయా గ్రామాల్లో రైతులతో నాలుగేళ్లుగా సాగు చేయించాం. పండిన పంటలకు నాణ్యతా పరీక్షలు చేశాం. ఎటువంటి ఇబ్బందీ లేదు. ఈ నీటిలో శుద్ధి చేసిన తర్వాత కూడా మంచి పోషకాలు ఉంటాయి. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పంటలకు సైతం ఈ నీటిని వాడుకోవచ్చు. శుద్ధి చేసిన నీటి నాణ్యతపై ఎటువంటి అపోహలు అక్కర్లేదు. సింగపూర్ ప్రజలు శుద్ధిచేసిన నీటినే తాగునీరుగా వాడుతున్నారని గమనించాలి. జల వనరుల లభ్యత తగ్గిపోతున్న తరుణంలో రైతులు, వినియోగదారుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్‌లో పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణ, దోమల నిర్మూలన తదితర కోణాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నెలకొల్పాలని భావిస్తుండటం హర్షణీయం. – డా. సుహాస్ పి. వాణి, సంచాలకులు, పరిశోధనా విభాగం(ఆసియా), ఇక్రిశాట్, పటాన్చెరు, తెలంగాణ ఫోన్: 040 3071 3466 మెయిల్: s.wani@cgiar.org రైతులు వాడుతున్నారు.. కొత్తపల్లి, భానూరుల్లో ఇక్రిశాట్ ఆధ్వర్యంలో రకరకాల సైజుల్లో గ్రావెల్, ఇసుకతో బెడ్స్ వేసి.. వాటిలో మెట్ట తామర (సత్యనారాయణ పూలు), తుంగ వంటి మొక్కలు పెంచుతున్నాం. మురుగు నీటిని నేరుగా పంటలకు వాడితే ప్రమాదం. శుద్ధి చేసిన నీటిని పంటలకు వాడితే ఆరోగ్యానికి ఏ ఇబ్బందీ ఉండదు. శుద్ధి చేసిన నీటితో పలువురు రైతులు పంటలు పండిస్తున్నారు. – డీ ఎస్ ప్రసాద్ (98499 98495), సాంకేతిక అధికారి, ఇక్రిశాట్, పటాన్చెరు రెండేళ్లుగా వాడుతున్నా.. మా గ్రామంలో ఇక్రిశాట్ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రెండేళ్లుగా ఎండాకాలంలో మక్క (మొక్కజొన్న), స్వీట్‌కార్న్ పంటలకు శుద్ధి చేసిన నీటిని వాడాము. ఏ ఇబ్బందీ లేదు. నీటి ఎద్దడి కాలంలో ఈ నీరు బాగా ఉపయోగపడుతుంది. – పట్టోళ్ల నరసింహారెడ్డి (99495 90189), మాజీ సర్పంచ్, కొత్తపల్లి, శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా శుద్ధి చేసిన నీటిని వాడుతున్నా.. నాకు అర్థెకరం మెట్ట భూమి ఉంది. బోరు లేదు. 3 ఏళ్లుగా రబీ పంట కూడా వేస్తున్నా. శుద్ధి చేసిన నీటిని వాడుతున్నా. కరెంటు మోటారుతో వారం, పదిరోజులకో తడి పెడుతున్నా. పోయిన ఏడాది పావెకరంలో 6 బస్తాల తెల్లజొన్న పండించా. ఆ జొన్నల రొట్టే తింటున్నాం. కొత్తిమీర కూడా ఒకసారి పండించా. మార్కెట్లో అమ్మా.. – సేరిగూడెం సాయిలు (76598 29582), కొత్తపల్లి, శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా మక్క వేయడానికి దుక్కి చేసిన.. నీళ్లు ఇప్పుడు ఫ్రెష్‌గా వస్తున్నాయి. పోయినసారి వరి, మక్క(మొక్కజొన్న) వేసిన. ఈసారి మక్క వేయడానికి దుక్కి చేసిన. వేరేవాళ్లు ఈ నీళ్లతోనే 8 ఎకరాల్లో వరి పంట వేసిన్రు. మంచిగనే ఉంది. ఏ ఇబ్బందీ లేదు. – సి. కృష్ణయ్య, భానూరు, శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: కె. రమేశ్, సీనియర్ ఫొటో జర్నలిస్టు -
గ్రేటర్ పరిధిలో మురికి నీళ్లతో మనీ మనీ!
-
మురికి నీళ్లతో మనీ మనీ!
- సంపద సృష్టికి జలమండలి వ్యూహం - శుద్ధి నీరు గార్డెనింగ్, నిర్మాణ రంగాలకు వినియోగం - ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.50 నుంచి రూ.100కు విక్రయం - మార్చి నుంచి ప్రయోగాత్మకంగా అమలుకు సన్నాహాలు - వేసవిలో భూగర్భజలాలు, ట్యాంకర్ నీళ్లపై ఒత్తిడి తగ్గించేందుకే.. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యర్థ జలాలను వృథా చేయకుండా సరికొత్త అర్థం ఇవ్వడమే కాదు.. తద్వారా సంపద సృష్టించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. మహానగరంలో రోజురోజుకూ నీటి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో మురుగు శుద్ధి కేంద్రా(ఎస్టీపీ)ల్లో మూడు రకాల ప్రక్రియలతో శుద్ధి చేసిన వ్యర్థ జలాలను గార్డెనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, కార్ క్లీనింగ్, నిర్మాణ రంగంలో సిమెంట్, కాంక్రీట్ కట్టడాలకు క్యూరింగ్ తదితర అవసరాలకు విక్రయించేందుకు త్వరలో శ్రీకారం చుట్టనుంది. మార్చి నెలలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రాబోయే వేసవిలో భూగర్భ జలాలు, ట్యాంకర్ నీళ్లపై ఒత్తిడిని గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో రోజువారీగా సుమారు 1,400 మిలియన్ లీటర్ల(140 కోట్ల లీటర్లు)మేర మురుగు జలాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో 750 మిలియన్ లీటర్ల మురుగు నీటిని జలమండలి శుద్ధిచేసి మూసీ, ఇతర చెరువుల్లోకి వదిలిపెడుతున్న విషయం విదితమే. అయితే ఇకపై శుద్ధి చేసిన నీటిని డిమాండ్‌ను బట్టి ఐదు వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.50 నుంచి రూ.100కు విక్రయించేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. వ్యర్థ జలాల వినియోగంతో హరితహారం.. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మహానగరంలో హరితం 5 శాతం లోపే ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో గార్డెనింగ్ అవసరాలు, హరితహారంలో భాగంగా నాటిన కోట్లాది మొక్కల సంరక్షణకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీగా ఉత్పన్నమవుతున్న 1,400 మిలియన్ లీటర్ల మురుగునీటిని అంబర్పేట్, నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్, నానక్‌రాంగూడాలోని భారీ మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేస్తున్నారు. ఆయా కేంద్రాల వద్ద సుమారు 650 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తుండగా.. గతంలో హెచ్ఎండీఏ నగరం నలుమూలలా ఏర్పాటు చేసిన 14 మినీ మురుగు శుద్ధి కేంద్రాల్లో మరో 100 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నారు. మొత్తంగా 750 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేసి మూసీతోపాటు పలు జలాశయాల్లోకి వదిలిపెడుతున్నారు. వ్యర్థజలాల శుద్ధి.. వినియోగం ఇలా... గ్రేటర్ పరిధిలో వెలువడుతున్న మురుగు జలాలను జలమండలి మూడు రకాల విధానాల ద్వారా శుద్ధి చేస్తోంది. ముందుగా గృహ, వాణిజ్య, పారిశ్రామికవాడల నుంచి నాలాలు, ప్రత్యేక కాల్వలు, పైప్‌లైన్ వ్యవస్థల ద్వారా చేరుతున్న మురుగునీటిలోని ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను తొలిదశలో తొలగిస్తోంది. రెండో దశలో ఇందులోని మలినాలను వడగట్టేందుకు సెడిమెంటేషన్ ట్యాంక్‌ల్లోకి పంపుతోంది. మూడో దశలో జలాల్లోని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(సీఓడీ), బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ), కరిగిన ఆక్సిజన్ స్థాయిలు, కరిగిన ఘన పదార్థాలను పర్యావరణానికి హానికలిగించని స్థాయిలో ఉండేలా శుద్ధి చేసి.. మూసీతోపాటు పలు చెరువుల్లోకి వదులుతోంది. ఈ నీటినే నిర్మాణ రంగంలో క్యూరింగ్, సిమెంట్, కాంక్రీట్, ఇసుక మిశ్రమాలను కలిపేందుకు, కార్ల వాషింగ్, నగరంలోని పలు పార్కులు, కేంద్ర, రాష్టప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో ఉన్న పార్కుల్లో గార్డెనింగ్ అవసరాలకు వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శుద్ధి చేసిన నీటిని ఐదు వేల లీటర్ల ట్యాంకర్‌ను రూ.50 నుంచి రూ.100కు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్‌ను బట్టి ధరను తగ్గించే అవకాశం ఉందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తాగునీటి ట్యాంకర్‌ను వినియోగదారునికి రూ.400కి(ఐదువేల లీటర్ల నీటికి) అందిస్తోంది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాశయాల నుంచి మహానగరనానికి తరలిస్తున్న నీటిలో ప్రతి వేయి లీటర్ల నీటిశుద్ధికి జలమండలి రూ.45 నుంచి రూ.50 ఖర్చు చేస్తోంది. ప్రస్తుతానికి 750 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసేందుకు మాత్రమే జలమండలి వద్ద ఎస్టీపీలు ఉన్నాయి. మరో 700 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు మరో 10 ఎస్టీపీలు, రెండు రీసైక్లింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు రూ.1,200 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను జలమండలి సిద్ధం చేసింది. వ్యర్థజలాల పునర్వినియోగంతో లాభాలివీ.. భూగర్భ జలాలను అక్రమ బోరుబావుల ద్వారా తోడే అవకాశం ఉండదు. భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గుతుంది. నిర్మాణ రంగం, గార్డెనింగ్ అవసరాలకు తాగునీటిని వాడే అవకాశం ఉండదు. తద్వారా పేదల గొంతు తడిపే అవకాశం ఉంటుంది. వ్యర్థజలాల పునర్వినియోగంతో నీటివృథా, పొదుపుగా వాడే అంశంపై అన్ని వర్గాల్లో అవగాహన కలుగుతుంది. కార్ వాషింగ్, ఫ్లోర్ క్లినింగ్ అవసరాలకు ఈ నీటిని వినియోగించవచ్చు. హరితహారంలో నాటిన కోట్లాది మొక్కలను ఈ వేసవిలో సంరక్షించవచ్చు. గ్రేటర్ మురుగునీటి పారుదల వ్యవస్థ ముఖచిత్రం ఇదీ.. గ్రేటర్ విస్తీర్ణం: 625 చదరపు కిలోమీటర్లు జనాభా: సుమారు కోటి రోజువారీగా వెలువడుతున్న మురుగునీటి పరిమాణం: 1400 మిలియన్ లీటర్లు(గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాలు) ప్రస్తుతం శుద్ధి చేస్తున్న మురుగు నీరు: 750 మిలియన్ లీటర్లు జలమండలి పరిధిలోని భారీ మురుగుశుద్ధి కేంద్రాలు: 5(నాగోల్, నల్లచెరువు, అంబర్పేట్, అత్తాపూర్, నానక్రాంగూడా) హెచ్ఎండీఏ నుంచి జలమండలికి బదిలీ చేసిన మినీ ఎస్టీపీలు: 14 మురుగునీటిపారుదల వ్యవస్థకు అందుబాటులో ఉన్న పైప్లైన్లు: 5 వేల కిలోమీటర్లు మురుగునీటిపైప్లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లు: 1.85 లక్షలు -
మురుగు వరదై..
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వర్షం పడ్డాక ప్రజలు పడుతున్న పాట్లు కాదు.. ఆసిఫ్‌నగర్‌లోని దత్తాత్రేయనగర్‌లో నెలరోజులుగా ఇది పరిస్థితి ఉంది. రోడ్లపై పారుతున్న మురుగుతో ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. ఫొటో: మహ్మద్ రఫీ -
జంట జలాశయాల పరిరక్షణకు శ్రీకారం
- సమీప గ్రామాల మురుగు నీరు చేరకుండా నాలుగు ఎస్టీపీల నిర్మాణం - సమగ్ర నివేదిక రూపొందిస్తున్న పీబీఎస్ కన్సల్టెన్సీ - నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్న నివేదిక సాక్షి, సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాల( హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్) పరిరక్షణకు జలమండలి శ్రీకారం చుట్టింది. సమీప గ్రామాలు, రిసార్టులు, కళాశాలల నుంచి వచ్చి చేరుతున్న మురుగు నీటితో భవిష్యత్‌లో ఈ జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లా మారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించింది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న 45 ఇంజినీరింగ్ కళాశాలలు, సమీపంలోని 12 గ్రామాల నుంచి వెలువడుతున్న మురుగు నీరు జలాశయాల్లోకి చేరకుండా ఉండేందుకు నాలుగు మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీటి నిర్మాణంతోపాటు జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన ఇతర చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించే బాధ్యతలను నగరానికి చెందిన పీబీఎస్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. ఈనెలాఖరులోగా సదరు సంస్థ నివేదికను బోర్డుకు అందజేస్తుందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నివేదిక దృష్టిసారించనున్న అంశాలివే.. - జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా నాలుగు మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి అనువైన స్థలాల గుర్తింపు. మురుగు నీటి అంచనా. - సుమారు పదివేల కి.మీల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ జలాశయాల సరిహద్దులు, జి.ఓ.111 ప్రకారం ఎగువ ప్రాంతాల్లో మరో పది కి.మీ పరిధి వరకు జలాశయాల సరిహద్దులను పక్కాగా గుర్తించడం. ఇందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) సహాయం తీసుకోవడం. - జీఐఎస్, శాటిలైట్ చిత్రాలు, టోటల్ స్టేషన్ వంటి ఆధునిక సాంకేతికతో ఎన్జీఆర్ఐ సంస్థ సరిహద్దులను గుర్తించిన తరవాత డిజిటల్ మ్యాపులు సిద్ధంచేయడం. - జలాశయంలో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించడంతోపాటు జంతు, వృక్ష అవశేషాలు, గుర్రపుడెక్క తొలగింపు, జలాశయాల అడుగున పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు. - జలాశయాల్లో నీటి రంగు మారకుండా ఏరియేషన్(ఆక్సిజన్‌స్థాయి పెంపునకు) వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించడం. - జలాశయాల్లో చేపలవేట నిషేధం. ఈ విషయంలో స్థానికుల సహకారం తీసుకోవడం. - ఫుల్ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్)వరకు ఉన్న చెట్లను కూకటి వేళ్లతో సహా తొలగించడం. - జలాశయాల్లోకి వరదనీరు చేర్చే 9 ఇన్‌ఫ్లో మార్గాల గుర్తింపు, వాటి ప్రక్షాళన. - ఎగువ ప్రాంతాలు, ఇన్‌ఫ్లో చానల్స్‌లో మట్టి, ఇసుక తోడుతున్న మాఫియాపై క్రిమినల్ కేసుల నమోదు. - క్రిమిసంహారకాలు కలిసిన వ్యర్థజలాలు, వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చి కలుస్తున్న నీటిని జలాశయాల్లోకి ప్రవేశించనీయకుండా తీసుకోవాల్సిన చర్యలు. - ఫాంహౌజ్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, రిసార్టులు, గృహవ్యర్థాలు, పరివాహ ప్రాంతాల నుంచి వచ్చి కలుస్తున్న మురుగు నీటి కట్టడికి అవసరమైన చర్యలు. - చేపల పెంపకం, వేట, బట్టలుతకడం, స్నానాలు చేయడం వంటి చర్యలపై నిషేధం. - రిజర్వాయర్‌లోకి ప్రవేశించే అన్ని కెనాల్స్ పరిరక్షణ చర్యలు సూచించడం. - జలాశయాల పరిరక్షణ విషయంలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, జలమండలి, హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, అటవీ శాఖల ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక. -
మేధావులను మెప్పించిన ‘మోడల్’ విద్యార్థి
సిద్దిపేట ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న మధ్యతరగతి విద్యార్థిని ఆవిష్కరించిన ప్రదర్శనకు జాతీయ స్థాయిలో చోటు లభించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్‌లో మెతుకుసీమ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది. మెదక్ మండలంలోని తిమ్మాయిపల్లికి చెందిన విద్యార్థిని మానస రెండేళ్ల క్రితం జరిగిన జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న విషయం విదితమే. ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఇర్కోడ్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని కృష్ణశ్రీ ఆవిష్కరించిన ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ క్రమంలో ఈ నెల 22నుంచి 24వ వరకు వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో కృష్ణశ్రీ ప్రయోగం జాతీయ స్థాయికి ఎంపికైంది. ఈ పోటీలకు పది జిల్లాల నుంచి 696 ప్రదర్శనలు రాగా న్యాయనిర్ణేతలు వీటిలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన 35 ప్రయోగాలను జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గురువారం ‘సాక్షి’ కృష్ణశ్రీని అభినందించి తన మనోభాలను తెలుసుకుంది. విద్యుత్ కొరతే ఆవిష్కరణకు నాందిగా... ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరత, నీటి వృథాను నియంత్రించే లక్ష్యంతో పాఠశాల ప్రిన్సిపల్, సబ్జెక్ట్ టీచర్ చొరవతో మురుగు నీటితో విద్యుత్ ఉత్పత్తి ప్రదర్శనకు నాంది పలికినట్లు విద్యార్థిని కృష్ణశ్రీ తెలిపింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ చిన్నారి ఇర్కోడ్ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు స్వరూప, నగేష్‌లు ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. 7వ తరగతి వరకు సిద్దిపేటలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో చదివిన కృష్ణశ్రీ ఇర్కోడ్‌లోని ఆదర్శ పాఠశాలలో 8వ తరగతిలో ప్రవేశం పొందింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డుల ఎంపికకు వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తోందని తెలుసుకున్న కృష్ణశ్రీకి ‘వ్యర్థజలాలతో విద్యుత్ ఉత్పత్తి’ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలకు చెందిన గైడ్ టీచర్ ముఖేష్ సహకారంతో తన ఆలోచనకు పదును పెట్టింది. స్థానికంగా దొరికే వస్తువులతో ప్రయోగాన్ని ప్రారంభించి విజయవంతంగా ప్రదర్శించింది. మెదక్‌లో జరిగిన జిల్లా స్థాయి ప్రదర్శనలో ఈ ప్రయోగం ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అక్కడ కూడా తన ప్రయోగం, వాక్చాతుర్యం ద్వారా న్యాయనిర్ణేతల మెప్పు పొంది తన ప్రదర్శనను జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా సత్తాచాటింది. ఆవిష్కరణ సమగ్ర రూపం అంశం: మురుగు నీటితో విద్యుత్ ఉత్పత్తి. కావలసిన పరికరాలు: అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బాక్స్‌లు, ప్లాస్టిక్ పైప్‌లు, డైనమో, మోటార్, చిన్న ఫ్యాన్, ఫ్లైవుడ్, గ్రీన్ సీట్. ప్రయోగ విధానం: మురుగు కాల్వల నుంచి వచ్చే నీటిని ఒక గది (చాంబర్)లో నిల్వ చేయాలి. దానిని 20 నుంచి 30 రోజుల వరకు నిల్వ ఉంచాలి. అలా నిల్వ ఉంచడం వల్ల దానిలో సూక్ష్మజీవులు పెరుగుతాయి. దీనివల్ల ఈ నీటిలో సీహెచ్4 (మిథేన్ గ్యాస్) ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన గ్యాస్‌ను, మిథేన్ చాంబర్లో నిల్వ చేయాలి. నిల్వ చేసిన మిథేన్‌ను పైప్‌ల ద్వారా ఫర్నెన్స్ అనే చాంబర్లోకి పంపించాలి. దీనిలో గ్యాస్‌ను మండించడం వల్ల ఉష్ణం వెలువడుతుంది. దీన్ని హీట్ ఎక్స్చేంజర్ చాంబర్లోకి పంపించాలి. నిల్వ ఉంచిన గది నుంచి మురుగు నీటిని పైప్‌ల ద్వారా బాయిలర్‌లోకి పంపిస్తాం. బాయిలర్‌లో మురికి నీరు, ఉష్ణం కలవడం వల్ల నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరిని మనం పైప్‌ల ద్వారా ఫర్నెన్స్ గదిలోకి పంపిస్తాం. నీటి ఆవిరి వేగంగా ఫర్నెన్స్ను తిప్పుతాయి. దీని వల్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మరోవైపు విద్యుత్ ఉత్పాదన సమయంలో కొంత స్వచ్ఛమైన నీరు ఏర్పడుతుంది. ఆ నీటిని మనం వ్యవసాయ, ఇతర నిర్మాణ రంగాలకు వాడుకోవచ్చు. ఉపయోగాలు... ఈ ప్రయోగం ద్వారా అనేక ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం ఉండదు. నీరు వృథా కాదు, భూగర్భ జలాశయాలను కాపాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. మిగిలిన స్వచ్ఛమైన నీటిని వ్యవసాయ, ఇతర పనులకు వాడుకోవచ్చు.