
మురికి నీళ్లతో మనీ మనీ!
- సంపద సృష్టికి జలమండలి వ్యూహం
- శుద్ధి నీరు గార్డెనింగ్, నిర్మాణ రంగాలకు వినియోగం
- ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.50 నుంచి రూ.100కు విక్రయం
- మార్చి నుంచి ప్రయోగాత్మకంగా అమలుకు సన్నాహాలు
- వేసవిలో భూగర్భజలాలు, ట్యాంకర్ నీళ్లపై ఒత్తిడి తగ్గించేందుకే..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యర్థ జలాలను వృథా చేయకుండా సరికొత్త అర్థం ఇవ్వడమే కాదు.. తద్వారా సంపద సృష్టించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. మహానగరంలో రోజురోజుకూ నీటి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో మురుగు శుద్ధి కేంద్రా(ఎస్టీపీ)ల్లో మూడు రకాల ప్రక్రియలతో శుద్ధి చేసిన వ్యర్థ జలాలను గార్డెనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, కార్ క్లీనింగ్, నిర్మాణ రంగంలో సిమెంట్, కాంక్రీట్ కట్టడాలకు క్యూరింగ్ తదితర అవసరాలకు విక్రయించేందుకు త్వరలో శ్రీకారం చుట్టనుంది.
మార్చి నెలలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రాబోయే వేసవిలో భూగర్భ జలాలు, ట్యాంకర్ నీళ్లపై ఒత్తిడిని గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో రోజువారీగా సుమారు 1,400 మిలియన్ లీటర్ల(140 కోట్ల లీటర్లు)మేర మురుగు జలాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో 750 మిలియన్ లీటర్ల మురుగు నీటిని జలమండలి శుద్ధిచేసి మూసీ, ఇతర చెరువుల్లోకి వదిలిపెడుతున్న విషయం విదితమే. అయితే ఇకపై శుద్ధి చేసిన నీటిని డిమాండ్‌ను బట్టి ఐదు వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.50 నుంచి రూ.100కు విక్రయించేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది.
వ్యర్థ జలాల వినియోగంతో హరితహారం..
625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మహానగరంలో హరితం 5 శాతం లోపే ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో గార్డెనింగ్ అవసరాలు, హరితహారంలో భాగంగా నాటిన కోట్లాది మొక్కల సంరక్షణకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీగా ఉత్పన్నమవుతున్న 1,400 మిలియన్ లీటర్ల మురుగునీటిని అంబర్‌పేట్, నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్, నానక్‌రాంగూడాలోని భారీ మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేస్తున్నారు. ఆయా కేంద్రాల వద్ద సుమారు 650 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తుండగా.. గతంలో హెచ్‌ఎండీఏ నగరం నలుమూలలా ఏర్పాటు చేసిన 14 మినీ మురుగు శుద్ధి కేంద్రాల్లో మరో 100 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నారు. మొత్తంగా 750 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేసి మూసీతోపాటు పలు జలాశయాల్లోకి వదిలిపెడుతున్నారు.
వ్యర్థజలాల శుద్ధి.. వినియోగం ఇలా...
- గ్రేటర్ పరిధిలో వెలువడుతున్న మురుగు జలాలను జలమండలి మూడు రకాల విధానాల ద్వారా శుద్ధి చేస్తోంది.
- ముందుగా గృహ, వాణిజ్య, పారిశ్రామికవాడల నుంచి నాలాలు, ప్రత్యేక కాల్వలు, పైప్‌లైన్ వ్యవస్థల ద్వారా చేరుతున్న మురుగునీటిలోని ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను తొలిదశలో తొలగిస్తోంది.
- రెండో దశలో ఇందులోని మలినాలను వడగట్టేందుకు సెడిమెంటేషన్ ట్యాంక్‌ల్లోకి పంపుతోంది.
- మూడో దశలో జలాల్లోని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(సీఓడీ), బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ), కరిగిన ఆక్సిజన్ స్థాయిలు, కరిగిన ఘన పదార్థాలను పర్యావరణానికి హానికలిగించని స్థాయిలో ఉండేలా శుద్ధి చేసి.. మూసీతోపాటు పలు చెరువుల్లోకి వదులుతోంది.
- ఈ నీటినే నిర్మాణ రంగంలో క్యూరింగ్, సిమెంట్, కాంక్రీట్, ఇసుక మిశ్రమాలను కలిపేందుకు, కార్ల వాషింగ్, నగరంలోని పలు పార్కులు, కేంద్ర, రాష్టప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో ఉన్న పార్కుల్లో గార్డెనింగ్ అవసరాలకు వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
- శుద్ధి చేసిన నీటిని ఐదు వేల లీటర్ల ట్యాంకర్‌ను రూ.50 నుంచి రూ.100కు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్‌ను బట్టి ధరను తగ్గించే అవకాశం ఉందని జలమండలి వర్గాలు తెలిపాయి.
- ప్రస్తుతం తాగునీటి ట్యాంకర్‌ను వినియోగదారునికి రూ.400కి(ఐదువేల లీటర్ల నీటికి) అందిస్తోంది.
- వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాశయాల నుంచి మహానగరనానికి తరలిస్తున్న నీటిలో ప్రతి వేయి లీటర్ల నీటిశుద్ధికి జలమండలి రూ.45 నుంచి రూ.50 ఖర్చు చేస్తోంది.
- ప్రస్తుతానికి 750 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసేందుకు మాత్రమే జలమండలి వద్ద ఎస్టీపీలు ఉన్నాయి.
- మరో 700 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు మరో 10 ఎస్టీపీలు, రెండు రీసైక్లింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు రూ.1,200 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను జలమండలి సిద్ధం చేసింది.
వ్యర్థజలాల పునర్వినియోగంతో లాభాలివీ..
- భూగర్భ జలాలను అక్రమ బోరుబావుల ద్వారా తోడే అవకాశం ఉండదు. భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గుతుంది.
- నిర్మాణ రంగం, గార్డెనింగ్ అవసరాలకు తాగునీటిని వాడే అవకాశం ఉండదు. తద్వారా పేదల గొంతు తడిపే అవకాశం ఉంటుంది.
- వ్యర్థజలాల పునర్వినియోగంతో నీటివృథా, పొదుపుగా వాడే అంశంపై అన్ని వర్గాల్లో అవగాహన కలుగుతుంది.
- కార్ వాషింగ్, ఫ్లోర్ క్లినింగ్ అవసరాలకు ఈ నీటిని వినియోగించవచ్చు. హరితహారంలో నాటిన కోట్లాది మొక్కలను ఈ వేసవిలో సంరక్షించవచ్చు.
గ్రేటర్ మురుగునీటి పారుదల వ్యవస్థ ముఖచిత్రం ఇదీ..
గ్రేటర్ విస్తీర్ణం: 625 చదరపు కిలోమీటర్లు
జనాభా: సుమారు కోటి
రోజువారీగా వెలువడుతున్న మురుగునీటి పరిమాణం: 1400 మిలియన్ లీటర్లు(గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాలు)
ప్రస్తుతం శుద్ధి చేస్తున్న మురుగు నీరు: 750 మిలియన్ లీటర్లు
జలమండలి పరిధిలోని భారీ మురుగుశుద్ధి కేంద్రాలు: 5(నాగోల్, నల్లచెరువు, అంబర్‌పేట్, అత్తాపూర్, నానక్‌రాంగూడా)
హెచ్‌ఎండీఏ నుంచి జలమండలికి బదిలీ చేసిన మినీ ఎస్టీపీలు: 14
మురుగునీటిపారుదల వ్యవస్థకు అందుబాటులో ఉన్న పైప్‌లైన్లు: 5 వేల కిలోమీటర్లు
మురుగునీటిపైప్‌లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లు: 1.85 లక్షలు