
సాక్షి, హైదరాబాద్: మురుగునీటిని తరచూ పరీక్షిస్తుండటం ద్వారా కోవిడ్ రాక, కొత్త రూపాంతరితాలను గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతే కాకుండా సామాజిక స్థాయిలో వ్యాధి వ్యాప్తిని, వైరస్ మోతాదును అంచనా వేసేందుకు ఇది చౌక పద్ధతిగా దోహదపడుతుందన్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్, బీమ్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్ బెంగళూరులో 28 చోట్ల నుంచి మురుగునీటిని సేకరించి జన్యు పరీక్షలు నిర్వహించాయి.
గతేడాది జనవరి నుంచి జూన్ వరకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ నమూనాలను ఆర్టీ–పీసీఆర్ పరీక్షలకు జరిపాయి. ఈ ఫలితాల ఆధారంగా వైరస్ వ్యాప్తి, వాటిల్లో జరుగుతున్న మార్పులను తెలుసుకోవడం వీలైందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఫరా ఇష్టియాక్ తెలిపారు. సాధారణ పద్ధతులతో పోలిస్తే మురుగునీటిలో జన్యువుల కోసం పరీక్షలు జరపడం ద్వారా ఎక్కువ రూపాంతరితాలు గుర్తించామని వివరించారు. ఈ పద్ధతిని భవిష్యత్తులో ఇతర వైరస్‌ల గుర్తింపునకు కూడా ఉపయోగించవచ్చని టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఈ అధ్యయనం వివరాలు లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్ ఈస్ట్ ఆసియా తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment