‘వాడిన నీరూ’ పంటకు మంచిదే! | WATER4CROPS–REUSE OF TREATED WASTEWATER DELIVERS HIGHER CROP YIELDS | Sakshi
Sakshi News home page

‘వాడిన నీరూ’ పంటకు మంచిదే!

Published Mon, Nov 6 2017 11:49 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

WATER4CROPS–REUSE OF TREATED WASTEWATER DELIVERS HIGHER CROP YIELDS - Sakshi

ఇళ్లలో, పరిశ్రమల్లో వాడిన నీటిని శుద్ధి చేయకుండా నేరుగా పంటల సాగుకు వాడుకోవటం అనే ప్రమాదకరమైన అలవాటు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉంది. ఈ మురుగు నీటిలోని ప్రమాదకరమైన భారఖనిజాలు, హానికరమైన సూక్ష్మజీవుల వల్ల భూసారానికి, కలుషిత నీటితో పెరిగిన ఆహారాన్ని తినే మనుషులు, గడ్డిని తినే పశువుల ఆరోగ్యానికి తీరని హాని జరుగుతోంది. అసలు, మురుగు నీటిని పంటలకు వాడాల్సిన అవసరం ఏమొచ్చింది..?? ఇళ్లలో, పరిశ్రమల్లో వాడిన నీటితో కూడిన కాలువలు ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. అన్ని గ్రామాల్లోనూ, అన్ని పట్టణాలు, నగరాల పరిసరాల్లోనూ ఈ మురుగు నీరు ఎర్రని ఎండాకాలంలో, కటిక కరువు కాలంలో కూడా అందుబాటులో పారుతూ ఉంటుంది.

రబీ, వేసవి పంటల సాగు కాలాల్లో చాలా మంది రైతులకు, ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులకు సాగు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అటువంటి అనివార్య పరిస్థితుల్లో మురుగు నీటిని రైతులు వాడుకోవాల్సి వస్తున్నది. మురుగు నీటిని శుద్ధి చేసుకోవటానికి సులువైన పద్ధతి ఏదీ అందుబాటులో లేదు! ఇందువల్ల మురుగు నీటిని నేరుగా వాడక తప్పని పరిస్థితి వస్తోంది! ఇప్పుడిక ఆ బాధ లేదు. ఐరోపా యూనియన్‌తో కలిసి అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ(ఇక్రిశాట్‌) మురుగు నీటిని గ్రామస్థాయిలోనే అతి సులువుగా, ఖర్చులేని రీతిలో, రసాయనాలేవీ వాడకుండానే సహజంగా శుద్ధి చేసుకునే శాస్త్రీయ పద్ధతిని రూపొందించింది. ఈ పద్ధతిపై ‘సాగుబడి’ ప్రత్యేక కథనం..


స్వచ్ఛమైన సాగు నీరు అందుబాటులో లేని కష్ట కాలంలో శుద్ధి చేయని మురుగు నీటినే పంటలకు వాడుకోక తప్పని పరిస్థితులు మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. శుద్ధిచేయని మురుగు నీటితో ఆహార ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పశుగ్రాసం సాగవుతున్న విస్తీర్ణం ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.

మన దేశంలో 15% సాగు నీరు.. మురుగు నీరే!
అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్‌) అంచనాల ప్రకారం మురుగు నీటిని యథాతథంగా పంటల సాగులో వాడుతున్న పంట భూముల విస్తీర్ణం.. ప్రపంచం మొత్తంలోని సాగు భూముల విస్తీర్ణంలో 65% వరకు ఉంటుందట! ఈ కలుషిత నీటితో సాగైన ఆహారం తిని 88.5 కోట్ల మంది పౌరులు రోగాల పాలవుతున్నారు. మన దేశంలో నీటి తడులతో పంటలు సాగు చేస్తున్న పొలాల్లో కనీసం 15% విస్తీర్ణంలో శుద్ధి చేయని మురుగు నీటిని నేరుగా వాడుతున్నారని ‘ఇక్రిశాట్‌’ అంచనా వేసింది. ఇళ్లలో వంటావార్పునకు, స్నానాలకు, బట్టలు ఉతకటానికి వాడుతున్న నీరు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలతో కూడిన కాలువలు ఏడాది పొడవునా పారుతూనే ఉంటాయి.

కరువొచ్చి బోర్లు ఎండిపోయినా, ఎండలు మండిపోతున్నా సరే ఈ మురుగు నీటి కాలువలు పూర్తిగా ఎండి పోవు. ఈ కారణంగానే ఇక ఏ నీరూ దిక్కు లేని రబీ, వేసవి పంట కాలాల్లో మురుగు నీటిని పంటలకు వాడుతున్నారు. తాజా నీరు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ మురుగు నీటికి కూడా చాలా డిమాండ్‌ ఉంటుంది. గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటిని వాడుకునే హక్కు కోసం ఏటా వేలం పాట నిర్వహించే పరిస్థితి కూడా ఉందని అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి ఏడాది పొడవునా అందుబాటులో ఉండే మురుగు నీటిని చక్కగా శుద్ధి చేసే పద్ధతులను ఉపయోగించటం ఎంతైనా అవసరం.

ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో నాలుగేళ్ల ప్రాజెక్టు
ఐరోపా యూనియన్‌ – భారత్‌ మధ్య అతిపెద్ద శాస్త్రీయ భాగస్వామ్యంలో ఇళ్ల నుంచి, పరిశ్రమల నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధి చేసి, హాని లేని రీతిలో వ్యవసాయానికి వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు నాలుగేళ్ల నుంచి ప్రత్యేకమైన పరిశోధనా ప్రాజెక్టు(వాటర్‌4క్రాప్స్‌) ప్రారంభమైంది. హైదరాబాద్‌ సమీపంలోని పటాన్‌చెరులో గల ఇక్రిశాట్‌ ప్రధాన కేంద్రంగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లోని 28 గ్రామాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్రిశాట్‌లో పరిశోధనా కార్యక్రమం (ఆసియా) సంచాలకులు డా. సుహాస్‌ పి. వాణి మురుగునీటి శుద్ధిపై పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నిధులు సమకూర్చిన ఈ ప్రాజెక్టు సత్ఫలితాలు సాధించింది. అతి తక్కువ ఖర్చుతో గ్రామస్థాయిలోనే రసాయన రహిత పద్ధతుల్లో ఇళ్లలో నుంచి, పరిశ్రమల నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధి చేసుకొని, నిస్సంకోచంగా పంటలకు వాడుకోవచ్చని తమ క్షేత్రస్థాయి పరిశోధనల్లో రుజువైందని డా. సుహాస్‌ ‘సాగుబడి’కి తెలిపారు. కర్నూలు జిల్లా పెండేకల్, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి, భానూర్‌ తదితర గ్రామాల్లో ఇళ్ల నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధి చేసే యూనిట్లను నిర్మించారు. కొన్ని పారిశ్రామిక సంస్థల సీఎస్‌ఆర్‌ నిధులతోనూ కొన్ని గ్రామాల్లో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశామని డా. సుహాస్‌ తెలిపారు.

మురుగునీటి శుద్ధి ఎలా జరుగుతుంది?
సగటున ప్రతి వ్యక్తికి రోజుకు 40 లీటర్ల చొప్పున మురుగు నీరు వెలువడుతుందని అంచనా. కనీసం 200 కుటుంబాలు లేదా వెయ్యి మంది ఉండే గ్రామంలో సిమెంటు కాలువలు నిర్మించి.. మురుగు నీటిని ఊరి బయటకు చేర్చిన తర్వాత శుద్ధి చేయాల్సి ఉంటుంది. మురుగు నీటి కాలవ పైనే నీటి శుద్ధికి అవసరమైన బెడ్స్‌ను పాక్షికంగా భూమి లోపలికి ఉండేలా నిర్మిస్తారు. అనేక రకాల సైజుల్లో గులక రాళ్లు, ఇసుకను దొంతర్లుగా వేసి బెడ్స్‌ను నిర్మిస్తారు. బెడ్స్‌ ద్వారా మురుగు నీరు వాలు దిశగా నెమ్మదిగా ప్రవహించే ఏర్పాటు చేస్తారు. నీటి శుద్ధి వ్యవస్థను గ్రామస్థాయిలో ఏర్పాటు చేయడానికి రూ. 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుందని డా. సుహాస్‌ తెలిపారు.

మెట్ట తామర, తుంగ మొక్కలతో నీటి శుద్ధి!
బెడ్స్‌పై మెట్ట తామర (CANNA INDICA), తుంగ (TYPHA LATIFOLIA) వంటి అత్యంత వేగంగా పెరుగుతూ, కలుషితాలను భారీగా పీల్చుకునే ప్రత్యేక జాతి మొక్కలను పెంచుతారు. వీటిని రెండు, మూడు నెలలకోసారి కోసి కంపోస్టు తయారీకి వాడతారు. భారఖనిజాలు, అధిక సాంద్రతలో ఉన్న లవణాలు తదితర అవాంఛిత పదార్థాలను ఈ మొక్కలు చప్పున గ్రహించి నీటిని శుద్ధి చేస్తాయి. నాచు, అజొల్లా తదితరాలను నీటిపైన పెంచటం ద్వారా ఆక్సిజన్‌ నిల్వలను నియంత్రిస్తారు. పోషకాల సాంద్రతను తగ్గించడానికి సూక్ష్మజీవరాశిని వినియోగిస్తారు. ఎటువంటి రసాయనాలు వాడకుండానే సహజమైన పద్ధతుల ద్వారానే మురుగు నీటిని శుద్ధి చేస్తారు.

శుద్ధి అయిన నీరు ఈ బెడ్స్‌కు కింది వైపు వాలులో నిర్మించిన కుంటలోకి చేరుకుంటుంది. ఆ నీటిని రైతులు మోటార్లతో తోడుకొని పంటలకు వినియోగించుకోవచ్చు. బీహెచ్‌ఈఎల్‌ కాలనీ నుంచి వెలువడే మురుగు నీరు ఇక్రిశాట్‌ ఆవరణలోకి వచ్చి చేరుతున్నది. ఈ నీటిని శుద్ధి చేసి పాలీహౌస్‌లో టమాటోలను పెంచుతున్నారు. ఈ టమాటోలు భారతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని డా. సుహాస్‌ చెప్పారు. ఈ నీటితో నిస్సందేహంగా పంటలు పండించుకోవచ్చని, వినియోగదారుల ఆరోగ్యానికి ఎటువంటి హానీ ఉండబోదన్నారు. మురుగు నీటిని గ్రామస్థాయిలోనే సులువుగా, సహజంగా శుద్ధి చేసుకునే పద్ధతులను రూపొందించిన ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు అభినందనీయులు.
 

శుద్ధిచేసిన నీటిపై అపోహలు వద్దు.. సేంద్రియ సాగుకూ వాడుకోవచ్చు..
ఇళ్లలో స్నానానికి, వంటకు, బట్టలు ఉతకడానికి వాడిన నీటిని.. పరిశ్రమల నుంచి వెలువడే నీటిని వేర్వేరుగా చాలా సులువుగా, రసాయనాలు వాడకుండా, తక్కువ ఖర్చులో గ్రామస్థాయిలోనే కేవలం రెండు రోజుల్లో శుద్ధిచేసుకోవచ్చు. భారఖనిజాలు, సేంద్రియ – సేంద్రియేతర పదార్థాలు, లవణాలు, రోగకారక క్రిములను ఈ మురుగు నీటి నుంచి అత్యంత ప్రభావశీలంగా తొలగించి, నీటిని శుద్ధి చేసే శాస్త్రీయ పద్ధతులను మేం రూపొందించాం. పరీక్షించి చూశాం. శుద్ధి చేసిన నీరును పరీక్షించగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ప్రభుత్వం నిర్దేశించిన నీటి ప్రమాణాలకు నూటికి నూరుశాతం అనుగుణంగా ఉన్నాయి. శుద్ధి చేసిన నీటితో ఎటువంటి సంకోచం లేకుండా పంటల సాగుకు ఉపయోగించుకోవచ్చు.

ఈ నీటితో టమాటోలు, చెరకు, మొక్కజొన్న, జొన్న తదితర పంటలను ఇక్రిశాట్‌లో సాగు చేస్తున్నాం. ఆయా గ్రామాల్లో రైతులతో నాలుగేళ్లుగా సాగు చేయించాం. పండిన పంటలకు నాణ్యతా పరీక్షలు చేశాం. ఎటువంటి ఇబ్బందీ లేదు. ఈ నీటిలో శుద్ధి చేసిన తర్వాత కూడా మంచి పోషకాలు ఉంటాయి. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పంటలకు సైతం ఈ నీటిని వాడుకోవచ్చు. శుద్ధి చేసిన నీటి నాణ్యతపై ఎటువంటి అపోహలు అక్కర్లేదు. సింగపూర్‌ ప్రజలు శుద్ధిచేసిన నీటినే తాగునీరుగా వాడుతున్నారని గమనించాలి. జల వనరుల లభ్యత తగ్గిపోతున్న తరుణంలో రైతులు, వినియోగదారుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ మిషన్‌లో పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణ, దోమల నిర్మూలన తదితర కోణాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నెలకొల్పాలని భావిస్తుండటం హర్షణీయం.
– డా. సుహాస్‌ పి. వాణి, సంచాలకులు, పరిశోధనా విభాగం(ఆసియా), ఇక్రిశాట్, పటాన్‌చెరు, తెలంగాణ
ఫోన్‌: 040 3071 3466  మెయిల్‌: s.wani@cgiar.org

రైతులు వాడుతున్నారు..
కొత్తపల్లి, భానూరుల్లో ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో రకరకాల సైజుల్లో గ్రావెల్, ఇసుకతో బెడ్స్‌ వేసి.. వాటిలో మెట్ట తామర (సత్యనారాయణ పూలు), తుంగ వంటి మొక్కలు పెంచుతున్నాం. మురుగు నీటిని నేరుగా పంటలకు వాడితే ప్రమాదం. శుద్ధి చేసిన నీటిని పంటలకు వాడితే ఆరోగ్యానికి ఏ ఇబ్బందీ ఉండదు. శుద్ధి చేసిన నీటితో పలువురు రైతులు పంటలు పండిస్తున్నారు.
– డీ ఎస్‌ ప్రసాద్‌ (98499 98495), సాంకేతిక అధికారి, ఇక్రిశాట్, పటాన్‌చెరు

రెండేళ్లుగా వాడుతున్నా..
మా గ్రామంలో ఇక్రిశాట్‌ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రెండేళ్లుగా ఎండాకాలంలో మక్క (మొక్కజొన్న), స్వీట్‌కార్న్‌ పంటలకు శుద్ధి చేసిన నీటిని వాడాము. ఏ ఇబ్బందీ లేదు. నీటి ఎద్దడి కాలంలో ఈ నీరు బాగా ఉపయోగపడుతుంది.
– పట్టోళ్ల నరసింహారెడ్డి (99495 90189), మాజీ సర్పంచ్, కొత్తపల్లి, శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా

శుద్ధి చేసిన నీటిని వాడుతున్నా..
నాకు అర్థెకరం మెట్ట భూమి ఉంది. బోరు లేదు. 3 ఏళ్లుగా రబీ పంట కూడా వేస్తున్నా. శుద్ధి చేసిన నీటిని వాడుతున్నా. కరెంటు మోటారుతో వారం, పదిరోజులకో తడి పెడుతున్నా. పోయిన ఏడాది పావెకరంలో 6 బస్తాల తెల్లజొన్న పండించా. ఆ జొన్నల రొట్టే తింటున్నాం. కొత్తిమీర కూడా ఒకసారి పండించా. మార్కెట్లో అమ్మా..  
– సేరిగూడెం సాయిలు
(76598 29582), కొత్తపల్లి, శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా


మక్క వేయడానికి దుక్కి చేసిన..
 నీళ్లు ఇప్పుడు ఫ్రెష్‌గా వస్తున్నాయి. పోయినసారి వరి, మక్క(మొక్కజొన్న) వేసిన. ఈసారి మక్క వేయడానికి దుక్కి చేసిన. వేరేవాళ్లు ఈ నీళ్లతోనే 8 ఎకరాల్లో వరి పంట వేసిన్రు. మంచిగనే ఉంది. ఏ ఇబ్బందీ లేదు.
– సి. కృష్ణయ్య, భానూరు, శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌
ఫొటోలు: కె. రమేశ్, సీనియర్‌ ఫొటో జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement