జంట జలాశయాల పరిరక్షణకు శ్రీకారం | Conservation on two water Reservoirs | Sakshi
Sakshi News home page

జంట జలాశయాల పరిరక్షణకు శ్రీకారం

Published Fri, Jun 19 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

జంట జలాశయాల పరిరక్షణకు శ్రీకారం

జంట జలాశయాల పరిరక్షణకు శ్రీకారం

- సమీప గ్రామాల మురుగు నీరు చేరకుండా నాలుగు ఎస్టీపీల నిర్మాణం
- సమగ్ర నివేదిక రూపొందిస్తున్న పీబీఎస్ కన్సల్టెన్సీ
- నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వానికి  అందనున్న నివేదిక
సాక్షి, సిటీబ్యూరో:
మహానగర దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాల( హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్) పరిరక్షణకు జలమండలి శ్రీకారం చుట్టింది. సమీప గ్రామాలు, రిసార్టులు, కళాశాలల నుంచి వచ్చి చేరుతున్న మురుగు నీటితో  భవిష్యత్‌లో ఈ జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లా మారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించింది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న 45 ఇంజినీరింగ్ కళాశాలలు, సమీపంలోని 12 గ్రామాల నుంచి వెలువడుతున్న మురుగు నీరు జలాశయాల్లోకి  చేరకుండా ఉండేందుకు నాలుగు మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

వీటి నిర్మాణంతోపాటు జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన ఇతర చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించే బాధ్యతలను నగరానికి చెందిన పీబీఎస్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది.  ఈనెలాఖరులోగా సదరు సంస్థ నివేదికను బోర్డుకు అందజేస్తుందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.

నివేదిక దృష్టిసారించనున్న అంశాలివే..
- జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా నాలుగు మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి అనువైన స్థలాల గుర్తింపు. మురుగు నీటి అంచనా.
- సుమారు పదివేల కి.మీల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ జలాశయాల సరిహద్దులు, జి.ఓ.111 ప్రకారం ఎగువ ప్రాంతాల్లో మరో పది కి.మీ పరిధి వరకు జలాశయాల సరిహద్దులను పక్కాగా గుర్తించడం. ఇందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) సహాయం తీసుకోవడం.
- జీఐఎస్, శాటిలైట్ చిత్రాలు, టోటల్ స్టేషన్ వంటి ఆధునిక సాంకేతికతో ఎన్‌జీఆర్‌ఐ సంస్థ సరిహద్దులను గుర్తించిన తరవాత డిజిటల్ మ్యాపులు సిద్ధంచేయడం.
- జలాశయంలో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించడంతోపాటు జంతు, వృక్ష అవశేషాలు, గుర్రపుడెక్క తొలగింపు, జలాశయాల అడుగున పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు.
- జలాశయాల్లో నీటి రంగు మారకుండా ఏరియేషన్(ఆక్సిజన్‌స్థాయి పెంపునకు) వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించడం.
- జలాశయాల్లో చేపలవేట నిషేధం. ఈ విషయంలో స్థానికుల సహకారం తీసుకోవడం.
- ఫుల్‌ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్)వరకు ఉన్న చెట్లను కూకటి వేళ్లతో సహా తొలగించడం.
- జలాశయాల్లోకి వరదనీరు చేర్చే 9 ఇన్‌ఫ్లో మార్గాల గుర్తింపు, వాటి ప్రక్షాళన.  
- ఎగువ ప్రాంతాలు, ఇన్‌ఫ్లో చానల్స్‌లో మట్టి, ఇసుక తోడుతున్న మాఫియాపై క్రిమినల్ కేసుల నమోదు.
- క్రిమిసంహారకాలు కలిసిన వ్యర్థజలాలు, వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చి కలుస్తున్న నీటిని జలాశయాల్లోకి ప్రవేశించనీయకుండా తీసుకోవాల్సిన చర్యలు.
- ఫాంహౌజ్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, రిసార్టులు, గృహవ్యర్థాలు, పరివాహ ప్రాంతాల నుంచి వచ్చి కలుస్తున్న మురుగు నీటి కట్టడికి అవసరమైన చర్యలు.
- చేపల పెంపకం, వేట, బట్టలుతకడం, స్నానాలు చేయడం వంటి చర్యలపై నిషేధం.
- రిజర్వాయర్‌లోకి ప్రవేశించే అన్ని కెనాల్స్ పరిరక్షణ చర్యలు సూచించడం.
- జలాశయాల పరిరక్షణ విషయంలో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, జలమండలి, హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్, అటవీ శాఖల ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement