జల శుద్ధి
సాక్షి, సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీరుస్తున్న హిమాయత్‌సాగర్ , ఉస్మాన్‌సాగర్ (గండిపేట్) జంట జలాశయాలకు మురుగు నుంచి విముక్తి కల్పించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. సమీప గ్రామాలు, ఎగువ ప్రాం తాల నుంచి మురుగునీరు చేరకుండా చిలుకూరు బాలాజీ దేవాలయం, ఫిరంగినాలా, అజీజ్‌నగర్, కొత్వాల్‌గూడా ప్రాంతాల్లో మురుగుశుద్ధి కేంద్రాలు నిర్మించాలని తలపెట్టింది. ఈ కేంద్రాల్లో నిత్యం పది మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను శుద్ధిచేసేందుకు రూ.38కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొం దిస్తోంది. ఈమేరకు సాంకేతిక సర్వే, డిజైన్ రూపొం దించేందుకు అర్హత, ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు ఫైలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రస్తుత పరిస్థితి ఇదీ...
భాగ్యనగర దాహార్తిని తీరుస్తోన్న చారిత్రక జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాలు తరచూ ఆర్గానిక్ కాలుష్యంతో కలుషితమవుతున్నాయని జలాశయాలపై పరిశోధన లు చేసిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చి ఇన్సిట్యూట్(నీరి) సంస్థ గతంలోనే స్పష్టం చేసింది. ఈ జలాశయాల పరిరక్షణకు 2011లో పలు విలువైన సిఫారసులు చేసినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. దీంతో జలాశయాల ఎగువ ప్రాంతాలు, ఎఫ్‌టీఎల్ పరిధిలో వెలిసిన ఇంజినీరింగ్ కళాశాలలు,ఫాంహౌజ్‌లు, పరిశ్రమలనుంచి వెలువడుతోన్న వ్యర్థజలా లు నేరుగా జలాశయంలోకి చేరుతున్నాయి. మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల పరంగా చూస్తే ఈ జలాశయా లు మూడో శ్రే ణి(సి క్లాస్)లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.
ఎస్టీపీలతో మురుగు కష్టాలకు చెక్..
జలమండలి తాజాగా ప్రతిపాదించిన నాలుగు మురుగు శుద్ధి కేంద్రాల్లో సుమారు పదిమిలియన్ లీటర్ల వ్యర్థజలాలను శుద్ధి చేసి వాటిని తిరిగి జలాశయంలోకి చేరకుండా సమీప పంట పొలాలకు తరలించాలని జలమండలి నిర్ణయించింది. గ్రామాల వారీగా మినీ మురుగు స్టోరేజి ట్యాంకులు ఏర్పాటుచేసి అక్కడినుంచి ట్యాంకర్ల ద్వారా మురుగుశుద్ధి కేంద్రానికి వ్యర్థజలాలను తరలించి శుద్ధిచేయాలని నిర్ణయించింది. ఇలా చేస్తే తరచూ మురుగునీటి పైప్‌లైన్‌లు పగిలిపోయి మురుగు రహదారులు, సమీప గ్రామాలను ముంచెత్తదని భావిస్తున్నారు.