సాక్షి, హైదరాబాద్: జీవో 69 ప్రకారం ప్రత్యేకంగా ఏర్పాటైన నిపుణుల బృందం తన నివేదికను సమ ర్పించే వరకు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల పరిరక్షణకు జారీ చేసిన జీవో 111కు కట్టుబడి ఉంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) చెప్పిన వివరాలను న్యాయస్థానం రికార్డు చేసింది. జీవో 111ను ఉల్లంఘించి తదుపరి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఆదేశించింది.
జీవో 111ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ పర్యావరణవేత్త ప్రొ. జీవానందరెడ్డి 2007లో, ఆ తర్వాత మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఏఏజీ రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ...ఉస్మాన్‌సాగర్, హి మాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతంలో కాలుష్యా న్ని ఉత్పత్తి చేసే పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాసాలను నిషేధిస్తూ 1996లో జీవో 111ను ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు.
84 గ్రామాల పరిధిలో పరీవాహక ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల వరకు దాదాపు 1,32,000 ఎకరాల పరిధిలో ఆంక్షలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అప్పట్లో హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా ఈ రెండు రిజర్వాయర్ల పరీవాహక ప్రాంతాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ఇది జరిగిందన్నారు. ఇప్పుడు వీటి నుంచి 1.25 శాతం నగర జనాభాకు మాత్రమే నీరు అందుతోందని, భవిష్యత్తులో వీటిపై ఆధారపడాల్సిన అవసరం కూడా లేదని వెల్లడించారు.
దీనికి సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీ సిఫార్సుల కోసం ప్రభుత్వం వేచి చూస్తోందన్న ఏఏజీ వివరాలను రికార్డు చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సీనియర్ న్యాయవాది కేఎస్.మూర్తి కూడా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ధర్మాసనం రెండు రిజర్వాయర్ల చుట్టూ 10 కి.మీ. పరిధిలో నిర్మాణాలపై నిషేధానికి కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment