సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. వైద్యారోగ్య, విద్య, శిశు సంక్షేమ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, జైళ్ల శాఖలు.. హైకోర్టుకు నివేదికలు సమర్పించాయి. డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని డీహెచ్ శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని.. మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వస్పత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నామని కోర్టుకు డీహెచ్ తెలిపారు.
6,127 ఖైదీలకు ఒకడోసు, 732 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిపినట్లు జైళ్ల శాఖ కోర్టుకు తెలిపింది. మరో 1,244 మంది ఖైదీలకు వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందని జైళ్ల శాఖ డీజీ పేర్కొన్నారు. మాస్క్‌లు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు డీజీపీ తెలిపారు. ‘‘జూన్ 20 నుంచి ఈనెల 5 వరకు 87,890 కేసులు నమోదు చేసి, రూ.52 కోట్ల జరిమానా విధించామని’’ కోర్టుకు డీజీపీ వివరించారు.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాగోగులు చూసుకుంటున్నామని శిశు సంక్షేమ శాఖ కోర్టుకు తెలిపింది. ఆన్‌లైన్ బోధన మార్గదర్శకాలను పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన.. కోర్టుకు సమర్పించారు. విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ తరగతులే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వర్షాకాలంలో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టామని హైకోర్టుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment