సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సోకి మృత్యువాతపడిన వారి కుటుంబాలకు ఎప్పటిలోగా పరిహారం అందిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నియంత్రణకు తగినచర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది.
రాష్ట్రవ్యాప్తం గా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, పరిస్థితి అదుపులోనే ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై విచారణ ముగించాలని కోరారు. ‘‘కరోనాతో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు పరిహారం పంపిణీ చేశారా.. ఇప్పటివరకు ఎంత మందికిచ్చారు.. ఇంకా ఎన్ని కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంది.. తదితర వివరాలతో స్థాయీ నివేదికను ఆరువారాల్లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ రెండోవారానికి వాయిదా వేసింది.
కాగా, కరోనా నియంత్రణలో రాష్ట్రప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని ధర్మాసనం అభినందించింది. కరోనా నియంత్రణకు తగినచర్యలు తీసుకుంటూనే ఎప్పటికప్పుడు తమకు పరిస్థితిని వివరించిన ప్రజా ఆరోగ్యవిభాగం డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పనితీరును ప్రశంసించింది.
1–22వ తేదీల మధ్య 23,526 కేసులు
‘‘జనవరిలో 3.40 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి 22 తేదీల మధ్య 12,41,660 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 23,526 పాజిటివ్ కేసులు(1.89 శాతం) వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 5.78 కోట్ల(105 శాతం) మందికి మొదటిడోసు ఇచ్చాం. 15–17 ఏళ్ల మధ్య యువకుల్లో మొదటి డోసు 15.40(84 శాతం) లక్షల మందికి, 8.18(44 శాతం) లక్షల మందికి రెండోడోసు ఇచ్చాం.
రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 56,265 బెడ్లు అందుబాటులో ఉండగా, 971 మంది రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. 55,294 (98.30 శాతం) బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 6 వేల బెడ్లు చిన్నారుల చికిత్స కోసం ఏర్పాటు చేయగా, ఇందులో 4,125 ఆక్సిజన్, 1,875 ఐసీయూ బెడ్లు ఉన్నాయి’’అని డాక్టర్ శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు.
ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం
‘‘హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో భౌతిక తరగతులకు హాజరుకాలేని విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితులకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’అని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment