సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశ ప్రభావం దేశంలో అక్కడక్కడా కనిపిస్తున్నా.. కరోనా కట్టడికి ఇంకా ప్రణాళికలు రూపొందిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన వైద్యం అందకపోయినా, జాప్యం జరిగినా రెప్పపాటు కాలంలోనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. మొదటి, రెండో దశలో ఎన్నో ప్రాణాలు పోయాయని, ఆక్సిజన్ అందక మృతి చెందినవారూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రణాళికలు రూపొందించి తగిన చర్యలు చేపట్టే వరకూ కరోనా వైరస్ ఆగదనే విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేసింది. మూడో దశ ముప్పు ముంచుకొస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.
నిపుణుల సమావేశం ఎందుకు నిర్వహించలేదు?
‘తాజా సెరో సర్వైలెన్స్ నివేదిక, విపత్తు నిర్వహణ చట్టం నిర్దేశించిన మేరకు నిపుణులతో కూడిన కమిటీ సమావేశాలకు సంబంధించిన మినిట్స్ సమర్పించాలని గత నెల 11న ఆదేశించాం. అలాగే మూడో దశ కట్టడికి తీసుకుంటున్న చర్యలను సవివరంగా పేర్కొనాలని చెప్పాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో అవేవీ లేవు’అని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసలు నిపుణులతో కూడిన కమిటీ సమావేశం నిర్వహించారా? అని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. సమావేశం జరిగినట్లు లేదని, రెండు వారాల సమయం ఇస్తే పూర్తి వివరాలు సమర్పిస్తామని ఆయన చెప్పారు.
దీంతో తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మూడో దశ కట్టడికి తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినా ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీసింది. ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశంలో ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం తగదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
కోర్టు ఆదేశాలివీ..
►వారం రోజుల్లో నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించి కరోనా కట్టడికి తగిన ప్రణాళికలు రూపొందించాలి.
►రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టీపీసీఆర్ పరీక్షల్లో తేలిన కేసుల సంఖ్య ఆధారంగా పాజిటివిటీ రేట్ ఎంత ఉందో జిల్లాల వారీగా నివేదిక ఇవ్వాలి.
►మూడో దశ కట్టడికి తీసుకున్న చర్యలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సమగ్ర నివేదిక సమర్పించాలి. ఈ నెల 22 విచారణకు రాష్ట్ర ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావాలి.
►కరోనా చికిత్సలో భాగంగా వినియోగించే ఔషధాలను అత్యవసర మందుల జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. గతంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందో కేంద్ర వైద్య ఆరోగ్య విభాగం కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై వివరణ ఇవ్వాలి.
►రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతమంది చిన్న పిల్లల వైద్యులు విధులు నిర్వహిస్తున్నారో తెలియజేయండి.
►చిన్నారుల చికిత్సకు నీలోఫర్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ పడకలు, ఇతర సౌకర్యాలపై జిల్లాల వారీగా వివరాలు సమర్పించండి.
►ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకానికి తీసుకున్న చర్యలేంటో తెలియజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment